24, సెప్టెంబర్ 2013, మంగళవారం

జగన్‌కు బెయిల్


September 24, 2013


హైదరాబాద్, సెప్టెంబరు 23 : అక్రమాస్తుల కేసులో అరెస్టయి, 16 నెలలుగా చంచల్‌గూడ జైలులో ఉన్న కడప ఎంపీ, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం... సోమవారం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 'కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది' అని సీబీఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదాలు, పలు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయన్న సీబీఐ వాదనను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది.

"దర్యాప్తు సమయంలోనేకాక, కేసు విచారణ సందర్భంగా కూడా నిందితుడు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీబీఐ వాదనను గుర్తించాం. అయితే... అలాంటి ఆరోపణలకు సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది'' అని కోర్టు అభిప్రాయపడింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితుడు సంజయ్ చంద్ర విషయంలో సుప్రీంకోర్టు ఇదే వెల్లడించిందన్నారు.

"జగన్ కేసులో సాక్ష్యాల తారుమారుపై కోర్టుకు సీబీఐ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు. అందువల్ల నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించలేకపోతున్నాం. ఒకవేళ... అలాంటి ఆధారాలు లభిస్తే, వాటిని ఎప్పుడైనా కోర్టుకు సమర్పించి, నిందితుడి బెయిల్ రద్దు కోరే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుంది'' అని సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు తెలుపుతూ జగన్‌కు బెయిల్ మంజూరు చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తీర్పు వెలువడటం, పూచీకత్తుల సమర్పణ కు సమయం లేకపోవడంతో జగన్ వెంటనే విడుదలకాలేదు. లాంఛనాలు పూర్తయిన అనంతరం మంగళవారం జగన్ విడుదల కానున్నారు.




జగన్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 18న వాదనలు జరిగాయి. "జగన్ పలుకుబడిగల వ్యక్తి. దర్యాప్తు పూర్తయినప్పటికీ... సాక్షులను ప్రభావితం చేయగలరు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దు'' అని సీబీఐ న్యాయవాది కోరారు. సత్యం కంప్యూటర్స్ కేసులో దర్యాప్తు ముగిసి, విచారణ జరుగుతున్నప్పుడు కూడా రామలింగరాజుకు బెయిల్ రాలేదని గుర్తుచేశారు.

"దర్యాప్తు పూర్తయిన తర్వాత బెయిలుకోసం సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని మాత్రమే సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఆదేశాలకు అర్థం, దర్యాప్తు ముగిసిన వెంటనే బెయిలు ఇవ్వాలని కాదు. మెరిట్స్, ఆధారాలు, పరిస్థితుల ఆధారంగానే బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉంది'' అని తెలిపారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. సత్యం కేసు, క్విడ్‌ప్రోకో కేసు వేర్వేరన్నారు. ఆ రెండింటినీ పోల్చి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దన్నారు.

"ఆధారాల్లేకుండా కేవలం అనుమానాలు, ఊహాలతో బెయిల్‌ను సీబీఐ పదేపదే అడ్డుకుంటోంది. ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించడమే'' అని వాదించారు. సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 8న ఇచ్చిన తీర్పు ప్రకారం... దర్యాప్తును 4 నెలల్లో పూర్తి చేయాలని, ఆ తర్వాత నిందితుడు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. 'కేసుకు సంబంధించిన పత్రాలన్నీ, సీబీఐ వద్ద ఉండగా సాక్ష్యాలను మార్చే అవకాశం ఎలా ఉంటుంది?' అని ప్రశ్నించారు. బెయిల్ ఇచ్చే విషయంలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో సుప్రీం కోర్టు గతంలోనే చెప్పిందంటూ... ఆ వివరాలు తెలిపారు. "సీబీఐ అంటున్నట్లు జగన్ ఇప్పటిదాకా ఎవరినైనా ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆధారాలు చూపిందా? అలాంటిది ఏదైనా ఉంటే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు'' అని తెలిపారు.




రూ.2 లక్షల విలువైన పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలి.
కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదు.
కేసులో వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.
దర్యాప్తునకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆటంకాలు కల్పించినా, షరతులను ఉల్లంఘించినా... బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి