27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మనకు తెలియని మన సంస్కృతి


కొత్తగూడెం వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుడు నన్ను బొగ్గుబావిలోకి తీసికెళ్లాడు.అప్పుడు నాకు ఆ బొగ్గుగని కార్మికుల జీవితం అర్థమైంది. ఈనాడు జయధీర్ తిరుమలరావు నా చేయిపట్టుకొని మరో బావిలోకి దించారు. ఇది బొగ్గు బావి కాదు. ఇది కళాత్మకమైన బావి. ప్రతి కళకు వృత్తికి, శరీర చెమటకు సంబంధించి ఉంటుంది. ఆ శ్రమ జీవుల వృత్తి నుంచి ఆ కళారూపాన్ని వేరు చేసి చూడలేం. శ్రామికుడు ఒక పని చేస్తున్నప్పుడు అతనిలోని మానసికమైనటువంటి ఏ ఆనందం కలుగుతుందో దానికి ఒక కళాత్మకమైన రూపం ఇస్తే ఆ శ్రామికుడు తన అలసటను మర్చిపోతాడు. తన శ్రమను ప్రేమిస్తూ తాదాత్మ్యం చెందుతాడు. ఇప్పుడు నాకర్థమైంది వరంగల్ జిల్లా గూడూరులో మా ఇంటి పక్కనున్న కమ్మరి యాదగిరి ఆ కొలిమి పక్కన ఎట్లా కూర్చునేవాడో నా కళ్లారా చూశాను.

ఆ పనిలో మా యాదగిరి ఎంత శ్రమించాడో ఎంత ఆనందించాడో నా కళ్లల్లో జ్ఞాపకాలు సుళ్లు తిరిగాయి. తన శ్రమలో పడే బాధను కళాత్మకం గా ఆలపిస్తూ ఆనందాన్ని ఎలా పొందుతానో ఆ చేతివృత్తుల శ్రమజీవుల ఆలపాటలే మహాకావ్యాలు. ఆ కావ్యాల ఆలాపనకు కావల్సిన వాయిద్యాన్ని కూడా తయారు చేసుకుంటారు. ఆ వాయిద్యంపై రాగం ఆపిస్తాడు. అందుకు లయబద్ధంగా వాయిద్యంపై శబ్దం చేస్తాడు. విశ్వకర్మల పనివారల వాయిద్యమే రుంజ. ఆ రుంజను వాయిస్తున్నప్పుడు వడ్రంగి కొలిమి మంట మండుతున్నట్లుగా కనిపిస్తుంది. కంసాలి కుంపటిలోని నిప్పులు ఎర్రటి రంగులాగుంటుంది. పెద్దబాడెశను గాలిలో ఎగురవేస్తుంటే వచ్చే శబ్దం నాకా రుంజ వాయిద్యంపై వినిపించింది. కమ్మరి మాట్లేస్తున్న శబ్దాలు ధ్వనించాయి. శిల్పులు తమ ఉలులతో శిల్పాలను చెక్కటం కనిపించింది.


రుంజవాయిద్యంపై అంగళ్లమూర్తి రాంమూర్తి వాయిస్తుంటే నా చిన్నప్పటి పంచకర్మ కులస్థుల శ్రమ దృశ్యాలన్నీ నా కళ్లముందు కదలాడాయి. ఈ 60 సంవత్సరాలలో రేగిన మార్కెట్ దుమారపు మట్టి ఆ కళల మీద పడటం వలన ఆ రుంజ కళావాయిద్యం కూడా క్రమంగా కనుమరుగవుతూ వస్తుంది. గ్రామాల కులవృత్తుల వాకిళ్లు దెబ్బతిన్నాయి. గోరటి వెంకన్న గొంతెత్తి పాటపాడుతుంటే ఆ జీరగొంతునుంచి పల్లెకన్నీరు పెడతున్న దృశ్యం చూశా ను. ఆ పాటలో చేతివృత్తుల చేతులు విరిగిపోవటం విని వొళ్లు క్షణికావేశంలో ఒళ్లు జలదరిస్తుంది. మా ఇంటి పక్కన కమ్మరి యాదగిరి రుంజ కళవాయిద్యం ద్వారా తన కళ ద్వారా అనుభవించిన ఆనందం లెక్కించలేనిది గణించలేనిది ఆ ఆనందాన్ని తిరిగి తీసుకురావటం ఎవరివల్లా కాదు. నేను, గోరటి తదితర సాహితీమివూతులందరం కలిసి ఆ రుంజ కళారూపాన్ని విని తరించటానికి జడ్చర్ల వెళ్లాం. పల్లకి మోసే వానికే ఆ బోయిలపాట అర్థమౌతుంది. ఇలాంటి సాహిత్యాన్ని, కళారూపాల్ని వెలికితీయటానికి జానపద పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు ఎంతో కాలంగా శ్రమిస్తున్నాడు. అందుకు కావల్సిన అంగబలాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇలాంటి కళాకారులు ఎక్కడ ఉంటే అక్కడికి పరుగెత్తుతారు. ఆయన జన విశ్వవిద్యాలయానికి వెళ్లి విశ్వవిద్యాలయంలోని తన అకడమిక్ రంగాన్ని కదిలిస్తాడు. అందులో భాగంగా జయధీర్ ఇటీవల జడ్చర్లలో రుంజపై సభ పెట్టాడు.

ఇతర దేశాలలో ఇలాంటి కళారూపాలను నవీనం చేస్తారు. ఈ కళారూపాలకు టెక్నాలజీని అందించి నవీనం చేయటమేగాక ఆ కళా సంపదలను కాపాడతారు. శ్రమ సామాజికీకరణ కావాలంటే శ్రామికుణ్ణి ప్రేమించాలి. అతన్ని కళలను ఆదరించాలి. ఆ చెమటచుక్కల జ్ఞానాన్ని ఏ విధంగా నవీనం చేయాల్నో సున్నిత విషయాలను కళలకు జోడించి కొత్త పార్శ్వానికి మార్గం వేస్తారు. నేను స్టాన్‌ఫర్డ్ వెళ్లినప్పుడు మ్యూజిక్ స్కూల్‌లో ఆర్టిస్టులు పాడటమే గాకుండా కొత్త లయలను కనుగొంటారు. ఆ కృషిని గమనించాను. మన దగ్గర 750 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఆ కాలేజీలు ఫర్నీచర్ కొనుక్కునేందుకు చైనా వెళుతున్నారు. ఇక్కడ వున్న వడ్రంగులు, విశ్వకర్మలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ వృత్తులను ఆధునీకరించుటకై ప్రయత్నం చేస్తే ఎంత బాగుండునో అనిపించింది. కానీ మన సాంకేతిక విద్యా విధానం అనుసరిస్తుంది. అమెరికా పెట్టుబడీ నమూనా విధానం కదా! పెట్టుబడి సంపదతో సహా దారివూద్యాన్ని కూడా సృష్టిస్తుంది. అదే చైనాలో ఐటి రంగం ఎంత పెరిగినా కానీ ఆ వలలో పడకుండా ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అందుకే చైనాలోని గ్రామీణ ప్రజలు పట్టణాలకు తక్కువగా వలసలు పోతున్నారు.


రుంజలాంటి ఒక కళాత్మక వాయిద్యం వెనుక వేలాది మంది శ్రమజీవుల కులవృత్తుల జీవితం ఆధారపడి ఉంటుంది. దీనిని వెలికితీయటానికే జయధీర్ తిరుమలరావు కృషి చేస్తున్నాడు. ఆ సెమినార్‌లో నిష్ణాతులతో ఆ రుంజ కళావాయిద్యాన్ని ప్రదర్శింపచేసి దీనికొక శాస్త్రీయమైనటువంటి అంశాలను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘రుంజ కళావూపదర్శనా వైవిద్యాలు’ అనే అంశంపై గుర్రం సీతారాం, శిష్ట పురాణాలు ఉపకుల పురాణాలు సన్నిధానం నర్సింహశర్మతో, రుంజవాయిద్యం అభివ్యక్తరీతులు అనే అంశంపై ఇంద్ర రమేష్‌తో, రుంజకళా వాయిద్యం, సంగీతంపై పవన్‌కుమార్‌తో, దేశీకుల పురాణాలను రాంమూర్తితో మాట్లాడింపచేశారు. రుంజ కళాదృశ్యీకరణ అనుభవం శరత్‌డ్డితో, రుంజ కళాచరిత్ర పౌరాణిక ఆధారాలను ప్రొఫెసర్ మనోజలాంటి నిష్ణాతులతో మాట్లాడింపచేశారు. చాలామందితో ఉపన్యాసాలు చెప్పించటమే గాకుండా డాక్యుమెం చేస్తున్నాడు. పరిశోధనను ప్రైవేట్ సంస్థలతో విక్రంసారాబాయ్ మాత్రమే చేయగలిగాడు. దానికెంతో జనబలం, ఆర్థిక బలం కావాలి. జయధీర్ తిరుమలరావు ఈ జానపద పరిశోధనను ఎంత వరకు చేయగలుగుతాడోనని నాకు కొంత భయంగానే ఉంది.

పెట్టుబడీదారి సమాజంలో శ్రమజీవుల నాగరికతకు ఆదరణ దొరకటం చాలా కష్టం. మన పాలకులు టెక్నాలజీని పెంచిన దానికన్నా బయట నుంచి కొనుక్కోవటం మేలనుకుంటున్నారు. కాబట్టే మన కళలు కూడా అదేమాదిరిగా అంతరించిపోతున్నాయిశమజీవుల సంస్కృతి అంతరించి పోతుంది. ఇది సమాజానికి ప్రమాద హెచ్చరిక.
-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి