15, సెప్టెంబర్ 2013, ఆదివారం

హైదరాబాద్ సిర్ఫ్ హమారా!


9/15/2013 12:33:37 AM
లేలే.. మీరుసాబు... లేవవయ్య మీరుసాబు. అలయ్‌ల దుంకి పీరీల గుండంలకెల్లి లేచి రావాలె కులీకుతుబ్‌షాలు, తానీషాలు. నౌబత్ పహాడ్ మీదికెల్లి ఇట్ల చూస్తె అట్ల కనవడే బాగేఆమ్ పక్కపొంటి పొందిచ్చిన టౌన్‌హాల్ (అసెంబ్లీ)ల కూచుని చేస్తున్న కుట్రల మందలు హైదరాబాద్ మాది మాదని గుంజుకులాడ్తున్న కూకట్‌పల్లిని కూకేటిపామై ఆక్రమించుకున్న మందబలపు అధికారం. ఎవనిదీ టౌన్‌హాల్. మీరుసాబు నువ్వన్న రావాలె. జర చెప్పా లె. నూట పదేండ్ల కింద పునాది రాయేసి కట్టిన టౌన్‌హాళ్ల గదే అసెంబ్లీల మంచి గ ఆరామ్‌గ పెయ్యంత ఒరిగిపోంగ సల్లటి ఏసీలల్ల కూకోని, చేతులకు బంగారి ఉంగురాలు మెరిపిచ్చుకుంట, ఖడక్ బట్టలేస్కోని కావురపు మాటలు మాట్లాడ్తున్నప్పుడు ... పాణం గుంజుకపోతది యే హైదరాబాద్ కిస్‌కా? యే హైదరాబాద్ కిసీ బాప్‌కా.. రారాదు. మీరుసాబు ఒక్కసారి చెప్పు.. గజ్జున వణుకాలె కొడుకులు మళ్ల హైదరాబాద్ పేరెత్తకుంట. నౌబత్ పహాడ్ మీదికెల్లి కొట్టాలె నగారా... హైదరాబాద్ కిసీ బాప్‌కా జాగీర్ నహీఁ సిర్ఫ్ హమారా!
లాడ్‌బజార్‌ల లబ్బరు గాజుల మురిపెం తీరక మునుపే పిల్లా.. నీ ముక్కు పుడక చార్మినార్ వెలుగుల్ల జిగేల్మని మెరువంగ.. ఎవడో వచ్చి గీ హైదరాబాద్ నాదంటే ఏమంటవే. భూలచ్చిమీ... వాని కడుపునిండ జెట్టలున్నయి. వాని కడుపునిండ నరుప్పలున్నయి. వాని కడుపునిండ కుట్రల కత్తులున్నయి. వాని కడుపునిండ జమాయించిన నోట్ల కట్టలున్నయి. ఒగ సావు గాదు. ఒక బాధ గాదు. యాది. మనాది. చింత కలుగుతున్నదే భూలచ్చిమీ.. అడివీల పొద్దుగూకినట్టు.. అడ్లల్ల పెరుగు కల్పినట్టు అగులు బుగులుగున్నదే భూలచ్చిమీ..

ముఖద్దమా నడుస్తున్నది. అడిక్‌మెట్టు అడ్డాలో ఎనభై ఏండ్ల కింద పొందిచ్చిన ఉస్మానియా సదువుల, శాస్త్రాల, యూనివర్సిటీల నుంచి పొలగండ్లు దినా ల, రాత్రుళ్ల దీపాలై వెలిగినంక, పచ్చని చెట్లకు ఉరితాళ్లై మలిగినంక వచ్చిందే తెలంగాణ. గా తెలంగాణ అరిగోసల బతుకుల, ఆగమయిన బతుకుల, పుట్టిన ఊరిల పరాయైపోయిన, బాసమరిచిన, యాస మరిచిన, తండ్లాటల్ల పడి లేచిం ది తెలంగాణ. కొట్లాడింది భూలచ్చిమీ. భూదేవరంత ఓపికతోని. నౌబత్ పహాడ్ దక్షిణాన గుడారాలేసుకున్న ఔరంగజేబు లెక్కనే కొలువుల కొట్లాటబెట్టిన కొందరు కొట్టిపోయిండ్రు యాదవ్. బాలరాజ్ యాదవ్‌ను, శ్రీనివాస్‌గౌడ్‌ను పెయ్యంత బొర్లిచ్చికొట్టి, పండబెట్టి.. అచ్చు హైదరాబాద్ వాడా. యాదవుడా... పుట్టు హైదరాబాదీ వాడాగౌడా.. అవ్వల్ హైదరాబాద్ వాడా పహిల్వాన్.. ధంగల్లల్ల ఎర్రమన్నుల పొర్లాడి, నూనెల ఏంచిన పెయ్యిని పెంచి, నీ కండల మీద మన్నువొయ్య. ఎందుకురా! నీ కండలుపాడుగాను.. కొట్టిపోయిండ్రు గదరా! పోలీసులతోని, ఏసీ బస్సులతోని వచ్చి.. కొట్టిపొయ్యిండ్రు గదరా.. ఇగ అవ్వల్ హైదరాబాద్ ఇజ్జత్ ఏడవాయె. పజీత ఏడవాయె. దుక్కమొస్తందిరా.. అఫ్జల్‌గంజ్ ఎనకాల తాలింఖానలు కట్టిన షావూషీ పహిల్వాన్ ఏడపన్నవ్. రావా! ఒక్కసారి.. వాళ్ల కడుపుల్ల కుట్రలున్నయి. వాళ్ల చేతుల్ల విచ్చుకత్తులున్న యి. వాళ్ల నోట్లె విషం పూసిన మాటలున్నయి. ద్వేషమున్నది. మన మీద అక్కసున్నది. బాంచెల మయిపోతిమి గద మనం. నిజాంల, దేశ్‌ముఖ్‌ల గడీలల్ల బొక్కలు సూర సూరయి, బాంచెన్ నీ కాల్మొక్తా దొరా బతుకుల నుంచి గీ హైదరాబాద్‌ల గుడుక బతకనియ్యరయిరి. ఏడజూసినా ఎన్టీవోని బొమ్మలుపెట్టి, ట్యాంక్‌బండ కట్టమీద నిలు ప్రతిమలుపెట్టి, పూల దుక్నాలు పెట్టి, పాల దుక్నాలు పెట్టి, ఒర్రంగ గుంజుకున్నరు గదరా జిందగీని... ఇడ్లీసాంబర్ మప్పి, బన్నూ, సమోసాను మరిపిచ్చినట్టే మరిపించిండ్రు గదరా బతుకును.

గండిపేట నీళ్లు పోసి, సల్లటి గాలిచ్చి, సర్ఫెఖాజ్‌లు, పైగాలు, అప్పనంగ భూములిచ్చి, దిల్‌సుఖ్‌నగర్‌లు, కూకట్‌పల్లిలు, నిజాంపేట్‌లు.. పొందిచ్చి కోరికోరి తెచ్చుకుంటిమి గదరా యాదవుడా.. ఒక్కపాలి సదర్‌ల ఆకాశమంత ఎత్తు ఎగిరిన దున్నపోతు దుంకినట్టు.. ఇంగ పహిల్వాన్ నవ్వుగిన గీ గుండంల దుంకకపోతే.. ఇంగ ఏమి మిగల్తది. సొప్పకట్ట. పొరుకపోడు చేసిండ్రు హైదరాబాద్‌ను. ఐడీపీఎల్‌ను మూసి తెరిచిన రెడ్డి ల్యాబ్‌ల సూడు మందుల మర్మం.. ఉస్మానియా, గాంధీలను పండబెట్టి లేపిండ్రు సూడు జూబ్లీహిల్స్‌ల అపోలో... చౌదాసౌ దుక్నాలతోటి, లాడ్ బజార్‌తోటి, సుట్టుపక్కల సూడసక్కని తొవ్వలతోటి నక్షవూతాలతోటి పోటీపడిన చార్మినార్‌కు పోటీపెట్టి కట్టిన హైటెక్కుల సిటీ టక్కుటమారాల ముంగట మోకరిల్లింది గదరా దునియా. దానియవ్వ గీ దుని యా మనల్ని ముంచి సైబరాబాద్‌లను కట్టి ఇప్పుడు. షేర్వాణీ, బిర్యానీ, ఖుబానీ అందర్ పరేషానీ అయిపోయింది గద ఖాన్ సాబ్.

నల్లనల్లని రేగళ్ల పొంటి అడ్డపంచె, ఊగులాడె లుంగి కట్టుకోనచ్చి శాంతినగర్‌లు. రామ్‌నగర్‌లు, క్యాంపులు పెట్టినప్పుడు తెలుగోడే అనుకుంటిమి. అగ్గువసగ్గువకు ప్రాజెక్టుల పొంటి, కాల్వలపొంటి భూములు గుంజి ఎవుసం చేసుకుంటె కానీ లెమ్మంటిమి. మనతోటివాళ్లు బతుకుతరనుకుంటిమి. కానీ కానీ.. ఈర్లాపురం నర్సన్నా... ఇప్పుడు హైదరాబాద్ అడుగుతున్నాడు అడ్డుపంచె కట్టుకుని, గంటసుట్ట నోట్లె పెట్టుకోని, పారపలుగు పట్టుకోని, గెట్టుపెట్టుకొన్న ఎవుసాయదారుడు కాడు. ఆడిప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుడు. ప్రపంచ సోకు పిల్లి. అమెరికా అన్నయ్యకు అనుంగు తమ్ముడు. వక్ఫ్ భూములల్ల, నూరంవూతాలు కట్టి, ఇచ్చంవూతాల క్లబ్బులు, పబ్బులు పెట్టి, రాత్రిళ్లు దిమ్మరదమ్మర ఎగిరే డ్యాన్సులు పెట్టి, బలిసిన కొడుకుల గేటెడ్ కమ్యూనిటీలు కట్టి, ముందర జవాన్లను పెట్టి.. మీరుసాబు కట్టిచ్చిన టౌన్‌హాల్‌లల్ల కూకోని కుట్రలు చేసిన పెట్టుబడిదారుడు, చార్మినార్‌కు పోటీగా హైటెక్‌సిటీ కట్టి ఇప్పుడు ‘ఇ రమ్మంటే ఇల్లంత నాదేనన్న’ ఒంటె శాస్త్రం... హైదరాబాద్ మాదీ అంటున్నడు ఎట్లనమ్మ భాగమతీ.. నువు పుట్టిన, కాలిగజ్జె ఎగిరిన, ఆడిన పాడిన ఈ భూమి మీద, నాట్యతారలను తెచ్చి, ఏక్‌దో తీన్‌లు అ అంటె అమలాపురాల మత్తు గాటిచ్చి హైదరాబాద్‌కు కన్ను గీటుతున్న వాడు కడుపుల కత్తులున్నవాడు. నోట్ల కట్టులున్నవాడు. సెరసెర.. ఎన్నాళ్లదో సెర.. కిరాయికి వచ్చి మకాన్ అడుగుతు న్న వాడి మదం అణిచేందుకు రారాదురా మియా..యే హైదరాబాద్ హమారా!
భాయ్ అసదుద్దీన్ భాయ్. ఈ హైదరాబాద్ ఎవరిది! అన్నా నాగేందర్, అన్నా ముఖేష్‌గౌడా, తలసాని శ్రీనివాస యాదవ్, పహిల్వాన్‌లు జర మాట్లాడుండ్రి.. కొట్టిపోయిండ్రు వాళ్లు. ఫతేమైదాన్ ముంగట, నిజాం కాలేజీ ముంగట బొర్లిచ్చి, బొర్లిచ్చి కొట్టిపోయిండ్రు. తెలంగాణను ఆల్విన్ కంపెనీలు మూసి జెక్‌కాలనీల ఐదంవూతాల అపార్టుమెంట్లు కట్టిరి. రిపబ్లిక్ ఫోర్జ్‌ను మూసి మాట్రిక్స్ మత్తులేపిరి. హెచ్‌ఎంటీని మూసి కాలానికే కళ్లెం వేసిరి. ఏపీ స్కూటర్స్ మూసి భూములు అడ్డికి పావుసేరు అమ్మిరి. డీబీఆర్ మూసి భూములు అగ్గువకు సగ్గువకు ఎవరికో ఇచ్చిరి. చూసినం చూసినం. సనత్‌నగర్ మూసి, విషం చిమ్మే గొట్టాల తోటి, ఫార్మా కంపెనీలు కట్టిరి.

అమలాపురం నుంచి దిగొచ్చి బంగ్లాలు కట్టుకొని, అడ్డాలల్ల ఎనకటి కరెంటు కోటలను కూలగొట్టి టాకీసులు కట్టుకొని, అంతొద్దు , ఇంతొద్దు అంటే పులకరించిపోయిన అమ్మా జయలక్ష్మీ... సినిమాలల్ల ఆంధ్ర హీరో కొడ్తుంటే, తెలంగాణ బుడ్డరఖాన్ వేణుగోపాల్ ఒక బాంచెగాని లెక్క ఒక బలహీనుని లెక్క, ఇకమతులు చేసి నవ్విస్తుంటే వక్కడ వక్కడ నవ్వితిమి. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ చీరలు కట్టి, సింగారించుకోని మైమరిచిపోతిమి గద. కూకట్‌పల్లి లనుంచి కర్రీపాయింట్లు, స్వగృహ పుడ్లు, పూతరేకుల కింద, పూలు అణిగిపోయినట్టు అణిగిపోతిమి. మల్లెల గంధం తెలియని అమానవ సంస్కృతుల ముందు మోకరిల్లి మూర్చపోతిమి గద. భూలచ్చిమీ.. ఏడేడపోతిమి. ఎక్కడ తేలితిమి. పూలతోటల మీద, వంకాయ మడుల మీద, వరిపైరుల మీద, గాలి మోటర్ల అడ్డా పెట్టి, మల్లెపూలలను నలిపిన వాళ్ల సంతతి అడుగుతున్నది. ఉల్టా సత్యవాణి పలుకుతున్నది. చెప్పు. మాపచ్చని పంట పొలాలల్ల రాజధాని ఎట్ల కట్టుకుంటం’ అని కానీ శంషాబాధల ఒర్రంగ భూములు గుంజుకోని, ఉల్టా పదమూడు మైళ్ల పొడుగున ఫ్లైఓవర్ కట్టి, జర్రున కార్లు జారిపోతుంటె ఎడ్డి మొగమేసుకొని నిలబడ్డ రాజవ్వా.. ఇప్పుడిక శంషాబాద్ కట్టినోనిదే హైదరాబాద్. నీ అయ్యదా? నీ అబ్బదా? మహబూబియా కాలేజీ కాదు. ఆలియా కాదు. ఇప్పుడన్నీ శ్రీ చైతన్యలు, నారాయణలు పెట్టి గొర్ల మందల లెక్క పొలగండ్లకు అపార్టుమెంటు జైల్లల్ల పెట్టి సదువులు కుక్కి, సంపిన కాలేజీలదే ఎలుగు. భ్రమిసినందుకు ఇప్పుడాళ్లదే రాజ్యం. హైదరాబాద్ ఎవనబ్బా సొత్తని అడిగినోనిదే రాజ్యం.

పిల్లుల లెక్క వచ్చినోడు పులైండు. బతకడానికి వచ్చినోడు బాకు అయిండు. హైదరాబాద్ బంగ్లాలు చూసి, హైదరాబాద్ కోటగోడలు చూసి, హైదరాబాద్ దవాఖానాలు చూసి, హైదరాబాద్ తోటలు చూసి, హైదరాబాద్ భూముల మీద కన్నేసి, కర్నూలు నుంచి నల్లుప్లూక్క వచ్చి నలిపి పారేసిండ్రు గద మియా మన బతుకులను. లాభం నష్టం, లానాదేనా, పైసాపైసా, నుక్సాన్, ఆమ్‌దాన్ ఈ భాష నేర్చుకున్నోడు పత్రికలు పెట్టినోడు, ఛానళ్లు పెట్టినోడు, బతుకంటే రూపాయి సంపాయించుడే అన్నోడు. భూములు కబ్జా చేసినోడు, మందిని ముంచినోడు, కాళ్లతో నీళ్లు మలుపుకొని ఎవుసంల కాసులు మిగిలిచ్చుకున్నోడు. సినిమా రీళ్లు, నోట్ల కట్టలు, కడుపునిండ కుట్రలు నింపుకొని హైదరాబాద్ వచ్చినోడు. ఇవ్వాళ్ల ఏకు బాకైండు. పక్కలో బల్లెమయిండు.

ముందు వాళ్లు అంగూర్ తోటలకు భూములు కొన్నరు. ఎన్టీఆర్ బొమ్మను ఆడిచ్చుకొని అప్పటి నుంచి భూములను కబ్జ చేసిండ్రు. వెంగళరావు నగర్‌లు, ఎస్‌ఆర్ నగర్‌లు, సుందర్ నగర్‌లు, దిల్‌సుఖ్‌నగర్‌లు, దాటి మాదాపూర్‌ల అడ్డాపెట్టిండ్రు. కోటీ, ఆబిడ్స్‌లను గంగల కలిపి, అమీర్‌పేటల దుక్నం తెరిచిండ్రు. ఇంగజూడు. అమ్ముడు, కొనుడు.. అమ్ముడు కొనుడు. బతుకుకు అగ్గిమల్లె పెట్టిండ్రు. భాషను పొతం పట్టిండ్రు. ఇంగ గీ నేల మీద భూలచ్చిమీ.. పిల్లా... ‘మా అక్క ముక్కు పిల్ల గీడనే పెట్టిన... ఏడేడ పాయెనని ఎదుకులాడు’ దొరకది.. దొరకది. పీరీల గుండంల దుంకాలె. ‘నౌబత్ పహాడ్ మీదికెల్లి నగారా కొట్టాలె. యే షహర్ హమారా! సిర్ఫ్ హమారా! కిసీ బాప్‌కా నహీ. పుట్టు జీవులు ఇప్పుడు ఆర్సి కేకపెట్టాలె. నడు నడు.. పద పద.. హైదరాబాద్ మనది. మన రక్తమాంసాలతో నిర్మితమైనది. మొఖద్దమా నడుస్తున్నది. జులుం చెల్లదు. పెత్తనం చెల్లదు. ఆధిపత్యం చెల్లదు. దిక్కులు పిక్కటిల్లేలా.. నౌబత్ పహాడ్ మీదికెల్లి నగారా కొట్టాలె.. హైదరాబాద్ సిర్ఫ్ హమారా! ట్యాంక్‌బండ్ మీద కూలిన విగ్రహాలల్ల కెళ్లి దుంకుతున్నది ఆధిపత్యం.. ఎదిరించినోడు బతుకుతడు. లేనోడు గులామ్ అయితడు. ఈ హైద్రబాద్‌ల పుట్టి పెరిగిన ఖాన్‌సాబ్, గౌడా, యాదవా, భూలచ్చిమీ.. గులామ్‌కీ జిందగీసే మౌత్ అచ్ఛీ హై.
-అల్లం నారాయణ
narayana.allam@gmail.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి