కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేం
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే
కేంద్ర మంత్రి మొయిలీ వ్యాఖ్య
'కుమ్మక్కు' ఆరోపణలకు ఊతం
అధిష్ఠానం వైఖరిపై నేతల మండిపాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : అధిష్ఠానానికీ, సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్
నేతలకూ మధ్య అంతరం పెరుగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అమలు చేసి
తీరాలని... ఇందుకు జగన్ పార్టీతోనైనా అవగాహనకు రావాలని ఢిల్లీ పెద్దలు
నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు గట్టిగా భావిస్తున్నారు. అధిష్ఠానం తన
పంతం నెగ్గించుకునేందుకు తమను బలి చేస్తోందంటూ ఆక్రోశిస్తున్నారు. స్థానిక
నేతలు ఈ విషయంలో రెండుగా విడిపోయారు. కొందరు కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరికి
అనుగుణంగా నడుచుకుంటుండగా... మరికొందరు మాత్రం ధిక్కార స్వరం
వినిపిస్తున్నారు. వీరిలో ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్,
రాయపాటి తదితరులు ముందు వరుసలో ఉన్నారు. ఒకవైపు... జగన్ పార్టీతో
కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తుండగానే, జగన్‌తో
పొత్తు అవకాశాలను కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి
వీరప్ప మొయిలీ తోసిపుచ్చకపోవడం గమనార్హం. ఆయన బుధవారం బెంగళూరులో
విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు బెయిల్‌తో తమ పార్టీకి సంబంధం లేదన్నారు.
జగన్ పార్టీతో పొత్తు గురించి ప్రశ్నించగా... "భవిష్యత్తులో జగన్ పార్టీతో
పొత్తు పెట్టుకోవచ్చు. కానీ, దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే'' అంటూ జగన్‌తో దోస్తీకి తలుపులు తెరిచి
ఉంచారు. ఈ వైఖరిపై సీమాంధ్ర నేతలు భగ్గుమంటున్నారు. 'మొయిలీ, మీ వల్లే
అగ్గిపుట్టింది. మీ మనుగడ కోసం జగన్‌తో చేతులు కలిపితే కాంగ్రెస్‌ను
నమ్ముకున్న కార్యకర్తలు, నేతలు ఏం కావాలి?' అని సాయిప్రతాప్ నిప్పులు
కక్కారు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేందుకు దిగ్విజయ్, మొయిలీ,
గులాంనబీ ఆజాద్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. 'సమస్యలకు పరిష్కారం
లభించేదాకా విభజనపై ముందుకు వెళ్లం' అని చెప్పకుండా కాంగ్రెస్ అధిష్ఠానమే
అనిశ్చితికి కారణమైందని మరో ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
విభజన విషయంలో పార్టీ తన నిర్ణయం మార్చుకోవాల్సిందేనన్నారు. 'ఇది
ప్రజాస్వామ్యం. నిరంకుశ పాలన చెల్లదు' అని తేల్చిచెప్పారు. ఇక రాయపాటి
తనదైన శైలిలో అధిష్ఠానాన్ని హెచ్చరిస్తూ, విభజనపై పునరాలోచలో పడేసే
ప్రయత్నం చేస్తున్నారు. 'రాష్ట్రాన్ని విభజిస్తే కేసీఆర్ తన పార్టీని
విలీనం చేస్తారు' అనే అభిప్రాయం సరికాదన్నారు. 'కేసీఆర్ అవివేకి కాదు. ఆయన
మేధావి. తన పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేస్తారు?' అని
ప్రశ్నించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లోనే ఉంటామా? లేక వేరే పార్టీలో
చేరతామా? కొత్త పార్టీ పెడతామా? అనేది అప్పుడే తేలుతుందన్నారు. మరోవైపు...
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డి
సీమాంధ్రలో జగన్‌ను తమ పార్టీ నేతలు నిలువరించడం లేదని వ్యాఖ్యానించడం
గమనార్హం.
- See more at: http://www.andhrajyothy.com/node/3230#sthash.dFtr26Hv.dpuf
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి