September 24, 2013
సీమాం«ద్రుల ఆందోళనలకు పరిష్కార మార్గాలు
సూచించి, రాష్ట్ర విభజనకు మార్గం సుగమం చేసుకోవాలా? లేక... సభలు పెట్టి
సీమాం«ద్రులను తిడుతూ అందరితో చప్పట్లు కొట్టించుకోవడం కావాలా? తెలంగాణ
ప్రాంత నేతలు దీని గురించి ఆలోచించాలి. ఇప్పటిదాకా జరుగుతున్నది చూస్తే...
చప్పట్లు కొట్టించుకోవాలంటే సీమాం«ద్రులను తిట్టాలి. అవాస్తవాలో,
అతిశయోక్తులో చెప్పాలి. నిజానిజాలు ఎలా ఉన్నా... మాటల దాడి మాత్రం చేయాలి.
రాజకీయ నాయకుల రాజకీయ ప్రసంగాలు ఎలా ఉన్నా... విజ్ఞులైన ప్రొఫెసర్లు సైతం
ఇలాగే మాట్లాడుతుండటమే నేటి విషాదం. 'హైదరాబాద్‌లో జరిగింది అభివృద్ధే
కాదు. అది విధ్వంసం. ఆ విధ్వంసానికి సీమాం«ద్రులే కారణం' అనే వాదన ఎంత
వింత! అభివృద్ధి అంటేనే... ఏదో ఒక స్థాయి విధ్వంసం. ఇది ఏ ప్రాంతానికైనా, ఏ
రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా వర్తిస్తుంది. హైదరాబాద్‌లో చెరువులు
నాశనమైపోయాయంటున్నారు. రాజమండ్రిలో కంబాల చెరువు చిక్కిశల్యమై పార్కులా
మారింది.కర్నూలు జిల్లా నంద్యాలలో రోజాకుంట పిల్లల ఆటమైదానంలా మారింది. విశాఖపట్నంలో సీతమ్మధార, మాధవధార ఇంతకుముందులాగా లేవే! లెక్కతీస్తే ఇలాంటివి ఎన్నో! ఒకప్పుడు ఏటేటా వర్షపు నీటితో నిండే చెరువులను... ఇప్పుడు ప్రాజెక్టుల ద్వారా విడుదల చేసే నీటితో నింపాల్సి వస్తోంది. ఏవైనా... వాడటం మానేస్తే పాడుబడిపోతాయి. బోర్లు వచ్చాక బావులు పోయాయి. ఇంటింటికీ కొళాయిలు వచ్చాక బోర్లూ ఎండిపోయాయి. ఇది పరిణామక్రమంలో జరిగే విధ్వంసం. పోనీ... హైదరాబాద్‌లో జరిగింది అభివృద్ధికాదు, మీరు చెప్పినట్లు విధ్వంసమే అనుకుందాం! అందులో సీమాం«ద్రుల పాత్ర ఎంతో కూడా మీర్చే తేల్చాలి. హైదరాబాద్‌లో సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినవారే కాదు, బీహార్, గుజరాత్, రాజస్థాన్, కేరళ ఇలా ఎన్నెన్నో రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. విదేశీయులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. నిఖార్సైన హైదరాబాదీలు కొందరే ఉన్నారు. వీరందరూ కాదని... సీమాంధ్రులవల్లే విధ్వంసం జరిగిందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లను కూడా సీమాం«ద్రుల కోసమే నిర్మించారనడం విమర్శలకు పరాకాష్ట. ఒక వాదన ప్రకారం కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లలోనే ఎక్కువగా సీమాం«ద్రులున్నారు.
కానీ... కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారిలో ఒక్క ఫ్లైఓవరూ లేదే! (ఎర్రగడ్డలో ఉన్నది రైల్వే ఓవర్ బ్రిడ్జి) ఎందుకని? సీతాఫల్‌మండీలో ఫ్లైఓవర్ ఎవరి కోసం వేసుకున్నట్లు? లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ ఎవరు వేయించుకున్నట్లు? పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రోడ్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ఐదు ఫ్లైఓవర్లు సీమాం«ద్రుల కోసం వేసినవేనా? పోనీ, మీరు చెబుతున్నట్లుగా ఫ్లైఓవర్లన్నీ సీమాంధ్రుల ఇళ్లకే దారి తీస్తున్నాయనుకుందాం! వీటివల్ల ఇతరులకు కించిత్ ఉపయోగం కూడా లేదా?
హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని మీరు విధ్వంసం అని పిలిస్తే... ఆ 'విధ్వంసం' హైదరాబాద్‌కే పరిమితం కావడంవల్ల సీమాంధ్రలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి ఆగిపోవడం నిజం. హైటెక్ సిటీ, హైటెక్స్, ఐఎస్‌బీ, ఐఐటీ, అంతర్జాతీయ విమానాశ్రయం... ఇలాంటివన్నీ నిర్మిస్తున్నప్పుడు 'ఈ విధ్వంసం మాకొద్దు' అని ఎందుకు ఉద్యమించలేదు? సరే... అప్పుడు మీకు ఇవన్నీ అభివృద్ధిలాగానే అనిపించిందనుకుందాం. కనీసం... ఇప్పుడు జరుగుతున్న 'మెట్రో విధ్వంసాన్ని' అయినా అడ్డుకోవచ్చుకదా? కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ఐటీ పెట్టుబడుల రీజన్ (ఐటీఐఆర్) విధ్వంసాన్నయినా అడ్డుకుంటారా? పెట్టుబడిదారుల వల్ల జరిగేది అభివృద్ధికాదని, విధ్వంసమే అని చెబుతున్న మీరు ఒక్క ముక్క చెప్పండి. 'రేపటి తెలంగాణ'లో పెట్టుబడిదారులకు చోటు ఉంటుందా లేదా? పెట్టుబడులు, పెట్టుబడిదారులు లేని సరికొత్త 'అభివృద్ధి సూత్రం' ఏదైనా ఆవిష్కరిస్తారా?
హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ సీమాం«ద్రుల చేతిలోనే ఉన్నాయంటున్నారు.
రియల్ ఎస్టేట్ భూతం పంట భూములను మింగేయడం నిజంగా నిజం. అయితే, రాష్ట్రంలోని ఏ మూలనున్న పట్టణానికి వెళ్లినా ఇదే దారుణం కనిపిస్తుంది. పెరుగుతున్న పట్టణీకరణ, నగరీకరణ ప్రభావమిది. మరి... ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మాత్రమే, అదీ సీమాం«ద్రులు మాత్రమే చేసిన విధ్వంసం ఏమిటి? హైదరాబాద్ శివార్లలో జరిగిన ఐటీ, రియల్టీ అభివృద్ధి వల్ల కనీసం రైతులు లబ్ధిపొందారు. రియల్ బూమ్‌తో రెండు మూడు ఎకరాలున్న రైతులు కూడా కోట్లకు పడగలెత్తారు. కానీ... సీమాంధ్రలో సెజ్‌ల రూపంలో వేలాది ఎకరాలు కోల్పోయిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఇది ప్రాంతాల మధ్య సమస్య కాదు. పెట్టుబడిదారీ విధానమే అంత! 1983కు ముందు హైదరాబాద్ చల్లగా ఉండేది. రోజంతా ఎండకాసినా సాయంత్రానికి చల్లబడేది. నిజమే. ఇప్పుడు వాతావరణం మారిపోయింది.
ఈ పరిస్థితి హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమా? కానేకాదు! బెంగళూరు ఇప్పటికీ 'గార్డెన్ సిటీ'గానే ఉందా? లేదుకదా! అంటార్కిటికాలోనే మంచు పరిమితికి మించి కరుగుతోందని పర్యావరణవేత్తలు వాపోతున్నారు. ప్రపంచ పరిణామ క్రమాన్ని వదిలేసి... తెలంగాణను మాత్రమే సింగిల్ఔట్ చేసి చూడటంవల్ల వస్తున్న సమస్య ఇది. 'అందరూ బాగున్నారు. మేం మాత్రమే నాశనమయ్యాం. ఆ నాశనానికి వేరెవరో కారణం' అనే వాదన సరికాదు. మాటలు, పాటలు, కవితల్లో పదేళ్లుగా 'ఆంధ్రోళ్లు' అని తిట్టిపోశారు. ఇన్నాళ్లు ఉగ్గబట్టుకున్న సీమాం«ద్రులు ఇప్పుడు ఉద్యమ రూపంలో భగ్గుమంటున్నారు. ఇకనైనా... తిట్టడంమాని, సమస్యను సానుకూలంగా పరిష్కరించేలా మనసులు గెలిస్తే మంచిది!
- సూరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి