September 01, 2013
10 20 50 100 500 1000! మీ దగ్గరున్న ఏ నోటునైనా చేతిలోకి తీసుకుని పరిశీలించండి! ఒక మామూలు కాగితానికి అంత విలువ ఎలా వచ్చిందో తెలుసా? 'ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఏ సమ్ ఆఫ్ ' అనే వాక్యం, దాని కిందే ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఈ రెండే ఆ నోటుకు అంత విలువ తెచ్చిపెట్టాయి. ఆ నోటు విలువ రూ.10 లేదా 20 1000 అని ఆర్‌బీఐ ఇచ్చే హామీ అది.
ఇప్పుడు మీవద్ద డాలర్ నోట్లు ఉంటే లేదా ఇంటర్‌నెట్‌లోనైనా వాటిని పరిశీలించి చూడండి. ఎక్కడా "ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఏ సమ్ ఆఫ్..' అనే వాక్యం కనపడదు. దానికి బదులుగా 'దిస్ నోట్ ఈజ్ ఏ లీగల్ టెండర్ ఫర్ ఆల్ డెట్స్..' అని ఉంటుంది!
ఈ రెండు కరెన్సీల మధ్య తేడా ఏంటి? మన కరెన్సీ విషయంలో ఆర్‌బీఐ హామీ ఎందుకు ఇస్తోంది? డాలర్ విషయంలో అది చట్టపరమైన చలామణీకి మాత్రమే ఎందుకు ఉపయోగపడుతోంది? డాలర్ నోట్లపై ముద్రించే విలువకు అక్కడి ఫెడరల్ బ్యాంక్ ఎందుకు హామీ ఇవ్వట్లేదు? అసలు ఎలాంటి హామీ లేని తెల్లకాగితం లాంటి డాలర్ అనధికారిక అంతర్జాతీయ కరెన్సీగా ఎలా చలామణీ అవుతోంది? చమురు నుంచి బంగారం దాకా అనేక ఉత్పత్తులకు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు డాలర్లలోనే ఎందుకు చెల్లింపులు చేస్తాయి? ఇవన్నీ చాలా మందికి వచ్చే సందేహాలు. సమాధానం వెతకాలంటే కాలంలో కొంత వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
రాజుల కాలంలో.. బంగారు, వెండి నాణేలు చలామణీలో ఉండేవి. వాటి విలువకు ఎవరూ హామీ ఇవ్వాల్సిన పనిలేదు. అవే స్వయంగా విలువైనవి కాబట్టి ఆ నాణేలతో కొనుగోళ్లు, విక్రయాలు సాఫీగా జరిగిపోయేవి. ఆ తర్వాత కాలంలో ప్రామిసరీనోట్లు రంగప్రవేశం చేశాయి. ఇవే ఆధునిక కరెన్సీకి తాతముత్తాతలు. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఒక ట్రస్టీ వద్ద డిపాజిట్ చేసి ఆ ట్రస్టీ నుంచి ఆ బంగారం విలువకు తగిన విలువగల ప్రామిసరీ నోట్ తీసుకునేవారు. ఆ నోట్ తీసుకుని ట్రస్టీ వద్దకు ఎవరు వెళ్లినా సరే అందులో పేర్కొన్న విలువ గల బంగారం ఇచ్చేవారు. ఇలా బంగారాన్ని డిపాజిట్ చేసుకుని మళ్లీ కోరినప్పుడు తిరిగి ఇచ్చినందుకు ప్రతిఫలంగా కొంత మొత్తం వసూలు చేసేవారు. ఈ మొత్తం ప్రక్రియనూ ఒకసారి పరిశీలిస్తే.. ఇదే నేటి బ్యాంకింగ్ వ్యవస్థకు మూలం అని అర్థమవుతుంది. ఈ దశలో ప్రజలు వస్తువుల కొనుగోళ్లకు బంగారం బదులుగా.. ట్రస్టీ సంతకం చేసి మరీ పూర్తి హామీతో ఇచ్చిన ప్రామిసరీ నోట్లను వాడేవారు.
ఒకరి ప్రామిసరీ నోటు విలువ పదివేలు అయితే.. మరొకరి ప్రామిసరీ నోటు విలువ వెయ్యి మాత్రమే కావొచ్చు. మొత్తమ్మీద... రకరకాల డినామినేషన్లలో గల ప్రామిసరీ నోట్లు విస్తృతంగా చలామణీలోకి వచ్చాయి. అదుగో.. ఆ రోజుల్లో ట్రస్టీలు ఇచ్చిన హామీనే (ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఏ సమ్ ఆఫ్...) నేటి కరెన్సీ నోట్లపై ఉండే హామీలకు మూలం. అయితే, అప్పట్లో ఆ హామీల విలువ నిజంగా బంగారంతో సమానం. సదరు ప్రామిసరీ నోట్లను ట్రస్టీకి ఇస్తే.. అందులో ఉన్న విలువ గల బంగారాన్ని తిరిగి ఇచ్చేసేవారు. కానీ, నేటి నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చేస్తే అదే విలువగల ఇతర డినామినేషన్ నోట్లనో, నాణేలనో ఇస్తుందే తప్ప బంగారం ఇవ్వదు. కాకపోతే, ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఈ చర్య అంతే.
పెరిగిన నోట్ల వాడకం..
నాణేల మూటలు పట్టుకెళ్లడం కంటే ప్రామిసరీ నోట్లను పట్టుకెళ్లడం ఎంత సులభమో ప్రజలకు అర్థమయ్యాక..అందరూ వీటి వైపే మొగ్గు చూపారు. అంటే.. ట్రస్టీల వద్ద బంగారం డిపాజిట్ చేసినవాళ్లు వెనక్కి వెళ్లి దాన్ని తెచ్చుకోవడం కన్నా, తమ వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లతోనే కొనుగోళ్లు, విక్రయాలు కొనసాగించడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ట్రస్టీలు.. తమ వద్ద ఉన్న బంగారం నిల్వలకు మించి ప్రజలకు ప్రామిసరీ నోట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా అదనంగా జారీ చేసిన ప్రామిసరీ నోట్లను తీసుకున్నవారి వద్ద నుంచి వడ్డీలు వసూలు చేసేవారు. దీన్ని.. నేడు బ్యాంకులు ఇచ్చే లోన్‌లకు సమానంగా భావించవచ్చు. ప్రజలందరూ ఒకేసారి వచ్చి తమ బంగారం తిరిగి ఇవ్వమని అడగరన్న భరోసానే ట్రస్టీల (లోన్‌ల) ఆలోచనకు మూలం. ఇలా తొలిదశల్లో ఒక అస్పష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ట్రస్టీలు (బ్యాంకులు) తమ వద్ద ఉన్న బంగారం లేదా డబ్బులో కొంత భాగాన్ని (ఫ్రాక్షన్) మాత్రమే రిజర్వులో ఉంచుకుని మిగతా మొత్తాన్ని లోన్‌ల రూపంలో వడ్డీలకిచ్చే ఈ వ్యవస్థనే 'ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్'గా వ్యవహరిస్తారు.
కాలక్రమంలో రిజర్వును మించిన సొమ్మును బ్యాంకులు వడ్డీల ద్వారా ఆర్జించే దశకు చేరుకుంటాయి. కానీ ఈలోగా.. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లందరూ దివాలా తీస్తే బ్యాంకులూ మునిగిపోతాయి. మొన్నామధ్య అమెరికాను కుదిపేసిన సబ్-ప్రైమ్ క్రైసిస్ సమయంలో జరిగింది ఇదే. మరి అప్పట్లో దివాలా తీసిన బ్యాంకులు ఎలా ఒడ్డున పడ్డాయి? బిలియన్ల కొద్దీ డాలర్లను ముద్రించడం ద్వారా బయటపడ్డాయి! ఇక్కడ మనకో సందేహం రావాలి. మిగతా దేశాలు కూడా అమెరికా చేసిన పనే చేయచ్చుగా? మనదేశం కూడా ఇష్టం వచ్చినట్లుగా రూపాయిల్ని ముద్రించుకుంటే సరిపోతుందిగా? అని.
కానీ, అమెరికన్ డాలర్లకు ఉన్న డిమాండ్ మన రూపాయలకు లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా ముద్రించినా అవి చిత్తుకాగితాల కిందే లెక్క. వాటిని తీసుకునేవారు ఎవరూ ఉండరు. కాబట్టి మనం అలా ముద్రించినా ఉపయోగం లేదు. మరి అమెరికా డాలర్లకు మాత్రం అలాంటి డిమాండ్ ఎందుకు ఉందీ అంటే... అదే అగ్రరాజ్యం తెలివి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న చందంగా... యుద్ధాలను స్వప్రయోజనానికి ఉపయోగించుకోవడం అన్నది అమెరికాకు ఇప్పుడే కాదు ఆది నుంచీ ఉన్న అలవాటే. డాలర్ డిమాండ్ ఎప్పట్నుంచీ మొదలైందో తెలుసుకోవాలనుకుంటే రెండో ప్రపంచ యుద్ధ సమయానికి వెళ్లాలి. (అప్పట్లో ఏమైందో రేపు తెలుసుకుందాం) - సెంట్రల్ డెస్క్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి