19, సెప్టెంబర్ 2013, గురువారం

సమ్మెపై నిర్ణయం ప్రభుత్వానిదే


9/19/2013 7:19:50 AM
-చర్యలు తీసుకోవాలని కోర్టులు ఆదేశించలేవు
-హైకోర్టులో ఏపీఎన్జీవోల వాదన
-విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, సెప్టెంబర్18 (టీ మీడియా): సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుని తీరాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు ఆదేశించలేవని ఏపీఎన్జీవోల తరఫు న్యాయవాది మోహన్‌రెడ్డి హైకోర్టుకు చెప్పారు. నిజానికి సమ్మె న్యాయమా? కాదా? అన్నది తేల్చాల్సింది కూడా ప్రభుత్వమేనని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్న విషయాన్ని ప్రభుత్వ వివేచనకు వదివేయాల్సిందేనని మోహన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రాజకీయ అంశమైన రాష్ట్ర విభజనపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, అఖిల భారత బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది.

kirannalla ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రకారం మాత్రమే సమ్మెపై నిషేధం ఉందని చెప్పారు. ఉద్యోగుల సర్వీస్ నిబంధనల్లో సమ్మెపై నిషేధం లేదని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తే ఎస్మా కింద మాత్రమే అవకాశముంటుందన్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకొని.. ప్రభుత్వానికి విచక్షణ ఉన్నపుడు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చా? చర్యలు తీసుకుని తీరాలని ఆదేశాలు ఇవ్వవచ్చా? అని ప్రశ్నించింది. దీనికి మోహన్‌రెడ్డి జవాబిస్తూ పరిస్థితులు, ఆయా కేసుల్లోని అంశాలనుబట్టి ఈ విషయం ఆధారపడి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. ప్రభుత్వ విచక్షణాధికారానికి రాజ్యాంగం ప్రకారం ఎంతో విలువు ఉంటుందని, ప్రస్తుత కేసులో ప్రభుత్వ విచక్షణకే ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అలా చేస్తే అంతిమంగా ప్రజలకే కదా ప్రయోజనం కలిగేది. ప్రభుత్వాలు ఉండేది ప్రజల కోసమే. ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోకపోతే నష్టం ఎవరికో మనం చూడాలి కదా’ అని పేర్కొంది.

ఇందుకు మోహన్‌రెడ్డి సమాధానమిస్తూ ప్రస్తుతం సమ్మెలో లక్షలమంది ఉద్యోగులు ఉన్నారని, వీరందరిపై ఎస్మా ప్రకారం చర్యలు తీసుకుంటే మొదట నష్టం వాటిల్లేది ప్రభుత్వానికేనని పేర్కొన్నారు. ఈ ప్రభావం ప్రజలపై కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. చర్యలు తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వం మొదట ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉంటుందన్నారు. ఆ వెంటనే ప్రత్యామ్నాయంగా ఉద్యోగులు దొరికే పరిస్థితి ఉండదని, దొరికినా సీనియర్లు దొరకరని, దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెప్పారు. ప్రభుత్వాలు రాజకీయపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంటాయని, ఈ విధంగా తీసుకున్న ఓ తీవ్రమైన నిర్ణయం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని వివరించారు. ఎస్మా ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినా సమ్మె చేస్తున్న ఉద్యోగులు వెనక్కి తగ్గకపోతే తలెత్తే పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే విచక్షణను ప్రభుత్వానికే వదిలివేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మె వ్యవహారంలో తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తన కౌంటర్‌లో తెలియచేసిందన్నారు. ఈ చర్యలు పిటిషనర్, కోర్టుకు సంతృప్తినివ్వకపోవచ్చునని, అయితే, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలోకి తీసుకుని నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలి వేయాలన్నారు. ఇటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని తాము చెప్పటం లేదన్నారు. అయితే, కోర్టుకు న్యాయపరిధి ఉందని చెప్పారు. పిటిషనర్ సమ్మె విషయంలో ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించటం లేదని ఎక్కడా చెప్పలేదని, ప్రభుత్వానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ దీనినే డిమాండ్ ఆఫ్ జస్టిస్ అంటారు.. పిటిషనర్ ప్రభుత్వానికి ఎటువంటి వినతిపత్రం ఇవ్వలేదు నిజమే అని వ్యాఖ్యానించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు దృష్ట్యా కోర్టు పనివేళలను ఉదయం 11.30గంటల వరకు కుదించటంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి