24, సెప్టెంబర్ 2013, మంగళవారం

నదీ జలాలూ-మనమూ-అమెరికా - డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి


September 24, 2013


కరువు కాటకాలు మనకు మాత్రమే చుట్టాలు కావు; అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిచిన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సైతం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతాలు ఉండేవి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలైన ఓక్లహామా, ఆర్కన్‌సాస్‌లు. చిన్న పెద్ద నదులేమో వాటిల్లో చాలా ఉన్నాయి. ఏ పదేళ్ళకొకసారో బీభత్సంగా అవి ఉప్పొంగి విపరీతమైన నష్టం కలిగించేవి. మిగతా రోజుల్లో నీటిచుక్క కనిపించకుండా ఎండిపోయేవి. నోబెల్ బహుమతి పొందిన 'గ్రేప్స్ ఆఫ్ రాత్' నవల అక్కడి రైతుల జాలిగాథను తెలుపుతూ రాసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రాలు పాడిపంటలతో మిగతా ఏ వొక్క ప్రాంతానికి తీసిపోనంత సంపన్నంగా ఉన్నాయి. అందుకు కారణం ఓక్లహామాలో జరిగిన 'నీటి పోరాటం'. ఆ పోరాటానికి నాయకుడు రాబర్ట్ శామ్యూల్ కెర్.

ఆయన ఆ రాష్ట్రానికి గవర్నరుగా ఎన్నికై 1943 నుంచి 47 వరకు పాలించాడు.  "no man has a right to waste one grop of water that another man can turn into bread'(మరొక మనిషికి ఆహారంగా మారే ఏ వొక్క నీటి చుక్కను వృధా చేసే హక్కు ఏ మనిషికి లేదు) - అంటూ పొరుగురాష్ట్రం గవర్నర్ బ్రిగమ్ యంగ్ చెప్పిన మాటలను కెర్ ఆదర్శంగా తీసుకున్నాడు. 'నీటిని వృధా చేయడమంటే దానిపాటికి దాన్ని వదిలేసి సముద్రంలో కలువనివ్వడం. పక్కకు మళ్ళించి, దప్పిక తీర్చుకునేందుకూ పరిశ్రమలకూ వ్యవసాయానికీ ఉపయోగించకుండా వదిలేసిన నీళ్ళన్నీ వృధా కిందికే జమ' అనేది కెర్ నమ్మకం. 'అదిగో వాడుకునేందుకు నీళ్ళున్నాయి. వాడుకోకుండా వదిలేస్తే అవి సముద్రం పాలవుతాయి-అనేది నా మంత్రం' అంటాడు కెర్.

గవర్నరుగా తన నాలుగేళ్ళ పరిపాలనలో ఓక్లహామా దాహం తీర్చడం అతనితో అయిందిగాదు. జీవనదులు తన రాష్ట్రంలో కాక పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోవడం ఇందుకు మొదటి కారణం. నీటి మళ్ళింపునకూ, జలాశయాల నిర్మాణానికీ తగినంత ఆర్థిక వనరులు ఆ పేద రాష్ట్రానికి లేకపోవడం రెండవ కారణం. తన ఆదర్శం సాధించుకునేందుకు 'సెనేటర్' కావాలనుకున్నాడు కెర్. అనుకున్నట్టే అందుకు ఎన్నిక కావడమే కాకుండా, పట్టుదలగా 'సెనేట్ పబ్లిక్ వర్క్స్ సబ్ కమిటీ ఫర్ రివర్స్ అండ్ హార్బర్స్'లో సభ్యత్వం సంపాదించాడు. దాంతో ఫెడరల్ ప్రభుత్వ నిధులు కొల్లలుగా అతనికి అందుబాటు కావడమే కాక, దేశం మొత్తంగా ఉన్న నదులన్నిటి మీద అధికారం గూడా చేతికి చిక్కింది. దాన్ని ఆధారం చేసుకుని అతడు తన రాష్ట్రంలోనే గాక, అవసరమైన ప్రతిచోట వీలైనన్ని జలాశయాలూ, సరోవరాలూ ఉనికిలోకి తీసుకొచ్చాడు. తన జీవితకాలంలో పూర్తిచేసిన జలాశయాలు పదకొండు కాగా ఆమోదం సంపాదించినవి మరో పదనాలుగు.

రాబర్ట్ కెర్ గానీ, అక్కడి నదీజలాల కమిటీగానీ మానవతా దృక్పథంతో ప్రకృతి మీద సాధించిన విజయాన్ని మనం చెప్పుకోవలసిందే తప్ప, భారతదేశంలో అలాటిది సాధ్యపడుతుందని ఊహించేందుకైనా సాధ్యపడదు. మనకు కెర్ వంటి ప్రజా నాయకుడు లేకపోవడం ఒక కారణమైతే 'శాడిస్టిక్' దృక్పథం కలిగిన కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అందుకు మరో అవరోధం. మన సీడబ్ల్యూసీ ప్రవర్తనను నిరూపించేందుకు ఎంతో దూరం వెళ్ళనక్కరలేదు. మన కృష్ణా గోదావరుల పరిస్థితిని పరిశీలిస్తే చాలు. గోదావరిలో ప్రతిఏటా 1500 టీఎంసీలకు తక్కువగాకుండా నీరు సముద్రంలో చేరిపోతున్నాయి. నీటికోసం తన్నుకు చచ్చే ఇరుగట్ల నడుమ కృష్ణానది నుంచి ఇప్పటికీ 300 టీఎంసీలు వృధాగా సముద్రంలో చేరిపోతున్నాయి.

మన రాష్ట్రంలో ఏ వొక్క జిల్లా అసంతృప్తి పడకుండా సాగునీరు సరఫరా చేసేందుకు ఇప్పుడు వృధా పోతున్న నీటిలో సగం చాలు.
గోదావరి మీద నిర్మించాలని తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే జలాశయం చాలా పెద్దది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ద్వారా సాగవుతున్న భూమి మొత్తానికి దీని కుడికాలువ నీరు సరిపోవడం వల్ల, రాయలసీమ తదితర ఎగువ ప్రాంతాల అవసరాలు తీరేందుకు దాదాపు 249 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. సుదీర్ఘమైన దీని ఎడమ కాలువ విశాఖపట్నం వరకు విస్తరించిన భూములన్నిటికి నీరందిస్తుంది. పోలవరం ఆనకట్ట ఎత్తును మరికొంత పెంచేందుకు అవకాశం కలిగితే, మరో మూడువందల టీఎంసీల నీటిని సులువుగా నిలువ ఉంచుకొని, దేశంలోనే అతి పెద్ద జలాశయంగా మారడమేగాక, ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడవకాలువ కింద సాగవుతున్న భూములన్నిటికీ నీరందించి, మరో 100 టీఎంసీలను కృష్ణానది ఎగువ ప్రాంతాలకు ఇది ఆదా చేస్తుంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపయోగపడుతుంది. ఇది తెలిసి గూడా మన సీడబ్ల్యూసీ అందుకు అనుమతించదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే నేలలను మనకు సాకుగా చూపెడుతుంది. మునక వల్ల నిర్వాసితులయ్యే ప్రజలను మరో చోటికి తరలించి వసతులు కల్పించేందుకు ఇంత పెద్ద దేశంలో స్థలాలకు కొరత లేదు.

కొరత ఉండే నీటిని సముద్రానికి వదిలివేయడం కంటే, నిర్వాసితులకు మార్గాంతరం ఏర్పాటు చేయడ మే కర్తవ్యమని మనం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు.
అదే గోదావరి మీద, మునక కారణంగా అనుమతికి నోచుకోని మరో ప్రాజెక్టు 'ఇచ్చంపల్లి'. ఇది తయారైతే గోదావరి నీటిని ఏకంగా శ్రీశైలం జలాశయానికే అందించొచ్చు. ఆ విధంగా కృష్ణా నీటికోసం ఏర్పడిన కష్టాలకు సంపూర్ణంగా సమాధానం ఇవ్వొచ్చు. ఇక కృష్ణా జలాలకు సంబంధించి -తుంగభద్ర ఎగువకాలువకు సమాంతరంగా ఒక 'కాంటూర్ కెనాల్' ద్వారానూ, ఆల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాల సామర్థ్యం పెంచడం ద్వారానూ కృష్ణా నీరు వృధా పోకుండా నిరోధించడం సాధ్యపడుతుంది గానీ, ఆల్మట్టి ప్రాజెక్టు మీద ఆంధ్రరాష్ట్రంలో రాజకీయ పార్టీలు లేపిన దుమారం అనేక తరహాల అపోహలకు తావిచ్చేదిగా తయారైంది. నీరు ఎక్కడ నిలవవున్నా, అవసరానికి మించి ఏ రాష్ట్రమూ వాడుకోలేదు. ఎవరి వాటాలు వాళ్ళకు ఏర్పాటయ్యే ఉన్నాయి గాబట్టి, వాటాకు మిం చిన నీటిని కిందికి వదిలేసేలా ఒప్పందం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కింద రాబట్టుకోనూవచ్చు. కానీ సముద్రంలో కలిసినా ఓర్చుకుందాంగానీ, మరొకరు వాడుకుంటే సహించేది లేదనే మనస్తత్వానికి స్వస్తి పలక్కుండా ఇలాటి ప్రతిపాదనలగురించి మనం ఆలోచించుకోలేం.

ఈ మార్గాలకు తోడు గోదావరి, మంజీర, కృష్ణ, తుంగభద్ర, కావేరీ నదుల్లో ఇప్పుడున్న ప్రవాహాన్ని మరింతగా పెంచుకునే దారులు మనకు లేకపోలేదు. దక్షిణ భారతదేశ వర్షపాతంలో అధిక భాగం కురిసేది పడమటికనుమల మీద. ఈ నీటి ఆధారంగానే ఆ కనుమల నుంచి తూర్పుకు ప్రవహించే గోదావరి, కృష్ణ, కావేరి బేసిన్లు జీవమార్గాలయ్యాయి. అదే పడమటి కనుమల్లో పుట్టి పడమరగాపయనించి అరేబియా సముద్రంలో కలిసే నదులూ, వాగులూ, వంకలూ వందకు పైగా ఉన్నాయి. వాటి ప్రవాహాన్ని వినియోగించుకునేంత విస్తారంగా అటువైపు సాగుభూమి లేకపోవడంతో ఆ నీళ్ళన్నీ అరేబియా సముద్రంలో కలిసిపోతున్నాయి. అలా వృధా అవుతున్న ప్రవాహం మోతాదు మన గోదావరి, కృష్ణ, కావేరి నదుల ప్రవాహ మొత్తానికి ఇంచు మించు సమానం. ఆ మొత్తం ప్రవాహాన్ని కాకపోయినా, సొరంగాల ద్వారానూ, 'రిడ్జ్ కట్టింగ్'ల ద్వారానూ అనుసంధానం చెయ్యొచ్చు. కాబట్టి మనకు నీటి కొరత తీర్చుకునే మార్గాలు ఎన్ని వున్నా, కొరవడిందల్లా సాధించుకునే మనసు మాత్రమే.
- డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి
రచయిత, మాజీ శాసనసభ్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి