15, సెప్టెంబర్ 2013, ఆదివారం

యూటీ అంటే యుద్ధమే


9/15/2013 8:37:50 AM
- 21న ఓయూలో ‘యుద్ధభేరి మహాసభ’,
- 29న గుంటూరులో సభ
- మంద కృష్ణ మాదిగ ప్రకటన
- సీమాంధ్రలో దాడులు చేస్తే.. తీవ్రపరిణామాలు : కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (టీ మీడియా): ‘హైదరాబాద్‌లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటారు. సీమాంధ్రలో మేము తెలంగాణ అంటే మీకు తప్పుగా అనిపించిందా..? తెలంగాణ అన్నందుకు మా గొంతు నొక్కుతారా..?’ అని సమైక్యవాదులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ నెల 21న నిర్వహించే ‘యుద్ధభేరి మహాసభ’, 29న గుంటూరులో నిర్వహించే ‘అంబేద్కర్‌వాదుల మహాసభ’కు మద్దతు కోరుతూ ఓయూలోని 14విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి మంద కృష్ణ.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డితో శనివారం భేటీ అయ్యారు.

kisrdymandhaఅనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమైక్యవాదులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీరు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ మాట్లాడగూడదా..?’ అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగానున్న బీజేపీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఉద్యోగుల పేరుతో ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో సభ పెట్టుకొని, ఇంటికొకరు రావాలని పిలుపునిచ్చి.. తెలంగాణపై దండయాత్ర చేయడమేమిటన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతమంటే యుద్ధమే జరుగుతుందని మంద కృష్ణ హెచ్చరించారు. తెలంగాణ అంశంపై ‘యుద్ధభేరి మహాసభ’ను ఈ నెల 21న ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహిస్తున్నామని, 29న గుంటూరులో ‘అంబేద్కర్‌వాదుల మహాసభ’ను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సభల విషయంలో ఇప్పుడే అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆ ఇబ్బందులను అధిగమిస్తామని తెలిపారు. తెలంగాణపై క్యాబినెట్ నోట్ రాకముందే.. హైదరాబాద్ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ లేఖ రాయాలని కోరారు.

దాడులు చేస్తే.. తీవ్రపరిణామాలు: కిషన్‌డ్డి
బీజేపీ తెలంగాణకు అనుకూలంగా ఉందని సీమాంధ్రలో దాడులు కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమైక్యవాదులను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబును ఉద్దేశించి ‘హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహిస్తే మేము వ్యతిరేకించలేదని, సీమాంధ్రలో బీజేపీ సమావేశాలను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. తెలంగాణ పునరుద్దరణనే బీజేపీ కోరుతున్న విషయాన్ని గమనించాలన్నారు. ఎమ్మార్పీఎస్ నిర్వహిస్తున్న ‘యుద్ధభేరి మహాసభ’, ‘అంబేద్కర్‌వాదుల మహాసభ’కు మద్దతు పలుకుతున్నామని, ఆయా సభలలో పాల్గొంటామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు ఎన్ రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌రావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, విద్యార్థి సంఘాల నాయకులు లింగస్వామి, సంజయ్, వీరస్వామి, వీరబాబు, దయాకర్, అంజి, కిరణ్ సహా పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి