19, సెప్టెంబర్ 2013, గురువారం

సత్యవాణి ఎగసాయమేంటో!


9/19/2013 7:17:47 AM
-సర్కారు భూమి.. సర్వం సమర్పయామీ!
-ఎకరా 20 గుంటలకు జీపీఏ.. ఏడెకరాల్లో సాగు
- ఆక్రమించేసి.. క్రమబద్ధీకరణ దరఖాస్తులు
- వాల్టా చట్టం బుట్టదాఖలు చేస్తూ జోరుగా నీటి దందా
- వెలుగు చూస్తున్న సత్యవాణి కబ్జా కోణాలు

sathyavaniహైదరాబాద్ సెప్టెంబర్ 18 (టీ మీడియా):పేదోడు నివాసం ఉండేందుకు సర్కారు స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే మందీమార్బలంతో, బుల్డోజర్లతో వచ్చి గుడిసెను తొలగించే అధికారులు.. ఒక వ్యక్తి.. అనేక మంది సహకారంతో ఎకరాల కొద్దీ సర్కారు భూమిని కబ్జాపెడుతుంటే కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి నగర శివార్లో కనిపిస్తోంది. సాక్షాత్తూ దేవుడి బిడ్డనని చెప్పుకొనే గొట్టిపాటి సత్యవాణి భూ దందాపై అనేక ఫిర్యాదులు వచ్చినా అధికార యంత్రాంగం చలించడం లేదని అరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను పరిశీలిస్తే అనేక కబ్జా కథలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను బై సర్వే నంబర్లతో అమాయకులకు అమ్మి మోసం చేస్తున్న వైనం కూడా తాజాగా బయటపడింది. ఇలా ఇళ్ల స్థలాలు కొన్నవారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాను ప్రభుత్వ భూములేవీ కబ్జా చేయలేదని సత్యవాణి చెబుతున్నా.. అదంతా అసత్యమేనని ఆమె పెట్టుకున్న క్రమబద్ధీకరణ దరఖాస్తులతో తేలిపోతున్నది. 2010లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సత్యవాణి 8 క్రమబద్ధీకరణ దరఖాస్తులు పెట్టకున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు పెట్టినవిగా స్పష్టమవుతోంది. తన వ్యవసాయ క్షేత్రంలోనూ సత్యవాణి ప్రభుత్వ భూమిని తనకు సాధ్యమైనంత మేరకు సాగు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎలాంటి సరిహద్దులు లేకుండా ధర్మపురిక్షేత్రంలోనూ, వ్యవసాయ క్షేత్రంలోనూ సత్యవాణి అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని స్థానికులు అంటున్నారు.

templeఎకరం జీపీఏ.. ఏడెకరాల్లో సాగు
మియాపూర్ దీప్తిశ్రీనగర్‌కు ఆనుకుని 100, 101 సర్వే నంబర్లతో సర్కారు భూమి ఉంది. ఈ భూమిలోనే గాంధీరెడ్డి నుంచి 1.20ఎకరాల భూమిని సత్యవాణి జీపీఏ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ భూమిలో సత్యవాణి అనుచరులు వ్యవసాయం చేస్తున్నారు. కానీ.. ఆ భూమి విస్తీర్ణం చూస్తే అంతకుమించి కనిపిస్తుంది. ఆ వ్యవసాయ భూమి విస్తీర్ణం కనీసం ఏడు ఎకరాలకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్షేత్రంలో ప్రస్తుతం వరి, చిక్కుడుకాయ, మిరప పంటలను పండిస్తున్నారు. స్థానికంగా తిరుమలయ్య అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్ర బాధ్యతలు చూస్తున్నారని తెలిసింది. ఇందుకుగాను తిరుమలయ్యకు ఆలయ ప్రాంగణంలో 200 గజాల స్థలాన్ని బహుమతిగా ఇస్తానని సత్యవాణి హామీ ఇచ్చినట్లు సమాచారం. ధర్మపురి క్షేత్రానికి కిలోమీటర్ మీటర్ దూరంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం ఇతరులకు కనిపించే ప్రసక్తే లేదు. దట్టమైన అరణ్యాన్ని పోలి ఉండే స్థలంలో ఈ భూ భాగోతం కొనసాగుతోంది. ధర్మపురి క్షేత్రం నుండి బయలుదేరిన తరువాత వచ్చే మియాపూర్ డంప్‌ను దాటుకుని ఎవరూ వెళ్లలేని రీతిలో ఉండే రోడ్డులో వెళ్తే సత్యవాణి వ్యవసాయం క్షేత్రం బయటపడుతుంది.

matatempleవాల్టా చటాన్ని తుంగలో తొక్కి..
వ్యవసాయం ముసుగులో అక్రమంగా నీటి వ్యాపారాన్ని సైతం సత్యవాణి కొనసాగిస్తున్నారు. పంటల సాగు కోసమనే వంక చూపుతూ లెక్కకు మించిన బోర్లు వేసి ఆ నీళ్లతో వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవసాయ క్షేత్రం చుట్టూ వందల ఎకరాల స్థలంలో నిర్మాణాలంటూ లేకపోవడంతో ఇక్కడ వేసిన నాలుగు బోర్లలో నీరు పుష్కలంగా లభిస్తోంది. దీంతో భూగర్భ జలాలను జుర్రుకుంటూ పరిసర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారన్న అరోపణలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి జూలై వరకు నీటి వ్యాపారం భారీ స్థాయిలో ఉంటుందని, స్థానిక వాటర్ ట్యాంకర్ల యజమానులు అను నిత్యం వందల ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి సుదూర ప్రాంతాలకు తరలిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో ట్యాంకర్ భర్తీ చేసేందుకు రూ.80 నుంచి రూ.100 వసూలు చేస్తుంటారు.

వేసవిలో ఈ రేటు ఇంతకు రెండింతలవుతుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఇక్కడి నుంచి పెద్ద స్థాయిలో నీటి సరఫరా జరుగుతుందని చెబుతున్నారు. సీజన్‌లో తక్కువలో తక్కువ 300 ట్రిప్పుల నీటిని తరలించినా.. నెలకు దాదాపు రూ.10 లక్షలకు పైగా వ్యాపారం! అంటే ఏటా జరిగే వ్యాపారం కోటిపైనేన్నమాట. ఈ ఆదాయం నుంచి స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు మామూళ్లు సైతం వెళ్తుంటాయనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కినా అందుకే ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఇటుకల తయారీ వ్యాపారం జోరుగా కొనసాగింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడం, పెరుగుతున్న ధరల కారణంగా తగ్గిన నిర్మాణాల దృష్ట్యా ఇటుకల తయారీ లాభసాటి కాదని, తాగునీటిని అందించడంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఎలాగూ నాలుగు బోర్లు ఉండటంతో అక్కడే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. రోజువారీ అవసరాల కోసం సామాన్యులు సైతం మినరల్ వాటర్‌ను వాడుతుండటంతో సత్యవాణి మినరల్ వాటర్ ప్లాంట్‌కు భలే గిరాకీ తగిలింది. ఒకవైపు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మియాపూర్ సర్వే నంబర్ 100, 101లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేస్తే ఇక్కడ సత్యవాణి మాత్రం అందుకు భిన్నంగా రోజుకో వ్యాపారానికి శ్రీకారం చుడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

cement
ప్రస్తుతం సత్యవాణి నడిపిస్తున్న ధర్మపురి క్షేత్రం 101 సర్వే నంబర్‌లో ఉంది. ఇందులో ఐదెకరాలను టెంపుల్ ల్యాండ్‌గా గుర్తించారు. కానీ ప్రస్తుతం ఉన్న ధర్మపురి క్షేత్రం కనుచూపు మేరలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలూ దాతలు కట్టించినవే. సత్యవాణి కట్టించింది కేవలం ఒక్కటి మాత్రమే. సత్యవాణి ఈ స్థలంలోకి రంగప్రవేశం చేసినప్పుడు చిన్న దుర్గాదేవి గుడి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆ గుడిని ఆధారం చేసుకుని మియాపూర్ స్థలాలను కబ్జా పెట్టేందుకు నాలుగైదు సొసైటీలు కలిసి పన్నిన కుట్రే ధర్మపురి క్షేత్రమని వారు ఆరోపిస్తున్నారు. సత్యవాణి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న స్థలం, ధర్మపురి ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని ఏపీల్యాండ్ గ్రాబింగ్ కోర్టు తేల్చింది. ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు తేల్చిన తరువాత కావాలని పలు సొసైటీలు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఇందులో సత్యవాణిదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. సత్యవాణి 101లోని స్థలాన్ని మొత్తం తన పేరున ఉన్న దీప్తిశ్రీనగర్ హౌసింగ్ సొసైటీ కిందకు మార్చుకునే క్రమంలోనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సత్యవాణి కనుసన్నల్లోని కొందరు 101లోని స్థలాన్ని పలువురికి బై నంబర్ 150 ద్వారా ఇప్పటికే అమ్మకాలు కూడా చేశారు. సత్యవాణి తన అనుచరులతో చేయించిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. తమను మోసం చేసి దీప్తిశ్రీనగర్ హౌసింగ్ సొసైటీ వ్యక్తులు ఆ స్థలాలు అమ్మారని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఈ సొసైటీకి అధ్యక్షురాలిగా రెండు దశాబ్దాలుగా కొనసాతున్న సత్యవాణి తన వారితోనే కమిటీ వేశారన్న విమర్శ ఉంది. ఆ కమిటీలోనివారే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ముగిస్తున్నారని సమాచారం.


తాను ఆక్రమించిన స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు సత్యవాణి దరఖాస్తులు పెట్టుకున్నారు. 31-03-2010లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక నోటీసును విడుదల చేశారు. ఇందులో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్‌లోని ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పేర్కొన్నారు. ఇందులో సత్యవాణి, ఆమె అధ్యక్షురాలిగా ఉన్న దీప్తిశ్రీ నగర్ హౌసింగ్ సొసైటీ పేర్లు 73, 74, 109, 110, 115,116, 121, 122 నంబర్ల సత్యవాణి భూమికి సంబంధించి ఉన్నాయి. సత్యవాణి ఆక్రమించినది ప్రభుత్వ భూమే అనడానికి ఈ ఒక్క ఆధారమే చాలునని పలువురు అంటున్నారు. ఇవి ఆక్రమించిన స్థలాలు కాకపోతే.. వాటిని క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవుడు చెబితేనే గుడులు కట్టానని చెబుతున్న సత్యవాణికి ప్రభుత్వ స్థలాల్లో గుడుల కట్టాలని దేవుడే చెప్పాడా? అని మియాపూర్ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నగర శివారులో గజం రూ.45వేల నుండి రూ.60వేల వరకు పలుకుతున్న సమయంలో సత్యవాణి భూ దందా ఎకరాల్లో సాగుతోందని స్పష్టమవుతోందని వారు తేల్చి చెబుతున్నారు.

satyalandధర్మపురి గుడులన్నీ దాతలు కట్టించినవే
ధర్మపురి క్షేత్రంలో ప్రస్తుతం వెంక లక్ష్మిదేవి, గోవిందరాజులు, అయ్యప్ప దేవాలయం, శివాలయం, నాంపల్లిబాబా ట్రస్టు, సాయిబాబా దేవాలయం, సర్వస్వతి దేవాలయాలు, ధ్యాన మందిరం ఉన్నాయి. వీటిలో కేవలం సత్యవాణి కట్టించింది విజయదుర్గాదేవి ఆలయాన్నే. అయితే సత్యవాణి 101 సర్వే నంబర్‌లోకి వచ్చినప్పుడు ఆ స్థలంలో చిన్నగా దుర్గమ్మ దేవాలయం ఉండేది. ఆ ఆలయాన్ని వెనక్కి నెట్టి.. దాని లోపలికి కూడా వెళ్లడానికి అవకాశం లేనంత సందు ఇచ్చి, విజయదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. పూర్వం తెలంగాణ ప్రజలు కట్టుకున్న దుర్గాదేవి ఆలయాన్ని పూర్తిగా మాయం చేసే కుట్రలో భాగంగానే హంగులతో చిన్నపాటి విజయదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆలయంలోని ప్రతి గుడికీ హుండీలు ఉంటాయి. వాటిని నెలకు ఒకసారి తెరుస్తారు. వీటిలో ఎంత సొమ్ము వచ్చిందనే వివరాలు కేవలం సత్యవాణికే తెలుస్తాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి గురువారం, శనివారం మాత్రమే వచ్చే సత్యవాణి అక్కడి కార్యకలాపాలను మొత్తం యూసుఫ్‌గూడ చౌరస్తాలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని తన నివాసం నుంచి నడిపిస్తారని ఈ వ్యవహారాలు తెలిసినవారు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి