15, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఉమ్మడికీ 'నో'


September 15, 2013
 



హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కూడా అంగీకరించేది లేదని టీ-జేఏసీ నిర్ణయించుకుంది. విభజన ప్రకటనను వేగంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు, ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు హైదరాబాద్‌లో 29న 'సకల జన భేరి' సదస్సును నిర్వహిస్తామని ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కోసం శనివారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ భేటీలో భాగస్వామ్య పార్టీల నేతలు, ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలు, ఇతర స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా జేఏసీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కోదండరాం వారందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు.

ఈ నెల 29న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు చెప్పి, వారిని తెలంగాణ సాధన కోసం కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సదస్సుకు 'సకల జన భేరి'గా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ సదస్సును నిజాం కళాశాల మైదానంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేయడానికి ఈ 15 రోజులూ నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు 10 జిల్లాల కేంద్రాల్లో ఒక్కో రోజు సన్నాహక రణభేరి పేరుతో ర్యాలీలు, సదస్సులు జరుగుతాయని చెప్పారు. కాగా, జేఏసీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పర్యటన ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఇక సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోదండరాం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని అమలు చేయకుండా తాత్సారం చేయడం వల్లే ఆంధ్రా పాలకులు కుట్రలకు పాల్పడి తెలంగాణకు అడ్డుపడే అవకాశం కలిగింది. అంతేకాక ప్రజల మధ్య వారు విద్వేషాలు రెచ్చగొడుతున్నార'ని కోదండరాం దుయ్యబట్టారు. ఈ కుట్రలను తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ప్రకటనను త్వరగా అమలయ్యేలా చూసే బాధ్యత టీ కాంగ్రెస్ నేతలపైనే ఉందన్నారు. తెలంగాణ విషయంలో ప్రతిపక్షాలు కూడా తమ పాత్రను సమర్థంగా పోషించడం లేదని ఆయన ఆరోపించారు. కాగా, హైదరాబాద్‌పై ఎలాంటి పరిమితులు, షరతులకు కూడా అంగీకరించేది లేదని జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య స్పష్టంచేశారు. 29 నాటి సదస్సుకు అనుమతి కోసం ఆదివారం నగర పోలీస్ కమిషనర్‌ను కలుస్తామని, ఆయన ఏం చేస్తారో చూస్తామని టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని కాపీ కొడుతున్న సీమాంధ్ర ఉద్యమం ఇక్కడి శాంతిని మాత్రం కాపీ కొట్టలేకపోతోందని జేఏసీ టీఎన్జీఓ నేత దేవీప్రసాదరావు ఎద్దేవా చేశారు. ఎమ్మార్పీఎస్ ఈనెల 26న గుంటూరులో నిర్వహించే సభకు, 28న మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసే తెలంగాణ సాధన సభకు జేఏసీ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ తీర్మానం చేసిన తర్వాత కమిటీలతో ఆ పార్టీ కాలయాపన చేస్తోందని, దీంతో తెలంగాణ ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని టీఆర్ఎస్ నేత శ్రవణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమొక్కటే పరిష్కారమని బీజేపీ నేత రాజేశ్వర్‌రావు అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి