21, సెప్టెంబర్ 2013, శనివారం

ఎందుకీ అపోహలు!


9/21/2013 1:37:56 AM
హైదరాబాద్‌లో అక్రమంగా ఆస్తులు పోగేసుకున్న కొందరు సీమాంధ్ర పెద్దలు అనవసరంగా రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారు. తమ ఆస్తుల రక్షణ కోసం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే వాదనను ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రల పట్ల తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నివసిస్తున్న సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలె. సీమాంవూధలో ఉంటున్న సాధారణ ప్రజలు, ఉద్యోగస్తులు కూడా ఈ ప్రచారాన్ని పట్టించుకోకూడదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వల్ల వారికి అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే వైషమ్యాలు పెరుగుతాయి.
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా అనేక మంది ఆంధ్రావారు మద్రాసులోనే ఉండిపోయారు. వారు మద్రాసులో ఏ భరోసాతో ఉన్నారనేది ఆలోచించాలె.

తోటి తమిళుల పట్ల నమ్మకంతో ఉన్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపి భరోసా ఇవ్వడం వల్ల కాదు. తమిళనాడులో తమ వారి జనాభా ఎంత కాదన్నా రెండు కోట్లు ఉంటుందని ఇక్కడి ఆంధ్రా పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ అంచనా ఎక్కువా తక్కువా అని కాదు. అనేక మంది ఇప్పటికీ అక్కడ నిర్భయంగా ఉన్నారంటే అందుకు కారణం తోటి తమిళులతో కలిసి పోవడం వల్లనే. వారిపై నమ్మకం పెట్టడం వల్లనే. ఆంధ్రా వారి భద్రత కోసమని మద్రాసును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే, ఇవాళ రెండు వర్గాల మధ్య వైషమ్యాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించడానికే భయం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో అనేక మంది ఆంధ్రా వారు ఐటీ ఉద్యోగాలు చేయడానికి బెంగళూరు వెళ్ళారు. రాయల సీమ వాళ్ళూ అక్కడ ఎక్కువగానే ఉన్నారు. బళ్ళారీ రోడ్డులోని ఐటి పార్క్ దగ్గరకు పోతే తెలుగులో మాట్లాడుకునే ఆంధ్రావాళ్ళు కనిపిస్తారు. ప్రతి భారీ బడ్జెట్ తెలుగు సినిమా బెంగళూరులో కూడా మొదటిరోజే విడుదల అవుతుందని ఆంధ్రా ఐటి ఉద్యోగులు గొప్పగా చెబుతుంటారు.

వీరు బెంగళూరులో నిశ్చింతగా ఉండడానికి కారణం ఏమిటి? అక్కడ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనేక మంది అడ్డా వేశారు. కానీ ఆంధ్రావారి భద్రతకు భరోసా లభిస్తున్నది ఈ ఫ్యాక్షనిస్టుల నుంచి కాదు. కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపించడం వల్ల లేదా బెంగళూరును కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వల్ల తమకు భద్రత లభిస్తుందని వారు ఏనాడూ అనుకోలేదు. వారి భద్రతా భావనకు పునాది స్థానిక కన్నడిగులపై పెట్టుకున్న నమ్మకమే. కర్ణాటకలోని చట్టబద్ధ, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోవడమే మంచి పద్ధతి. తమకు భద్రత ఉండదనే సాకు చూపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే, కేంద్రమే శాంతి భద్రతలను చూడాలని కోరితే, అక్కడ ఆంధ్రావారు ఇంత నిశ్చింతగా ఉండగలుగుతారా? ముంబయిలోని అనేక మంది తెలంగాణ వారు స్థానికులతో కలిసి మెలిసి ఉంటున్నారే తప్ప మరాఠీల మంచితనాన్ని ఏనాడూ శంకించలేదు.

ఇదే విధంగా తెలంగాణలో ఉంటున్న మరాఠీలు, కన్నడిగులు, ఇతర ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజలు ఏనాడూ స్థానికుల సామరస్య సంస్కృతిని శంకించలేదు. వారి నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు. ప్రతి ఏటా తెలంగాణలో గణేశ్ ఉత్సవాల్లో ‘గణపతి బప్పా మోరియా’ అనే మరాఠీ నినాదం మారుమోగుతుందీ అంటే సమ్మిళిత సంస్కృతికి ఇంతకు మించిన నిదర్శనం మరేముంటుంది? తెలంగాణలో భద్రత కోసం కేంద్రం చేతిలో అధికారం ఉండాలని వారు ఏనాడూ కోరుకోలేదు. అందుకే తెలంగాణ వారు నిండు మనసుతో వారిని ఆదరిస్తున్నారు. విశాఖ పట్నంలో అనేక ప్రాంతాల వారున్నారు. వారెవరూ విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరడం లేదు. తమ భద్రతకు పూచీ స్థానికులదనే సంపూర్ణ నమ్మకంతో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఇతర ప్రాంతాల వారు కోరితే అది స్థానికుల మనసును గాయపరుస్తుంది. అక్కడే విద్వేషాలకు బీజం పడుతుంది. స్థానికుల మనోభావాలను గౌరవించడం కనీస సంస్కారం.

మంచికో, చెడుకో దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఆంధ్రా తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండవలసి వచ్చింది. ఆంధ్రా పెత్తందారులు వివక్ష పాటించక పోతే రెండు ప్రాంతాల వారికి సమన్యాయం జరిగితే ఇవాళ విభజించే పరిస్థితి రాకపోయేది. కానీ ఆంధ్రా పెత్తందారులే విభజన రేఖలు గీశారు. పైకి కావలించుకున్నా కడుపులో విషం పెట్టుకున్నరు. వారి వికృత పోకడలే ఇవాళ రాష్ట్ర విభజనకు దారితీశాయి. అంతే కానీ విభజనకు కారణం తెలంగాణ వారు కాదు. తమ అస్తిత్వ పరిరక్షణకే ఆంధ్రా పెత్తనాన్ని వదలించుకోవాలని తెలంగాణ వారు కోరుకుంటున్నారు. అనేక ఒప్పందాలు, జీవోలు, ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలోనే రాష్ట్ర విభజన అంతిమ పరిష్కారంగా ముందుకు వచ్చింది. తెలంగాణ వారు తమకు జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవాలని కోరుకోవడం లేదు. చేదు జ్ఞాపకాలను చెరిపివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రావారిని తమ సోదరులుగానే భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వారు ఇక ముందు కూడా ఇక్కడకు రావచ్చు, ఇతర మరాటీ, కన్నడిగుల మాదిరిగానే ఇక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఆస్తులు కొనుక్కోవచ్చు. కొందరు ధూర్తులు ప్రచారం చేస్తున్నట్టు హైదరాబాద్‌కు రావడానికి వీసాలు అవసరం లేదు. హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా ఎవరు వచ్చి స్థిరపడినా వారికి భద్రత కల్పించడం స్థానికుల నైతిక బాధ్యత. తరతరాలుగా ఆ బాధ్యతను తెలంగాణవారు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రావారు తెలంగాణ వారి మంచితనాన్ని నమ్ముకోవాలే తప్ప కేంద్ర పాలిత ప్రాంతం చేయడం ద్వారా లేదా కేంద్ర బలగాల ద్వారా భద్రత చేకూరుతుందనే దుష్ప్రచారాన్ని నమ్మకూడదు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి