September 20, 2013
హైదరాబాద్, సెప్టెంబరు 19: జగన్ అక్రమాస్తుల కేసులో మరో వ్యవహారం వెలుగుచూసింది. క్విడ్‌ప్రొకో విధానంతో పెట్టుబడుల ప్రవాహం సాగించే క్రమంలో ఒకరికి వండి, వడ్డించేందుకు మరొకరిని పస్తులుంచిన వైనాన్ని సీబీఐ బయటపెట్టింది. భారతీ సిమెంట్స్ వ్యవహారంపై ఇటీవల దాఖలైన చార్జిషీట్‌లో ఈ వివరాలు వెలుగు చూశాయి. అంబుజా సిమెంట్స్‌కు దక్కాల్సిన సున్నపురాతి గనులను జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్ (అప్పట్లో రఘురాం సిమెంట్స్)కు కట్టబెట్టారని సీబీఐ స్పష్టం చేసింది. కడప జిల్లా ఎర్రగుంట్లలో సున్నపురాతి గనుల కోసం గుజరాత్‌కు చెందిన అంబుజా ముందుగానే దరఖాస్తు చేసుకుందని తెలిపింది. భారతీ సిమెంట్స్‌కు సరస్వతి పవర్ 'డమ్మీ' అని పేర్కొంది.
ఈ రెండు కంపెనీలు ఒకేసారి దరఖాస్తు చేయడం.. ఒకే కార్యాలయానికి లేఖలు పంపడం.. దాని ఆధారంగా సర్వే చేయాలంటూ కడప జిల్లా మైనింగ్ అధికారులకు కూడా ఒకేసారి దర ఖాస్తు పంపడాన్ని ప్రస్తావించింది. ఒకే సంస్థ దరఖాస్తు చేసి, అదే సంస్థకు గనులు లీజుకు ఇస్తే అనుమానాలు వస్తాయనే.. ముందు జాగ్రత్తతో రఘురాం సిమెంట్స్ ప్రతినిధులు, జగన్ కలిసి అధికారులతో కుమ్మక్కై తమకే చెందిన సరస్వతి పవర్ సంస్థతో కూడా దరఖాస్తు చేయించి కథ నడిపారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు మైనింగ్ అధికారి కృపానందం తన వంతు సహకారం అందించినట్లు దర్యాప్తులో తేలిందని వివరించింది.
"రఘురాం సిమెంట్స్ తరఫున జేజే రెడ్డి దరఖాస్తు చలానా కోసం రూ. 3500లు డిపాజిట్ చేయగా.. ముందుగా అనుకున్నట్లే అదే తేదీన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున పీబీ రెడ్డి నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేశారు. అలాగే, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం టి.సుంకేసుల గ్రామంలో సున్నపురాతి గనులున్న 2037.52 ఎకరాలను తమకు లీజుకు ఇవ్వాలని ఈ రెండు సంస్థలు ఒకేసారి కడప అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అండ్ జియాలజీ కార్యాలయానికి దరఖాస్తులు పంపాయి. అవి ఒకే తేదీన ఆ కార్యాలయానికి చేరాయి. సాధారణంగా ఇలాంటి దరఖాస్తులు వస్తే ముందుగా ఏది అందిందో రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
కానీ, ఏడీఎంజీ అధికారులు ఆ పని చేయలేదు. చివరికి రఘురాం సిమెంట్స్‌కు లీజు ఇవ్వడానికి అభ్యంతరం లేదంటూ రాష్ట్ర కార్యాలయానికి సిఫారసు చేశారు. సరస్వతీ పవర్ అభ్యర్థనను తిరస్కరించాలని సూచించారు. రఘురాం సిమెంట్స్ ప్రతినిధిగా లీజు కోసం దరఖాస్తు చేసిన జేజే రెడ్డి.. సరస్వతి పవర్ తరఫున కూడా పనిచేసి డబుల్ రోల్ పోషించారు'' అని సీబీఐ పేర్కొంది. 'మరో విశేషమేమిటంటే.. రెండు సంస్థల దరఖాస్తులపై జేజే రెడ్డి ఒక్కరే సంతకం చేశారు. రెండు దరఖాస్తులను ఆయనే కడప ఏడీఎంజీ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందించార'ని చార్జిషీట్‌లో వివరించింది. ఒకే గని కోసం ఒకేసారి రెండు సంస్థలు ఎలా దరఖాస్తు చేస్తాయన్న అనుమానాన్ని సీబీఐ వ్యక్తం చేసింది.
'నిజానికి 2000-02 మధ్య అంబుజా సిమెంట్స్ ఈ గనులపై ప్రాస్పెక్టివ్ లైసెన్స్ పొందింది. దీంతో దాదాపు రూ. 2.90 కోట్లు వెచ్చించి ఖనిజాన్వేషణ జరిపింది. తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో గడువు పెంచాలని అంబుజా సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అందుకు నిరాకరించిన సర్కారు.. ఆ గనులపై రఘురాం సిమెంట్స్‌కు ఏకంగా మైనింగ్ లీజులు కట్టబెట్టింది' అని దర్యాప్తు సంస్థ వివరించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఏ సంస్థ అయినా మొదట ప్రాస్పెక్టివ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా రఘురాం, సరస్వతి కంపెనీలు మాత్రం ఏకంగా మైనింగ్ లీజు కోసం దరఖాస్తు చేశాయని, నిబంధనల ప్రకారం వాటి దరఖాస్తులే చెల్లవని చెప్పింది.
సాంకేతికంగా అవి రెండు వేర్వేరు దరఖాస్తులుగా కనపడినా.. ఆధారాల ప్రకారం ఆ రెండు ఒకటేనని సీబీఐ తెలిపింది. కాగా, రఘురాం సిమెంట్స్ దరఖాస్తు చేసిన గని ఉన్న ప్రాంతం భౌగోళికంగా కీలక ప్రదేశంలో ఉందని సీబీఐ వెల్లడించింది. అక్కడ 140 మిలియన్ టన్నుల సున్నపురాతి నిక్షేపాలు ఉన్నాయని, ఆ ప్రాంతం రవాణాకు అంటే ఇటు రైల్వేకు, అటు స్టేట్ హైవేకు దగ్గరగా ఉందని, అక్కడ వ్యవసాయం లేనందున ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ సులువేనని చార్జిషీట్‌లో పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి