21, సెప్టెంబర్ 2013, శనివారం

ఈ ఏడాది వృద్ధి 4.8 శాతమే..


9/21/2013 3:34:13 AM
అంచనాను మరోసారి తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్..భారత వృద్ధిరేటు అంచనాను మరోసారి తగ్గించింది. దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న సంకేతాలు వెలుబడటంతో ఈ ఏడాది వృద్ధి అంచనాను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో సంస్థ పేర్కొంది. 2012 సెప్టెంబర్‌లో 7 శాతంగా ఉంటుందని పేర్కొన్న రేటింగ్ ఏజెన్సీ... ఆ తర్వాత 2013 జూన్‌లోఅంచనాను మరోసారి 5.7 శాతానికి తగ్గించింది. గడిచిన మే నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 శాతం మేర క్షీణించడంతో కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) మరింత పెరగనుండటంతో వృద్ధి అంచనాను సవరించినట్లు పేర్కొంది.

అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతోపాటు దేశ అంతర్గత సమస్యలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని.. ముఖ్యంగా జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన 4.8 శాతం వృద్ధిరేటు ఏప్రిల్-జూన్ కాలానికి 4.4 శాతానికి తగ్గిందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా జీడీపీ అంచనాను 5.8 శాతానికి కుదించింది. గతంలో 7.5 శాతంగా ఉంటుందని ఏజెన్సీ పేర్కొన్న విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి