17, సెప్టెంబర్ 2013, మంగళవారం

నేడు తెలంగాణ విలీన దినోత్సవం!?


- పొత్తిళ్లలోనే కుట్ర కత్తులు.. విమోచన మాటునే దోపిడీ మొదలు
- వేదికగా నిలిచిన వెలోడి పా లన.. గుర్తుగా మిగిలిన విజయనగర్ కాలనీ
- హైదరాబాద్‌లో సీమాంధ్రవాసుల తిష్ఠ.. ఉద్యోగాల పేరుతో నగరం ఆక్రమణ
- అన్యాయం గ్రహించిన తెలంగాణ .. బూర్గుల పాలనలో గైర్‌ముల్కీ ఉద్యమం
- విలీనం వద్దన్న ఫజల్ అలీ కమిషన్.. ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని సిఫారసు
- లాబీయింగ్‌కు తలొగ్గిన నెహ్రూ.. షరతులతో కూడిన విలీనం


హైదరాబాద్, సెప్టెంబర్ 16 (టీ మీడియా): సెప్టెంబర్ 17! యావత్‌దేశం స్వేచ్ఛాగాలులు పీల్చుతున్న తరుణంలో ఇంకా నిజాం నవాబు పాలనలోనే ఉన్న తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన రోజు! భారత ప్రభుత్వ సైనిక చర్యతో హైదరాబాద్ స్టేట్.. ఇండియన్ యూనియన్‌లో విలీనమైన సందర్భం! ఏళ్లతరబడి
సాగిన నిజాం దాష్టీకాల నుంచి తెలంగాణ ప్రజలకు విమోచన కలిగిన సమయం! కానీ.. విలీనం మాటున.. విద్రోహానికి పునాదులు పడింది కూడా అదే రోజు! నిజాం కబంధ హస్తాల నుంచి బయటపడినందుకు ఆనందించే సమయం కూడా దక్కకముందే తెలంగాణ ప్రాంతం ఆంధ్రా కుట్రలకు వేదికైంది! ఆ కుట్రలకు పరాకాష్టగా.. ఆంధ్రతో తెలంగాణ విలీనమైంది! ఫజల్ అలీ కమిషన్ నిరాకరించినా.. నాటి ప్రధాని నెహ్రూకు ఇష్టం లేకపోయినా.. జోరుగా సాగిన సీమాంధ్ర లాబీయింగ్ తెలంగాణను కలిపేసుకుంది! దోపిడీకి అద్భుతవనరుగా మార్చుకుంది! ఆరు దశాబ్దాలు గడిచినా.. ఇంకా తెలంగాణ గోసపడ్తూనే ఉంది! డిసెంబర్ 9 అనంతర మోసాన్ని దిగమింగుకుని.. రాజీలేని పోరాటాలతో జూలై 30 ప్రకటనను సాధించుకుంది! ఇప్పుడు ఆ ప్రకటన అమలు కోసం తండ్లాడుతోంది!!
నిజమే.. సీమాంధ్ర నేతల ప్రస్తుత యాసిడ్ ప్రేమకు పునాదులు పడింది తెలంగాణ విమోచన (విలీన) సందర్భం మరుసటి రోజు నుంచే! 1948 సెప్టెంబర్ 16వ తేదీ వరకు భారత ఉపఖండంలో స్వతంత్ర దేశంగా ఉన్న హైదరాబాద్ సంస్థానం 17వ తేదీన సైనిక చర్య ద్వారా భారత్‌లో విలీనమైంది.

sardharpatelmnagarజనరల్ జేఎన్ చౌదరి మిలిటరీ కమాండర్‌గా సైనిక పాలన కొనసాగింది. సైనిక పాలనలోనే విచక్షణా రాహిత్యంగా ఉద్యోగులను తీసి వేశారు. ఇంగ్లీష్ వచ్చిన వారిని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రప్పించారు. నిజాం పాలనలో ఉన్న అధికారులను సైనికాధికారులు అనుమానంగా చూశారు. ప్రజలకు కనీస హక్కులు లేకుండా పోయాయి. దీంతో నిజాం నవాబు ఐక్యరాజ్యసమితిలో మరో కేసు వేసి, తన సంస్థానంలో ప్రజా పాలన లేదని ఫిర్యాదు చేశారు. ప్రజలకు భద్రత కరువైందని చెప్పారు. దీనిపై ఐక్యరాజ్యసమితికి భారత ప్రభుత్వం కనీసం సమాధానం కూడా చెప్పుకోలేక ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి (ఐసీఎస్) ఎంకే వెల్లోడిని 1950 జనవరి 26న ముఖ్యమంత్రిగా నియమించింది.

భారతదేశ చరిత్రిలో ఒక సివిల్ సర్వీస్ అధికారి ముఖ్యమంత్రిని అయిన చరిత్ర ఒక్క హైదరాబాద్ రాష్ట్రానిదే. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత నాలుగు సంవత్సరాలు ప్రజా పరిపాలన లేకుండాపోయింది. రెండేళ్లు సైనిక అధికారుల చేతుల్లో, ఆ తరువాత వారి కనుసన్నల్లో వెల్లోడి పాలనలో కొనసాగింది. ఈ నాలుగేళ్లు కాలంలోనే హైదరాబాద్ సంస్థానం తీవ్రంగా నష్టపోయింది. హైదరాబాద్ సంస్థానంలో పని చేసిన అధికారులకు ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చే పద్ధతి ఉండేది. సంస్థానం అధికారులు ఇదే పద్ధతిని వెల్లోడి పాలనలోనూ కొనసాగించారు. అయితే.. దీనిని పక్కనపెట్టిన ప్రభుత్వం.. ఇంగ్లిష్ పద్దతుల్లో ఫైళ్లను నడిపే పద్ధతిని అమలు చేసింది. ఇందుకోసం జనరల్ చౌదరి, వెల్లోడిలు.. హైదరాబాద్ సంస్థానంలోని ఉన్నతాధికారులను, వారికింద పని చేసే బంట్రోతులను ఉద్యోగాల నుంచి ఊడబీకి ఇంటికి పంపించారు. వారి స్థానంలో ఆంధ్రా, తమిళనాడుల నుంచి దాదాపు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులను ఇక్కడకు తీసుకువచ్చారు.

వారి కోసమే విజయనగర్ కాలనీని నిర్మించారు. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటగా ఆంధ్రుల ఆధిపత్యానికి, వలస దోపిడికి నిదర్శనంగా విజయనగర్ కాలనీ నిలుస్తుందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత సీ విఠల్ తెలిపారు. ఆ తర్వాత మలక్‌పేట, ఇతర కాలనీలు ఉంటాయని చెప్పారు. 1949 నుంచే వెల్లోడి 20 వేల మంద్రి నాన్ ముల్కీలను హైదరాబాద్‌లో ఉద్యోగులుగా నియమించాడు. హైదరాబాద్‌లో నిపుణత లేక మమ్మల్ని ఆహ్వానించారని చెప్పుకునే ఆంధ్రుల్ని స్వాగతించింది వెల్లోడీనే. నగరంలోకి సీమాంధ్రుల రాక 1956 నుంచి మొదలు కాలేదు. 1949 నుంచే ఢిల్లీ పెద్దల సూచనతో ముఖ్యమంత్రి హోదాలో వెల్లోడి కుట్రను అమలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో నిజాం ప్రాధాన్యం తగ్గించాలనేది ఢిల్లీ కుట్ర. ఆ బాధ్యతను అమలు చేసేందుకు నియమితుడైన వెల్లోడి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి, సేవా రంగాల్లోకి సీమాంవూధకు చెందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాడు. నిజాం ప్రభావం తగ్గించేందుకు హైదరాబాద్‌లో వెల్లోడి అనేక మార్పులు చేశాడు. అప్పటి వరకు అధికారిక భాషగా ఉన్న ఉర్దూ స్థానంలో ఆంగ్లంను ప్రవేశపెట్టాడు. విద్యా భాషగా ఉర్దూను రద్దుచేసి తెలుగును ప్రవేశపెట్టాడు. ఈ విధంగా అప్పటికే తెలుగు మాద్యమంలో చదివిన సీమాంధ్రులు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాలను అలవోకగా దక్కించుకున్నారు. ఈ విధంగా ఢిల్లీ కుట్ర అమలయింది. 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెల్లోడిని హైదరాబాద్ స్టేట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ (సీఎస్ సమాన స్థాయి హోదా)గా నియమించారు.

ఆయన ఢిల్లీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేశారు. వెల్లోడి విధానాలకు వ్యతిరేకంగా 1952లో వరంగల్‌లో ముల్కీ ఉద్యమం. సెప్టెంబర్‌లో మొదలయిన ఈ ఉద్యమం అక్టోబర్‌లో హైదరాబాద్‌కు విస్తరించింది.

1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ సంస్థానంలో మొదటి సారిగా ప్రజా పాలన వచ్చింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన హైదరాబాద్ ఉద్యోగస్థులతోపాటు యువకులు, విద్యార్థులు తమ భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున గైర్ ముల్కీ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమానికి హైదరాబాద్ విద్యార్థుల తరపున ఆనాడు నిజాం కళాశాల విద్యార్థిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు కుమారుడు నర్సింగ్‌రావు ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారు. సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రి కుమారుడే ఉద్యోగం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇడ్లీసాంబార్ గో బ్యాక్ అంటూ హైదరాబాద్ వీధులు ఆనాడు నిరసనకారులతో పోటెత్తాయి. ఆనాడు జరిగిన పోలీసు కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు.

పోలీసులు ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. మరో వైపు మద్రాసు నుంచి వేరు పడి, కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలోని పెద్దలు అప్పటికే హైదరాబాద్‌పై గురి పెట్టారు. భారీ ఎత్తున కేంద్రంతో లాబీయింగ్ చేశారు. కన్నడ, మరాఠా భాషలు మాట్లాడే ప్రాంతాలతో కూడి ఉన్న హైదరాబాద్ స్టేట్‌ను విచ్ఛిన్నం చేయడం ద్వారా హైదరాబాద్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కుట్ర చేశారు. అందుకోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను ఆంధ్రులు తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్విభజన కోసం ఫజల్ అలీ నాయకత్వాన కేంద్రం కమిషన్ వేసింది. ఈ కమిషన్ తన సిఫారసులలో తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని చెప్పింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణను కలిపుతే తెలంగాణ దురాక్రమణకు గురవుతుందని పేర్కొంది.

ఆనాడు ఫజల్ అలీ కమిషన్ చెప్పింది ఈ నేడు వాస్తవమని రుజువవుతోంది. హైదారాబాద్ రాష్ట్రంలో అధికారులుగా వచ్చిన ఆంధ్రులే ఆనాడు అనేక భూములు, భవనాలు, తోటలపై కన్నేశారు. చివరకు పైగా భూములను కూడా తమపేర రాయించుకున్నారు. ఆతరువాత వారి తరాలకు చెందిన వారసులే హైదరాబాద్‌లో వందల ఎకరాలకు ఆసాములుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగ్గజాలు అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపడం అసలు ఇష్టం లేదు. విస్తరణవాదం అంటేనే సామ్రాజ్యవాద కాంక్షతో కూడినదని నెహ్రూ విస్పష్టంగా చెప్పారుకూడా.

అనేక మంది ఆంధ్రులు పలుసార్లు నెహ్రూను కలిసినా తెలంగాణను ఆంధ్రతో కలుపడం కుదరదని చెప్పారు. అయినా బ్రిటిష్ పాలనలో 200 ఏళ్లు ఉండి లాబీయింగ్ చేయడంలో చేయి తిరిగిన సీమాంధ్ర నాయకులు ఒక వైపు అక్కడ లాబీయింగ్ చేస్తూనే, హైదరాబాద్ రాష్ట్రంలో నాయకుల మధ్య విభేదాలు సృష్టించారు. హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటే ఏనాటికీ కూడా తమ రాజ్యం రాదని, ఒక కులానికి చెందిన నాయకులను ఎగవేశారు. మరో కులానికి చెందిన నాయకులను బెదిరించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని చీల్చి ఆంధ్రలో కలుపుకోవడానికి చివరకు కుల పంచాయతీలు కూడా సృష్టించిన ఘనత ఆనాటి ఆంధ్ర నాయకత్వానిదని తెలంగాణ వాదులు అంటున్నారు.

చివరకు విలీనం ఇష్టం లేక పోయినా బలవంతంగా తాను తెలంగాణను ఆంధ్రాలో కలుపుతున్నానని నెహ్రూ ఆనాడు నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో చెప్పారు. అమాయకపు అమ్మాయిలాంటి తెలంగాణకు గడసరి అబ్బాయిలాంటి ఆంధ్రాను ఇచ్చి పెళ్లి చేస్తున్నామని, కాపురం సజావుగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చునని చెపుతూనే విలీనం చేశారు. ఈ సందర్భంగా నిర్ధిష్టమైన ఒప్పందాలతో విలీనం చేశారు. పెద్దమనుషుల ఒప్పందంగా పిలిచిన ఈ ఒప్పంద పత్రాలపై తెలంగాణ నుంచి నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి కేవీ కేవీ రంగారెడ్డి, చెన్నారెడ్డి, నర్సింగ్‌రావులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో తెలంగాణ భూములు బయటి వాళ్లు కొనాలంటే తెలంగాణ ప్రాంతీయ బోర్డు అనుమతి తీసుకోవాలనేది ముఖ్యమైన నిబంధన.

సీమాంధ్రకు ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణకు ఉపముఖ్యమంత్రి ఉండాలనేది మరో అంశం. తెలంగాణ ఆదాయాన్ని తెలంగాణకే ఇక్కడే ఖర్చు చేయాలని, అసెంబ్లీలో తెలంగాణ, ఆంధ్రా బడ్జెట్‌లను ప్రత్యేకంగా చూపాలని, ఆంధ్రా- తెలంగాణ వచ్చేటట్లుగా రాష్ట్రం పేరు ఉండాలని కొన్ని అంశాలను నిర్ధారించి.. తెలంగాణ వనరులు, ఆదాయానికి రక్షణ కల్పించారు. ఆ మేరకు 1956 నవంబర్ 1న రెండు ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రం పేరు విషయంలోనే మొట్టమొదటి రోజే తొలి ఉల్లంఘన జరిగింది. నాటినుంచి నేటి వరకు అన్నీ ఉల్లంఘనలే జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి