24, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఇదేం డీల్?


September 24, 2013


హైదరాబాద్, సెప్టెంబర్ 23: సీబీఐ నాలుక మడతేసింది. పక్కాగా ప్లేటు తిప్పేసింది. విషయాన్ని తిరగేసింది. తాను ఎత్తి చూపిన తప్పును తానే ఒప్పుగా ఒప్పేసుకుంది. జగన్‌కు బెయిలు ఇవ్వొద్దంటూ ఈనెల 18వ తేదీన వేసిన కౌంటర్ అఫిడవిట్‌లో, 'కేసు ముగిసింది. మా పనైపోయింది' అంటూ సోమవారం దాఖలు చేసిన మెమోల్లో, ఐదు రోజుల వ్యవధిలోనే సీబీఐ పిల్లిమొగ్గలు వేసింది. 'కార్మెల్ ఏషియా' అనే కంపెనీపై మాట మార్చింది. అసలు విషయంలోకి వెళితే... 'వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి పరపతిని ఉపయోగించుకుని పలు కంపెనీల నుంచి క్విడ్‌ప్రోకో పద్ధతిలో అక్రమంగా నిధులు రాబట్టుకున్నారు. ఇదే విషయాన్ని మేం దాఖలు చేసిన పది చార్జిషీట్లలో సవివరంగా ప్రస్తావించాం' అంటూ సీబీఐ ఈనెల 18వ తేదీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపింది.

మరీ ముఖ్యంగా... పదో చార్జిషీటులో 'శంషాబాద్‌లో ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాలు అప్పగించారు. దీనికి ప్రతిఫలంగా (క్విడ్‌ప్రోకో) కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి రూ.15 కోట్లు పెట్టుబడిగా పొందారు' అని తెలిపింది. ఇన్నేళ్లుగా జరిగిన దర్యాప్తు మొత్తాన్ని క్లుప్తీకరిస్తూ... "ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రిద్వారా అయాచిత లబ్ధి చేకూర్చిన కంపెనీల నుంచి పెట్టుబడులు పొందేందుకు జగన్ మోహన్‌రెడ్డి జగతి పబ్లికేషన్స్, రఘురామ్ సిమెంట్స్, కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ తదితర సంస్థలను ఏర్పాటు చేశారు'' అని స్పష్టం చేసింది.

వెరసి... కార్మెల్ ఏషియాకు క్విడ్‌ప్రోకోతో సంబంధమున్నట్లు 18న దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో, అంతకుముందురోజే వేసిన పదో చార్జిషీటులో సీబీఐ స్పష్టంగా తేల్చిచెప్పింది. కానీ, జగన్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు ఇవ్వనున్న నేపథ్యం లో... ఉదయమే సీబీఐ ఓ మెమో దాఖలు చేసింది. 'ఎమ్మెల్యే శంకర్రావు, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు దాఖలుచేసిన రిట్ పిటిషన్లలోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది' అని అందులో తెలిపింది. అదే మెమోలో.... కార్మెల్ ఏషియాపై మాట మార్చింది. కార్మెల్ ఏషియాకు 'ఇచ్చి పుచ్చుకోవడం'తో సంబంధమే లేదని చెప్పింది. తాము చార్జిషీట్లు దాఖలు చేసిన అంశాలకు సంబంధించిన 10 కంపెనీల తప్పులే దొరికాయని... కార్మెల్ ఏషియా విషయంలో క్విడ్‌ప్రోకో జరిగినట్లు స్పష్టంకాలేదని సీబీఐ పేర్కొంది.

అంటే... ఐదు రోజుల్లోనే కార్మెల్ కథ మారిపోయిందన్న మాట. నిజానికి... అంతకుముందు దాఖలు చేసిన చార్జిషీట్, కౌంటర్ అఫిడవిట్ ప్రకారం కార్మెల్ వ్యవహారంపైనా సీబీఐ దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. దానిపైనా చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. కానీ... దానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా జగన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. అందుకే... 'కార్మెల్'కు క్లీన్ చిట్ ఇచ్చి, దర్యాప్తు ముగిసిపోయిందంటూ మెమో దాఖలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మెల్ ఏషియాతోపాటు సండూర్ పవర్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, బ్రహ్మణి, ఆర్.ఆర్.గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, సరస్వతి పవర్, మంత్రి డెవలపర్స్ కంపెనీల విషయంలోనూ 'క్విడ్ ప్రోకో'కు ఆధారాలు లభించలేదని తెలిపింది.

విశేషమేమిటంటే... వీటిలో పీవీపీ, మంత్రి డెవలపర్స్ మినహా మిగిలినవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్‌తో సంబంధమున్న కంపెనీలే కావడం గమనార్హం. అయితే, ఈ కంపెనీల విషయంలో జరిగిన ఉల్లంఘనలు, అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్నుశాఖ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని... ఈ విషయాలన్నీ వాటి పరిశీలనకు పంపించామని సీబీఐ తెలిపింది.
సూట్ 'కేసులూ' క్లోజ్: జగన్ కంపెనీల్లోకి కోల్‌కాతాకు చెందిన అనేక సూట్‌కేసు కంపెనీలు 'పెట్టుబడులు' పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అయితే... కోల్‌కతాకు చెందిన 15 కంపెనీలు, గువాహటికి చెందిన ఒక కంపెనీ జోలికి సీబీఐ వెళ్లలేదు. ఆ కంపెనీల్లో జరిగిన వ్యవహారాలను ఈడీ, ఐటీ పరిశీలనకు పంపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి