19, సెప్టెంబర్ 2013, గురువారం

హస్తినలో కుట్రల కోలాటం


9/19/2013 7:41:59 AM
- తెలంగాణను అడ్డుకునే యత్నాలను ముమ్మరం చేసిన సీమాంధ్ర నేతలు
- ఆంటోనీ కమిటీ సభ్యులు మొయిలీ, అహ్మద్ పటేల్‌తో భేటీ
- ముందుకుపోలేం.. వెనక్కిపోలేం: అహ్మద్ పటేల్
- రాష్ట్రపతిని ఒంటరిగా కలిసిన ఉండవల్లి
- నేడు సోనియా, షిండే, దిగ్విజయ్‌ను కలిసే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు హస్తిన వేదికగా తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. అడ్డుకునే కుట్రల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలుస్తూ.. సీమాంధ్ర ఉద్యమం తీవ్రంగా సాగుతోందని వివరిస్తున్నారు. ఆఖరిప్రయత్నంగా ఉద్యమ బూచిని చూపి అడ్డుకోవాలని చూస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, కేంద్రమంత్రులు బుధవారం ఆంటోనీ కమిటీ సభ్యులైన కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ప భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఎట్టిపరిస్థితుల్లో అడుగు ముందుకేయబోమని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సిందిగా నేతలను వారు కోరినట్టు తెలిసింది. మరోవైపు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒంటరిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.

రాష్ట్ర విభజనతో అనేక చిక్కులు తలెత్తుతాయని, ముఖ్యంగా హైదరాబాద్, నదీ జలాల పంపిణీ అంశాలపై సమస్య ఎదురవుతుందని రాష్ట్రపతికి ఉండవల్లి వివరించారు. ఉండవల్లి చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావధానంగా విన్నట్టు తెలిసింది. అయితే ప్రణబ్‌తో భేటీ వివరాలను మీడియాకు తెలిపేందుకు ఉండవల్లి నిరాకరించారు. మరోవైపు గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేలను సీమాంధ్ర నేతలు కలువవచ్చునని తెలుస్తోంది. సోమవారం నుంచి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం వారు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇందుకు సోనియా సుముఖత చూపడం లేదని తెలిసింది.

ముందుకుపోలేం.. వెనక్కిపోలేం!: సీమాంధ్రలో ఆందోళన ఉధృతంగా కొనసాగుతోందని, ప్రజాజీవితం పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజలు రోడ్లమీదకు వచ్చారని సాయంత్రం అహ్మద్ పటేల్‌తో జరిగిన భేటీలో సీమాంధ్ర నేతలు వివరించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పార్టీతో ప్రకటన చేయిస్తే సమైక్య ఉద్యమాన్ని నిలిపివేయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. వారి మాటలన్నీ విన్న అహ్మద్ పటేల్ రాష్ట్ర విభజన నిర్ణయంపై వెనక్కి వెళ్లలేమని స్పష్టంచేసినట్టు సమాచారం. అలాగని రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఆయన సీమాంధ్ర నేతలకు చెప్పినట్టు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమించవచ్చునని, ఈ విషయంలో ఏమీ పాలుపోని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయినట్టు తెలిసింది.

ఈ విషయంలో మీరే ఏదో పరిష్కారం చూపాలని అహ్మద్ పటేల్ సీమాంధ్ర నేతలను కోరినట్టు సమాచారం. నేతలు తనకు తెలియజేసిన వివరాలను సోనియాకు చెబుతానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఉదయం సీమాంధ్ర నేతలు కేంద్రమంత్రి వీరప్పమొయిలీను ఆయన కార్యాలయంలో కలిశారు. తెలంగాణ ప్రక్రియను ఆపాలని కోరారు. వీరిలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పనబాక లక్ష్మి, కిల్లికృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంద్రరావ్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, సాయిప్రతాప్ తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీ అనంత మీడియాతో మాట్లాడుతూ.. ఏకాభిప్రాయం ఉంటేనే విభజన జరుగుతుందని విశ్వాసం తమకు కలిగిందని పేర్కొన్నారు. 48 రోజులుగా విద్యార్థులు, ఉద్యోగులు ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆందోళనచేస్తున్నారని మొయిలీకి వివరించామన్నారు. వీరప్ప మొయిలీ సానుకూలంగా స్పందించారని, ఈ విషయాలను ఆంటోని కమిటీలోని మిగతా సభ్యులతో చర్చిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ప్రక్రియ కొనసాగదని ఆయన పేర్కొన్నారు.

సోయిలేని తెలంగాణ కాంగ్రెస్ నేతలు
తెలంగాణను అడ్డుకుని తీరతామంటూ ఒకవైపు సీమాంధ్ర నేతలు ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తుండగా, ఇదేమీ పట్టించుకోకుండా తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిద్రావస్థలో జోగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విభజనను తాము ఆపగలిగామని సీమాంధ్ర నేతలు ప్రకటనలిస్తున్నా.. టీ నేతలు పట్టీపట్టనట్టు వ్యవహరింస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి