19, సెప్టెంబర్ 2013, గురువారం

అసెంబ్లీ ఆమోదం అనవసరం - బి.వినోద్‌కుమార్

ఆంధ్రప్రదేశ్ విభజనపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని నివేదించేంత వరకు పార్లమెంటు వేచివుండనవసరం లేదు; శాసనసభ సూచనలను పార్లమెంటు త్రోసిపుచ్చవచ్చు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం వాంఛనీయమే కానీ అది విధిగా ఆదేశాత్మకమైనది కాదు. సీమాంధ్రుల అంగీకారం ఉన్నా లేకపోయినా రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తుంది. శాసనసభ కొనసాగుతున్నా లేదా రద్దయినా దాని తీర్మానాన్ని తిరస్కరించి విభజన బిల్లును ఆమోదించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. భారత రాజ్యాంగమూ, న్యాయబద్ధమైన పూర్వోదాహరణలూ ఈ ఆనవాయితీని నెలకొల్పాయి.
తెలంగాణ తథ్యం. రాష్ట్ర విభజన జరగదనే భ్రమల్లో సీమాంధ్ర శాసనసభ్యులు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదింప చేయగలమని వారు భావిస్తున్నారు. లేదూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును శాసనసభ పరిశీలనకు వచ్చినప్పుడు దానిని ఆమోదించడంలో జాప్యం చేయగలమని వారు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో తాము అధిక సంఖ్యలో ఉన్నందున తెలంగాణ ఆవిర్భావాన్ని అడ్డకోగలమని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇలా భావించడంలో వారు పొరపడుతున్నారు. వాస్తవాలు వారి ఆలోచనలకు, అంచనాలకు భిన్నమైనవి.
మన రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి ప్రమాదాలు సంభవించగలవని ఊహించగలిగారు. ఒక రాష్ట్రంలోని (శాసనసభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న) మైనారిటీ ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తే, (శాసనసభ్యుల సంఖ్య అధికంగా ఉన్న) మెజారిటీ ప్రాంతం ఆ ఆకాంక్షను అడ్డుకోవచ్చని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకే శాసనసభ అంగీకరించినా అంగీకరించకపోయినా రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుదేనని స్పష్టం చేశారు. శాసనసభ అభిప్రాయాలను త్రోసిపుచ్చడానికి, నిర్దేశించిన గడువులోపు అసెంబ్లీ తన అభిప్రాయాన్ని తెలియజేయకపోయినప్పటికీ పార్లమెంటు రాష్ట విభజనకు నిర్ణయం తీసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించవచ్చని రాజ్యాంగ నిబంధనలు స్పష్టం చేశాయి.
రాష్ట్ర సరిహద్దులను మార్చడానికి పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగ సభ చర్చలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒక రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రాంతం ఆ రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని భావిస్తే అందుకు సంబంధించిన ప్రక్రియ ఆ రాష్ట్ర శాసనసభలోనే ప్రారంభం కావాలని రాజ్యాంగ సభలో ప్రొఫెసర్ కె.టి.షా అభిప్రాయపడ్డారు. అయితే కె.సంతానం ప్రొఫెసర్ షాతో విభేదించారు. అప్పట్లో (1948లో) ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తికి ఆందోళన చేస్తుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంతానం ఇలా అన్నారు: 'ప్రొఫెసర్ షా తన ప్రతిపాదన పర్యవసానాలను అర్థం చేసుకున్నట్టుగా లేదు. ఆ ప్రతిపాదనను అంగీకరించిన పక్ష ంలో ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతమూ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కోరడానికి గానీ, లేదా పక్క రాష్ట్రంలో చేరడానికి గానీ వీలుండదు. సంబంధిత రాష్ట్ర శాసనస భలోని మెజారిటీసభ్యులు అంగీకరించిన పక్షంలోనే అది సాధ్యమవుతుంది'.
సంతానం ఇంకా ఇలా అన్నారు: 'మద్రాసు రాష్ట్రాన్నే తీసుకోండి. ఆంధ్ర ప్రాంతం వారు విడిపోవాలని కోరుకొంటున్నారు. అందుకు వారు మద్రాసు శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే మెజారిటీ సభ్యులు దానిని తిరస్కరించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మరెలాంటి చర్యలు చేపట్టకుండా వారు అడ్డుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రాష్ట్రంలోనూ మెజారిటీ ప్రాంతాల ఆధిపత్యం కింద మైనారిటీ ప్రాంతాలు నలిగిపోవల్సి వుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం'. ఈ చర్చల పర్యవసానంగానే డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించిన ముసాయిదాను అంగీకరించారు. అదే అధికరణ 3. ఈ అధికరణ ప్రాతిపదికగానే 1953లో ఆంధ్ర రాష్ట్రంతో సహా కాలక్రమంలో 15 రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజల (ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న) సంకల్పం ప్రాతిపదికగా కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించడం పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని ఆ అధికరణ స్పష్టం చేసింది.
అధికరణ 3కి చేసిన 5వ సవరణ గురించి ఇటీవల సీమాంధ్ర రాజకీయవేత్తలు కొంతమంది ప్రస్తావించారు. నిజానికి ఆ సవరణ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయమై పార్లమెంటుకు మరిన్ని అధికారాలను కల్పించింది. శాసనసభ కొత్త రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినా, లేదా సంబంధిత బిల్లును అంగీకరించడంలో తీవ్ర జాప్యం చేసినా పార్లమెంటు అందుకు కట్టుబడి ఉండవల్సిన అవసరం లేదు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు దుర్గాదాస్ బసు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులను మార్చడానికి సంబంధిత రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు. రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ తన అభిప్రాయాన్ని నిర్దేశిత గడువులోగా పంపినా దానికి కట్టుబడి ఉం డవల్సిన అవసరం పార్లమెంటుకు లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో పార్లమెంటుకు పూర్తి అధికారాలు ఉన్నాయి. 'నిర్దిష్ట చట్టం చేయడం ద్వారా అధికరణ 3లోని అంశాలను పార్లమెంటు మాత్రమే అమలుపరచగలదు. పార్లమెంటు అనుమతించినప్పటికీ కార్యనిర్వాహక వర్గం సైతం వాటిని అమలుపరచలేద'ని దుర్గాదాస్ బసు వ్యాఖ్యానించారు.
దీన్ని బట్టి రాష్ట్రపతి సైతం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అడ్డుకోలేరని, లేదా ఆ చట్టంలో మార్పులు చేయలేరని స్పష్టంగా చెప్పవచ్చు. 1960లో సంయుక్త బొంబాయిని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై బాబూలాల్ పరంతే అనే వ్యక్తి బొంబాయి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. బొంబాయి రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాన్ని తెలిపేందుకు రాష్ట్ర శాసనసభకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. బొంబాయి హైకోర్టు అతని పిటీషన్‌ను కొట్టివేసింది. రాష్ట్రపతి నిర్దేశించిన గడువులోగా రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాలను తెలియజేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్దేశించిన గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేసిన పక్షంలో కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళే అధికారం పార్లమెంటుకు ఉన్నది. ఒక వేళ శాసనసభ నిర్దేశిత గడువులోగా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా పార్లమెంటు దాన్ని విధిగా అంగీకరించి తీరాలనే నిబంధనేదీ ఆ అధికరణలో లేదని కూడా బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాలు, సవరణలకు విరుద్ధంగా హరిద్వార్ జిల్లాను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చేర్చడాన్ని ప్రశ్నిస్తూ 2009లో ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఒక పిటీషన్ దాఖలు చేశారు. మౌలిక బిల్లుకు పార్లమెంటు ఎటువంటి సవరణలు చేయకూడదని, కొత్త ముసాయిదా బిల్లును పార్లమెంటులో ఆమోదించే ముందు శాసనసభ పరిశీలనకు పంపాలని ఆయన అభిప్రాయపడ్డారు. 'శాసనసభ నిర్దేశిత గడువులోగా ఎటువంటి అభిప్రాయాన్ని తెలియజేసినా దానికి పార్లమెంటు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త రాష్ట్ర ఏర్పాటు బిల్లును యథాతథంగా గానీ లేక సవరణలతో గానీ పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక దానిలో నివేదించే ప్రత్యేక అధికారం పార్లమెంటుకు ఉన్నదని' ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ఇంకా ఇలా వ్యాఖ్యానించింది: " 'సంప్రదింపులు' అనే మాటకు భిన్న సందార్భలలో భిన్న అర్థాలు ఉన్నాయి. ప్రస్తుత సందర్భంలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించడం కాదు. ఒక విషయమై ఒక వ్యక్తి అభిప్రాయాలను అడగడం లేదా తెలుసుకోవడం మాత్రమే. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవల్సివుంటుంది. అయితే దీనర్థం ఆ అభిప్రాయాలకు పార్లమెంటు కట్టుబడి వుండాలని భావించకూడదు''.
1966లో ఉమ్మడి పంజాబ్ రాష్ట్రాన్ని విభజించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, చండీగఢ్ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పంజాబ్ రాష్ట్రపతి పాలనలో ఉండగా ఇది జరిగిందన్నది గమనార్హం. పంజాబ్ విభజన బిల్లును రాష్ట్ర శాసనసభ పరిశీలనకు పంపకుండా పార్లమెంటు ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ 1970లో మనోహర్‌లాల్ అనే వ్యక్తి కోర్టులో సవాల్ చేశారు. పిటీషనర్ వాదనను కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర శాసనసభను రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించినప్పటికీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను అమలుపరిచేందుకు పార్లమెంటుకు అధికారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పూర్వోదాహరణలన్నీ రాష్ట్ర విభజనకు రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరంలేదని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని నివేదించేంత వరకు పార్లమెంటు వేచివుండనవసరం లేదని, శాసనసభ సూచనలను పార్లమెంటు త్రోసిపుచ్చవచ్చని కొత్త రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభ తీర్మానం వాంఛనీయమే కానీ అది విధిగా ఆదేశాత్మకమైనది కాదు. తెలంగాణ విషయానికి వస్తే సీమాంధ్రుల అంగీకారం ఉన్నా లేకపోయినా రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొనసాగుతున్నా లేదా రద్దయినా దాని తీర్మానాన్ని తిరస్కరించి విభజన బిల్లును ఆమోదించే అధికారం పార్లమెంటుకు ఉన్నది. భారత రాజ్యాంగమూ, న్యాయబద్ధమైన పూర్వోదాహరణలూ ఈ ఆనవాయితీని నెలకొల్పాయి. తెలంగాణ అనే భావన వాస్తవమయ్యే సమయం ఆసన్నమయింది. అది అనివార్యమైన పరిణామం. కనుక తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్రులు నిలిపివేయాలి. తెలంగాణను వ్యతిరేకించడం వివేక వంతమైన విషయం కాదు. రాష్ట్ర విభజన ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రాకు రెండిటికీ శ్రేయస్కరమనే విషయాన్ని సీమాంధ్రులు గుర్తించాలి. చారిత్రక అనివార్యతను ఆహ్వానించాలి. తెలంగాణ ఆవిర్భావాన్ని స్వాగతించేందుకు సీమాంధ్రులు సిద్ధమవ్వాలి. కొత్త రాష్ట్రమైన తెలంగాణతో సామరస్యంగా సహజీవనం నెరపుతూ తమ సొంత రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొనేందుకు సీమాం«ధ్రులు శక్తి సామర్థ్యాలను వినియోగించాలి.
- బి.వినోద్‌కుమార్
మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు
-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి