24, సెప్టెంబర్ 2013, మంగళవారం

అంతా అపసవ్యమే (సంపాదకీయం)


September 24, 2013
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారం రోజుకో సంచలనంతో క్రీడాభిమానుల్ని నివ్వెరపరుస్తోంది. ఈ బెట్టింగ్, ఫిక్సింగ్ కుంభకోణంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ లీగ్... ఆరంభించినప్పటినుంచీ ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఏదో ఒక రగడతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. సంప్రదాయ క్రికెట్‌ను సర్వనాశనం చేసేదిశగా సాగుతున్న ఈ టీ-20 లీగ్ అంతా అపసవ్యమే. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చవాన్‌లతోపాటు ఇంకా దొరకని దొంగలు ఎందరో ఉన్నారు. వారికోసం వేట సాగుతోంది.
తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో విస్తుగొలిపే అనేక విషయాలున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ సొంత జట్టుపైనే బెట్టింగ్‌లు నిర్వహించేవాడంటూ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మళ్లీ బీసీసీఐ అధ్యక్షుడిగా వెలిగిపోవాలని ఆరాటపడుతున్న శ్రీనివాసన్‌కు తాజా చార్జ్‌షీట్ పెద్ద విఘాతమే. బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌తో కలిసి మేయప్పన్ వెలగబెట్టిన బెట్టింగ్ నిర్వాకం మామూలు స్థాయిలో జరగలేదని అర్ధమవుతోంది. మే 12న చెన్నై-రాజస్థాన్, 14న చెన్నై-ఢిల్లీ జట్ల మ్యాచ్‌లకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని మేయప్పన్ విందూకు అందజేశాడు. తమ జట్టు రాజస్థాన్‌పై ఓడిపోతుందని, ఢిల్లీపై గెలుస్తుందని అతనికి చేరవేశాడట. మేయప్పన్‌పై పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌లో ఇలాంటి అనేక విషయాలు వెలుగుచూశాయి. కుట్ర, ఫోర్జరీ, మోసానికి పాల్పడ్డందుకుగాను పోలీసులు మేయప్పన్‌తోపాటు మరో 20 మందిపై అభియోగాలు మోపారు. 11,500 పేజీల ఈ చార్జ్‌షీట్‌లో 15 మంది బుకీలు, ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసిన పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్‌ల పేర్లు కూడా ఉన్నాయి.

బుకీలనుంచి భారీగా బహుమతులు అందుకోవడంతోపాటు తాను అంపైరింగ్ చేసే మ్యాచ్‌లపై రవూఫ్ బెట్టింగ్ కాసేవాడు. దీనికి సంబంధించి కూడా పోలీసులు బలమైన సాక్ష్యాలు సంపాదించారు.
ఈ ఏడాది మే నెలలో బుకీలు రమేశ్ వ్యాస్, అశోక్ వ్యాస్‌లను అరెస్టు చేయడంతో బట్టబయలైన ఈ బెట్టింగ్, ఫిక్సింగ్ రగడ అంతూదరీ లేకుండా సాగుతూనే ఉంది. విచారణలో భాగంగా విందూ దారాసింగ్ పాత్ర బట్టబయలైంది. మేయప్పన్-విందూల అనుబంధం, బెట్టింగ్ వ్యవహారంలో వీరిద్దరూ ఎలా సంప్రదింపులు జరిపేవారు... తదితర ఫోన్ సంభాషణల్ని పోలీసులు దొరకబుచ్చుకున్నారు. తమ చెన్నై జట్టు ఎప్పుడెలా ఆడుతుంది, ఎన్ని పరుగులు చేయబోతోంది, ఏ ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు, జట్టు కూర్పు, తుది జట్టులో ఎవరెవరు ఆడబోతున్నారు... వంటి విషయాలను మేయప్పన్.. విందూ దారాసింగ్‌కు అందజేసినట్టుగా తమ వద్ద సాక్ష్యాలున్నాయని క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. మేయప్పన్ నుంచి జట్టుకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న వెంటనే విందూ సింగ్ దాన్ని పవన్ జైపూర్, సంజయ్ జైపూర్, జూపిటర్.. తదితర బుకీలకు అందించి బెట్టింగ్‌లు కాయమని చెప్పేవాడట. చార్జ్‌షీట్‌లో పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌లు, సిమ్‌కార్డుల వివరాల్ని కూడా పొందుపరిచారు.

ఇదిలావుంటే ఫిక్సింగ్‌కు సంబంధించి తాజాగా మరో సంచలన కథనం వెలుగుచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఐపీఎల్-6లో భాగంగా ఏప్రిల్ 17న పుణె వారియర్స్‌తో మ్యాచ్ ఆరుకోట్లకు ఫిక్సయింద ని, దీనికి నలుగురు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సహకరించారని చార్జ్‌షీట్‌లో పోలీసులు కోర్టుకు తెలిపారట. హనుమ విహారి, ఆశీష్ రెడ్డి, తిసార పెరెరా, కరణ్ శర్మల సహకారంతో మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ చంద్రేష్ శివ్‌లాల్ పటేల్ అనే బుకీ పోలీసులకు వెల్లడించినట్టుగా చెబుతున్న విషయాలు నివ్వెరపరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న తెలుగు కుర్రాళ్లు హనుమ విహారి, ఆశీష్ రెడ్డిలపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చంద్రేష్‌ను గతంలోనే అరెస్టు చేసిన పోలీసులు అతనినుంచి ఈ సమాచారాన్ని రాబట్టారు. ఆ మ్యాచ్‌లోని తొలి 10 ఓవర్లలో ఎన్ని పరుగులు చేయాలి, తర్వాతి 10 ఓవర్లలో ఎలా ఆడాలనే విషయాలమీద బుకీలకు-ఆటగాళ్లకు మధ్య ఆరు కోట్లకు ఓ ఒప్పందం కుదిరిందట. అయితే ఏం జరిగిందో ఏమోగానీ అనుకున్నట్టుగా జరగలేదు. ఒప్పందం ప్రకారం ఓడిపోవాల్సిన హైదరాబాద్ గెలిచింది. దీంతో బుకీలు భారీగా నష్టపోయారన్నది తాజా కథనం.

డబ్బుకు ఆశపడి మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఆటగాళ్లకు ఎలాంటి శిక్షలు పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. భారత్‌నుంచి ఐదుగురు ఆటగాళ్లతో కలిపి ఇప్పటిదాకా 16మంది అంతర్జాతీయ ఆటగాళ్లు శిక్షలకు గురయ్యారు. అలాగే మరో 11 మంది దేశవాళీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇన్ని చూస్తున్నా యువ ఆటగాళ్లలో మార్పు రావడంలేదు. కొద్దికాలం వక్రమార్గంలో పయనిస్తే జీవితమంతా ఆ డబ్బుతో సుఖంగా ఉండవచ్చన్న చెడు ఆలోచనలనుంచి ఆటగాళ్లు ఇకనైనా మేల్కొనాలి. బుకీలతో చేతులు కలపడంవల్ల తమ కెరీర్‌ను నాశనం చేసుకోవడంతోపాటు, ఉన్న ఊళ్లో, రాష్ట్రంలో అప్రతిష్ఠపాలై తలదించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఉన్నత జీవితాన్ని చేజేతులా బలిచేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, క్రికెట్ బోర్డులు బెట్టింగ్ రాయుళ్లకు శిక్షలు విధించడం కంటే ముందు అసలు ఈ మాఫియాను నిరోధించే దిశగా కఠిన చట్టాలు తీసుకురావాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి