26, సెప్టెంబర్ 2013, గురువారం

అవ్వల్ దర్జాగా సాగిన అఖిలభారత తెలంగాణ రచయితల సభలు


కరీంనగర్‌ల పోయినాదివారం (సెప్టెంబర్ 22) అఖిలభారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలు బొంబాటుగ జరిగినయి. తెలంగాణ ప్రకటన తేటతెల్లం అయినంక సీమాంధ్ర రాజకీయ యాపారులు ఇంకా ఆపుదామని కొర్రి పెడుతున్న సందర్భం. ఓ పక్క సంబురం మరో పక్క తెలంగాణ ఏడ పుశ్కి పోతదోనని పటపట పండ్లు కొరికే కోపం వందలాది మంది రచయితలు తెలంగాణవాదుల మధ్యన అఖిలభారత తెరవే జెండాను నలిమెలభాస్కర్ ఎగిరేసిండు. ఆ తర్వాత జరిగిన సభలల్ల మాట్లాడిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోవా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌డ్డి మాట్లాడిన మాటలు అందరి కండ్లల్లకెల్లి నిప్పులు కురిపించినయి. ఆయన తెలంగాణ రచయితలను సోక్రటీస్ వారసులని అన్నడు. ముప్పయి నలభై ఏండ్ల నుంచి ప్రశ్నించుడే ప్రశ్నించుడే చేస్తున్న రచయితలు సోక్రటీస్ లెక్క మరణానికైనా సిద్దపడుతరు కని ప్రశ్నించడం ఆపరు అని అన్నరు. ఇంకా సోక్రటీస్ వారసత్వం పుణికి పుచ్చుకున్నవారు ఐన్‌స్టీన్, రూసో, గాంధీ, లోహియా, జయవూపకాశ్ నారాయణ (లోక్‌సత్తా వాడు కాదు)కాళోజీ అన్నరు. సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ఈ పాత్ర పోషిస్తున్నరని ఆయన చెప్పవట్టిండు. అరిక్టల్ 3 ప్రకారం తెలంగాణ కోరడం ప్రజల హక్కు అని దాన్ని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ ద్రోహం అని కూడా అన్నారు. ‘తెలుగుజాతి’ అనేది కూడా ఆమూర్త భావన అని ఉన్నది ఒక్కటే భారత జాతి అన్నారు. దాదాపు 40 నిమిషాలు సుదర్శన్‌డ్డి ఉపన్యాసానికి సభ పిన్‌వూడాప్ సైలెన్స్ అయ్యింది. ఇదే మొదటి సభలో ప్రొఫెసర్ గోపి ప్రామాణిక భాష అంటే ఆధిపత్య భాషనే అన్నారు.

ఆ ప్రామాణికం నిర్ణయించేది ఎవరు ? ఎవరి భాష వారికే ప్రామాణికం అని తేల్చారు. సెంటిమెంట్ అనేది మానవీయ రూపానికి మరో పేరని అన్నారు. సెంటిమెంట్ అనేది గడిచిన జ్ఞాపకాల లగ్నత, స్మృతి లగ్నత అన్నారు. ఈ సెంటిమెంట్ యూజ్ అండ్ త్రో కల్చర్ వాళ్లకు లేదన్నారు. ఈ సెషన్‌లో జూకంటి జగన్నాథం, సూరేపల్లి సుజాత, మచ్చ ప్రభాకర్, ఆహ్వాన సంఘ అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడగా నలిమెల భాస్కర్ సభ నడిపిండు.
రెండో సెషన్‌కు ప్రవాస తెలంగాణ రచయిత అనుభవాలు, సాహిత్య సేవ మీద పత్తిపాక మోహన్ అధ్యక్షత వహిస్తే గట్టు నారాయణ గురూజీ మైసూర్‌నుంచి సియన్‌డ్డి అతిథులుగా పాల్గొన్నారు. ముంబై, భీవండి, ఢిల్లీ నుంచి వచ్చిన వక్తలు మాట్లాడిండ్రు. తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత స్థాయిలోనే గాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా రచయితలను ఆర్గనైజ్ చేయాలన్నారు. బువ్వల తర్వాత పట్ట పగటీలి అల్లం నారాయణ అధ్యక్షతన దాదాపు 20 పుస్తకాలు విడుదల అయినయి. ఈ సభకు జార్ఖండ్ జన సాంస్కృతిక మంచ్ నుంచి అనిల్ అంశుమాన్ ముఖ్య అతిథిగా పాల్గొని మస్తు మాట్లాడిండ్రు. తమ జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అవతలవాళ్లు ఎవలు వ్యతిరేకించలేదు. ఈ ఆంధ్రలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.

విడిపోయే వాళ్లు వాళ్లకు కట్టు బానిసలా వాళ్లతో ఇష్టం లేకున్నా కల్సి ఉండేందుకు అని అన్నారు. అల్లం నారాయణ తెలంగాణ నేల దశాబ్దాలుగా యుద్ధం చేస్తు నేల అని ఇక్కడ పోరాటం వారసత్వంగా వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం వెనుక జగిత్యాల జైత్రయాత్ర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వ స్వాతంత్య్ర ఉద్యమాల వెలుగు ప్రసరిస్తుందన్నారు. సుదీర్ఘ పోరాట వారసత్వంతోనే ఈ రోజు తెలంగాణ ఉద్యమం ఈ దశకు చేరుకున్నదని దీనిని ఇదే రీతిన కల సాకారం అయ్యేదాకా తీసుకపోవాలన్నారు.
తెలంగాణ ఉద్యమ హిందీ అనువాదం కవితా సంకలనం ఉడాన్ ఆకడుప దాటి లోపలికి రాంగానే అలిశెట్టి ప్రభాకర్ వాకిలి కన్పిస్తది. లోపికి పోంగనే కరీంనగర్ జిల్లా సాహీతి మూర్తుల ఫోటోలు వారి గురించి రాతలతో హాలు అలంకారమైంది. బి దామోదర్‌రావు వంటిల్లులో అందరం బువ్వ తిన్నం కానీ అంచనాకు మించి వచ్చిన జనం వల్ల మళ్లీమళ్లీ వండి పెట్టాల్సి వచ్చింది. మరో పక్కన బండి రాజన్‌బాబు చిత్రశాల అందులో యంసీ శేఖర్ ఫోటో ప్రదర్శన ఎందరినో ఆకట్టుకున్నది. హాలు ముందు సాహితీ సోపతి, వీక్షణం, దిశ, సహచరల పుస్తకాల ప్రదర్శన కొనక్కునోళ్లకు కొనుక్కున్నంత తెలంగాణ సాహిత్యం దొరికింది.

బీవండి ముంబాయి మైసూర్, షోలాపూర్ ఢిల్లీ , నాగాపూర్ బరోడా నుంచి వచ్చిన రచయితలు ఆబగా తెలంగాణ పుస్తకాలు కొనుక్కున్నారు. సభలు ముగిసే సమయానికి మక్కగుడాలు ఉడుకబెట్టిండ్రు మస్తు తిన్నరు. తినుకుంట తినుకుంట ఇండ్ల కల్లుంటే ఇంకెంత మంచిగుండునో అని నవ్వుకుంట మాట్లాడుకున్నరు. ఈ సభలకు కామాడ్డి, నిజామాబాద్, జనగాం, హైదరాబాద్, హన్మకొండ, మహాబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, మహాబూబ్‌నగర్, నల్గొండ, మిర్యాలగూడ, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆలేరు, మెదక్, సంగాడ్డిల నుంచి మరియు కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి రచయితలు, తెలంగాణవాదులు వచ్చి సంబురంగా పాల్గొన్నారు. సభలో నాగరాజు, బుర్ర సతీష్, మల్లిక్ ఇంకొందరు పాడిన పాటలు ధూంధాంగా ఉన్నయి. ఈ సభలు తెలంగాణ రచయితలకే ఉషారు నింపినయి. ప్రధాన వేదిక మీద అన్నవరం శ్రీనివాస్ ఓ పక్క బతుకమ్మ పండుగ మరోపక్క పీరిల పండుగ నడుమ కరీంనగర్ ఘన చరివూతతో ఉన్న పెయింటింగ్ అందరిని ఆకట్టుకున్నది. వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి. తెలంగాణ సిలబస్ రూపొందించుకోవాలి. తెలంగాణ సాంస్కృతిక చరివూతను పునర్ నిర్మించుకునేందుకు అందరు కట్టుబడాలని తీర్మానించిండ్రు. అఖిల భారత తెరవే అధ్యక్ష, కార్యదర్శులు నలిమెల భాస్కర్, మచ్చ ప్రభాకర్‌లను ఆహ్వాన సంఘం బాధ్యులను అందరు మెచ్చుకోవట్టిండ్రు.
- అన్నవరం దేవేందర్, 9440763479

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి