14, సెప్టెంబర్ 2013, శనివారం

ఆ నలుగురికీ ఉరి


September 14, 2013


"మహిళలపై ఘోరమైన నేరాలు హద్దుమీరి జరుగుతున్న సమయమిది. ఇలాంటి సంఘటనలపై న్యాయస్థానాలు కళ్లుమూసుకుని కూర్చోలేవు. ఇలాంటి నేరగాళ్లకు కఠినమైన హెచ్చరికలు పంపాల్సిన అవసరముంది. మహిళలపై క్రూర నేరాలకు పాల్పడే వారిని సహించడం కుదరదని మొత్తం సమాజానికి సంకేతాలు పంపినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మహిళలపట్ల జరిగే ఘోరమైన నేరాలకు... ఉరే సరి!''
- జడ్జి యోగేశ్ ఖన్నా


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: "23 ఏళ్ల యువతిపై క్రూర మృగాలవలె, ఒళ్లు గగుర్పొడిచే, మనసును కలిచివేసేలా దారుణానికి పాల్పడటం అత్యంత అరుదైన ఘటనే. అందువల్ల... ఆ నలుగురు దోషులను చనిపోయేదాకా ఉరికొయ్యకు వేలాడదీయాలి'' అని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు చెప్పారు. ఆ నలుగురిని ఈనెల పదో తేదీనే దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తి... శిక్షలపై 11న వాదోపవాదాలు విన్నారు. శుక్రవారం వారికి శిక్షలు ఖరారు చేశారు. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ రాత్రి ఈ దారుణం జరగ్గా... తొమ్మిది నెలల్లోనే కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ జైలులో ఉండగానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. బాల నేరస్థుడికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడింది. మిగిలిన నలుగురికి ఇప్పుడు ఉరి పడింది.

కిక్కిరిసిన కోర్టు హాలులో జడ్జి యోగేశ్ ఖన్నా తన 20 పేజీల తీర్పు వెలువరించారు. హత్యానేరానికి ఉరి శిక్ష, అత్యాచారానికి యావజ్జీవ విధించారు. దోషులకు రూ.55 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. నిర్భయ స్నేహితుడిపై హత్యాయత్నానికి పాల్పడిన నేరానికి కూడా శిక్షించారు. జడ్జి నోట 'ఉరి'మాట రాగానే... వినయ్ విలవిలా ఏడ్చాడు. మిగిలిన నిందితులు... ముఖేశ్, పవన్, అక్షయ్ 'కనికరించండి. దయ చూపండి' అని బతిమాలుకున్నారు. సాకేత్ కోర్టు విధించిన శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించాల్సి ఉంటుంది. అలాగే... తన తీర్పుపై దోషులు 30 రోజుల్లోపు అప్పీలుకు వెళ్లవచ్చునని జడ్జి తెలిపారు.

ఘోరాతిఘోర నేరం

"యువతిని, ఆమె స్నేహితుడిని కుట్రలో భాగంగానే బస్సులోకి ఎక్కించుకున్నారు. బాధితురాలిపై ఘోరమైన రీతిలో సామూహిక అత్యాచారం జరిపారు. అమానవీయంగా హింసించారు. దోషులది దుర్మార్గమైన, మతిలేని, ఆటవిక చర్య. ఇనుపరాడ్లు, చేతులతో జననాంగాన్ని ఛిద్రం చేశారు. రాడ్లు, చేతులు పదేపదే జొప్పించడంతో ఆమె పేగులకు చిల్లులుపడ్డాయి. పొట్టలో ఉండాల్సిన పేగులు బయటికి వచ్చాయి. బాధితురాలి అంతర్గత అవయవాలు చికిత్సకు అందనంత తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితురాలిని, ఆమె స్నేహితుడి శరీరాలపై నూలుపోగు కూడా లేకుండా చేసి... కదులుతున్న బస్సులో నుంచి బయటికి విసిరేశారు.

బస్సు వెనుక తలుపు తెరుచుకోకపోవడంతో... బాధితులను జుట్టుపటుకుని ముందు తలుపు వరకు ఈడ్చుకొచ్చి మరీ బయటికి నెట్టారు. రక్తమోడుతున్న శరీరాలతో, శీతల రాత్రిలో నడిరోడ్డుపై బాధితురాలు అనుభవించిన హింస వర్ణనాతీతం. దోషులు మానవ సహజమైన క్షమాభిక్షకు అర్హులుకాని మానసిక వికారులు'' అని జడ్జి తెలిపారు. 'ఇంత ఘోర నేరానికి పాల్పడిన వారికి అత్యంత తీవ్రమైన శిక్ష వేయాల్సిందే' అని స్పష్టం చేశారు. బాధితురాలి చెంపలు, పెదవులు, మెడ, ఛాతీ, పొత్తికడుపు... ఇలా ముఖం నుంచి మోకాళ్ల వరకు శరీరంపై అనేకచోట్ల కొరికిన, గోళ్లతో రక్కిన గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైందని... ఇవన్నీ దోషుల ఆటవిక, అనాగరిక చర్యలకు నిదర్శమని తెలిపారు. ఈ నేరాన్ని క్రూర, వికార, విపరీత, అసహ్య, నీచ చర్యతో పోల్చారు. ఇంత ఘోర నేరానికి పాల్పడిన వైనం మొత్తం సమాజ స్థితిపైనే ప్రభావం చూపిందన్నారు. శిక్ష ఖరారులో ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

నేర తీవ్రతే ప్రాతిపదిక...

'మద్యం మత్తులో నేరం చేశారు. (ఆ సమయంలో ముఖేశ్, పవన్ తాగి ఉన్నారు. బస్సును ముఖేశ్ నడిపాడు). వారివి నిరుపేద కుటుంబాలు. కుటుంబ సభ్యులకు వారి ఆసరా ఎంతో అవసరం. అందరూ యువకులు. బోలెడంత జీవితం ముందుంది. ఎలాంటి నేర చరిత్ర లేదు. మున్ముందు తమను తాము సంస్కరించుకునే అవకాశం ఉంది. ఉరి వద్దు... యావజ్జీవ శిక్షతో సరిపెట్టండి' అంటూ డిఫెన్స్ లాయర్ చేసిన వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలన్న వాదనతోనూ ఏకీభవించలేదు. వారిపట్ల జాలి చూపించేందుకు ఉన్న కారణాలకంటే... కఠినంగా శిక్షించాల్సిన కారణాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకించారు. 'నేర తీవ్రత ఆధారంగానే ఉరిశిక్ష ఉంటుంది. వయసు మినహాయింపు కాబోదు' అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే... శిక్షను ఖరారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి కేసుల్లోనే మహ్మద్ అజ్జల్ (మహారాష్ట్ర), అత్బీర్ (ఢిల్లీ), విక్రంసింగ్ (పంజాబ్), శివు (కర్ణాటక), జైకుమార్ (మధ్యప్రదేశ్), ధనుంజయ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)లకు విధించిన ఉరి శిక్షలను సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. వీరంతా యుక్తవయసులోనే ఉన్నారని తెలిపారు. నేర తీవ్రత ముందు మద్యం మత్తు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు ప్రాతిపదిక కాబోవంటూ సుప్రీం ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు.

ఎలాంటి నేర చరిత్ర లేకున్నా... తొలి నేరమే తీవ్రమైనదైనప్పుడు విధించిన ఉరి శిక్షలనూ సుప్రీం కోర్టు సమర్థించిందని జడ్జి తెలిపారు. "డిఫెన్స్ న్యాయవాది చెబుతున్నట్లుగా కేవలం నేరపూరిత కుట్రను దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షలు విధించలేదు. అన్నీ తెలిసీ చేసిన దుశ్చర్యలకే ఈ శిక్ష వేశాం'' అని స్పష్టం చేశారు. నేరం రు జువైనందున, కేవలం శిక్ష తీవ్రత తగ్గించుకునేందుకే ముఖేశ్ 'ఆ సమయంలో బస్సులో ఉన్నాను' అని అంగీకరించాడని... ఆ మాత్రానికే అతనిపై జాలి చూపాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి