14, సెప్టెంబర్ 2013, శనివారం

మాక్కొంచెం టైమ్ కావాలి !


September 14, 2013


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ కోర్‌కమిటీలో ఎలాంటి ముందడుగూ పడలేదు. ప్రస్తుతానికి ఇది పెండింగ్‌లో ఉందని, కదలిక రావడానికి ఇంకొన్ని రోజులు పడుతుందని ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను కూడా విస్మరించలేమని హైకమాండ్ భావిస్తోంది. ఏ ప్రాంతాన్నీ నొప్పించకుండా నిర్ణయం తీసుకునేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. అలాగని రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని కూడా ఎక్కువ కాలం అనుమతించలేమని అభిప్రాయపడుతోంది.

వీటన్నింటి దృష్ట్యా ప్రధాని మన్మోహన్ విదేశీ (ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికా) పర్యటనకు వెళ్లే లోగానే, అంటే ఈనెల 25 లోపే, విభజన నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందుకు తేవాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 19న జరిగే కేబినెట్ సమావేశంలో విభజన నోట్ ఆమోదానికి రావచ్చని అంచనావేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికా నుంచి రావడంతో, కాంగ్రెస్ కోర్‌కమిటీ శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ నివాసంలో సమావేశమైంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, రక్షణ మంత్రి ఆంటోనీ... గత నెల రోజులుగా రాష్ట్రానికి చెందిన నేతలతో జరిపిన సమావేశాల వివరాలను కోర్ కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. సీమాంధ్రలో పెద్ద ఎత్తున ప్రజాందోళన జరుగుతున్నందున నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాలని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్టు కోర్‌కమిటీకి ఆంటోనీ వివరించారు. ఈ నేతలు ఎవరూ పరిష్కార మార్గాలను సూచించేందుకు సిద్ధంగా లేరని కూడా ఆయన తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని వారు కోరుతున్నట్టు పేర్కొన్నారు. అందువల్లే ఎలా ముందుకు వెళ్లాలో తెలియక, నివేదిక రూపొందించలేకపోయానని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. నివేదికను తయారు చేసేందుకు మరింత సమయం కావాలని ఆయన సోనియాను కోరారు. దీంతో తెలంగాణ నోట్‌పై కోర్‌కమిటీ తదుపరి నిర్ణయం తీసుకోలేకపోయింది. కమిటీ సభ్యులు సత్వరమే ఒక నిర్ణయానికి రావాలని, ఎక్కువ మందిని సంతృప్తిపరిచే ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలని ఆంటోనీకి సోనియా సూచించినట్లు తెలిసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే కేబినెట్ నోట్ తయారీకి అవసరమైన రాజకీయ దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుందన్న దానిపై కోర్‌కమిటీ క్లుప్తంగా చర్చించినట్టు సమాచారం.

బహుశా మరో వారంలో ఆంటోనీ కమిటీ నివేదిక తయారయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే కేబినెట్ నోట్ తయారీ కసరత్తు జరుగుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇతరత్రా అనుకోని అడ్డంకులు వస్తే మాత్రం ప్రధాని అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని హైకమాండ్ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి తిరిగి వచ్చేవరకు కేబినెట్ నోట్ కసరత్తు పూర్తి చేసి, అక్టోబర్ నెలలో దానిపౖౖె నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. ప్రధానితో పాటు, సోనియా ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొనలేదు. సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 45 నిమిషాల్లోనే ముగిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి