23, సెప్టెంబర్ 2013, సోమవారం

సీమాంధ్ర పాలనలో ఆగమైన చెదిరిన చెరువులు


9/23/2013 6:44:13 AM
హైదరాబాద్
జల వనరుల ధ్వంస రచన!

‘హైదరాబాద్ ఒక అద్భుత నగరం.. పెద్ద పెద్ద వీధులు, విశాలమైన భవంతులు, కనువిందు చేసే చెరువులున్న నగరం. మంచినీరందించే అంత పెద్ద చెరువు ఊరు నడిమధ్యన ఉన్న నగరం దేశంలో మరెక్కడా లేదు’...వందల ఏళ్ల నుంచి నగర సందర్శకులంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట ఇది. అవును..నాలుగు వేలకు పైగా నీటి వనరులున్న హైదరాబాద్‌ను సరస్సుల నగరంగా పిలిచేవారు. నగరం నడిమధ్యన ఉన్న లేక్‌వ్యూ భవనం... నగరానికి సరస్సులకు ఉన్న సంబంధానికి మౌన సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచే ఉంది. భూమి పుత్రులు రాజ్యమేలిన కాలమంతా సరస్సులను ప్రాణప్రదంగానే కాపాడుకున్నారు. నడమంత్రపు సీమాంధ్రులు కాలుపెట్టాకే చెరువులకు, కుంటలకు చేటుకాలమొచ్చింది. వారి కాసుల దాహానికి సరస్సులన్నీ ఆవిరైపోయాయి. కుంటలు అదృశ్యమైపోయాయి. అయ్య చుట్టం కానోడు.. అవ్వ చుట్టం కానోడు తనకు ఏ సంబంధమూ లేని భూమిని, నీటిని కబ్జా పెట్టి అడ్డికి పావుశేరు చొప్పున అంగట్లో పెట్టి అమ్మకుంటున్నడు. ఆకాశహర్మ్యాలు కడుతున్నడు. రంగుల దుకాణాలు పెడుతున్నడు. వందల ఏళ్లు భూమిపుత్రులు తల్లిగా కాపాడుకున్న, గంగమ్మగా కొలుచుకున్న సాగునీటి చెరువులు కుంటలను చెరపట్టి కాసులుగా మార్చుకుంటున్నడు. రాజ్యం వారిది... యంత్రాంగం వారిది. చెరువుల దగ్గరి గంగమ్మలు, కట్టల మీది మైసమ్మలు గోడుగోడు మంటున్న విషాదం మాత్రం భూమి పుత్రులది!!


gfdtహైదరాబాద్,సెప్టెంబర్ 22(టీ మీడియా): సీమాంధ్రుల దురాశకు నగరంతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది చెరువులు విధ్వంసానికి గురయ్యాయి. పర్యావరణాన్ని కాపాడి నగరాన్ని సమశీతల వాతావరణం లో ఉంచే నీటి వనరులను ఒక్కటొక్కటిగా మింగేశారు. దీంతో నగర వాతావరణపు సమతుల్యత దెబ్బతిన్నది. తోటలు, చెరువుల నగరంగా వందల ఏళ్లు పేరుగాంచిన హైదరాబాద్‌లో ఇపుడు చెరువులు కన్ను పొడుచుకున్నా కనిపించని పరిస్థితి ఏర్పడింది. నగరంలోని నీటి కుంటలు, చెరువులు లింక్ కాలువల ఆనవాళ్లు కూడా మిగల్లేదు. వర్షపునీటిని, మురికి నీటిని కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన చెరువులు లేకపోవడంతో వరదనీరు, మురికి నీరు వీధులను బస్తీలను ఆక్రమిస్తోంది. నగరంలోని ఓ చెరువులో రాంకీ విల్లాలు, డూప్లెక్స్‌లు లేస్తే మరో చెరువు అపార్ట్‌మెంట్‌గా మారింది. లో సమైక్య రాష్ట్రం ఏర్పడే నాటికి నగరంతో పాటు చుట్టూ శివారు ప్రాంతాల్లో అన్నీ కలిపి 532 చెరువులు ఉండేవి. వీటికి వేల సంఖ్యలో ఉన్న కుంటలు కలుపుకుంటే నగరంలో నాలుగు వేలకు పైగా నీటి వనరులుండేవి. అయితే ఇవన్నీ కాలక్రమంలో రియల్‌ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోయాయి. వీటి రికార్డులు కూడా గల్లంతయ్యాయి. ప్రభుత్వం 1996లో ఎన్‌ఆర్‌ఎన్‌ఏ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నగరంలో 112 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 932 చెరువులు ఉన్నట్లు నిర్ధారించింది. అయితే 2000 సంవత్సరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు 25 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో 169 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విస్తీర్ణం 90 చదరపు కిలోమీటర్లు కాగా వీటిల్లో కూడా చాలా వరకు ఇపుడు ఆక్రమణకు గురయ్యాయి. అధికారులు 483 ఎకరాల విస్తీర్ణం కలిగిన 99 చెరువులు కబ్జా అయినట్లు అధికారికంగా ప్రకటించారు.

జలాశయాలకు ముప్పు...: హైదరాబాద్‌కు మంచినీటి దాహర్తిని తీర్చిన జంటజలాశయాలను కబ్జాదారులు వదలడం లేదు. ఈ ఏరియా అంతా 111 జీవో పరిధిలో ఉన్నా అక్రమంగా పరివాహక ప్రాంతంలో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలతోపాటు అనేక రిసార్ట్‌లు వెలిశాయి. దీంతో పరివాహక ప్రాంతం నుంచి జలాశయాలకు వచ్చే వరద నీరు తగ్గిపోవడంతోపాటు పదేళ్లుగా ఈ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు జలాశయాల్లో రాజకోటలను తలపించే విధంగా ప్రహరీ గోడలు నిర్మించారు.

సర్కారు అండాదండా...: కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాయడంతో శిఖం భూములు కాలనీలుగా అవతరించాయి. జలాశయాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికి అధికారుల అవినీతి, సీమాంధ్ర సర్కారుపెద్దల అండతో భారీ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఏండీఏ అధికారులు రియల్టర్లకు అండగా నిలుస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు వేసిన వెంచర్లకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంతోపాటు ఈ అనుమతులను పట్టుకొని కొంత మంది వెంచర్లు చేసి విక్రయించుకోగా జీహెచ్‌ఏంసీ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. రోడ్లు వేసింది. వాటర్ బోర్డు మంచినీటి కనెక్షన్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. దానితో చెరువులే కాలనీలుగా అవతరించాయి.

చెరువుల ప్రక్షాళనలోనూ కొనసాగుతున్న వివక్ష
సీమాంధ్ర పెట్టుబడి దారులు తమ పరిశ్రమలనుంచి వ్యర్థాలను అడ్డగోలుగా నాలాల ద్వారా చెరువుల్లోకి విడుదల చేస్తుండడంతో హుస్సేన్‌సాగర్‌తో పాటు అనేక చెరువులు కాలుష్యపు కాటుకు గురయ్యాయి. దీంతో ఇంటా బయట తీవ్రస్థాయి విమర్శలకు గురైన సీమాంధ్ర సర్కారు నెదర్లాండ్స్ నిధులతో ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు గ్రీన్‌ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం కింద నెదర్లాండ్స్ ప్రభుత్వం రూ.206.70 కోట్లు విడుదల చేయగా ఇందులో చెరువులకు రూ.128 కోట్లు కేటాయించింది. ఈ నిధులను అప్పటి హుడా ద్వారా ఖర్చు చేశారు. అంతే హుడా అర్బన్‌ఫాస్టు విభాగానికి సీమాంధ్ర అధికారులు డిప్యూటేషన్ పై వచ్చి గద్దల్లా వాలారు. అంతే ఈ నిధులతో 87 చెరువులు ప్రక్షాళన చేస్తామని చెప్పి కేవలం ఏడు చెరువులకు మాత్రమే ఎస్టీపీలు నిర్మించారు. ఆతరువాత వాటి ఆలనా, పాలనా గాలికి వదిలేశారు. కానీ నిధులు మాత్రం పూర్తిగా ఖర్చు పెట్టేశారు. తెలంగాణ చెరువుల ప్రక్షాళనకు వచ్చిన నిధులు కూడా ఆగమయ్యాయి. రుణం మాత్రం ప్రజలకు భారంగా మిగిలింది. తాజాగా రూ.375 కోట్లతో చేపట్టిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు సాగుతూనే ఉన్నాయి. కానీ సాగర్ ప్రక్షాళన ఎప్పటికైనా పూర్తి అవుతుందా? అన్న సందేహాలు సర్వత్రా వెంటాడుతున్నాయి.

కమిటీ వేసి చేతులు దులుపుకున్న సర్కారు: చెరువుల ఆక్రమణపై న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించాయి. సుప్రీంకోర్టు చివాట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీహౌజ్ కమిటీని కూడా వేసింది. హౌస్‌కమిటీ రికమండేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో చెరువుల రక్షణపై సర్కారు అనుసరిస్తున్న తీరుపట్ల కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. న్యాయస్థానం చెరువుల పరిరక్షణకు ఏం చేస్తున్నారో చెప్పమని ప్రశ్నించింది. దీంతో ఏదో చేశామని సమాధానం చెప్పుకోవడానికి కోరలు లేని ఒక కమిటీని వేసింది. చెరువుల పరిరక్షణకు మాత్రమే ఈ కమిటి పనిచేస్తుంది. ఇది హెచ్‌ఎండీఏలో ఒక విభాగం కింద ఏర్పడిన కమిటీగా ఉంది. దీనికి నిర్ణయాత్మక అధికారాలు ఉండవు. ఎక్కడైనా కబ్జా జరుగుతుందని తెలిస్తే రెవెన్యూశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు రిఫర్ చేయడం తప్పవీరు చేయగలిగేది ఏమీ ఉండదు. ఈ కమిటీ పోస్ట్‌మెన్‌గిరి చేయడానికి తప్ప దేనికి పనికి రాదని హెచ్‌ఎండీఏ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో పనిచేసే ఒకఅధికారే అన్నారు. కేవలం కంటితుడుపు కమిటీ కావడంతో చెరువుల ఆక్రమణలు యధేచ్చగా జరుగుతూ ఉన్నాయి. హైటెక్‌సీటీ సమీపంలోని దుర్గంచెరువులో జరుగుతున్న అక్రమణలే దీనికి నిదర్శనం.

ఇవీ చెరువుల్లో మొలిచిన అపార్టుమెంట్లు, కాలనీలు
కూకట్‌పల్లి ఏరియాలోని ఎల్లమ్మ చెరువును రాంకీ సంస్థ కబ్జా చేసి డూప్లెక్స్‌లు, విల్లాలు నిర్మించి విక్రయించింది. ఒకనాటి 30 ఎకరాల ఎల్లమ్మ చెరువు ప్రస్తుతం రెండెకరాల మురికిగుంటగా మిగిలింది. 8.15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఖాజా కుంట చెరువులో ఒక్క మురుగునీటి శుద్దికర్మాగారం వినహా ఏమి మిగల్లేదు. నగర శివారు ప్రాంతంలోని ప్రగతినగర్‌లో దాదాపు 250 ఎకరాల అంబీర్‌ చెరువు ఇపుడు సీమాంధ్రుల అపార్ట్‌మెంట్లకు, డూప్లెక్స్ ఇళ్లకు నిలయంగా మారింది. ఆనంప్రసాద్, కె.ఆర్.రాజులతో పాటు మరికొంతమంది స్థానిక నేతల సహకారంలో ఈ చెరువును మింగేశారు. కూకట్‌పల్లిలోని ఐడిఎల్ చెరువులో మూడుఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేత అవతారం ఎత్తిన ఒక సినీ నటుడు కబ్జాచేశాడు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఏడు పెద్ద చెరువులు కబ్జాకు గురయ్యాయి. మియాపూర్‌లోని గంగారం చెరువులో రెండు సినిమా థియేటర్లు కట్టేశారు. బోయన్‌పల్లిలోని హస్మత్ పేట చెరువులో 169 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులే గుర్తించారు. కొండాపూర్‌లోని దుర్గంచెరువునూ కబ్జాదారులు వదలలేదు. పూర్తి ఎఫ్‌టీఎల్(ఫుల్‌ట్యాంక్ లెవల్) ప్రాంతంలో భారీ అపార్ట్‌మెంట్లనిర్మాణం జరిగింది. ఇప్పటికీ కాలనీ రోడ్ల మధ్యనే ఎఫ్‌టీఎల్ గుర్తులు కనిపిస్తాయి. ఈ చెరువు పరిధిలోనే అమర్ కోఆపరేటీవ్ సొసైటీ, కావూరిహిల్స్‌లో కొంత భాగం ఉన్నాయి. ఇదే కొండాపూర్‌లోని మొండికుంట చెరువు, తుమ్మాడికుంట చెరువులను మట్టిపోసి పూడ్చికబ్జా చేస్తున్నారు.

యూసుఫ్‌గూడ చిన్న చెరువులో కృష్ణనగర్ కాలనీ ఏర్పడింది. పెద్ద చెరువును సర్కారే కృష్ణకాంత్‌పార్కుగా మార్చేసింది. చారిత్రక హుస్సేన్‌సాగర్ చెరువులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కబ్జాలకు తెరలేపారు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌కు హుస్సేన్‌సాగర్ చెరువు శిఖం భూమిని కేటాయించారు. ఆప్రాంత మంతా కన్జర్వేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌కు మారుస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు ఇచ్చారు. జలవిహార్, ఈట్‌స్ట్రీట్‌లకు అనుమతులు ఇచ్చి సుప్రీం కోర్టు నిబంధనలకు పాతరేశారు. కులీకుత్‌బ్‌షా నవాబుల రాజధాని గోల్కొండ కోటకు, గోల్కొండ పట్టణానికి గ్రావిటి ద్వారా తాగు నీరందించిన దుర్గం చెరువును మింగేశారు. ఇపుడు పేరుకే పర్యాటక ప్రాంతం అని చెబుతున్నా ఈ చెరువులో మెజార్టీ బాగం కబ్జాకు గురైంది. ఈ చెరువులో కావూరి హిల్స్‌లో కొంత భాగం, దానితో పాటు అమర్ కోపరేటీవ్ సొసైటీల కాలనీలు ఏర్పడ్డాయి. అలాగే శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మడి చెరువు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ బంధువులతోపాటు సీనీ నటుడు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెనషన్ సెంటర్‌చేతుల్లోకి వెళ్లింది. సున్నం చెరువులో కాలనీ ఏర్పడగా, ఎల్‌బినగర్ వద్దనున్న మన్సూరాబాద్‌లో రెండు చెరువులు ప్లాట్లుగా మారాయి. తాజాగా వీటిల్లో నిర్మాణాలు వస్తున్నాయి. మీర్‌పేట చెరువులో ఒక కాలనీ వెలిసింది. సాహెబ్‌నగర్‌లోని కాప్రాయి చెరువును వైస్రాయి ప్రభాకర్‌రెడ్డి లేవుట్ చేసి విక్రయించగా, గడ్డి అన్నారంలోని నీటి కుంటను ప్రభుత్వమే కబ్జా చేసి ఠాగూర్ హరిప్రసాద్ ఇనిస్ట్యూట్‌కు అప్పగించింది. లంగర్‌హౌస్ చెరువులో బాగ్దాద్ నగర్, సజ్జాద్‌నగర్‌లు వెలిశాయి. శాతం చెరువు నదీం కాలనీగా మారింది. ఈ చెరువులోనే శాతంనగర్, అరుణ కాలనీలు కూడా ఉన్నాయి. తుమ్మలకుంట చెరువు న్యూహకింపేట బస్తీగా మారింది. పుప్పాల్‌గూడలో భారతమ్మ చెరువును రియల్ వ్యాపారులు కబ్జాచేశారు.

కబ్జా చేసేది ఇలా....
నగర నానాటికీ విస్తరించి సాగు భూములున్న ప్రాంతాలకు చేరుతుండడంతో సాగుభూములు క్రమంగా నివాసాలుగా మారిపోతున్నాయి. దీంతో సహజంగానే చెరువుల నీరు వాడకం నిలిచిపోతోంది. చెరువుల పర్యవేక్షించే రెవెన్యూ శాఖ వాటి బాగోగులు పట్టించుకోవడం మానేసింది. ఇది ఆసరాగా కబ్జాదారులు చెరువు నీటిని నాలాల గుండా పంపించేసి నీటి విస్తీర్ణాన్ని కుదిస్తున్నారు. స్థానిక నేతలతో కుమ్మక్కై రాత్రిళ్లు మట్టి పోస్తూ చెరువును కొద్దికొద్దిగా పూడ్చుకుంటూ వస్తారు. దీనికితోడు ఆ చుట్టు పక్కల్లో ఎవరూ పాత ఇళ్లు కూల్చినా, తీసిన పునాదుల్లో మట్టి వచ్చినా అదంతా ఆయా చెరువు పరిసరాలకే తరలిస్తున్నారు. పూడ్చిన మట్టిపై గుడిసెలు వేయించి ఆక్రమించి ఏదో బస్తీ పేరిట ఓ బోర్డు ఏర్పాటు చేసి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఆతరువాత వాటిల్లో బాహాటంగా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.

హైదరాబాద్‌ను సర్వనాశనం చేశారు
కృష్ణా బేసిన్ 10లోకి వచ్చే హైదరాబాద్ నగర ప్రాంతానికి మూసీ మినహా మరే నదీ ప్రాంతం లేదు. దక్కన్ పీఠభూమిలో ఎతైన ప్రదేశంలో ఉన్న హైదరాబాద్ నగరానికి ‘పెరి’ అర్బన్ ఏరియాగా పిలిచే శివారు ప్రాంతాలన్నీ కీలకమైనవి. 1980 వరకు పంజాగుట్టలోని అమృతహిల్స్, సోమాజిగూడ యశోదా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఏరియాలలో వ్యవసాయం చేశారు. మాస్టర్ ప్లాన్ల్‌లో ఇలాంటి ఏరియాలను చాలా సున్నితమైనవిగా గుర్తించి, గ్రీన్ బెల్ట్ జోన్ కింద రక్షించాలి, కానీ సర్కారు మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలన్నీ 1980 తరువాత జరిగినవే. సీమాంధ్ర పెత్తందారులు తెర ఉండి ఈ తతంగాన్ని కానిచ్చేశారు. కొన్ని చెరువులను ప్రభుత్వమే పూడ్చి పార్కులుగా మార్చింది. చెరువుల కబ్జాల మూలంగా ఏ చిన్న పాటి వర్షం వచ్చినా వరద నీరు నిలిచే అవకాశం లేక రోడ్లపైకి వస్తోంది. గతంలో హైదరాబాద్‌లో వరద నీరు రోడ్లపై నిలిచేది కాదు... కానీ ఇప్పుడు వర్షపు నీరంతా రోడ్లపైనే ఉంటుంది. వేదకుమార్, అధ్యక్షులు, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి