15, సెప్టెంబర్ 2013, ఆదివారం

జేపీకి సెగలు


September 15, 2013


(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలనూ పరిరక్షిస్తూ.. ప్రస్తుత సంక్షోభానికి సామరస్య పరిష్కారం సాధించే లక్ష్యంతో 'తెలుగు తేజం' యాత్ర చేపట్టిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది! ఆయన యాత్ర ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రల్లో ఏకకాలంలో వివాదాస్పదమైంది. సీమాంధ్రలోని ఉద్యోగ సంఘాలు.. తెలంగాణ నేతలు జేపీ వైఖరిపై మండిపడ్డారు. తెలుగుతల్లి విగ్రహం వద్దనే యాత్రకు శ్రీకారం చుట్టి, తెలుగు తల్లికి పూలమాల వేయకపోవడాన్ని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. జై సమైక్యాంధ్ర అనాలని డిమాండ్ చేశారు. ఇక సీమాంధ్రలో జేపీ యాత్రను టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తప్పుబట్టారు. నల్లగొండజిల్లా మోత్కూరులో టీఆర్ఎస్ సర్పంచుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. లంకలో పుట్టిన వారంతా రాక్షసులే.

ఆంధ్రా నాయకుల కన్నంతా సీమాంధ్రవైపే అని కేసీఆర్ చెప్పినట్టు.. చంద్రబాబు, విజయలక్ష్మి, చివరకు జయప్రకాశ్ నారాయణ్ కూడా ఇప్పుడు ఆంధ్రా ఉద్యమానికి అండగా వెళ్లారని విమర్శించారు. అయితే, జేపీపై రెండు ప్రాంతాల్లోనూ దుష్ప్రచారం చేయడం దారుణమని లోక్‌సత్తా ఉపాధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో తెలుగు తేజం సభలో కొందరు అలజడి సృష్టించడం, అదే సమయంలో జేపీ వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు వక్రభాష్యం చెప్పడాన్ని ఆయన ఖండించారు. విభజన ప్రక్రియలో హైదరాబాద్ కంటే రాయలసీమ భవిష్యత్తు ప్రధానమని, రాయలసీమ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. లోక్‌సత్తా ఆధ్వర్యంలో 'తెలుగు తేజం' పేరిట సీమాంధ్రలో చేపట్టిన యాత్రను కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద శనివారం ఆయన ప్రారంభించారు.

అంతకుముందు మాంటిస్సోరి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేపీ మాట్లాడారు. "నిరసనలు తెలపడం సమంజసమే. కానీ, బంద్‌లు చేయడం సరికాదు. ముఖం మీద కోపంతో ముక్కు కోసుకుంటామా?'' అని వ్యాఖ్యానించారు. అందరి ప్రయోజనాల కోసం ఢిల్లీపై దండెత్తాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి రాజకీయ పార్టీలు ఆడిన వికృత రాజకీయమే కారణమన్నారు. "తెలంగాణ ప్రజాప్రతినిధులు వద్దంటున్నా వినకుండా 2000లో నాటి సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదన లేవనెత్తారు. ఈ డిమాండ్‌తో అధికార టీడీపీని దెబ్బ కొట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అదే దృష్టితో 2004లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆనాటి కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు కేవలం కాంగ్రెస్ అధికారంలోకి రావటమే లక్ష్యంగా వ్యవహరించారే తప్ప పర్యవసానాల గురించి ఆలోచించలేదు.

2009లో అధికారంలో రావడానికి టీడీపీ కూడా అదే రీతిలో తెలంగాణ అంశాన్ని ఉపయోగించుకుని టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంది'' అని వివరించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వచ్చే అవకాశం కనిపించటం లేదని, కనీసం తెలంగాణలోనైనా కాసిన్ని ఓట్లు, సీట్లు దండుకుందామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసింది తప్పితే.. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండి కాదని విమర్శించారు. విభజన ప్రకటన చేసేటప్పుడు అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలన్న కనీస పరిజ్ఞానం కూడా కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. సీమ ప్రాంతానికి పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో మరో సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. నీటి విభజన న్యాయంగా జరగాలని, రాయలసీమకు ప్రధానంగా నికర జలాలను మళ్లించాలని చెప్పారు.


కర్నూలులోనే జయప్రకాశ్ నారాయణ్‌కు సమైక్య సెగ తగిలింది. వాస్తవానికి, ఆయన తన తెలుగు తేజం యాత్రను తెలుగు తల్లి విగ్రహంవద్దనుంచే ప్రారంభించారు. అయితే, తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేయకపోవడంతోపాటు నిరసనలు మాత్రమే తెలుపుకోవాలని, బంద్‌లు చేయడం తప్పని వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రసంగాన్ని ఆపకపోవడంతో లౌడ్ స్పీకర్ కనెక్షన్ తొలగించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేయాలని పట్టుబట్టారు. దీంతో సభ తర్వాత జరగాల్సిన రోడ్ షోను రద్దు చేసుకున్న జేపీ, ప్రభుత్వ అతిథిగృహానికి వెళ్లిపోయారు. సమైక్యాంధ్ర నేతలు అక్కడికి వెళ్లి జేపీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు తేజం పేరుతో యాత్రలు చేస్తూ తెలుగు తల్లిని గౌరవించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణవాదులు సమ్మెలు చేసినప్పుడు జేపీకి తప్పని గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. రాత్రయినా అతిథి గృహం వద్దే బైఠాయించి నిరసన కొనసాగించారు.



మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలనే యాత్ర చేస్తున్నానని జేపీ చెప్పారు. అనంతరం అతిథి గృహంలోనే ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో ఒక మాట, కరీంనగర్‌లో ఒక మాట, అనంతపురంలో ఒక మాట, ఆదిలాబాద్‌లో ఒక మాటా చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని తాను రాలేదన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యాత్ర చేస్తానన్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె చేసినప్పుడు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని చెప్పానని గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే విభజనపై ఆలోచించాలని తాను స్పష్టం చేశానని, అయినా తన మాటను ఏ రాజకీయ పార్టీ వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి