29, సెప్టెంబర్ 2013, ఆదివారం

హైదరాబాద్‌పై మోహం, ఆంధ్రకు ద్రోహం


అ వకాశవాదం, అధికారం మీద భక్తి తప్ప, దేశభక్తి ప్రాంతీయ భక్తి సీమాంధ్ర రాజకీయ నాయకుల్లో చూడలేము. ప్రాంతం మీద భక్తి ఉన్నవాళ్లు సీమాంవూధను నిర్లక్ష్యం చేసి తమ శక్తి సామర్థ్యాలన్నీ హైదరాబాద్ మీద పెట్టేవారు కాదు. హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణను బాగుచేయడంకోసం జరిగింది కాదు. హైదరాబాద్ భూములను, వనరులను ఉపయోగించుని సొంత వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకోవడంకోసం జరిగింది. ఆస్తులను పెంచుకోవడంకోసం జరిగింది. ఇది సరైన అభివృద్ధి నమూనాయే కాదు. అభివృద్ధి అంటే వంద నగరాలను అభివృద్ధి చేయడం.అమెరికాలో మనవాళ్లు ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని నగరాల్లో ఉంటున్నారో ఈ నాయకులు ఎప్పుడైనా పరిశీలించారా? అంతలోతైన పరిశీలన చేసి ఉంటే, ఇప్పుడు ‘హైదరాబాద్ మీకిచ్చేస్తే మాకేం మిగులుతుంది?’ అని వాపోయేవారు కాదు. ‘తల మీకు గోచి మాకా?’ అని నినాదాలు చేసేవారు కాదు. ‘విడిపోతే మా ఆర్టీసీ మూతపడుతుంది’ అని మొరపెట్టుకునేవాళ్లు కాదు. ‘మాకు ఒక్క గొప్ప ఆస్పత్రీ లేదు. ఏరోగమొచ్చినా హైదరాబాద్‌కే రావాలి. ఇప్పుడెలా?’ అని అమాయకంగా ప్రశ్నించి ఉండేవాళ్లు కాదు. ఈ పరిస్థితికి కారకుపూవరు? రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన సీమాంధ్ర నాయకులు ఆ ప్రాంతంగోచీగా మారుతుంటే ఏం చేశారు? సీమాంధ్ర నాయకులకు సీమాంధ్ర ప్రజలపై కంటే హైదరాబాద్ మీదే ప్రేమ ఎక్కువ.

ఐదుకోట్ల మందికి ప్రయోజనం కలుగడం కంటే ఐదు వందల మంది ఆస్తులను కాపాడుకోవడమే ముఖ్యం.ఆధునిక రాజధాని నిర్మా ణం, లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, కొన్ని లక్షల మందికి కొత్తగా ఉపాధిరావడం, సీమాంధ్ర అంతటా రైతులకు చెందిన కోట్ల ఎకరాల భూముల విలువలు పెరగడం కంటే హైదరాబాద్‌లో లక్ష మంది ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు చూసుకోవడమే ముఖ్యం. రాజధానిని, ఆధునిక వసతులను, అంతర్జాతీ య సంస్థలను సీమాంధ్ర ప్రజలకు చేరువ చేయడం కంటే హైదరాబాద్‌ను బూచిగా చూపి అక్కడి ప్రజలను మోసం చేయడమే ముఖ్యం.నిజానికి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న సీమాంవూధుల ఆస్తులు ఎక్కడికీపోవు. ప్రైవే టు ఉద్యోగాలూ, వ్యాపారాలూ ఆగిపోవు. ఇక్కడ పుట్టి పెరిగి చదివి ఎదిగిన పిల్లల స్థానికతలో కూడా ఎటువంటి సమస్యలు రావు. వాళ్లు స్థానికులుగా హైదరాబాద్‌లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఎవరు అభ్యంతర పెడుతున్నారు? తేడా వచ్చేదల్లా ప్రభుత్వ ఉద్యోగాల్లోనే. కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుంది. కొద్దిమంది పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై పెత్తనం కోల్పోవలసి ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయితే ఎక్కడికయినా వెళతారా లేదా? అశోక్‌బాబుకు ప్రమోషన్ వచ్చి, ఏ గ్రూప్-1 ఉద్యోగమో వస్తే శ్రీకాకుళం వెళతాడా లేదా? గ్రూప్-1 అధికారులు రాష్ట్రమంతా తిరిగి పనిచేస్తున్నారా లేదా? ఐదుకోట్ల మంది సీమాంధ్ర ప్రజలను హైదరాబాద్ చుట్టూ తిప్పుకోవడం సమంజసమా లేక రాజధానిని వారి మధ్యకు తీసుకుపోవడం సమంజసమా?అకారణ భయాలు,అనవసరం ద్వేషాలు, అనుచిత డిమాండ్ల తో ఎంతకాలం ఉద్యమాలు నడుపుతారు?

ప్రభుత్వంలో సకల అధికారాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, డిజిపి దినేశ్‌డ్డి వంటి వారి దన్ను తెలంగాణ ఉద్యమానికి లభించి ఉంటే ఇక్కడి ఉద్యమకారులు అక్కడ జరుగుతున్నట్లు భజనలు, విచిత్ర వేషాలు, వికారపు పాటలు, రోత చేష్టలు ప్రదర్శించేవారు కాదు, నిప్పుల వర్షం కురిపించి ఉండేవారు. ఎర్రతివాచీల మీద, పులిహోర పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్ల సం తర్పణల మధ్య పాఠశాల, కళాశాల ప్రార్థనా సమావేశాల వంటి గళగర్జనలు కాదు, ఢిల్లీ పీఠం దద్దరిల్లే జనఘోషలు హోరెత్తేవి. తెలంగాణ ఈపాటికి విముక్తి అయి ఉండేది. వందలాది పోలీసు చెక్‌పోస్టులను దాటుకుని, ముళ్లకంచెలను ధిక్కరించి, అణచివేతలు, అరెస్టులు, లాఠీ చార్జీలు బుల్లెట్ల వర్షాలను అధిగమించి మిలియన్ మార్చ్‌లు, సాగరహారాలు, చలో అసెంబ్లీలు, జనగర్జనలు నిర్వహించిన చరిత్ర తెలంగాణ ఉద్యమానిది. ఒకటి నిప్పుల మీద నడిచొచ్చిన ఉద్యమం. మరొకటి తివాచీలమీద నడుస్తున్న ఉద్యమం. ఒకటి అగ్నిశిఖలను సైతం లెక్కచేయక ఆత్మత్యాగాలు చేసిన ఉద్యమం.మరొకటి అకారణ భయాలు రేపెట్టి నడుపుతున్న స్పాన్సర్డ్ ఉద్యమం. అక్కడి ప్రజలకు అబద్ధాలు చెప్పి, భయపెట్టి, మోసపూరితమైన వాదాలు చేసి ఉద్యమానికి పురికొల్పుతున్నారు.

ఇప్పుడు మరొక రెడ్డి మొదలు పెడతాడట. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడుపుతారట. తనతో కలసి రావాలని సిపిఎంను కోరారు. రేపోమాపో ఎంఐఎంను కోరతారట. ‘మాటతప్పని మడమతిప్పని’ వంశంగా మొన్నటి దాకా ఆయన గురించి ఆయన అభిమానులు చెబుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వచ్చిన తర్వాత ఆయన పార్టీ అసలు రంగు బయటపడింది. నిజానికి మాటతప్పడం, మడమతిప్పడం స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌డ్డి ఎప్పుడో చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబునాయుడు ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో, రాజశేఖర్‌డ్డి అన్ని పిల్లిమొగ్గలు వేశారు. గత పదేళ్లలో చంద్రబాబుకు తెలంగాణను ఆపే శక్తి ఏనాడూ లేదు. అనవసరంగా మాటలు మార్చి గబ్బుపట్టారు. తెలంగాణకు అడ్డమూ నిలు వూ అన్నీ తానైనవారు రాజశేఖర్‌డ్డే.2000 సంవత్సరంలో తెలంగాణ ఎమ్మెల్యేలతో లేఖరాయించింది రాజశేఖర్‌డ్డే. ‘గతంలో సోనియాగాంధీకి 41 మంది ఎమ్మెల్యేలు వినతిపత్రం ఇచ్చారు. అప్పట్లో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దాంతో తెలంగాణ విషయంలోనూ చొరవ తీసుకోవాలంటూ అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న చిన్నాడ్డి, పాల్వాయి గోవర్ధన్‌డ్డి నన్ను కోరారు. సరే వినతిపత్రం రూపొందించాలని చెప్పాను... అందులో ఏం రాశారో నేను చూడలేదు. రాసింది నిజం. ఇచ్చిందీ నిజం.. అధిష్ఠానం తెలంగాణ ఇస్తానంటే అడ్డుకోవడానికి నేనెవ ర్ని? సోనియా నిర్ణయాన్ని అడ్డుకునేంతటి పెద్దవాడినా?’ అని 2008లో రాజశేఖర్‌డ్డి స్వయంగా వివరణ ఇచ్చారు.

దానికి అప్పట్లోనే 2008లో అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు మైసూరాడ్డి స్పందన కూడా చూడండి- ‘రాష్ట్రంలో రేగిన తెలంగాణ చిచ్చుకు ముఖ్యమంత్రి వైఎస్సే మూలకారకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ సోనియాకు వినతిపత్రం సమర్పించిన విషయం వైఎస్‌కు పూర్తిగా తెలుసు.అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ముఖ్యమంత్రి ఇప్పుడు బుకాయిస్తున్నారు. లేక్ వ్యూ అతిథి గృహం లో ఉన్న సోనియాను చూడడానికి ఆరోజు నేను కూడా అక్కడికి వెళ్లాను. రాజశేఖర్‌డ్డి ముందే 41మంది తెలంగాణ శాసనసభ్యులంతా సోనియాకు వినతిపత్రం ఇచ్చారు. వినతిపవూతాన్ని ఆమె వైఎస్‌తోపాటు అందరిముందే చూశారు. అందులో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని చూసి ‘ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను. దీనిని తీసుకుని నేనేం చేసేది’ అని సోనియాగాంధీ ప్రశ్నించారు.

అప్పుడు వైఎస్ కల్పించుకుని వినతిపవూతాన్ని తీసుకోవాలని సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రోద్బలంతోనే ఆమె దానిని స్వీకరించారు. ఆ పత్రంలో తెలంగాణ అంశం ఉందని వైఎస్‌కు స్పష్టంగా తెలుసు. అప్పటికింకా తెరాస కూడా ఏర్పాటు కాలేదు’. మైసూరా 2000లో రాజశేఖర్‌డ్డితో ఉండి ఆ తర్వాత టీడీపీలోకి మారి, ఇప్పుడు జగన్ పంచన చేరిన పెద్దమనిషి. ఆయన ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ నాయకునిగా సమైక్య ఉద్య మం నిర్మిస్తారట. పాపం ఊసర కూడా సిగ్గుపడతాయేమో! రాజశేఖర్‌డ్డి 2009 ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు కూడా ‘మమ్మల్ని గెలిపిస్తేనే తెలంగాణ వస్తుంది’ అని స్పష్టంగా ప్రకటనలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ‘హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుంద’ ని ఆంధ్రా ప్రజలను బెదిరించినవారు రాజశేఖర్‌డ్డి.అవకాశవాదంలో చంద్రబాబుకంటే వంద ఆకులు ఎక్కువ చదివినవారు రాజశేఖర్‌డ్డి.

జగన్‌మోహన్‌డ్డి అందుకు భిన్నంగా లేరు. 2009లో తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల చేతుల్లోంచి సమైక్యాంధ్ర ప్లకార్డులు లాక్కుని నినాదాలు చేసిన వాడాయన. పార్టీ పెట్టగానే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, ‘తెలంగాణ సెంటిమెంటును వైఎస్సార్ పార్టీ గౌరవిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించడానికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. అయినా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకుండా,సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రజలతో చెలగాటమాడుతోంది’అని ఇడుపులపాయ ప్లీనరీలో జగన్‌మోహన్‌డ్డి ప్రకటించారు. కమిటీలు, కాలయాపనలు అనవసరం అని కూడా ఆయన అన్నారు.‘మేము ఇచ్చేవాళ్లం కాదు, అడ్డుకునే వాళ్లం కాదు’ అని ప్రకటనలు చేశారు. విజయమ్మగారు బైబిలు చేతపట్టుకుని మరీ పరకాల సభల్లో ఏం చెప్పారో గుర్తు చేసుకుంటే మంచిది. కానీ ఇప్పుడవన్నీ మరచిపోయారు.

సీమాంధ్ర నాయకులంతా ఇంతేనని తేలిపోయింది. ఇంకా కులం పేరు తో, మతం పేరుతో, పదవులు, టిక్కెట్లు, డబ్బు ఆశతో తెలంగాణ నేతలు కొందరు టీడీపీ వెంట, వైఎస్సార్ కాంగ్రెస్ వెంట డూడూ బసవన్నల్లా ఊరేగుతున్నారు. ఈ బసవన్నలను చూసి తెలంగాణలో కూడా సమైక్యవాదం ఉందని రాజగోపాల్, పరకాల ప్రభాకర్ వంటి అక్రమ రాజకీయ సంతతి ఊదరగొడుతున్నారు. ఈ వాదన ఎక్కడిదాకా వెళ్లిందంటే-మొన్న జగన్‌ను చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ వరకు ఊరేగించిన జనంలో అత్యధికశాతం మంది తెలంగాణవాళ్లేనట. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్లట. జగన్‌డ్డి హైదరాబాద్ విడిచి వెళ్లడానికి వీలులేదు కాబట్టి, హైదరాబాద్‌లోనే అందరినీ కలుపుకుని సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభిస్తారట.అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సీపీఎం నేతలను కలిశారట. సీపీఎం నేతలు చెంపమీద కొట్టినట్టు తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కలువలేమని.

త్వరలో ఎంఐఎం నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతార ట. తాచెడ్డ కోతి వనమెల్లా చెరచినట్టు, తన వ్రతం పోతే పోయింది, మిగతా పార్టీలనూ చెడగొట్టాలని జగన్ చూస్తూ ఉండవచ్చు. చెడిపోయేవాడి ఖర్మ. హైదరాబాద్‌లో ఏ చిచ్చు రేపినా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో జగన్‌డ్డి కానీ, మరో నాయకుడు కానీ తెలుసుకుంటే మంచిది. ఇప్పటివరకు జరిగింది చాలు. జగన్, చంద్రబాబు, కిరణ్, జయవూపకాశ్‌నారాయ ణ్... మీరు ఎవరయినా మహానాయకులో, సమైక్యాంధ్ర నాయకులో కాలేరని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. మీకు రాష్ట్రమంటే ఆంధ్ర రాష్ట్రమేనని, ప్రజలంటే ఆంధ్ర ప్రజలేనని, మీరంతా ఆంధ్రా తానులో ముక్కలేనని అర్థయింది. సీమాంవూధలో పెత్తనంకోసం మీరెన్ని పాట్లయినా పడం డి. అక్కడి ప్రజలను తెలంగాణకు వ్యతిరేకంగా ఎంతయినా రెచ్చగొట్టి, పబ్బం గడుపుకోండి. తెలంగాణ జోలికి, హైదరాబాద్ జోలికి మాత్రం రాకండి. తెలంగాణను ఇలా బతకనీయండి.
-kattashekar@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి