25, సెప్టెంబర్ 2013, బుధవారం

కాంగ్రెస్ కంఠస్వరం! (ఇండియా గేట్) - ఎ.కృష్ణారావు

బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు నివేదికలో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సుప్రీంకోర్టు 'తన యజమాని కంఠస్వరానికి అనుగుణంగా పంజరంలో ఉన్న చిలక మాదిరి సీబీఐ వ్యవహరిస్తోంది..' అని వ్యాఖ్యానించింది. తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో దాఖలైన సీబీఐ మెమోలో కూడా కొందరికి హృదయం కనపడకపోతే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఎవరి కంఠస్వరం సీబీఐని పలికిస్తుందో ఊహకందని విషయం కాదు.
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాదాపు ఏడాది తర్వాత ఒకరోజు ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూర్చుని ఉండగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అటువైపు నుంచి వెళ్తూ ఆయనవైపు చూశారు. తనను చూసి లేచి నిలబడ్డ విహెచ్‌ను ఆమె తనతో పాటు రమ్మని పిలిచారు. పరుగు పరుగున వెళ్లి విహెచ్‌కు చీవాట్లే దక్కాయి. 'ఏమిటీ, వైఎస్ రాజశేఖర రెడ్డిని బహిరంగంగా విమర్శిస్తున్నావట, లేఖలు రాసి లీక్ చేస్తున్నారట..' అని ఆమె ఆయనను తీవ్రంగా నిలదీశారు. అందుకు ఖంగు తిన్న విహెచ్ తాను వైఎస్ ఏక పక్ష వైఖరిని ప్రశ్నించానని వివరించబోగా, సోనియా ఆయనను ఆపి.. 'ఏదైనా ఉంటే నాకు చెప్పండి.. పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడండి..'అని గట్టిగా మందలించారు.
హతాశుడైన విహెచ్ 'సరే మేడమ్...' అని కొద్ది రోజుల వరకూ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలికి సన్నిహితుడుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి రామమోహన్ రావు అంతకు ముందు సోనియాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కలిసి విహెచ్ పై ఫిర్యాదు చేసినందువల్లే ఆమె విహెచ్‌పై ఆగ్రహించడం సహజ పరిణామం.
దాదాపు నెల రోజుల క్రితం ఇదే విహెచ్‌ను ఆంటోనీ కమిటీ సమావేశంలో సోనియాకు సన్నిహితుడైన ఒక సీనియర్ నేత తీవ్రంగా మందలించారు. కాంగ్రెస్‌లోనే చాలా మంది జగన్మోహన రెడ్డిని పన్నెత్తి మాట అనడం లేదని, సోనియా గాంధీని విమర్శిస్తున్నా విజయమ్మను, షర్మిలను వారు విమర్శించడం లేదని వీహెచ్‌కు ఆ నేత గుర్తు చేశారు. హనుమంతరావు గత కొంతకాలంగా చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ మందలింపు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతిలో విహెచ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ నేత ఆయనను మందలించడానికి ఒక కారణమైంది. 'నీవొక్కడివే మేడమ్‌కు విధేయుడివని అనుకుంటున్నావా, నీ దూకుడు తగ్గించు.. మాకు తెలుసు.. ఎవరు విధేయులో కాదో..' అన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించడం సోనియాగాంధీకి వీర విధేయుడుగా అనుకుంటున్న వి. హనుమంతరావుకు షాక్‌లా అనిపించింది.
సాధారణంగా కాంగ్రెస్ అధిష్ఠానం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వంటి జాతీయ స్థాయి నేతలను విమర్శించనంతవరకూ రాష్ట్రాల్లో తమ పార్టీ నేతలు ఎవరు ఎవర్ని తిట్టుకున్నా సహిస్తూ ఉంటుంది. వారు వారూ తిట్టుకుని తన వరకూ రావడం కాంగ్రెస్ అధిష్ఠానానికి సంతోషకరంగానే ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తమను సంతృప్తి పరిస్తే, తమకు విధేయంగా ఉంటే ఆయనపైఎన్ని ఆరోపణలు వచ్చినా ఈగ కూడా వాలకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు పడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదు. ప్రాజెక్టుల్లో అవినీతి నుంచి రింగ్ రోడ్ పేరిట జరిగిన అక్రమాలు, రాయలసీమలో హత్యారాజకీయాలు, గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టిన తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టడం, కేంద్రంలో యుపిఏకు మద్దతునిచ్చిన సీపీఐ(ఎం) రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా మారడం, తెలంగాణ రాష్ట్రసమితిని దూరం చేయడంలో వైఎస్, ఆయన అనుయాయులు కీలక పాత్ర పోషించడం వంటి పరిణామాలెన్నో జరిగినా కాంగ్రెస్ అధిష్ఠానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. నాడు కాంగ్రెస్ పార్టీకి ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్‌ను ఆకాశానికి ఎత్తేవారు. సోనియాగాంధీ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడల్లా ఆమె వైఎస్‌ను బాగా పొగిడేలా ఉండవల్లి లాంటి వారు జాగ్రత్తలు తీసుకునేవారు. ఉపన్యాస రచయితలను ప్రభావితం చేసేవారు.
అన్నిటికన్నా విచిత్రమేమంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మందీ మార్బలంతో ఢిల్లీ వచ్చి రింగ్ రోడ్ అక్రమాలపై సేల్ డీడ్స్‌తో సహా పలు సాక్ష్యాధారాలతో దాదాపు వేయి పేజీల డాక్యుమెంట్‌ను తనకు సమర్పించిన మరునాడే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి పనిగట్టుకుని వైఎస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్‌ను అపర ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించే వైఖరికి భిన్నంగా మన్మోహన్ సింగ్ వ్యవహరించే అవకాశాలు లేవు కనుక అధిష్టానంపై వైఎస్ పట్టు ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఆయన ప్రశంసలు దోహదపడుతాయి. ఈ పట్టు ఆయన చివరి వరకూ కొనసాగించగలిగారు. ఆయనపై వేల వేలపేజీల ఫిర్యాదులు అధిష్ఠానానికి, ప్రభుత్వాధినేతలకూ, ఆఖరుకు రాష్ట్రపతికీ చేరినా ఆయనను కనీసం ప్రశ్నించిన పాపాన కూడా ఢిల్లీ పెద్దలు పోలేదు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంతర్గత సమావేశాల్లో వైఎస్‌ను ఎంత వ్యతిరేకించినా, తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకోవాలని వాదించినా, వైఎస్ మాటకే అధిష్ఠానం మొగ్గు చూపింది. కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి వంటివి కాంగ్రెస్ డిక్షనరీలో కొత్తపదాలు కావు కాబట్టి వైఎస్‌పై అవినీతి ఆరోపణలను సీరియస్‌గా పట్టించుకుని ఒక ప్రధానమైన రాష్ట్రంలో పరిస్థితిని చేజేతులా అస్తవ్యస్తం చేయడం ఎందుకని అధిష్ఠానం భావించి ఉండవచ్చు.
అందుకే వైఎస్‌పై తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్న సమయంలో కూడా సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. కొత్తకోటలో జరిగిన ఒక సభలో ప్రధానమంత్రి తమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రమని స్పష్టీకరించారు. అవును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు ముఖ్యమైన రాష్ట్రం కనుకనే కాంగ్రెస్ అధిష్ఠానం దానిని అంత తేలికగా వదలదలచుకోలేదు. నాడు వైఎస్‌పై ఏ ఆరోపణలనైతే కాంగ్రెస్ అధిష్ఠానం విస్మరించిందో. ఇప్పుడు ఆయన కుమారుడిపై అవే ఆరోపణలను విస్మరించడానికి అధిష్ఠానం నిర్ణయించినట్లు సంకేతాలు కనపడుతున్నాయి. ఇందుకు కారణం 2014లో విభిన్న రాజకీయ సమీకరణాల ద్వారా అధికారంలోకి రావడానికి, రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించడమే. బహుశా గత రెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ రాజకీయ క్రీడలో భాగమే. ఏ క్రీడకైనా గెలుపోటములు తేలాల్సిన సమయంలో అసలు ఆట గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. ఈ క్రీడలను గ్రహించలేని వి.హనుమంతరావు లాంటి వాళ్లు అన్ని సార్లూ ఒకే రకంగా వ్యవహరించి మందలింపులకు గురి అవుతుంటారు. ఆంటోనీ కమిటీ సమావేశంలో తనను మందలించిన కాంగ్రెస్ ముఖ్యనేతే దేశంలో పలువురు ప్రముఖులపై సిబిఐ కేసులను పర్యవేక్షిస్తున్న విషయం ఆయన గమనించి ఉండకపోవచ్చు.
సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ విషయంలో కూడా ఇదే క్రీడ జరిగింది. 2007 అక్టోబర్ 26నాటికి ములాయం సింగ్‌యాదవ్ పై సిబిఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. కాని సిబిఐ ఎఫ్ఐఆర్ మాత్రం దాఖలు చేయలేదు. అణు ఒప్పందం తర్వాత వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించడంతో కాంగ్రెస్ జాగ్రత్త పడింది. క్రమంగా ములాయంపై సిబిఐ ఒత్తిడి పెంచడం ప్రారంభించింది. ఏమైతేనేం అప్పటి వరకూ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాది పార్టీ 2008 జులైనుంచి యుపిఏ ప్రభుత్వానికి మద్దతునీయడం ప్రారంభించింది. మేలో జరిగిన యుపిఏ ప్రభుత్వ వార్షికోత్సవానికి ములాయం సింగ్ యాదవ్ హాజరై సోనియాగాంధీ కూర్చున్న టేబుల్ వద్దనే కూర్చుని విందారగించారు. ఆ తర్వాతే ములాయం సింగ్ అక్రమ ఆస్తిలో ఆయన భార్య, కోడలు ఆస్తిని చేర్చకూడదని అటార్నీ జనరల్ వాహనావతి న్యాయ సలహా ఇచ్చారు. అణు ఒప్పందం అమలు అయిన నాటి నుంచీ వాహనావతి ములాయం సింగ్ కేసును స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. సిబిఐ తర్వాతి కాలంలో ములాయంకు క్లీన్ చిట్ ఇచ్చింది కాని ఆయన ఫైలును పూర్తిగా మూసివేయలేదు. తర్వాతి కాలంలో ములాయంను కాంగ్రెస్ చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంది. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో తొలుత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చేతులు కలిపిన ములాయం తర్వాత ఆమెను అమాయకురాలును చేసి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికారు. గత పార్లమెంట్ సమావేశాలకు ముందు ములాయం సింగ్ యాదవ్ ఆహార భద్రత బిల్లును బలంగా వ్యతిరేకించారు.
కాని ఏమి జరిగిందో కాని ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో సమర్థించారు. నోయిడాలో ఐఏఎస్ అధికారిణి దుర్గానాగ్‌పాల్ ఇసుక మాఫియా కుంభకోణాన్ని అరికట్టినందుకు ఎస్‌పి ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. దీనిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. తాజా పరిణామం- దుర్గానాగ్‌పాల్ తన భర్తతో కలిసి యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. ఆమె సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుని రెవిన్యూ శాఖలో మంచి పోస్టింగ్ ఇవ్వడానికి అఖిలేష్ యాదవ్ సుముఖత వ్యక్తం చేశారు. రెండు పార్టీలు తలుచుకుంటే ఐఏఎస్ అధికారులెంత? సిబిఐ ఎంత? ఏమైతేనేం ములాయం సింగ్ యాదవ్, సోనియాగాంధీల మధ్య సఖ్యత ఏర్పడిందన్న విషయం స్పష్టమవుతున్నది. ఆహార భద్రత బిల్లుకు ఆయన మద్దతునిస్తే, ఆయనపై అక్రమాస్తుల కేసు ఫైలును సిబిఐ మూసివేసింది. నాకది-నీకిది (క్విడ్‌ప్రో) సూత్రానికి ఇది అసలు సిసలైన ఉదాహరణ. లోక్‌సభకు 80 మంది ఎంపిలను పంపే ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వీయకుండా అడ్డుకోవాలంటే ఈ స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడం కాంగ్రెస్‌కు రాజకీయ అవసరం. బహుజన సమాజ్ పార్టీ మాయావతి కూడా తన గుప్పిట్లోంచి జారిపోకుండా కాంగ్రెస్ మరో వైపు జాగ్రత్తలు పడుతోంది.
కొద్ది రోజుల క్రితం బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు నివేదికలో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి ప్రకటించిన సుప్రీంకోర్టు 'తన యజమానుల ఒత్తిళ్లకు లొంగి సిబిఐ ఈ నివేదిక హృదయాన్నే మార్చి వేసింది...' అని విమర్శించింది. 'తన యజమాని కంఠస్వరానికి అనుగుణంగా పంజరంలో ఉన్న చిలక మాదిరి సిబిఐ వ్యవహరిస్తోంది..' అని వ్యాఖ్యానించింది. తాజాగా హైదరాబాద్‌లో ని నాంపల్లి కోర్టులో దాఖలైన సిబిఐ మెమోలో కూడా కొందరికి హృదయం కనపడకపోతే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఎవరి కంఠస్వరం సిబిఐని పలికిస్తుందో ఊహకందని విషయం కాదు.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
- See more at: http://www.andhrajyothy.com/node/2701#sthash.CZP8wg2B.dpuf

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి