17, సెప్టెంబర్ 2013, మంగళవారం

నాటి సైనికచర్య ఉద్దేశం వెనుక...!


రజాకార్లు పాల్పడుతున్న ఆగడాల నుంచి ప్రజలను కాపాడే పేరుతో ఢిల్లీలోని ఆనాటి కాంగ్రెస్ పాలకులు 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంలోకి యాభైవేల మంది సైన్యాన్ని పంపారు. ఐక్యరాజ్య సమితిలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ మిలటరీ చర్యకు ‘పోలీస్ యాక్షన్’ అని పేరు పెట్టారు. 1947 సెప్టెంబర్‌లో నిజాం సంస్థానంలో ప్రారంభమైన సాయుధ పోరాటం 1948 సెప్టెంబర్ నాటికి బలపడింది. సాధ్యమైనంత వరకు స్వాతంవూత్యాన్ని, అదనపు సౌకర్యాలను పొందడం కోసం నిజాంరాజు బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్ల ద్వారా యూనియన్ ప్రభుత్వంతో మంతనాలు జరిపించాడు. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ అనే ఇంగ్లిషు పుస్తకంలో, నిజాం నవాబు చేసిన ఈ ప్రయత్నాల గురించి ఆ రచయితలు (లారీ కాలి న్స్, డొమినిక్ లాపియర్- ఇరువురు ఐరోపాకు చెందిన వారే) వివరించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా దాని కోసం ప్రయత్నించింది. అయితే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం ముందకు పోవడంతో, బ్రిటిష్ వారు కూడా ఈ సంస్థానం స్వతంవూతంగా ఉండలేదనే అంచనాకు వచ్చారు. స్వతంవూతంగా ఉంచడమంటే, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం ముందుకుపోయి హైదరాబాద్ సంస్థానం చేతిలో లేకుండా పోతుందని వారు గ్రహించారు. దాంతో హైదరాబాద్ సంస్థానం యూనియన్‌లో చేరవలసిందేనని నిజాం నవాబుకు మౌంట్‌బాటన్ ద్వారాను, ఇతరత్ర బ్రిటిష్ వారు స్పష్టం చేశారు.

ఆఖరి క్షణంలో లొంగిపోవడం కన్నా సైన్యాలకు పట్టుపడితే ఒక నాయకుడిగా, వీరుడిగా ముస్లిం ప్రజల ముందు చలామణి కావచ్చుననే ఆలోచనతో రజాకార్ల నాయకుడైన ఖాసీంరజ్వీ యూనియన్‌లో చేరడానికి సిద్ధంగా లేడు. మతోన్మాదం కూడా దానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పాకిస్థాన్‌లో జిన్నా తదితరులు కూడా సంస్థానాన్ని స్వతంవూతంగా అట్టి పెట్టడానికే ప్రయత్నించారు. వీటన్నిటి ఫలితంగా నిజాం రాజు భారత యూనియన్‌లో చేరలేదు. కొంతకాలం తర్వాతనే, చివరిదశలో నిజాం రాజు కూడా యూనియన్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే ఖాసీంరజ్వీ దానికి ఒప్పుకోలేదు. సరిగ్గా అదే సమయంలో పాకిస్థాన్‌కు గవర్నర్‌గా ఉన్న జిన్నా చనిపోయాడు. దాంతో ఆ దేశం గందరగోళంలో పడిపోయింది. హైదరాబాద్ సంస్థానంలోని మజ్లిస్ కూడా జిన్నా చనిపోవడం వల్ల తమను బలపరిచే శక్తులు బలహీనపడ్డాయనే ఆందోళనలో పడింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సంస్థా నం పైన సైనిక చర్యకు పాల్పడింది. హైదరాబాద్ సంస్థానం చట్టరీత్యా ఒక స్వతంత్ర రాజ్యం. ఆ రాజ్యంలోకి మరో రాజ్యమైన యూనియన్ ప్రభుత్వం సైన్యాన్ని పంపడం దురాక్షికమణ అవుతుంది. ఇది కప్పి పుచ్చుకోవడానికే వారు దానికి ‘పోలీసు చర్య’ అని పేరు పెట్టారు.

ఐక్యరాజ్యసమితి ముందు ఈ సమస్య ఎప్పుడూ ఒక తల నొప్పిగా ఉండడంతో దాన్ని వదిలించుకోవడానికి కూడా యూనియన్ ప్రభుత్వం సంస్థానాన్ని రద్దుచేసి, 1956లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అంతేకానీ భాషా రాష్ట్రాల మీద అభిమానంతో కాని, లేదా తెలుగు ప్రజలందరినీ ఒకే రాష్ట్రంలో ఐక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో గానీ అది జరగలేదనేది స్పష్టం. అయితే ఈ చర్య తీసుకోవడానికి ఇతర అనేక కారణాలు కూడా ఉన్నాయి. సైన్యాలు పంపింది నిజాం ప్రభుత్వం మీదికా లేక ప్రజలపైకా అన్నది అంతర్జాతీయంగా ఆనాడు ఒక సమస్య కాలేదు. కానీ కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభల నాయకత్వాన ఒక విశాల ప్రాంతంలో నిజాం ప్రభు త్వం అనేదే లేకుండాపోయింది. ప్రజాసాయుధ బలగాలు నిజాం సైన్యాన్ని దెబ్బతీసి దాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. అది ఆనాటి చారివూతక వాస్తవం. ఆ స్థితిలో పంపబడి న యూనియన్ సైన్యాలు నిజాం నవాబుకు వ్యతిరేకంగా కాక, ఆ విప్లవోద్యమాన్ని అణచడానికే అన్నది స్పష్టమవుతున్నది. సైన్యాలు సంస్థానంలోకి ప్రవేశించిన తర్వాత కేవలం ఐదురోజులకే, సెప్టెంబర్ 17న నిజాం నవాబు వారికి లొంగిపోయాడు. హైదరాబాద్ సంస్థానం ఆ విధంగా భారత యూనియ్‌లో విలీనం అయింది.

నిజాం సైన్యం కంటే ఎన్నోట్లు బలమైన యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు మూడు సంవత్సరాల పాటు పోరాటాన్ని విజయవంతంగా కొనసాగించారు. అప్పుడు కూడా ఆ పోరాటం యూనియన్ సైన్యాల అణచివేత మూలంగా దెబ్బతినలేదు. ఆనాటి కమ్యూనిస్టుపార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకుల్లో అత్యధికులు పోరాటాన్ని నడుపుతున్న ముఖ్యనాయకులతో సంప్రదించకుండానే, వారికి తెలియకుండానే దాన్ని విరమించాలని నిర్ణయించడం వల్ల అది ఆపివేయబడింది. రజాకార్ల అత్యాచారాల గురించి దానివల్ల ప్రజలు పడ్డ బాధల గురించి నెహ్రూ ప్రభుత్వమే గనుక అంతగా పట్టించుకొని ఉంటే, వారు సైనికచర్యను ముందుగానే చేపట్టవలసి ఉండే. అంతకుముందు సంవత్సరం పాటు ఆ అత్యాచారాలు కొనసాగాయి. ఆ విధంగా చేయడానికి బదులు అప్పట్లో నిజాం కోర్కెలను కొంతవరకైనా మన్నించి, రాజీ కుదుర్చుకోవడానికి నెహ్రూ ప్రభుత్వం నిజాం రాజుతో సంప్రదింపులు జరుపుతూ ఉం డింది. పోరాటం ఉధృతంగా సాగుతున్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం (ఆనాడది వరంగల్ జిల్లాలో ఒక భాగంగా ఉండింది). జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి రజాకారులు అప్పటికే పట్టణాలకు పారిపోయారు. పోరాటం మరికొంత కాలం సాగితే ప్రజలు మరికొద్ది కాలంలోనే రజకార్లను పూర్తిగా తుడిచిపెట్టగలిగేవారు. దాంతో సైనిక చర్య అసలు లక్ష్యం ప్రజల విప్లవోద్యమం నుంచి భూస్వాములను, ఇతర పాలకవర్గాలను కాపాడడమేననే విషయం స్పష్టమవుతున్నది. కాబట్టి రజకార్ల ఆగడాల నుంచి ప్రజలను రక్షించడం కోసమే ఆనాటి కాంగ్రెస్ పాలకులు సైనిక చర్యకు పాల్పడినట్టుగా చెప్పడంలో వాస్తవం లేదనేది స్పష్టమవుతున్నది.
-జి. సత్యనారాయణడ్డి
‘ప్రోలి ఆంగ్లమాస పత్రిక పూర్వ సంపాదకులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి