మంత్రులతో సీఎం కిరణ్ వ్యాఖ్యలు
30లోగా నిర్ణయిద్దామంటున్న బొత్స
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 25 : రాష్ట్ర విభజన తీర్మానాన్ని
అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడానికి జగన్ పార్టీతో కాంగ్రెస్ అధిష్ఠానం ఓ
అవగాహనకు వచ్చినట్లు ఆ పార్టీ సీమాంధ్ర నేతలు గ్రహించారు. దీంతో ఈ ఉచ్చులో
చిక్కుకోకుండా ఎలాగైనా తీర్మానాన్ని అడ్డుకోవాలని వారంతా వ్యూహం
రచిస్తున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆచితూచి
వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని సీఎం
కిరణ్‌కుమార్ రెడ్డి వాదిస్తున్నారు. మొత్తంమీద రాజీనామాలపై కలసికట్టుగా
నిర్ణయించుకుందామని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సూచిస్తున్నారు. ఇదే
విషయాన్ని వివరిస్తూ వారిద్దరూ సీమాంధ్ర నేతలందరికీ నచ్చజెబుతున్నారు.
బుధవారం సచివాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, సాకే శైలజానాథ్‌లు
సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీల రాజీనామాల విషయం చర్చకు వచ్చింది.
ఎంపీలు రాజీనామా చేయొద్దని తాను వారించడానికి బలమైన కారణం ఉన్నదని ఈ
సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ ప్రభావం సీమాంధ్ర ప్రజా ప్రతినిధులందరిపైనా
పడుతుందని, దాంతో ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో
రాష్ట్రపతి పాలన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పార్లమెంటులో విభజన
బిల్లును, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని.. విభజన
జరిగిపోతుందని మంత్రులతో కిరణ్ పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పుడు రాజీనామా
చేస్తే సమైక్యాంధ్రని కాపాడుకోవాలన్న ఆశయం నెరవేరే పరిస్థితి కూడా ఉండదని
వారితో అన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తనని కలిసిన మాజీ మంత్రి జేసీ
దివాకర రెడ్డితోనూ సీఎం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన అంశం
అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పడు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను
వెల్లడించడంతో పాటు తీర్మానం వీగేలా చేయాలని.. అప్పటివరకు రాజీనామాల
ప్రస్తావన వద్దేవద్దని అన్నారు.
ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే
వాదానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా ఈ వాదానికి నష్టం చేకూర్చిన
వారమవుతామని ఈ సందర్భంగా సీఎం కిరణ్ అన్నట్లు సమాచారం. తెలంగాణ బిల్లును
ఎంపీలు పార్లమెంటులో వ్యతిరేకించాలని, అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని
ఓడించాలని, అంతదాకా ఓపిక పట్టాలని సూచించారు. ఆ తర్వాత కూడా కేంద్రం
ముందుకు వెళ్తే అప్పుడు అందరం కలసి సమష్టి నిర్ణయం తీసుకుందామని సీఎం
స్పష్టం చేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు కూడా రాజీనామాలపై సీమాంధ్ర
నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీమాంధ్ర నేతలు
విడివిడిగా రాజీనామా చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా మిగతావారిపై
ఒత్తిడి పెరుగుతుందని బొత్స అంటున్నారు. ఒకవేళ చేస్తే అంతా కలిసి ఒకేసారి
రాజీనామా చేయాలని, ఎవరిదారిన వారు వెళ్లకుండా ఒకే మాటకు కట్టుబడి ఉండాలని
సూచిస్తున్నారు.
దీనిపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ఈ నెల 30లోగా ఎంపీలు, ఎమ్మెల్యేలు,
కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సీఎం నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని,
అందులోనే ఒక నిర్ణయం తీసుకుని దానికే కట్టుబడాలని బొత్స చెబుతున్నట్లు
సమాచారం. ఇప్పటికే ఆయన రెండుమూడు రోజులుగా ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు,
కేంద్ర మంత్రులతో తరచూ మాట్లాడుతున్నారు. రెండు మూడు రోజుల్లో అందరితోనూ ఓ
సమావేశం నిర్వహించి సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేసే అంశంపై
చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏకాభిప్రాయం వ్యక్తమైతే
కలసికట్టుగా రాజీనామా చేద్దామని బొత్స చెబుతున్నారు. అలాగే జగన్‌కు బెయిల్
వచ్చినందున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వైసీపీలోకి దూకకుండా ఉండాలంటే
తాడోపేడో తేల్చుకోవాలని, ఇక సొంత అజెండాల గురించి ఆలోచించకూడదని ఆయన
అభిప్రాయపడుతున్నారు.
అక్టోబర్ తొలి వారంలో సీమాంధ్ర నేతల భేటీ
కన్వీనర్ శైలజానాథ్ వెల్లడి
30న విశాఖలో సీఎం పర్యటన
రాష్ట్ర
విభజన విషయంలో అధిష్ఠానం నిర్ణయం, కేంద్రం ముందడుగు వంటి పలు అంశాలపై
చర్చించేందుకు అక్టోబర్ తొలివారంలో సమావేశం కావాలని సీమాంధ్ర కాంగ్రెస్
ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీన ఈ
సమావేశాన్ని నిర్వహించే యోచనలో ఉన్నామని సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం
కన్వీనర్ మంత్రి శైలజానాథ్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. ఈ సమావేశానికి
కేంద్ర మంత్రులు, ఎంపీలతో పాటు.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, ఈ భేటీలో కీలక
నిర్ణయాలు తీసుకునే వీలుందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. బుధవారం
సచివాలయంలో సీఎంని కలిసి వచ్చిన తర్వాత శైలజానాథ్ తన సహచరులతో ఈ అంశంపై
సమాలోచనలు జరిపారు. కాగా, ఈ నెల 30న సీఎం కిరణ్ విశాఖలో పర్యటించనున్నారు.
అక్కడ రూ. వంద కోట్లతో పూర్తి చేసిన ఓ ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు ఆయన పర్యటన ఖరారైంది.
- See more at: http://www.andhrajyothy.com/node/3242#sthash.Obwq31E5.dpuf
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి