15, సెప్టెంబర్ 2013, ఆదివారం

విలీన సందర్భం ఆపరేషన్ పోలో-1948



9/15/2013 1:01:43 AM
యావత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిషు పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో కలపడానికి నిజాం పాలకులు సిద్ధంగా లేకపోవడంతో అసలు సమస్య మొదలైంది. హైదరాబాద్ రాష్ట్రం పొడుగునా జాతీయ పతాకాలు ఎగుర వేయలేని దౌర్భాగ్యం ఏర్పడింది. అయినా, ధైర్యం చేసి పతాకావిష్కరణ చేసిన దేశభక్తులు, ప్రజా నాయకులు ఎందరో జైళ్ల పాలయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సమస్య సంక్షోభంగా మారడానికి కారణం నిజాం పాలకులు, వారి మొండితనం. వీరికి అనుయాయులుగా నగరానికి వచ్చి చేరిన ఖాసిం రజ్వీ, అతని నాయకత్వంలోని రజాకార్లు. భారత జాతీయ నాయకులకు, నిజాం రాజుకు మధ్య ఈ ప్రతిష్టంభన కొన్నాళ్లు కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల ‘భారతీయ రాష్ట్రం’గా ఉంచాలన్న భారత జాతీయ నాయకుల ప్రతిపాదనను కూడా నిజాం అంగీకరించలేదు. ఇదేకాదు, ఇలాంటి ప్రతిపాదనలు వేటినీ నిజాం, ఖాసిం రజ్వీలు అంగీకరించలేదు. మరోవైపు తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని అణచివేయడానికి కూడా భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో-1948’కు సిద్ధపడింది. అయితే, అంతకంటే ముందు నిజాం రాజును ఒప్పించడానికి జాతీయ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
group
దేశ విభజన అనంతరం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇటు భారత్‌లోకానీ, అటు పాకిస్థాన్‌లో కానీ కలపడానికి నిజాం ఇష్టపడలేదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. ఉస్మాన్ అలీఖాన్ ఈ ఉల్లంఘన వెనుక ఖాసిం రజ్వీ మిలిటెంట్ల (రజాకార్లు) హస్తం ఉన్నట్లు తేలింది. ఈ రజాకార్లు పాకిస్థాన్‌కు ‘నైతిక మద్దతుదారులు’గా స్థిరపడ్డారు. దేశంలోని దాదాపు అన్ని సంస్థానాలు భారత్‌లో విలీనమైనా, హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం ‘స్వతంత్ర రాజ్యం’గా పాలించుకుంటానని ఏడవ నిజాం ప్రకటించారు. ఆయన అంతటితో ఊరుకోలేదు కూడా.‘బ్రిటిష్ కామన్ ఆఫ్ నేషన్స్’ నుండి ‘రాజ్యాంగ బద్ధమైన ఒక స్వతంత్ర దేశం’గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు నివ్వాలంటూ నిజాం ప్రభువు బ్రిటిషు ప్రభుత్వాన్ని మొదట్లోనే సంప్రదించారు. ఆ విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. కనీసం ఒక అధికార పత్రం (దస్తావేజు)పై సంతకం చేయాలని అప్పటి ఇండియన్ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైద్రాబాద్ ప్రభుత్వాన్ని కోరారు. ‘అదేమీ కుదరదంటూ’ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే (15.8.1947) ‘హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం’గా ఉంటుందని ప్రకటించారు. ‘భారతీయ సరిహద్దుకు ‘హృదయం’ వంటి చోట మరో ‘స్వతంత్ర దేశం’, అదీ పాకిస్థాన్‌కు మద్దతునిస్తున్న దేశం ఏర్పాటు’ అన్న ఆలోచననే భారత జాతీయ నాయకులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే..
‘ఎలాంటి సైనిక చర్యకు తావు లేకుండా’ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా వల్లభాయ్ పటేల్ అప్పటి భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటెన్ కోరారు. ‘కనీసం హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌లో చేర్చబోమని’ హామీ ఇవ్వాలని, అలా చేస్తే యధాస్థితిని కొనసాగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని కూడా తెలిపారు. ఈ మేరకు ఒక ‘నిశ్చిత ఒప్పందాన్ని’ అంగీకరించ వలసిందిగా భారతీయ ప్రభుత్వం నిజాం రాజును కోరినా, ‘దానికీ ససేమిరా’ అన్నారు. హైదరాబాద్ పాలకులు, రాయబారులు ఇంతటితో ఊరుకోలేదు. ‘భారత ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూగల అన్ని రోడ్డుమార్గాలలో సైనికులను మోహరించి, అవరోధాన్ని కలిగించడాన్ని’ తీవ్రంగా తప్పు పట్టారు. ‘తమ దేశాన్ని ఆర్థికంగా ఒంటరిని చేసే ప్రయత్నం’గా వారు దీనిని విమర్శించారు. ప్రతిగా భారత నాయకులు ‘హైదరాబాద్ ప్రభుత్వానికి పాకిస్థాన్ నుంచి ఆయుధాలు అందుతున్నాయని’ ఆరోపించారు. పాకిస్థాన్‌లో తమకు సహాయంగా ‘ఒక బాంబర్ విమానాన్ని సైన్యంతో’సహా సిద్ధంగా ఉంచడానికి హైదరాబాద్ సర్కారు ఆ దేశానికి 200 మిలియన్ రూపాయలను ఇచ్చినట్లు కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి.1948 జూన్‌లో లార్డ్ మౌంట్‌బాటెన్ మరో ఒప్పందం (హెడ్ ఆఫ్ అగ్రిమెంట్)ను సిద్ధం చేశారు. దాని ప్రకారం నిజాం పాలకులు తమ ప్రాంతాన్ని యథావిధిగా పాలించుకోవచ్చు. ఎన్నికల్లో ప్రజాభివూపాయం మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా సరిహద్దు ప్రాంతాల పాలనను కూడా కొనసాగించవచ్చునని, అయితే హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన విదేశీ వ్యవహారాలు మాత్రం భారత ప్రభుత్వానికి చెందుతాయన్నది అందులోని అసలు సారాంశం. దీనికి భారత పాలకులు అంగీకరించినా, నిజాం రాజు తిరస్కరించారు. ‘తన రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ కావాలని, అది కూడా ‘బ్రిటిష్ కామన్ సామంత దేశపు హోదాను మాత్రమే ఇవ్వాలని’ ఆయన డిమాండ్ చేశారు. నిజాం పాలకులు ఇంతటితో కూడా ఆగలేదు. ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అధ్యక్షుడు హేరీ ఎస్ ట్రూమన్‌తోనూ మధ్యవర్తిత్వం నెరిపించడానికి విఫలయత్నం చేశారు. ఏదైతేనేం, సామాజిక వేత్తలు ఏదైతే జరగకూడదని అనుకున్నారో చివరకు అదే జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నీ ఒకవైపు, రజాకార్ల దుర్మార్గాలు మరోవైపు హైదరాబాద్ ప్రజలను తీవ్ర అశాంతిలోకి నెట్టివేశాయి.

రాచపుండుకు ‘ఆపరేషనే’ ప్రత్యామ్నాయం
‘భారతదేశపు వక్షస్థలంపై ఒక స్వతంత్ర దేశాన్ని ఏలుకుంటామనే భావనే ఒక రాచపుండు వంటిది. దానిని ఆపరేషన్ చేసి తొలగించక తప్పదు’- ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ‘స్వంతంగా ఆయుధాలు సమకూర్చుకుంటూనే, పాకిస్థాన్‌కు అదొక మిత్రదేశమవుతోందని’ హైదరాబాద్‌పై వార్తలు అందిన నేపథ్యంలో ఆయన ఈ కఠోర అభివూపాయాన్ని వెల్లడించారు. దానికి ప్రతిగా హైదరాబాద్ ప్రధానమంత్రి లాయిక్ ఆలీ స్పందన మరింత ఘాటుగానే ఉంది. ‘‘పాకిస్థాన్ ఒకవేళ తమపై దాడి జరిపితే ‘ప్రతిగా హైదరాబాద్ వెన్నుపోటు పొడుస్తుందేమో’ అని భారత్ అనుకుంటోంది. ఆ పని మేం చెయ్యమని నేను ఖచ్చితంగా చెప్పలేను’’. ఇది పరోక్షంగా భారత్‌ను హెచ్చరించినట్టే అయ్యింది. దీనికి పటేల్ జవాబు తక్కువదేమీ కాదు. ‘‘ఒకవేళ నువు హింసతో మాపై వొత్తిడి తెస్తే అప్పుడు ‘కత్తులు కత్తులతోనే’ కలుసుకుంటాయి’’. ఇక, ఖాసిం రజ్వీ మాటలైతే తూటాల్లానే పేలాయి. ‘ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే నేను భారత్ అంతటా అల్లకల్లోలం సృష్టించి తీరతాను’ అన్నది ఖాసిం రజ్వీ శపథం. ‘భారత్ కనుక హైదరాబాద్‌పై దాడి చేస్తే రజాకార్లు హిందువులపై నరమేధం సృష్టిస్తారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లపై ప్రతీకార దాడులు జరుగుతాయి’ అని ‘టైమ్’ మేగజైన్ అప్పట్లో రిపోర్ట్ చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిపిన మొట్టమొదటి సైనిక చర్య ‘ఆపరేషన్ పోలో-1948’. భారతీయ యూనియన్‌లో హైదరాబాద్ రాష్ట్రం 1948లో బలవంతంగా విలీనమైతే, తర్వాత ఎనిమిదేళ్లకు 1956లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో తెలంగాణను విలీనం చేసి ‘ఆంవూధవూపదేశ్’ను సృష్టించారు. మొదటిది సైనికచర్య. రెండోది రాజకీయ విచర్య. ఈ రెంటిలోనూ ప్రజలు నిమిత్తమావూతులే. చివరకు వారికి మిగిలింది వలసాధిపత్యమే.

అయిదు రోజుల్లో ముగిసిన ఆపరేషన్
తుట్టతుదకు హైదరాబాద్‌పై భారత్ ‘పోలీసు చర్య’కు సిద్ధపడింది. అది 13 సెప్టెంబర్ 1948. దీనిని ముందే ఊహించి ఉంటారు కాబట్టి, నిజాం సర్కారు నుండి ఎటువంటి తీవ్ర వ్యతిరేకతా రాలేదు. తొలి యుద్ధం ‘షోలాపూర్-సికింవూదాబాద్ రహదారిపైగల నాల్‌దుర్గ్ వద్ద మొదలైంది. మొదటి హైదరాబాద్ నిజాం సైన్యం భారతీయ 7వ బ్రిగేడ్‌ను ఎదుర్కొంది. రెండవ రోజు (14 సెప్టెంబర్) రాజసూర్ పట్టణానికి 48 కి.మీ. దూరంలోని ఉమార్గ్‌వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. మూడోరోజు (15వ తేదీ) నాటికి భారతసైన్యం సూర్యాపేట పట్టణం చేరింది. ఇదే రోజు మరో సంఘటనలో నార్కట్‌పల్లి వద్ద భారత సైనికులు రజాకార్ల సమూహాన్ని ఓడించారు. ఎక్కడికక్కడ నిజాం సైనికులు, రజాకార్లు లొంగిపోవడం ఎక్కువైంది. 16వ తేదీకల్లా నిజాం ఓటమి సుస్పష్టమై పోయింది. లెఫ్టెనెంట్ కల్నల్ రామ్‌సింగ్ నేతృత్వంలో భారత సైన్యం జహీరాబాద్ వైపు వచ్చింది. అయితే, ఇక్కడ రజాకార్లు ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు. భారత సైన్యం 75 ఎంఎం గన్స్ వాడేదాకా వారు అలా రెచ్చిపోతూనే ఉన్నారు. ఎంతయినా, పెద్ద చేప ముందు చిన్న చేప తల వొంచక తప్పదు. సెప్టెంబర్ 17వ తేదీ తెల్లవారు జాముకల్లా ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సరిహద్దులను చుట్టు ముట్టేసింది. ఆ రోజు సాయంత్రం 5 గంటల కల్లా ‘కాల్పులను విరమిస్తున్నట్టు’ నిజాం ప్రకటించారు. 16వ తేదీనే తన ఓటమి తెలుసుకున్న నిజాం ప్రధానమంత్రి లాయిక్ ఆలీని పిలిచి, రాజీనామా సమర్పించ వలసిందిగా ఆదేశించారు. ఆ తర్వాత మొత్తం క్యాబినెట్ మంత్రులంతా రాజీనామాలు సమర్పించారు. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర సైన్యాన్ని మేజర్ జనరల్ ఎల్ ఎల్డ్రూస్ భారత మేజర్ జనరల్‌కు అప్పగించడంతో ‘ఆపరేషన్ పోలో’ పూర్తయింది.

పోలో పేరు వెనుక...
ఆరున్నర దశాబ్దాల కిందట దేశంలోనే అత్యధిక సంఖ్య (17)లో పోలో మైదానాలున్న నగరం హైదరాబాద్. అందుకే ఆనాటి ఆ సైనికచర్యకు భారతీయ ఆర్మీ ‘ఆపరేషన్ పోలో’ అని పేరు పెట్టినట్టు వినికిడి. కానీ, ఈ పేరు పెట్టడానికి కారణం ఇది కాదనే వారూ ఉన్నారు. ‘దీనికంటే కొన్నాళ్ల ముందు నిజాం ప్రభువు యుద్ధ ఏర్పాట్లు చేసుకున్నాడని, దానిని ‘ఆపరేషన్ కబడ్డీ’గా పిలిచారని (కబడ్డీలో ప్రత్యర్థులను అవహేళన చేస్తారు), ‘పోలో’ అలా కాక ఒక ‘భవూదమైన ఆట’ అని అంటారు. అందుకే, ‘హైదరాబాద్ నడిబొడ్డున సురక్షితంగా భారతీయ సైన్యాలు దిగుతాయని’ చెప్పడానికి సూచనగానే ‘ఆపరేషన్ పోలో’ అన్నట్లు తెలుస్తోంది. - దోర్బల బాలశేఖరశర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి