23, సెప్టెంబర్ 2013, సోమవారం

ప్లాన్ బీ భయం


9/23/2013 6:51:24 AM
రాజీనామాలకు ససేమిరా అంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
రాష్ట్రపతి పాలనంటే బెదురు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (టీ మీడియా): సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒకరొకరుగా తోకముడుస్తున్నారు. నిన్నటిదాకా రాజీనామాలు చేస్తాం.. భూకంపాలు పుట్టిస్తామన్న నేతలు ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొదట్లో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే రాజీనామా అన్నారు... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అయిపోయిందనుకో అన్నారు.. నోట్ తెస్తే కనుక రాసేసుకోమన్నారు.. నోట్ కేబినెట్‌కు వెళ్తే అక్కడికక్కడే అన్నారు. మొత్తానికి ఇలా అనేక గడువులు..

హెచ్చరికలు అయిపోయాయి. ఇపుడు తాజా నినాదం... అసెంబ్లీలో తీర్మానాన్ని lionsఓడించడమే జీవితాశయం.. వీర నిష్క్రమణ అంతటితో పూర్తి. తీర్మానాన్ని ఓడించడానికి.. కత్తి వదిలేస్తే యుద్ధమెలాగా అంటున్నారు. పైకి ఏం చెబుతున్నా.. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సన్నాయి నొక్కుల వెనుక అధిష్ఠానం అమలు చేస్తున్న ప్లాన్ ‘బీ’ భయం ఉన్నట్టు తెలిసింది . సీమాధ్ర నేతలు రాజీనామాల వంటి చర్యలకు దిగితే ప్లాన్ బీ లో భాగంగా రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం సర్వసన్నద్ధంగా ఉందంటూ వస్తున్న వార్తలు వారిని భయకంపితులను చేస్తున్నాయి. కేంద్రం ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ ఇచ్చేయాలని నిర్ణయించి ైబ్లైండ్‌గా వెళుతుండడం వారిని కలవరపరుస్తున్నది. నిన్నటి దాకా రాజీనామాలు చేస్తే పిలిచి బుజ్జగిస్తుందనే ధీమా ఉండేది. 2009లో, తర్వాత ఇటీవల కూడా కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండడం దానికి ఊతమిచ్చింది. కానీ తాజా పరిస్థితిలో తేడా కనిపిస్తున్నది. దిగ్విజయ్ వంటి కీలకనేత ‘రాజీనామాలిస్తారా? ఇచ్చేయండి!..పోతేపొండి..’ అన్న పరిస్థితి. ఈ దశలో రాజీనామా ఇస్తే పదవికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితితో పాటు, సామూహిక రాజీనామాలకు దిగితే ఏకంగా రాష్ట్రపతి పాలనే విధించే అవకాశం కనిపిస్తోంది. తొందరపడితే మరో ఆరునెలలపాటు అధికా ర హోదా, సౌకర్యాలకు దూరం కావడంతో పాటు, రాష్ట్ర విభజన ప్రక్రియ సాఫీగా జరిగిపోయే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పదవులకు రాజీనామాలు చేస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు అవుతుందని భావించిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పట్లో రాజీనామాల జోలికి వెళ్ళవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆదివారం అసెంబ్లీ ఆవరణంలో ముగ్గురు సీమాంధ్ర నేతలు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడిన మాటలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన భయంతోనే వారు వెనక్కి తగ్గినప్పటికీ, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు వ్యతిరేకించే వరకు తాము పదవుల్లో కొనసాగుతామని చెప్పుకోవడం వెనుక ఇదే మతలబు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే వీరి రాజీనామాల సంగతి ఎలా ఉన్నా...సీమాంధ్రలో ఆందోళనలు, ఏపీఎన్జీవోల సమ్మె కనుక మరి కొంత కాలం కొనసాగితే గనుక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా పార్టీ ఎంపీ పాల్వాయి గోవర్డన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. దీనిక తోడు కేంద్రంలో పరిస్థితి తీసికట్టుగానే ఉంది. ఇప్పటికే పనబాక తెలంగాణ ఇచ్చుకోనివ్వమనేశారు. సగం మంది కేంద్ర మంత్రులు పదవులు వదిలేది లేదని మొండికేశారు. ఎంపీల్లో ఎవరు మిగుల్తారో తెలియదు.

రాజీనామాలు వద్దని సీఎం చెప్పారు : ఏరాసు ప్రతాప్‌రెడ్డి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరూ రాజీనామాలు చేయవద్దని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబితేనే వెనక్కి తగ్గామని ఆయన తెలిపారు. రాజీనామాలు చేస్తే ఇటూ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం, అటూ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఏకపక్షంగా ఆమోదం పొందుతాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎంపీలు కూడా పార్లమెంట్‌లో బిల్లు వ్యతిరేకించేందుకే రాజీనామాలు చేయడం లేదని, సమయం వచ్చినప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందామని సీఎం తమకు చెప్పారని ఏరాసు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం ఓడించిన తర్వాత పదవులు వదులుకుంటామని ఆయన ప్రకటించారు.

పదవులు వెంట్రుకతో సమానం: టీజీ వెంకటేష్
పదవులు తమకు వెంట్రుకతో సమానమని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ఇప్పటికే తాము పదవులకు రాజీనామాలు చేశామని, వాటిని ఆమోదించే పని సీఎం, లేదంటే గవర్నర్ చేయాలన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకే పదవుల్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలే ఉద్యమంలో చేరి అల్లరి చేస్తున్నాయని టీడీపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడంలో, టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు విజయం సాధిస్తున్నారన్నారు. దాన్ని అడ్డుకోవడంతో పాటు, రాష్ట్రంలో తాజా పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు తాము ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రాజధాని కన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ ప్రాంత ప్రజల అభీష్టమని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు ఆలస్యంగా మేలుకున్నారని, ముందే ఆందోళనలు చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావన్నారు.

పార్టీని వదిలేస్తాం.. కొత్త పార్టీకి ఛాన్సుంది: జేసీ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజన విషయంలో పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీని వదిలేస్తామని, ఇప్పటికే సీమాంధ్రలో రాజకీయ అనిశ్చితి వల్ల కొత్త పార్టీ ఏర్పాటుకు అవకాశముందని చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇతర పార్టీలతో కలిసి పోరాడుదామన్నారు. శాసన సభలో తెలంగాణ తీర్మానం అడ్డుకోవడానికి, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఓడించేందుకు సీమాంధ్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌కు వచ్చినప్పుడు దానిలో ఏముంటుందో చూసి రాజీనామా చేద్దామని సూచించారు. అధిష్ఠానం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ కన్న సమైక్యవాది రాష్ట్రంలో ఎవరూ లేరని, ఆయనపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

సిద్ధమవుతున్న కేబినెట్ నోట్
నేలకొండపల్లి తన నియోజక వర్గంలోనే ఉందని పాలేరు ఎమ్మెల్యే, మంత్రి రామిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందువల్ల భద్రాచలాన్ని ఆంధ్రలో కలిపితే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. 1953 నుంచి భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతం తెలంగాణలో ఉంటుంది కనుక భవిష్యత్తులో పోలవరం నిర్మాణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకు సీమాంధ్రుల భద్రాచలం కావాలని కోరుతున్నారని, అటువంటి అపోహలు అక్కరలేదని తెలిపారు.

తలంబ్రాలు తెలంగాణ ఆనవాయితీ: భట్టి
శ్రీరామ నవమికి తలంబ్రాలు తెలంగాణ నుంచి తీసుకుపోవడం ఇక్కడి ఆనవాయితీ అని, రాజైన తానీషా దగ్గరనుంచి నేటి ప్రజాస్వామ్యంలోని ముఖ్యమంత్రి వరకు గోల్కొండ నుంచే తలంబ్రాలు తీసుకెళుతున్నారని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఆనవాయితీని భగ్నం చేయడం వల్ల సీమాంధ్రులకు ఫలితం దక్కదన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి