19, సెప్టెంబర్ 2013, గురువారం

మళ్లీ తెలంగాణ..జంగ్ సైరన్


9/18/2013 6:42:26 AM
- 29న సకల జనభేరికి టీ జేఏసీ పిలుపు.. 21న ఎమ్మార్పీఎస్ విద్యార్థి రణభేరి
- భారీ సభ ఆలోచనలో టీ కాంగ్రెస్ నేతలు
- వరుస సభలు, సమావేశాలు, ర్యాలీలకు సమాయత్తమవుతున్న తెలంగాణ శ్రేణులు
- ఉద్యమాలతోనే తెలంగాణ ప్రకటనకు రక్ష.. ప్రక్రియ వేగవంతానికి అదే మార్గం
- తీర్మానించుకుంటున్న తెలంగాణ ప్రజలు.. హోరెత్తనున్న తెలంగాణ జిల్లాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (టీ మీడియా):దశాబ్దాల అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు.. వెయ్యికిపైగా బలిదానాల అనంతరం సాధించుకున్న తెలంగాణ ప్రకటనను సురక్షితంగా ‘అమలు తీరం’ చేర్చేందుకు తెలంగాణ సమాజం సమాయత్తమవుతున్నది. ఊరువాడ ఏకమయ్యి.. పోరుజేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది. గతంలో డిసెంబర్ 9 అనంతర పరిణామాల అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న తెలంగాణవాదులు ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా పకడ్బందీ వ్యూహంతో కదలాలని తీర్మానించుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ జేఏసీ, ప్రజా, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు విస్తృత స్థాయి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి.

congressగత నెలన్నర రోజులుగా సహనంతో ఉన్న తెలంగాణవాదులు ఇక మౌనంగా ఉంటే లాభం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు పోరాటాన్ని ఆపకూడదని నిర్ణయానికి వచ్చారు. అందుకు అవసరమైన కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం జరిగి నెలన్నర పూర్తవుతున్నా.. ఇంకా ప్రక్రియ ఒక కొలిక్కిరాలేదన్న ఆవేదన మాటున తెలంగాణ ప్రజల్లో ఆందోళన కూడా కనిపిస్తున్నది. దీనికి తోడు సీమాంధ్ర నేతల నోట మారుతున్న మాటలు, వారి వైఖరులతో తెలంగాణ విషయంలో మళ్ళీ కాంగ్రెస్ వెనక్కి వెళుతుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక తెలంగాణ పట్ల మరో మోసానికి పాల్పడుతుందా? అనే సందేహాలు చోటు చేసుకుంటున్నాయి.

సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో సీమాంధ్రలో ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయించడం, ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభ నిర్వహించడం వెనుక కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో సాధించుకున్న ప్రకటనను కాపాడుకునేందుకు మళ్ళీ ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని తెలంగాణ పౌరులు భావిస్తున్నారు. ఈ దిశగా మార్గదర్శకత్వం వహించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్నది.

ప్రస్తుత సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సమాజం మిన్నకుంటే కష్టమని, ఉద్యమించకుంటే వచ్చిన తెలంగాణ కాస్తా వెనక్కు పోయే అవకాశం ఉందని తెలంగాణ శ్రేణులను అప్రమత్తం చేసింది. ఆ మేరకు కార్యాచరణ ఖరారు చేస్తున్నది. ఇందులో భాగంగాఏ ఈ నెల 29న తెలంగాణ సకల జన భేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నది. ఈ సభకు ఇప్పటికే టీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. తెలంగాణ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను మళ్ళీ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి, రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనకడుగు వేస్తే సహించేది లేదనే విషయాన్ని ఈ సభ ద్వారా కేంద్రానికి స్పష్టం చేయాలని టీ వాదులు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

విద్యార్ధి సంఘాలను కలుపుకుని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ నెల 21వ తేదీన యుద్ధభేరి పేరిట ఎమ్మార్పీఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా ఈ నెల 22న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత హైదరాబాద్‌లో లేదా తెలంగాణలోని ఏదో ఒక జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనతో ఉన్నారు. మరి కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్ధి, ఉద్యోగ, న్యాయవాద సంఘాలు కూడా తెలంగాణ సాధించుకునే క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సభలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీల రూపకల్పనకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్ విషయంలోనే సీమాంధ్రులు పేచీ పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటపై వెనక్కి పోదనే నమ్మకం తమకున్నప్పటికీ, సీమాంధ్ర నేతల తీరుతో మళ్ళీ అనుమాన పడాల్సివస్తుందని ఆయన అభివూపాయపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పోకుండా, స్థైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఆలస్యం జరిగితే ప్రజలు మళ్ళీ ఉద్యమించే అవకాశాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో జనం తమను నిలదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2009 డిసెంబర్ 9 ప్రకటనపై వెనక్కి వెళ్ళడంతో మొన్నటి వరకు కాంగ్రెస్‌పై జ్రలకు నమ్మకం లేదని, రాష్ట్ర విభజనకు సంబంధించి తాజా ప్రకటన వచ్చి కూడా 47 రోజులు కావస్తున్నా కేంద్రం ఆ ప్రక్రియను ప్రారంభించక పోవడంతో ప్రజలకు మళ్ళీ కాంగ్రెస్‌పై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతున్నదని నిజామాబాద్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు జీ గంగాధర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, మరో వైపు సీమాంధ్ర నేతల ఒత్తిళ్ళు, లాబీయింగ్ వల్ల తెలంగాణ వెనక్కి పోతుందనే ఆందోళన యువతలో పెరిగిపోతూ ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మరో వైపు పదవులు వదిలి తెలంగాణ సాధించుకునేందుకు పోరాడాలంటూ తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే పిలుపు నిచ్చారు. రెండు రోజుల క్రితం జరిగిన టీ కాంగ్రెస్ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కూడా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు పచ్చి సమైక్యవాదుల్లా వ్యవహరిస్తూ తెలంగాణకు అడ్డుపడుతుంటే, ఇంకా మీరు ఎందుకు మంత్రి వర్గంలో కొనసాగుతున్నారని, వారి వైఖరి మార్చుకోక పోతే కేబినెట్ నుంచి బయటికి వస్తామని హెచ్చరించాలని, అలాగే తెలంగాణకు సానుకూలంగా ప్రకటన వచ్చిందని కూర్చొంటే సరిపోదని, రాష్ట్రం సాధించుకునే వరకు తమ కృషి, కార్యక్రమాలు కొనసాగించాలని కొందరు టీ నేతలు ఈ భేటీలో టీ మంత్రుల తీరుపై నిప్పులు చెరుగుతూ ఉద్యమబాటపట్టకుంటే లాభం లేదని చెప్పకనే చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో తెలంగాణలో, ప్రత్యేకించి తమ జిల్లాలో ప్రజల్లో ఆందోళన కనిపిస్తున్నదని అన్నారు. కోస్తాంధ్రలో సమైక్య రాష్ట్రం పేరిట జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు, సీమాంధ్ర కాంగ్రెస్‌నేతల ప్రకటనలు, వాటికి సీమాంధ్ర మీడియాలో లభిస్తున్న ప్రచారం... పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నిర్ణయంపై మళ్ళీ ఎక్కడ వెనక్కి పోతారేమోనని భావం టీ ప్రజల్లో కనిపిస్తున్నదని, తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సాధన కోసం మళ్ళీ ఉద్యమ బాట తప్పదేమోననే అభివూపాయం గ్రామాల్లో వ్యక్తమవుతోందన్నారు.

యూటీ చేస్తే రణభేరే
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే రణభేరి మోగించక తప్పదని ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రాజకీయంగా పట్టున్న మజ్లిస్ పార్టీ కూడా యూటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. హైదరాబాద్ తెలంగాణలో భాగమని, ఈ నగరాన్ని వేరు చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఒక వేళ హైదరాబాద్‌ను యూటీగా ప్రకటిస్తే ఇప్పటి వరకు హైదరాబాద్ చరిత్రలో జరగని రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు, ప్రదర్శనలు చేపడుతామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పాతబస్తీలో జరిగిన పార్టీ బహిరంగ సభలో స్పష్టం చేశారు. విభజన అనివార్యమైన పక్షంలో సీమాంధ్రుల భద్రత, వారి రక్షణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ను యూటీగా చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ముసుగులో ఉన్న పెట్టుబడిదారులు కొందరు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో వారు గట్టిగా లాబీయింగ్ కూడా చేస్తున్నారని అంటున్నారు. లాబీయింగ్‌లో నిజానిజాలు ఎలా ఉన్నా.. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆంశం కేంద్ర పరిశీలనలో ఉన్నట్లు సీమాంధ్ర నేతలు తమ ప్రయోజనాలు కాపాడే మీడియా శక్తుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం తెగించి పోరాడుతుండగా, సీమాంధ్ర పాలకులు దోపిడీని కొనసాగించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. ఆధిపత్యానికి, ఆత్మగౌరవానికి మధ్య ఘర్షణ జరుగుతున్నది. దీని వల్లే ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధిపత్యంపై పోరాడి, ప్రజలు తమ నేలమీద ఆత్మగౌరవ జెండాలు ఎగరేసిన సాక్ష్యాలు చరిత్ర నిండా ఉన్నాయి. ఆరు దశాబ్దాల పోరాటాల అనుభవాలతో గమ్యాన్ని చేరేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీడబ్ల్యుసీ తీర్మానాన్ని అమలులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడంలో టీ కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. హైదరాబాద్‌పై రకరకాల అభిప్రాయాలు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితులన్నింటికీ టీ కాంగ్రెస్‌దే బాధ్యత. వీటన్నింటినీ గమనించిన తెలంగాణ ప్రజలు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ సాధించుకునేందుకు ఎలాంటి ఉద్యమాలను నిర్వహించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29 సకల జన భేరి సదస్సు చరిత్రాత్మకం కానున్నది.


తెలంగాణలో విలక్షణమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల ఎజెండాను అమలు చేయడానికి సిద్ధంగా లేవు. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీకి ఒక అంశంపై ఒకే అభిప్రాయం ఉంటుంది. కానీ.. రాష్ట్రంలో పాలకవర్గ పార్టీలన్నీ తెలంగాణలో తెలంగాణ నినాదాన్ని, సీమాంధ్రలో సీమాంధ్ర నినాదాన్ని బలపరుస్తున్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాల పార్టీలను తెలంగాణ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షోభాలకు, ఘర్షణలకు ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్న పార్టీలే కారణం. తెలంగాణ ప్రజలు రాజకీయ పోరాటాలలో, రాజకీయ అవగాహనలో రాటు తేలిపోయారు. లక్ష్యాన్ని చేరుకునేవరకు ఎవ్వరినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రజలతో కలిసి ఉద్యమిస్తుంది.
- జీ దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్


సెప్టెంబర్ 17, 2013 నాటికి తెలంగాణ ప్రక్రియ ఒక రూపానికి వస్తుందని ప్రజలు చాలా ఆశపడ్డారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నెలన్నర గడుస్తున్నప్పటికీ ప్రక్రియ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. తెలంగాణ ప్రజలు శాంతికాముకులు మాత్రమే కాదు, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వాళ్లు కూడా. తెలంగాణ గమ్యాన్ని ముద్దాడేవరకు తెలంగాణ ప్రజలకు విశ్రాంతి లేదు.
- వీ శ్రీనివాస్‌గౌడ్, టీ ఉద్యోగసంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్

సీమాంధ్ర ప్రజల్లో తెలంగాణ డిమాండ్ ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో రాజకీయ నాయకత్వం విఫలమైంది. పార్టీల వైఫల్యంవల్లే ప్రస్తుత సంక్షోభం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడుతున్న సత్యాన్ని సీమాంధ్ర లాయర్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కో సంక్షోభాన్ని పరిష్కరించుకుంటూ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రజలు నిర్మించుకుంటున్నారు. సీడబ్ల్యుసీ నిర్ణయం అమలు తథ్యం.
- సీ విఠల్, తెలంగాణ జేఏసీ కో చైర్మన్

అన్నింటికన్నా ఆత్మహత్యలు చాలా బాధపెడుతున్నాయి. చిన్న చిన్న పిల్లల భౌతికకాయాలను చూసిన తర్వాత నిద్ర కూడా రావడం లేదు. ఇది తెలంగాణ చేసుకున్న పాపమా? సీమాంధ్ర పాలకులు తెలంగాణ పిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. రాజకీయ నాయకత్వం ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ముందుకు రావాలి.
- కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ కో చైర్మన్

కడుపు మండుతున్న వాళ్లకు, కడుపు నిండిన వాళ్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. కడపుమండుతున్న వాళ్ల ఆవేదన తాత్కాలికమే. తెలంగాణలో ప్రస్తుత సంఘర్షణ తాత్కాలికమే. తెలంగాణ ప్రజలదే రేపటి విజయం.
- జూలూరి గౌరీశంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పరిణతి, ప్రజ్ఞ కబరుస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమాలను నిర్మిస్తున్నారు. పార్టీలు గాడి తప్పుతుంటే వాటిని ప్రజలే గాడిలో పెడుతున్నారు. వాళ్లకు కావాల్సిన తెలంగాణ వారు తెచ్చుకుంటారు. సంక్షోభాలు కృత్రిమమైనవి.
- ఎం నరేందర్‌రావు, సెక్ర తెలంగాణ ఉద్యోగులు జేఏసీ చైర్మన్

తెలంగాణ ఉద్యమం చాలా సమస్యలను పరిష్కరించుకున్నది. సంక్షోభాలను అధిగమించింది. ప్రజల ఉద్యమాలతోనే సీడబ్ల్యుసీలో తీర్మానం వచ్చింది. రేపు తెలంగాణ వస్తుంది. ప్రజా ఉద్యమాల విజయం తథ్యం
- మల్లికార్జున్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి