దర్శకత్వం అధిష్ఠానం
పాత్ర«ధారి జగన్ పార్టీ
నేడు స్పీకర్ వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు
రాజీనామాల ఆమోదానికి పట్టు
ఆమోదింప చేసుకోవాలంటూ
వైసీపీకి 'ఢిల్లీ హైకమాండ్' సూచనలు
అసెంబ్లీలో సమైక్య బలం తగ్గించడమే
లక్ష్యం
విభజన తీర్మానాన్ని గట్టెక్కించే వ్యూహం
తెలంగాణ తీర్మానం తయారవుతోంది
కేబినెట్ ఆమోదించాక అసెంబ్లీకి: దిగ్విజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : వైసీపీ అధినేత జగన్ జైలు నుంచి విడుదలై ఒకటి రెండు రోజులు గడవకముందే రాష్ట్రంలో రసవత్తర రాజకీయ నాటకానికి తెరలేస్తోంది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలవనున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము సమర్పించిన రాజీనామాలను... ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించాల్సిందిగా ఒత్తిడి చేయనున్నారు. సమైక్యవాదానికి 'చాంపియన్లు'గా జనంలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. అంతేనా? కానేకాదు.. రాజీనామాలతో వారు 'రాష్ట్ర విభజనకు శాసనసభలో మార్గం సుగమం' చేస్తున్నారు. ఈ రాజీనామాల వెనుక దాగిన 'రాజీడ్రామా' తెలుసుకోవాలంటే చదవండి మరి... రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడకముందే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు సమర్పించారు. ఆ తర్వాత విభజన ప్రకటన వచ్చింది. సీమాంధ్ర భగ్గుమంది. 'విభజన తథ్యం. మరోమాటే లేదు' అని ఢిల్లీ పెద్దలు పదేపదే చెబుతున్నారు.
అయినప్పటికీ... రాజీనామాల ఆమోదంపై వైసీపీ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టలేదు. ఈ రెండు నెలలుగా వీరంతా ఏం చేస్తున్నారు? ఇదీ ప్రశ్న! 'జగన్ బయటికి వచ్చారు కదా! ఆయన ఆదేశాల మేరకే స్పీకర్‌ను కలుస్తుండవచ్చు' అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఆదేశించింది జగనే కావచ్చు! కానీ... 'దర్శకత్వం' మాత్రం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలది! కాంగ్రెస్ అధిష్ఠానంనుంచి అందిన 'తగిన' ఆదేశాల మేరకే... వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్‌ను కలుస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, రాష్ట్ర విభజన విషయంలో కీలకపాత్ర పోషిస్తున్న దిగ్విజయ్ సింగ్ పంపిన సంకేతాల మేరకే వైసీపీ ఎమ్మెల్యేలు కదిలినట్లు తెలిసింది. రాజీనామాలు ఆమోదించక తప్పని పరిస్థితి స్పీకర్‌కు కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా సృష్టించాలి, రాజీనామాలు ఎలా ఆమోదింపచేసుకోవాలి అనే అంశాలపైనా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రముఖులే సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది.
ఇదంతా... తెలంగాణపై అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టేబోయే తీర్మానం గట్టెక్కేందుకే! రాష్ట్ర విభజనపై ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు ముందుకే అంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం... రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తీర్మానం వీగిపోకుండా జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత బలాబలాల ప్రకారం... శాసనసభలో విభజనను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. 'అసెంబ్లీలో తీర్మానాన్ని గట్టెక్కనివ్వం' అని బల్లగుద్ది చెబుతున్నారు. అసెంబ్లీ ఆమోదిస్తేనే విభజన జరుగుతుందని, రాజ్యాంగ పరంగా ఉన్న విధాయకాలను సంప్రదాయాలను పాటిస్తానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమకు హామీ ఇచ్చినట్లు సీమాంధ్రనేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాద ఎమ్మెల్యేల సంఖ్యను ఎంత తగ్గిస్తే... విభజన తీర్మానానికి అంత బలం. వైసీపీ ఎమ్మెల్యేలు సమైక్యవాదానికి అనుకూలంగానే తమ రాజీనామాలు సమర్పించారు.
ఈ 17 మంది రాజీనామాలను ఆమోదిస్తే... అసెంబ్లీలో సమైక్యవాదుల బలం ఆ మేరకు తగ్గిపోతుంది. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం తర్వాత సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలపైనా ఒత్తిడి పెరగడం ఖాయం. వారిలో కొందరైనా రాజీనామాలు చేసే అవకాశముంది. వాటిని కూడా ఆమోదిస్తే... సభలో సమైక్య - ప్రత్యేక వాదుల బలాలను తారుమారు చేయవచ్చునన్నది అధిష్ఠానం వ్యూహంగా తెలుస్తోంది. తద్వారా 'అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందకుండానే విభజనపై ముందుకు వెళ్లారు' అనే అపవాదు నుంచి తప్పించుకోవచ్చునని భావిస్తోంది. ఇదీ... రాజీనామాల వెనుక ఉన్న రసవత్తర డ్రామా! మరోవైపు... 'సమైక్యానికి మనమే చాంపియన్లుగా ఉండాలి' అని పార్టీ నేతలకు సూచించిన జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే పార్టీల నేతలతో గురువారం సమావేశం అవుతున్నట్లు తెలిసింది.
- See more at: http://www.andhrajyothy.com/node/3243#sthash.Hx0UEKS5.dpuf
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి