21, సెప్టెంబర్ 2013, శనివారం

బహుజన బాంధవుడు కొండా లక్ష్మణ్‌తె


9/21/2013 1:32:25 AM
లంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ ఉద్యమానికి అండ గా ఉద్యమకారులకు బాసటగా నిలిచిన కొండాలక్ష్మణ్ బాపూ జీ తుది శ్వాస విడిచి సంవత్సరమైంది. ఆయన కల సాకారం కాకముందే వెళ్లిపోయారు. ఆయన ఆశయాలు మాత్రం మన భుజాలపై వుంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆయన తన జీవితమంతా ప్రజలకే అంకితం చేశారు. పదహారేళ్ల పడుచు ప్రాయంలో మొదలైన ఆ ఉద్యమదీప్తి శతాబ్దికి చేరుకుంటున్న సమయంలో ఆరిపోయింది. బాపూజీ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని నినదించారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని నిరసించారు. తెలంగాణ ప్రాంతాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి చేయాలని నాడు నిజాం రాజరికంపై పోరాడారు. తుదిశ్వాస విడిచే వరకు సీమాంవూధుల వలసపాలనపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే వచ్చారు. తన స్వరం మూగబోయినా నాలుగున్నర కోట్ల మంది గొంతుకల్లో తన వాణిని వినిపిస్తూ నే ఉన్నారు.
DSC_0108

వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా బహుజన బాంధవుడిగా మనందరికి బాపూజీ చిర పరిచితులు. ఆంధ్రవూపదేశ్‌లో అస్తిత్వ ఉద్యమాల గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందు కొండా లక్ష్మణ్ బాపూజీనే పేర్కొనాలి. ఆయనొక ఉద్యమ కెరటం. దళిత బహుజన, తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలకు పునాది. ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం. 1952-56 మధ్యకాలంలో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కొండాలక్ష్మణ్ బాపూజీ సమైక్యవాదిగా ఉండి ఆంధ్రవూపదేశ్ అవతరణ కోసం తన వంతు కృషి చేశారు. సమైక్య రాష్ట్రం ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగే నష్టాల గురించి చెప్పుతున్నప్పటికీ అవన్నీ వట్టి అపోహలని అనుకున్నారు. తర్వాత కాలంలో సీమాం ధ్ర నేతలు చేసిన అన్యాయాలను, అవమానాలను స్వయంగా అనుభవించిన తర్వాత తన అభివూపాయాలను మార్చుకుని 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తన మంత్రి పదవిని కూడా తృణవూపాయంగా వదులుకున్నారు. అయినప్పటికీ తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పరస్పర విద్వేషాలు ఉండరాదని కడదాక కోరుకున్నారు.

1969 సెప్టెంబర్ 23న రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘తెలుగుజాతి ఒక రాష్ట్రం కింద ఉండనివ్వండి, అనేక రాష్ట్రాల కింద ఉండనివ్వండి- ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు జాతి గౌరవం పెంచుకునే విధంగా వ్యవహరించాలి. అది మనందరికి మంచిది’. అని బాపూజీ అన్న మాటలు ప్రజల మధ్య సౌభ్రాతృత్వానికి నిదర్శనం. ఈ మాటలను నేటి ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుంటే మంచిది. నేటి తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఉద్యమాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న రాజీనామాల వంటిదికాదు ఆయన రాజీనామా. ఒక్కసారి మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత తిరిగి దాన్ని ముట్టుకోలేదు. అది రాజకీయాల పట్ల, తెలంగాణ పట్ల ఆయనకున్న నిబద్ధత. 1990లో మలిదశ తెలంగాణ ఉద్యమంలోకూడా కొండాలక్ష్మణ్ మరోసారి క్రియాశీలకమయ్యారు. జీవితం చివరి అంకంలో ఉండి కూడా వయోభారాన్ని లెక్కచేయకుండా ఎక్కడ తెలంగాణ టెంటు వేస్తే అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఉద్యమకారులకు స్ఫూర్తి నిచ్చారు. రాజకీయ పార్టీల్లో ఏకాభివూపాయాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పరితపించారు బాపూజీ.

ఒకవైపు రాజకీయ జీవితం కొనసాగిస్తూనే, మరోవైపు సామాజిక ఉద్యమాన్ని కూడా నిర్మించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధిలోకి తీసుకొచ్చారు. చేనేత, గీత, కమ్మరి, కుమ్మరి, వడంగ్రి, గొర్లకాపర్లు, చర్మకారుల సహకార సంఘాలను ఏర్పాటు చేశా రు. దేశంలోనే ప్రప్రథమంగా 1951-52 మధ్యకాలంలో ఆయన కార్మిక సహకార సంఘాలను నిర్మించాడు. 1945 లోనే సిరిసిల్లలో నిజాం రాష్ట్ర చేనేత మహాసభను ఏర్పాటు చేశారు. 1952లో హైదరాబాద్ చేనేత సహకార సంఘం, 1955లో హైదరాబాద్ పారిక్షిశామిక కేంద్ర సహకార సం ఘం,1959లో గీత, 1960లో మత్స్య పారిక్షిశామిక సం ఘాలను ఏర్పాటు చేయడంలో చొరవ చూపారు. చర్మకారుల సహకార సంఘాల కోసం ‘నాయుడమ్మ కమిటీ’ని నియమించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

రాజకీయాలు మానవీయ, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కలగన్న కొండా లక్ష్మణ్ 1915 సెప్టెంబర్ 27న వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామం లో నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే విద్యార్థి నాయకుడుగా ఎన్నికయ్యారు. ఆటపాటల్లో మెటిగా రాణించారు. నిజాం రాజు స్తుతి గీతాన్ని ఆలపించడానికి నిరాకరించినందుకు, వందేమాతరం నినాదాలు చేసినందుకుగానూ పాఠశాల నుంచి వారం రోజులపాటు బహిష్కరణకు గురయ్యారు.

నిజాం సంస్థానంలో సాగిన తెలంగాణ సాయుధ చారివూతక పోరాటంలో కొండా లక్ష్మణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. వందేమాతర నినాదాలు, జాతీయ నాయకుల పేర్లు ఉచ్ఛరించడం నిషేధించబడిన కాలం లో, దేశ నాయకులు నైజాం రాష్ట్రంలో సంచరించడం నిషేధించబడిన రోజుల్లో 1930లో బ్రిటిష్ పాలిత బొంబాయి రాష్ట్రంలోని చాందా పట్టణంలో గాంధీజీని సందర్శించి నిజాం ప్రభుత్వంపై ధిక్కార స్వరాన్ని ఎక్కుపెట్టాడు. స్టేట్ కాంగ్రెస్‌పై, పౌరహక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో ఆయన నిజాం సర్కారును ధిక్కరించి పోరుబాట ఎంచుకున్నారు. రజాకార్ల ఆగడాలకు అంతులేని రోజుల్లో ప్రజలను చైతన్యపర్చేందుకు బాపూజీ చైర్మన్‌గా ‘సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ’ ఏర్పడింది. ఈ కాలంలో మందుగుండు సామాగ్రి తయారు చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంలో బాపూజీ ప్రధాన పాత్ర పోషించారు.

నిజాం రాజును అంతమొందిస్తే తప్ప ప్రజలకు విముక్తి లేదని భావిం చి రాష్ట్రం వెలుపలి నుంచి ‘పహాడి’ (కొండ) అనే పేరుతో బొంబాయి, షోలాపూర్‌లో ప్రచ్ఛన్న కార్యక్షికమాలు నిర్వహించాడు. 1947 డిసెంబ ర్ 4 న నిజాం నవాబుకారుపై బాంబు విసిరే చర్యకు బాపూజీ రూపకల్పన చేశారు.
తెలంగాణ సాయుధ పోరా ట కాలంలో క్రిమినల్ న్యాయ వాదిగా విప్లవకారుల తరఫున అనేక కేసులు వాదించారు. నిజాం ప్రభుత్వం నిర్బంధించి న వ్యక్తులకు పార్టీలతో నిమిత్తం లేకుండా న్యాయ సహాయం అందించారు. హుస్నాబాద్, విసునూరు దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం వంటి కేసుపూన్నింటినో వాదించి గెలిచారు. కమ్యూని స్టు నాయకులు నల్ల నర్సింహు లు, ఆరుట్ల రాంచంవూదాడ్డి, జైని మల్లయ్యగుప్త, నయీ జిందగీ సంపాదకులు ప్రొఫెసర్ కెఎస్ శర్మలపై ఉన్న కుట్ర కేసులను వాదించి గెలిచారు. మన రాష్ట్రంలో పాదయావూతలకు శ్రీకారం చుట్టింది కూడా కొం డా లక్ష్మణే. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నల్లగొండ జిల్లాలో 228 మైళ్ల దూరం పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు.

శాసనసభ్యుడిగా, ఉప సభాపతిగా, మంత్రిగా సహకారోద్యమ నాయ కునిగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా రాష్ట్ర ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించాడు. సర్వజనులకు సమ్మతమైన సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని పరితపించిన బహుజన బాంధవుడు ఆయన. నాటి హైదరాబాద్ విముక్తి పోరాట కాలం నుంచి నేటి దాకా ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయమే కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం. ఆ మహనీయుని చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. అది సాధించిననాడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినవారమవుతాము.
-డాక్టర్ వంగరి భూమయ్య
పాలమూరు యూనివర్సిటీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి