27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఐటీలో లూటీ వైరస్!


- కారుచౌకగా భూములు కొల్లగొట్టారు
- కేటాయించిన భూముల తనఖా
- వాటిపై కోట్ల రూపాయల రుణాలు
- కంపెనీలు రాలేదు.. జాబులూ ఇవ్వలేదు
- ఉన్న కంపెనీల్లో టీ ఉద్యోగులు 10%
- 70% సీమాంధ్రులు.. 20% రాష్ట్రేతరులు
- ఎమ్మెన్సీల్లో సీమాంధ్రులదే హవా
- వీపీ నుంచి పీఎం దాకా అంతా వారే
హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక ప్రత్యేకతల నేపథ్యంలో నగరంలో ఐటీ పరిక్షిశమ స్థిరపడితే తమకూ అవకాశాలు వస్తాయని ఆశించింది తెలంగాణ విద్యాధిక యువత! క్రమక్రమంగా విస్తరిస్తుంటే.. తమ బిడ్డల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆశపడింది తెలంగాణ ప్రజ! ఐటీ పార్కుల పేరుతో భూములు లాక్కున్నా.. అదే ఆశతో మౌనంగానే నిరసన తెలిపింది! వేల ఎకరాల పంట పొలా ల్లో ఐటీ కంపెనీలు వెలిశాయి.. ఊళ్లకు ఊళ్లను చుట్టేసి విస్తరించాయి! కానీ.. ఆ ఐటీలో విస్తరించింది తమకు ఉపయోగపడే అభివృద్ధి కాదని చాలా కాలానికిగానీ అర్థంకాలేదు! అప్పటికే హైదరాబాద్ ఐటీలో తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ను డిలీట్ చేసిన సీమాంధ్ర పాలకులు.. అందులో సీమాంధ్ర వైరస్‌ను ఎక్కించారు! తమవారి కంపెనీలకు.. తమవారి ప్రయోజనాలు కాపాడే సంస్థలకు..

hydreelootiపెద్ద మొత్తంలో భూములు నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేశారు! మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి చోట్ల చూస్తే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ మొదలుకుని.. లీడ్స్.. ప్రాజెక్ట్ మేనేజర్స్.. వైస్ ప్రెసిడెంట్స్ దాకా సీమాంధ్రులు.. లేదంటే రాష్ట్రేతరులే తిష్ఠవేశారు! ఇంటర్వ్యూ రౌండ్‌లోనే కాదు పొమ్మంటే.. ఉద్యోగాల కోసం వేరే నగరాలు వెతుక్కుంటూ తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వలసపోయారు! సాఫ్ట్‌వేర్ కంపెనీల కోసం భూములు, జీవనాధారాలు కోల్పోయిన తెలంగాణ రైతులు, ప్రజలకు సెక్యూరిటీ ఉద్యోగాల్లో కూడా అవకాశం దక్కలేదు. అందుకే ఇప్పుడు మొత్తం దోపిడీ ‘సిస్టమ్’ను ఫార్మాట్ చేసేందుకు తెలంగాణ ఇంజినీర్లు సమాయత్తమయ్యారు! సీమాంధ్ర వైరస్‌ను క్లీన్ చేసి.. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు!!

హైదరాబాద్, సెప్టెంబరు 26 (టీ మీడియా):సాఫ్ట్‌వేర్ పరిశ్రమల ఏర్పాటు ముసుగులో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం సంగతి పక్కపెడితే.. తెలంగాణ మాత్రం పెద్ద ఎత్తున భూములు కోల్పోయింది. ఒకవైపు భూములు కోల్పోయి.. మరోవైపు తమ బిడ్డలకు సాఫ్ట్‌వేర్‌ఉద్యోగాలు రాక.. తెలంగాణ రైతులు.. ప్రజలు రెండు రకాలుగా నష్టపోయారు. భూములు తీసుకున్న సంస్థలు మాత్రం దర్జాగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారితో ఉద్యోగాలు భర్తీ చేసుకుని కొన్ని.. ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కొన్ని పబ్బం గడుపుకుంటున్నాయని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పెద్ద మొత్తంలో భూములు తీసుకుని.. ఎలాంటి కార్యకలాపాలు మొదలు పెట్టనేలేదు. నిర్దిష్టకాల పరిమితిలో కంపెనీ ఏర్పాటు జరుగని పక్షంలో కంపెనీలకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకునే నిబంధనలున్నా.. సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1300 ఐటీ కంపెనీలున్నాయి. ఇందులో 2002 నుంచి 2008 వరకు ప్రభుత్వం 66 సంస్థలకు 2110 ఎకరాలు కేటాయించింది. ఇందులో వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆరు సంస్థలకే 1453 ఎకరాల విలువైన భూమిని అప్పగించారు. ఈ ఆరింటిలో ఐదు సంస్థలు ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని అమలు చేయలేదు. అయినా ఈ సంస్థల భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదు. ఇదే తీరుగా మరికొన్ని సంస్థలు కూడా ఉన్నట్లు ఈ ఏడాది అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో ‘కాగ్’ పేర్కొన్నది. 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఐటీరంగంలో 11 మందికి ఏపీఐఐసీ ధరల నిర్ణాయక కమిటీ నిర్ణయించినదానికంటే తక్కువకు కేటాయించడం వల్ల రూ.304.52 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందని, అదే విధంగా నాలుగు కేసులలో పాత ధరకే భూమిని కేటాయించడం వల్ల రూ.412 కోట్లు నష్టపోయినట్లు కాగ్ తన ఆడిట్‌లో స్పష్టం చేసింది.

ఇదే కాగ్ నివేదిక కాస్తలోతుగా వెళ్లి కొన్ని కంపెనీల తీరును పరిశీలించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద సంప్రదింపుల కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నదని, ఈ మేరకు ఉద్యోగాల కల్పన, నిర్ణీత పెట్టుబడుల సాధనపై ఐటీ యూనిట్లకు భూములు రాయితీ ధరలపై కేటాయించిందని తన నివేదికలో పేర్కొన్నది. 2006-12 మధ్య 37 యూనిట్లతో అవగాహన ఒప్పందాలు జరిగాయని, ఇందులో కేవలం 11 యూనిట్లు మాత్రమే ఒప్పందాలను అమలు చేశాయని, తొమ్మిది అమలు దశలో ఉండగా, 17 యూనిట్లు కనీసం నిబంధనలు అమలు జరిపే ప్రయత్నం కూడా చేసినట్లు లేదని తెలిపింది. వట్టినాగులపల్లిలో 101 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఎకరం రూ.40 లక్షల చొప్పున 2006లో తీసుకున్న విప్రో దాదాపు రెండేళ్లు కార్యకలాపాలు ప్రారంభించలేదు. నిర్మాణ పనులు పూర్తి చేసుకొని దాదాపు 15,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల కల్పన జరగలేదని, ఈ మధ్యే రిక్రూట్‌మెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

పరిశీలించిన 37 యూనిట్లలో 22 యూనిట్లు ఒప్పందం కంటే తక్కువ పెట్టుబడి పెట్టగా, కేవలం 4యూనిట్లు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను సాధించాయని కాగ్ పేర్కొంది. ఇందులో విప్రో ఒకటని తెలిపింది. ఈ ఐటీ కంపెనీల ద్వారా 2012 ఆగస్టు నాటికి 85,490 మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా 25,511 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు ఆడిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. కారు చౌకగా భూములు పొందిన సంస్థలు పెట్టుబడులు పెట్టలేదని, ఉద్యోగాలు కల్పించకుండానే భూములను స్వాధీనం చేసుకున్నారని తేలిపోయింది.

సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్‌కు హైటెక్ సిటీ వద్ద ఎకరం రూ.80 లక్షల చొప్పున 14.93 ఎకరాల భూమికి 2002లో అవగాహన ఒప్పందం కుదిరింది. కానీ కార్యకలాపాలు చేపట్టలేదు. తిరిగి ఇదే భూమిని సత్యం అనుబంధ సంస్థ అయిన నిపుణ సర్వీసెస్ లిమిటెడ్‌కు కేటాయించి మే 2004 నుంచి ఏప్రిల్ 2006లో అప్పగించినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. ఈ సమయంలో ఏపీఐఐసీ స్వాధీన రుసుము రాబట్టలేదని, మార్కెట్‌లో ఆనాటికి హెటెక్ సిటీ వద్ద ఎకరం భూమికి రూ. 30 కోట్ల విలువ ఉండగా ఈ ధరకు ఈ భూమిని కేటాయించకుండా తిరిగి అదే రూ.80 లక్షలకు కేటాయించడంతో ప్రభుత్వం భారీ ఎత్తున దాదాపు రూ.400 కోట్లు నష్టపోయింది. 6,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా.. కంపెనీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. ఇందుకుగాను 2000 ఉద్యోగాలకు ప్రతి ఉద్యోగికి రూ.20వేల చొప్పున రాయితీని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఈ పద్ధతిలో ప్రభుత్వం మరో రూ.10 కోట్లు నష్టపోయినట్లు కాగ్ పేర్కొంది.

కేటాయించిన ఆరేళ్లకు పని మొదలు
వైఎస్ ప్రభుత్వం మే 2007లో మే 30న ఇన్ఫోసిస్ సంస్థకు పోచారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 44, 45(పార్ట్)లలో 447.075 ఎకరాల భూమిని ఎకరం రూ.12 లక్షల చొప్పున కేటాయించింది. అయితే కేటాయించిన తరువాత నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయడంలో ఈ సంస్థ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత నిర్మాణ పనులు పూర్తి చేసుకొని కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇంకా పనులు మొత్తం పూర్తి కాకపోవడంతో పూర్తి స్థాయిలో ఉద్యోగాల నియామకం జరుగలేదని సమాచారం.

ఐటీ పార్కు ఆదిభట్లలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 2007 జూన్ 18న 75 ఎకరాల భూమిని తీసుకున్న టాటా కన్సప్టూన్సీ సంస్థ, అదే ఏడాది జూన్13న 40 ఎకరాలను ప్రభుత్వం నుంచి పొందిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంస్థలు తాపీగా నాలుగేళ్ల తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టాయి. ఇదే తీరుగా అమెరికాకు చెందిన జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జీఐటీ)కిరాష్ట్ర ప్రభుత్వం ఎంపవర్డ్ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కేటాయించింది.

రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మంచిరేవుల గ్రామంలో ఎకరం 18 లక్షల విలువ చేసే సర్వే నంబర్ 228లోని 250 ఎకరాలను కేవలం ఎకరం లక్షన్నరకే ఇచ్చారు. ఎంపవర్ కమిటీ 50 ఎకరాలు ఇస్తే చాలని చెప్పినా పట్టించుకోలేదు. ఇంతజేసీ ఈ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.3.75 కోట్లనుకూడా చెల్లించలేదని కాగ్ తన నివేదికలో తెలిపింది. ఆ తరువాత ఈ భూమి కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించాల్సి వచ్చింది.

ఐటీ కంపెనీలో 70 శాతం ఉద్యోగాలు సీమాంధ్రులవే...
హైదరాబాద్‌లో ఉన్న 1300 ఐటీ కంపెనీ ఉద్యోగాలలో సీమాంధ్రులే 70 శాతం మంది పని చేస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐటీ నిపుణులంతా హైదరాబాద్‌లో అవకాశాలు దొరకని ఫలితంగా బెంగళూరు, పుణెకు వలసపోయారని తెలంగాణ ఐటీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సందీప్ మక్తాలా చెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ నిపుణులు 10% మాత్రమే పని చేస్తున్నారని, మరో 20% మంది ఇతర రాష్ట్రేతరులు ఉన్నారని తెలిపారు. ఐటీ నియామకాలలో భారీ ఎత్తున తెలంగాణ అభ్యర్థులు నష్టపోతున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర కంపెనీలు కేవలం 2% మాత్రమే ఉన్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడకు వచ్చిన కంపెనీలలో ఎక్కువ బహుళజాతి కంపెనీలే.

అయితే ఈ కంపెనీలలో కీలకమైన ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, అడ్మినిస్టేటివ్ అధికారులు, హెచ్ ఆర్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్ల లాంటి కీలకమైన పైస్థాయి పోస్టులలో సీమాంవూధకు చెందిన వారే ఉన్నారు. దీంతో తెలంగాణకు చెందిన ఐటీ ఉద్యోగార్థులు ప్రతిభ కలిగి ఉన్నా.. ఇంటర్వ్యూలలో కావాలనే ఫెయిల్ చేసి ఇంటికి పంపుతారని అంటున్నారు. ఫలితంగా చాలా మంది తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు ఇక్కడ అవకాశాలు రాక తిరిగి ఇతర నగరాలకు వెళుతున్నారని చక్రవర్తి అనే ఐటీ నిపుణుడు ఆవేదన వ్యక్తం చేశారు. నాణేనికి ఇది ఒక వైపు మాత్రమేనని మరోవైపు సాఫ్ట్‌వేర్‌ను ఉత్పత్తి చేసే ఐటీ కంపెనీలకు మ్యాన్ పవర్‌ను పంపించే కన్సప్టూన్సీలు హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఉన్నాయి.

ఇవి ఎక్కువభాగం సీమాంధ్రల యాజమాన్యల్లో ఉన్న కారణంగా అభ్యర్థుల ఎంపిక సమయంలో సాకులు చెబుతూ వారిని నిరాకరిస్తున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
ఐటీ కంపెనీలపై ఆధారపడి హౌస్ కీపింగ్, సెక్యూరిటీ ఉద్యోగాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్, అకౌంటింగ్ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. వీటిని కూడా తెలంగాణ వారికి దక్కనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ట్రాన్స్‌పోర్టు(క్యాబ్స్), క్యాంటిన్, సర్వీస్ అపార్ట్‌మెంట్స్ వంటివి కూడా సీమాంధ్ర బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా 80% తెలంగాణ అభ్యర్థులక ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనతో పాటు, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు, ఈ కంపెనీలపై ఆధారపడి ఉండే ఉపాధి అవకాశాలన్నీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా భూములు కోల్పోయిన రంగారెడ్డి జిల్లా ప్రజలకే కల్పించాలన్న డిమాండ్ వస్తున్నది. తమ భూముల్లో ఎవరో వచ్చి వ్యాపారాలు చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని రంగారెడ్డి జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వాదులు ఈ మేరకు ఐటీ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి ఉపాధి అవకాశాలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి