15, సెప్టెంబర్ 2013, ఆదివారం

మారణకాండ !


September 15, 2013


ముజఫర్‌నగర్, సెప్టెంబర్ 14: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో కొద్ది రోజులుగా మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. పక్కనున్న షామ్లీ జిల్లాకూ ఇవి విస్తరించాయి. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన మృతుల సంఖ్య 45 కాగా, మారణకాండలో కనుమరుగైన వారి సంఖ్య వేలల్లో ఉంది. బాధితుల్లో ఒకరైన 24 ఏళ్ల సత్యేందర్‌కుమార్ బలియాన్ ప్రస్తుతం అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టాడు. 'గత వారం ఇక్కడి కవాల్ గ్రామ శివార్లలో జాట్ వర్గాల సమావేశంలో 2 వేల మంది వరకు స్థానికులు పాల్గొన్నారు. తిరిగి ఇళ్లకు వెళుతుండగా కొందరు దాడిచేశారు. ఏకే-47వంటి అత్యాధునిక ఆయుధాలున్నాయి. పిట్టలను కాల్చినట్టు కాల్చారు. మృతదేహాలను పక్కనే ఉన్న జాల్లీ కెనాల్‌లో పడేశారు. చాలామంది ఇప్పటికీ కనిపించడం లేదు. కాలువలో ఆరు మృతదేహాలే లభించాయి' అని బలియాన్ వివరించాడు. ఇలాంటి అనేక కథనాలు వెలుగుచూస్తున్నాయి.


గత నెల 27న ఈ గొడవలు మొదలయ్యాయి. ముజఫర్‌నగర్ జిల్లాలోని కవాల్ గ్రామం ఈ ఘర్షణలకు కేంద్ర బిందువైంది. గ్రామంలోని జాట్ వర్గానికి చెందిన ఓ అమ్మాయిని కొందరు ముస్లిం యువకులు వేధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అమ్మాయి సోదరులు సచిన్ సింగ్, గౌరవ్ సింగ్ రగిలిపోయారు. అదే ఆవేశంతో షానవాజ్ ఖురేషి అనే యువకుణ్ని హతమార్చారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ముస్లిం వర్గానికి చెందిన కొందరు సచిన్, గౌరవ్‌పై దాడిచేసి చంపేశారు. పోలీసులు మాత్రం ఖురేషి హత్యకేసులో అమ్మాయి కుటుంబ సభ్యులందరినీ(11మందిని) అరెస్ట్ చేశారు. కానీ ఆమె సోదరుల హత్య విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ ఉదంతంతో స్థానికంగా ఇరు వర్గాలు రగిలిపోయాయి. రెండు రోజులతర్వాత ఒక్కసారిగా పరస్పర దాడులకు దిగాయి.

ఈ అల్లర్లపై విచారణకు యూపీ ప్రభుత్వం ఈ నెల 9న ఏక సభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి విష్ణు సహాయ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగనుంది. రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ పరిస్థితిని ఆదిలోనే అదుపుచేయడంలో విఫలమైన ఐదుగురు సీనియర్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఘర్షణలను నివారించడంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కేబినెట్ సహచరుడు ఆజం ఖాన్‌ను బుజ్జగించడానికి సీఎం అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. విపక్షాల మత రాజకీయాల వల్లే ఈ అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ధ్వజమెత్తింది. ముజఫర్‌నగర్ ఘర్షణలను ప్రమాద ఘంటికలుగా సీపీఎం అభివర్ణించింది. మోదీ అనుచరుడు అమిత్‌షా యూపీలో పార్టీకి సారథ్యం వహించగానే మత ఘర్షణలు మొదలయ్యాయని, ఇది ఆరంభం మాత్రమేనని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీతో ఎస్పీ కుమ్మక్కైందని ఆరోపించింది. ఇక దేశాన్ని, మహిళలను, ఆవులను రక్షించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని బీజేపీ కొత్త నినాదాన్ని ఎత్తుకుంది.

కవాల్‌లో హత్యలు జరగ్గానే రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నేతలు ఇరువర్గాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం జోరుగా సాగింది. పాక్‌లో మత ఘర్షణల తాలూకు వీడియో, రెచ్చగొట్టే శీర్షికలను జత చేసిన మీడియా కథనాల క్లిప్పింగులు, మృతుల సంఖ్యపై తప్పుడు వివరాలు ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా వ్యాపించాయి. జిల్లావ్యాప్తంగా ఇరువర్గాల మధ్య దాడులు పెరగడానికి ఇవి దోహదం చేశాయి. అవన్నీ తప్పుడు కథనాలని, ఆ వీడియోలు మన దేశంలో జరిగిన ఘటనలకు సంబంధించినవి కావని పోలీసులు పదేపదే ప్రకటించారు. నెట్‌లో సదరు వీడియోలను నిషేధించారు.

కవాల్‌లో జరిగిన ఘటన ముజఫర్‌నగర్ జిల్లా అంతటా సంచలనం సృష్టించింది. రెండు వారాలపాటు అక్కడక్కడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ వచ్చాయి. కానీ ఈ నెల 7న తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐబీఎన్7 చానల్‌కు చెందిన ఓ రిపోర్టర్, ఫొటోగ్రాఫర్ కూడా ఈ దాడుల్లో మరణించారు. వెయ్యి మంది సైన్యాన్ని రంగంలోకి దించారు. సుమారు పది వేలమంది సాయుధ పోలీసులు, 1300 మంది సీఆర్‌పీఎఫ్, 1200 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లను కూడా రంగంలోకి దిగారు. సుమారు 12 వేల మందిని అరెస్టు చేశారు. పలు కేసులు నమోదయ్యాయి. రెండు వేల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2300 ఆయుధ లైసెన్సులను రద్దు చేశారు. దాడుల్లో సుమారు 43 వేలమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది పునరావాస శిబిరాల్లో వేలాదిమంది తలదాచుకుంటుకున్నారు. కొన్ని గ్రామాల నుంచి ఒక వర్గమంతా వలసబాట పట్టింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి