26, సెప్టెంబర్ 2013, గురువారం

జగన్‌తో కుమ్మక్కు

September 24, 2013

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు కస్సుమంటున్నారు. తాము పార్టీని నిలబెడుతుంటే హైకమాండ్ మాత్రం జగన్‌తో చేతులు కలిపిందని, ఓట్ల కోసం, సీట్ల కోసం తెలంగాణను ఇచ్చి తమను, రాష్ట్రాన్ని బలిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మారిన పరిణామాల నేపథ్యంలో ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డి, సాయిప్రతాప్ సోమవారం ఢిల్లీలో లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. రాజీనామాలను ఆమోదించుకునే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానంపై రాయపాటి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... పార్టీని ప్రజల్లో నిలబెడుతున్న తమకు పార్టీ అన్యాయం చేస్తోందని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ జగన్‌తో చేతులు కలిపిందని, ఆయనకు బెయిల్ ఇప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆక్రోశించారు. 'ఇలాంటప్పుడు ఇంకా కాంగ్రెస్‌లో ఎందుకు ఉండాలి?' అని ప్రశ్నిస్తూ... పదవులతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసేద్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మారుస్తామని ప్రజలకు చెబుతున్న మనమే పార్టీకి రాజీనామాలు చేయటం సరికాదని ఒకరిద్దరు ఎంపీలు సూచించారు.

"ప్రస్తుతానికి మనం పదవుల్ని వదులుకుంటే చాలు. పార్టీ సంఖ్యాబలం తగ్గుతుంది. తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలు కూడా అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తారు. తద్వారా అధిష్ఠానం వైఖరిలో మార్పు తీసుకురావచ్చు. పార్టీకి రాజీనామాలు వద్దు'' అని తెలిపారు. మొత్తానికి... కాంగ్రెస్ అధిష్ఠానం జగన్‌తో చేతులు కలిపిందని, అయినప్పటికీ పార్టీలోనే ఉండి, పదవులను మాత్రం వదులుకుని రాష్ట్ర విభజన నిర్ణయం మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు తీర్మానించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాలులో తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు.


ఏపీ భవన్‌లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఎంపీల రాజీనామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. తర్వాత పలువురు ఎంపీలకు ఫోన్లు చేసి ఏపీ భవన్‌కు రావాలని కోరారు. లగడపాటి, అనంత, ఉండవల్లి మాత్రం ఏపీ భవన్‌కు రాలేదు. రాయపాటి, సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం వచ్చారు. రాజీనామాలపై కిరణ్, బొత్స ఎంపీలను బుజ్జగించారు. "రాజీనామాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండటం ఎంత అవసరమో, బిల్లు అడ్డుకునేందుకు లోక్‌సభలో ఎంపీలు ఉండటం కూడా అంతే అవసరం'' అని సీఎం తెలిపారు.

దీంతో సమావేశానికి హాజరైన ఎంపీలు కొంత మెత్తబడ్డారు. మిగతా ఎంపీలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో మంగళవారం ఉదయం స్పీకర్ అపాయింట్‌మెంట్‌కంటే ముందే ఏపీ భవన్‌లో అల్పాహార విందుకు హాజరు కావాలని ఎం పీలను ముఖ్యమంత్రి కోరారు. అప్పుడు అంతా కలిసి కూర్చుని, ఏ నిర్ణయం తీసుకున్నా సమైక్యంగా తీసుకోవచ్చునని సూచించారు.


సీఎంను కలిసిన రాయపాటి, సాయిప్రతాప్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం మంగళవారం ఉదయం కిరణ్‌తో మాట్లాడాకే రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకుంటామని మీడియాకు చెప్పారు. ముఖ్యమంత్రి కూడా సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నారని, ప్రజలతో పాటు అధిష్ఠానానికి కూడా ఈ విషయం తెలుసునని వారు అన్నారు.

"స్పీకర్‌కు ఇప్పటికే రాజీనామాలు సమర్పించాం. వాటిని ఆమోదిస్తే వద్దనం. సంతోషంగా ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేస్తాం'' అని తెలిపారు. అయితే... మిగతా ఎంపీలు మాత్రం సీఎంతో అల్పాహార విందు భేటీలో పాల్గొనేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు. తాము స్పీకర్‌ను కలుస్తామని, రాజీనామాలు ఆమోదించుకుని ప్రజల్లోకి వెళతామని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. వెరసి... మంగళవారం ఎంతమంది ఎంపీలు స్పీకర్‌ను కలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి