September 24, 2013
మెరుగైన
ఆరోగ్యం, ఆకలిదప్పులు దూరం! ఈ మహత్యాలను ఆహారభద్రతా చట్టం నిజం
చేయబోతుందట!! ఆ చట్టం ప్రకారం దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఆహారధాన్యాలను
(ఒక్క ఆహారధాన్యాలే సుమండీ!) సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం సరఫరా చేయబోతోంది
మరి. తిండిగింజలు అందుబాటులో ఉంటే అనారోగ్యం దరిచేరుతుందా? పోషకాహారలోపం
నిన్నటి జ్ఞాపకమే అవదూ? సరే, పాలకులు చెబుతున్నట్టుగా ఆహారభద్రతా చట్టం
సఫలమయ్యేనా? ఆ ఆశావాదంలో అర్వింద్ వీర్మణి (ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు)
పాలుపంచుకోవడం లేదు. ఆహారధాన్యాలు అందుబాటులో ఉండడం కంటే మెరుగైన
పారిశుద్ధ్య సదుపాయాలు, కాలుష్యరహిత మంచినీటి వనరులను సమకూర్చడం చాలా
ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఇవి ఉన్నప్పుడే పోషకాహార లోపం అనేది
తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నారు.ఆహారభద్రతా చట్టంతో ఎదురయ్యే రెండో సమస్య పరిపాలనా సంబంధమైనది. చట్టం లక్ష్య పరిపూర్తికై ఆహారధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తారు. మరి ఈ వ్యవస్థ ఇప్పటికే శిథిలమయింది కదా. ఆహార సబ్సిడీకి ప్రభుత్వం వెచ్చించే నిధులు వాస్తవానికి భారత ఆహార సంస్థ అసమర్థత, అవినీతిని కప్పిపుచ్చడానికే వినియోగమవుతున్నాయి.
పోషకాహార సమతుల్యతకు భంగం కల్గడం ఆహారభద్రతా చట్టంతో ఎదురయ్యే మూడో సమస్య. పుష్టికరమైన ఆహారంలో పిండిపదార్థాలే కాక మాంసకృత్తులు మొదలైన ఇతర పోషకాలుసైతం ఉండాలి. అయితే ఆహారభద్రతా చట్టం కింద దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తున్న కుటుంబాలకు కేవలం ఆహారధాన్యాలను మాత్రమే పంపిణీ చేస్తారు. పప్పు ధాన్యాలు, కూరగాయల పంపిణీ ఉండదు. అదనంగా వాటిని కొనుక్కోగలిగిన స్థితి చాలా పేద కుటుంబాలకు లేదన్నది ఒక వాస్తవం. ఆహారధాన్యాలు చౌకగా అందుబాటులో ఉండడం వల్ల పేదలు వాటిని అతిగా వినియోగించుకోవడం జరుగుతుంది. పప్పుధాన్యాల వినియోగం లేకుండా ఆహారధాన్యాలనే ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశమున్నది. ఎరువుల సబ్సిడీలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను గుర్తుచేసుకోవల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తొలుత నత్రజని ఎరువులకే సబ్సిడీని సమకూర్చేది. దీంతో రైతులు నత్రజని ఎరువులనే అమితంగా వినియోగించేవారు. ఫాస్పేట్, పొటాష్ ఎరువుల వాడకంపై శ్రద్ధ చూపేవారు కాదు. దీంతో భూసారం సమతుల్యత దెబ్బతింది. తత్ఫలితంగా కేవలం నత్రజని ఎరువులకే సబ్సిడీ సమకూర్చే విధానాన్ని ప్రభుత్వం త్యజించవలసివచ్చింది. దరిమిలా మూడు రకాలఎరువులకూ సబ్సిడీలనివ్వడం ప్రారంభించింది. అదే విధంగా ఆహారధాన్యాల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకోవల్సి ఉంది. మార్చుకోక తప్పదు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పప్పుధాన్యాలను, అయోడైజ్డ్ ఉప్పునూ సబ్సిడీపై అందిస్తోంది. పంజాబ్ ప్రభుత్వం పప్పుధాన్యాలకు సబ్సిడీ ఇస్తోంది. ఏమైనా కేంద్రం ధర పెంచైనా సరే ఆహార, పప్పు ధాన్యాలు రెండిటినీ పంపిణీ చేయడం మంచిది. ఇక నాలుగో సమస్య పేదరికానికి సంబంధించినది. మంచి ఆదాయం ఉంటే మెరుగైన పోషకాహారం దానికదే సమకూరుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలో తలసరి ఆదాయాలు ఎలా ఉన్నాయో సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శిశు మరణాల వివరాలను ఏటా వెల్లడిస్తుంది. శిశు మరణాలనేవి పోషకాహార లోపానికి సూచికలు. 11 రాష్ట్రాలకు సంబంధించి ఈ రెండు గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్ర, పంజాబ్, కేరళ, తమిళనాడు, హర్యానాలో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 45.7గా ఉంది. పేద రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, ఒడిశా, బెంగాల్‌లో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 83.4 గా ఉన్నది. తలసరి ఆదాయాలలో తేడానే శిశుమరణాల రేటులో పూర్తిగా ప్రతిబింబించింది.
ప్రజలందరికీ ఆహార భద్రతను సమకూర్చాలన్న మౌలిక లక్ష్యం మానవీయమైనది. అందుకే ఆహార భద్రతా చట్టాన్ని నేను స్వాగతిస్తున్నాను. అయితే పెనం మీద నుంచి పొయ్యిలో పడే విధంగా మనం వ్యవహరించకూడదు. పోషకాహార సమతుల్యత దెబ్బతినని విధంగా ప్రజల ఆకలిదప్పులను రూపుమాపాలి. అందుకు ఉత్తమ మార్గం ప్రజల ఆదాయాలను మరింతగా పెంపొందించడమే. ఆదాయం సమృద్ధిగా ఉంటే ప్రజలే తమకు అవసరమైన పోషకాహారాన్ని సమకూర్చుకోగలుగుతారు. రెండో ఉత్తమ ప్రత్యామ్నాయం ఆహార ధాన్యాలతోపాటు పప్పు ధాన్యాలనూ సబ్సీడీపై అందించడం.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి