23, సెప్టెంబర్ 2013, సోమవారం

సిద్ధమవుతున్న కేబినెట్ నోట్


9/23/2013 7:03:45 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ముందడుగు అయిన కేబినెట్ నోట్ తయారవుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ధ్రువీకరించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటన వచ్చి 50 రోజులైనా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి కారణమేమిటన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..‘కేబినెట్ నోట్ ముసాయిదాను కేంద్రం తయారు చేయాల్సి ఉంటుంది. దానిని తీర్మానం నిమిత్తం రాష్ట్ర అసెంబ్లీకి dfsedsపంపుతారు. ప్రస్తుతం ముసాయిదా తయారవుతోంది’ అని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ అంతర్భాగంగానే కొనసాగించాలని ఖమ్మం జిల్లా నాయకులు తనను కోరారని దిగ్విజయ్ తెలిపారు.

భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉండాలి: ఖమ్మం జిల్లా నేతలు
రాష్ట్ర విభజన జరిగితే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్ ఆంధ్రా ప్రాంతంలో కలుపనున్నారనే వార్తల నేపథ్యంలో ఆ జిల్లా నేతలు కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి ఆర్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి తదితరులు ఆదివారం దిగ్విజయ్‌ను కలిశారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని, తెలంగాణ అంతర్భాగంగా పరిగణించాలని వినతిపత్రం సమర్పించారు.

రాములవారు లేని తెలంగాణ అక్కరలేదు: కుంజా సత్యవతి
భద్రాద్రి రాముడు లేకుండా తెలంగాణ ఇస్తే ఒప్పుకొనేది లేదని ఎమ్మెల్యే కుంజా సత్యవతి స్పష్టం చేశారు. ఆదివాసీలకు మేలు జరగాలంటే భద్రాచలం తెలంగాణలోనే ఉండాలన్నారు. భద్రాచలం డివిజన్‌లో ఆదివాసీ జనాభా తొంభై శాతం వరకు ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కడితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు.

రామదాసుది నా నియోజకవర్గమే: వెంకట్‌రెడ్డి
భద్రాచల రామాలయాన్ని నిర్మించిన భక్తరామదాసు స్వస్థలం నేలకొండపల్లి తన నియోజక వర్గంలోనే ఉందని పాలేరు ఎమ్మెల్యే, మంత్రి రామిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అందువల్ల భద్రాచలాన్ని ఆంధ్రలో కలిపితే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. 1953 నుంచి భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతం తెలంగాణలో ఉంటుంది కనుక భవిష్యత్తులో పోలవరం నిర్మాణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకు సీమాంధ్రుల భద్రాచలం కావాలని కోరుతున్నారని, అటువంటి అపోహలు అక్కరలేదని తెలిపారు.

తలంబ్రాలు తెలంగాణ ఆనవాయితీ: భట్టి
శ్రీరామ నవమికి తలంబ్రాలు తెలంగాణ నుంచి తీసుకుపోవడం ఇక్కడి ఆనవాయితీ అని, రాజైన తానీషా దగ్గరనుంచి నేటి ప్రజాస్వామ్యంలోని ముఖ్యమంత్రి వరకు గోల్కొండ నుంచే తలంబ్రాలు తీసుకెళుతున్నారని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఆనవాయితీని భగ్నం చేయడం వల్ల సీమాంధ్రులకు ఫలితం దక్కదన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి