24, సెప్టెంబర్ 2013, మంగళవారం

'పట్నం'పై అత్యాశకు పోవద్దు - జగపతిరావు వెలిచాల


September 24, 2013


పట్నంపై మా తాత సంవాదం!
మన పట్నం వాళ్ళది ఎట్లైతది? వాళ్ళు ఎవరైనా, ఎప్పుడైనా మన పట్నం చుట్టూ ఉన్న లక్షలాది గోరీలకు దీపం పెట్టిండ్రా!! ఊదు కాల్చిండ్రా! ఆగర్‌బత్తీలు ఎలిగించిండ్రా!! చార్మినార్ నుంచి గోల్కొండ ఖిలాదాక, షేక్‌పేట నుంచి మలక్‌పేట్ దాక, లక్షలాది గోరీలన్నీ మన తెలంగాణోళ్లయే. మన పట్నం వాలదెట్లైతది. 5,6 లక్షల మంది మన 'కారీగర్లు' పట్నం కట్టంగ నేలకొరిగి పోయిండ్రు. ఎందరో 'అపాహాజ్'లు వికలాంగులు అయిపోయిండ్రు. వాళ్ళు పట్టణం కట్టడానికికొరకు ఒక్కడైనా చచ్చిండ్రా!! మన పోరగాండ్లు ఇప్పుడు మళ్ళీ ఉరిపోసుకోబట్టిరి. తుపాకి గుండ్లకు బలైపోతుండ్రి!! ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పట్నం వాళ్ళదంటరేంది. ఇదేం కిరి కిరీ!! కుదరదని చెప్పు.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ స్వీయ రాష్ట్రం తమకే కావాలని పొత్తులు వద్దని-తమ భూ భాగాన్ని తామే ఏలుకుంటామని 1956 నాటి తమ సర్వ స్వతంత్ర రాష్ట్ర పునరుద ్ధరణ జరగాలని ఆంధ్రతో తెగతెంపులు చేసుకోవాలని ఆరు దశాబ్దాలుగా నిరంతరంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తెలంగాణాను తెలంగాణోళ్ళకు ఇవ్వద్దని ఆంధ్రా లిటి గేషన్ పెడుతున్నది. ఇది సమంజసం కాదు. తెలంగాణ ఘోషను, ఆర్తిని గమనించిన కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు, భారత ఫెడరల్ వ్యవస్థలోని 28 రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర వీధి ఉద్యమాలకు దిగింది. తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా ఆంధ్రా ఎన్నో ఉద్యమాలు చేపట్టింది.

ఉమ్మడి రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ హక్కులను, సంఖ్యాబలం ఉన్న ఆంధ్రా దౌష్టికం చేసి, దురాక్రమణ చేసి ప్రాథమిక హక్కులను కూడా రద్దు చేయించింది. ఆం«ద్రులకు ఉద్యమాలు చేయడం ఆనవాయితీగా వచ్చి అలవాటుగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రా చేపట్టిన ఇప్పటి ఉద్యమం పేరు సమ-ఐక్యత. ఈ పదం విద్వాంసులకు, సామాన్యులకు కూడా అర్థమై చావడం లేదు. సమ ఐక్యత ఎవ్వరితోని? వద్దన్న వారితోనేనా? అది కుదరదు సాధ్యం కాదు. ఆంధ్ర తెలంగాణ ఏనాడు సమంగా లేవు. ఏనాడు ఐక్యతగా లేవు. సమైక్యత హేతబద్ధంగా లేదు. అది దోపిడీని, దురాశను అపరిమిత రాజ్య కాంక్షను స్పురింపచేస్తున్నది.

ఆంధ్రా చేపట్టిన కొన్ని ఉద్యమాల వివరాలు : 1952-53 మద్రాసుతో విడిపోతామని పంచాయతీ, సమ భాగస్వామ్యం కొరకు, 1965-67- విశాఖ ఉక్కు ఆం«ద్రుల హక్కు ఉద్యమం, 1972-తెలంగాణ ఉద్యమానికి (1969) కౌంటర్ ఉద్యమం. సమైక్యత కొరకు బ్రహ్మాంనదరెడ్డి ప్రభుత్వాన్ని బలపర్చడానికి, 1972-మళ్ళీ ఇంకో ఉద్యమం జై ఆంధ్రా పేరుతో. ముల్కీ రూల్క్ రద్దు చేయమని, తెలంగాణ ముఖ్యమంత్రి పి.వి.ని గద్దె దించమని. 1984-ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రి పదవిని పునరుద్ధరించమని, 2009-శ్రీ కృష్ణ కమిటీని తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి 2 లక్షల పేజీల కట్టు కథల సమాచారాన్ని సమర్పించడానికి ఉద్యమ రీతిలో గూడుపుఠాని, 2012-డిసెంబర్ 9, కేంద్ర హోం మంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటనను అడ్డుకోవడానికి, 2013-సెప్టెంబర్ కేంద్ర కేబినెట్ జాతీయ రాజకీయ పార్టీల సంయుక్త రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేక ఉద్యమం.

ఆం«ద్రులు చేపట్టిన ఉద్యమం అప్రజాస్వామికం, కేంద్ర ప్రభుత్వ అధికారిక నిర్ణయానికి, ఆజ్ఞకు వ్యతిరేకం. జాతీయ రాజకీయ పార్టీల సమష్టి నిర్ణయానికి విరుద్ధం. ఆంధ్రా ఉద్యమం రాజ్య ధిక్కరణ కిందికి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సామాన్య ప్రజానీకాన్ని భావోద్వేగానికి గురి చేసి, అబద్ధాలతో, అసత్యాలతో, ఉద్రేకపరిచి, తమకుకావలసింది సాధించుకోమని చెప్పడాన్ని 'మెబోక్రసి'- 'మందస్వామ్యం' అంటారు. మూక బలంతో రాజ్య నిర్ణయాలు మార్చమనడం అరాచకం, అనాగరికం.

ఆంధ్ర తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా మార్చినప్పటికీ తెలంగాణ ప్రజల కోరిక మేరకు రాజ్యాంగ రక్షణలు, ముల్కీ రూల్స్, తెలంగాణ ప్రాంతీయ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు తెలంగాణ బడ్జెట్, ఆడిటింగ్, పరిపాలన, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, ఆజమాయిషీ, పరిపాలన నియంత్రణ వగైరా సమీక్షించేది. అన్ని అధికారాలు, రక్షణలు ఉన్నప్పటికీ ఆంధ్ర పరిపాలకులు, తెలంగాణ నీటిపై, నిధులపై, ఉద్యోగాలపై దురాక్రమణ చేశారని, భారత దేశ ప్రభుత్వం నియమించిన కమిషన్లు అధికారికంగా తెలియజేశాయి.

విశాలాంధ్ర అద్దె మైకులు, ఎన్.జి.ఓ.ల ఉద్యమంలో దొడ్డిదారిన ప్రవేశించి తెలంగాణకు వ్యతిరేకంగా విషం కక్కుతున్నారు. వారు మే«ధావులమనీ, చరిత్రకారులమనీ, ఆర్థిక నిపుణులమనీ, ఆడిటర్స్‌మనీ, జర్నలిస్టులమనీ, భాషా పండితులమనీ, రాజ్యాంగ నిపుణులమనీ వారికి వారే చలామణి అవుతున్నారు. వారు హైదరాబాద్ ఉనికిని, తెలంగాణ ఉనికిని సైతం సవాల్ చేస్తున్నారు. తెలంగాణ నాయకులను ఉద్యమ కారులను అవహేళన చేస్తున్నారు. దురుసుగా మాట్లాడుతున్నారు. వారి చరిత్ర, వారి భాగోతం అవసరం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులే బయటపెడతారు. ఆంధ్రా ఉద్యమంలో సామాన్య జనంతో టి.వి. ఛానళ్ళు మాట్లాడించే కొన్ని మాటలు నమ్మరాకుండా వున్నాయి. చరిత్ర భాండారాల్లో తెలంగాణ పేరే లేదట. దాని ఉనికి ప్రశ్నార్థకమేనట. నాటి నుంచి నేటి వరకు ఎటు చూసినా ఆంధ్రానే వెలిగిపోతున్నదట.

తెలంగాణ విడిపోతే ఆంధ్ర ఎడారై పోతదట. కరువు కాటకాలు వస్తాయట. క్షామ పరిస్థితి ఏర్పడుతదట. సాగునీటికి కట కట వుంటుందట. నిరుద్యోగం ఎక్కువవుతదట. కోన సీమలో కొబ్బరి కాయలు, అరటి కాయలు అమ్మవట. ప్రజలకు గిట్టుబాటు ధర రాదట. గుంటూరు మిర్చికి ధర పలుకదట. ఆంధ్ర కూలీలకు కైకిలి దొరకదట. విద్యార్థులకు చదువుకోవడానికి సీట్లు దొరకవట. ఆంధ్రా ఆర్.టి.సి. తెలంగాణ లేకుంటే నష్టాలపాలై దివాలా తీస్తదట. తెలంగాణ నీరు లేకుంటే ఆంధ్ర రెండవ పంటకు, మూడవ పంటకు, నారుమళ్ళకు నీరు దొరకవట.... తెలంగాణ లేకపోతే ఆంధ్ర పుట్టి మునిగిపోతుందా? దివాళా తీస్తుందా? నమ్మశక్యం కాకుండా వుంది. ఆం«ద్రులకు తరతరాలకు సరిపోయే గ్యాస్ సంపద వుంది. వేలాది మైళ్ళ పొడవు సముద్రం, నౌకాయానం వుంది. పోర్టులున్నాయి. మూడు పైర్లు పండించుకొనే 30 లక్షల ఎకరాల సాగునీటి సామర్థ్యం గల బంగారు భూమి వుంది. నాలుగువైపులా గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర వందలాది ఉపనదులు వున్నాయి. భూతల స్వర్గం లాంటి కోనసీమ, అరకు వ్యాలీ ఉంది. రంగురాళ్ళు, బైరెట్, ఇనుము, అల్యూమినియం లాంటి ఎంతో ఖనిజ సంపద వుంది.

డజన్ల కొద్దీ చెక్కర ఫ్యాక్టరీలు, వందలాది రైస్ మిల్లులు, వేలాది చేపల చెరువులు, రొయ్యల పెంపక కేంద్రాలు, పండ్ల తోటలు, మొక్కల ఉత్పత్తి కేంద్రాలు, పశు సంపద, పాడి సంపద అపారంగా వున్నాయి. వేలాది విద్యా సంస్థలు మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు దండిగా వున్నాయి. లక్షల కోట్ల విలువ చేసే సినిమా రంగం, 24 టి.వి.ఛానళ్ళు ఉన్నాయి. వేలాది మైళ్ళ పొడవు జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు వున్నాయి. కామధేనువు లాంటి తిరుపతి దేవాలయం వుంది. నాలుగు మహానగరాలు, కూతపెట్టు దూరంలో మద్రాసు, బెంగళూరు రాజధాని నగరాలున్నాయి. స్టీలు, ఫెర్టిలైజర్, సిమెంటు ఫ్యాక్టరీలు దండిగా వున్నాయి. తరతరాలు తిన్నా తరగని ఇంత సిరి సంపద తలాపున పెట్టుకొని తెలంగాణ లేకపోతే బికారులమైపోతామని, అవురావురుమని ఏడవడం ఎందుకు? మొత్తుకోవడం ఎందుకు? ఎవర్ని నమ్మించడానికి? ఆంధ్రులు తమకు తాము తెలంగాణ లేకపోతే బ్రతుకలేమని చెప్పుకోవడం భావ్యంగా లేదు. గద్దెనెక్కిన ఆంధ్రా ప్రభుత్వాలన్నీ తెలంగాణ రాజధాని నగర భూములను గ్రామీణ భూములను ఎడా పెడా చౌక ధరలో కొనుక్కొని కబ్జాలు పెట్టేసారు. మిగిలిన రాజధాని భూములను హర్రాజులు పెట్టించి వేలాది కోట్ల నిధులను ఆంధ్ర ప్రాజెక్టుల నిర్మాణానికి తరలించుకు పోయారు. 'సెజ్'ల పేరిట తెలంగాణ పేద ప్రజల భూములను కారు చౌకగా కొని తమ వారికి, తమ ఆప్తులకు దారాధత్తం చేశారు. వేలాది ఎకరాల తెలంగాణ భూమిని బినామీ సంస్థలకు దాన ధర్మాల క్రింద కేటాయించారు.

నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టు. మద్రాసు, హైదరాబాద్ రాష్ట్రాల ఒడంబడిక ద్వారా కట్టినది. ఖర్చు సమానం. నీటి ఉపయోగం సమానం అనే దామాషాపై నిర్మాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ కుడి కాలువను (ఆంధ్రాకు సంబంధించింది) పొడిగిస్తూ పోయారు. నిర్ణయించిన పరిధిని దాటి వంద కిలోమీటర్లు దూరం వరకు కాలువలు త్రవ్వుకొని అక్రమ సాగుబాటు చేస్తున్నారు. తెలంగాణ ఎడమ కాలువను సున్నా కొట్టించారు. తెలంగాణ ప్రాంతంలో ఎడమ కాలువ క్రింద సాగుబాటు చేస్తున్న రెండు పంటల భూమిని ఒక పంట క్రిందకు మార్చారు. సొరంగ నిర్మాణం చేయలేదు. లిఫ్ట్ పెట్టుకోమన్నారు. అది కూడా పూర్తి చేయలేదు. పర్యవసానం తెలంగాణ వాటా 50 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. శ్రీశైలం, తుం గభద్ర నీటిపైనా దురాక్రమణ చేసి తెలంగాణకు నీరు రాకుండా చేశారు.

తెలంగాణలోని ఏకైక పెద్ద తరహా శ్రీరాం సాగర్ ప్రాజెక్టును 60 సంవత్సరాలుగా పూర్తి చేయలేదు. తెలంగాణ రైతుల నోళ్ళు కొట్టి ప్రాజెక్టు నిలువ వున్న నీరును డ్యాం గేట్లు తెరిపించి దొంగరాత్రి నదీ మార్గంగా ఆంధ్రా డెల్టా క్రింద అక్రమ సాగుబాటును కాపాడటానికి తీసుకెళ్లారు. మూడు సార్లు ఇదే రకంగా దొంగరాత్రి గేట్లు తెరిపించి నీళ్ళు తరలించుకు పోయారు. తెలంగాణకు సంబంధించి కిన్నెర సాని ప్రాజెక్టు నుంచి కూడా ఇదే రకంగా నీరు తరలించుకు పోయారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కానీ శిక్షపడలేదు.

ఆంధ్రా ఉద్యమ సంఘాల నాయకత్వం ఉద్యమ లాభ, నష్టాలను బేరీజు చేసుకోవాలి. ఉద్యమం పొడిగించటం వలన జరిగే నష్టాలను సమీక్షించుకోవాలి. ఆంధ్ర రాజకీయ నాయకులు తీవ్ర సంక్షోభంలో వున్నారు. వారు ఓపికతో ఉన్నంత మాత్రాన వారికి స్థాన బలం, కుల బలం, వర్గ బలం, రాజకీయ బలం లేక కాదు. వారికి ఉద్యమంతో సంఘీభావం ఉన్నందువలననే వారు ఓపికగా వున్నారు. ఉద్యమ లక్ష్యం, గమ్యం మారుతున్నది. ఏది ఏమైనా కాలపరిమితి లేని ఉద్యమం కొనసాగింపు తెగేదాక 'బలిచ్చినట్టు'గా ఉంటుంది. ప్రజల్లో తీరని ఆశలు రేకెత్తించడం సులభం కావచ్చు కానీ ప్రమాదకరం కూడా. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రాంతాన్ని శాశ్వతంగా తమ ఆధీనంలో పెడుతుందనుకోవడం గొంతెమ్మ కోర్కెలాంటిది. అది వట్టి భ్రమ. ఆం«ద్రులు ఉద్యమించినప్పుడల్లా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా స్పందిస్తే రాజ్యాలు రాజ్యాంగాలు కూడా కూలిపోతాయి అది గ్రహించాలి.
ఉద్యమ ఫలితాలు భావితరాలకు ఉపయోగపడేలా వుండాలి.

ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని నిర్మాణం ఆవశ్యకతను గమనించి నడుచుకోవాలి. రాజధాని నిర్మాణానికి ఇప్పటి నుండే రోడ్ మ్యాప్ వేసుకోవాలి, నిధులు సమీకరించుకోవాలి. ఆంధ్రాకు అత్యంత ఆవశ్యకత గల బహుళార్థక ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం కట్టాలి. కేంద్రం అనుమతులు తీసుకోవాలి, నిధులు ఇవ్వమని అడగాలి. ఆంధ్ర ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై త్రాగునీటి సమస్యపై దృష్టి సారించాలి. కేంద్ర ధనసాయం పొందాలి.
హైదరాబాద్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం భావ్యం కాదు. తెలంగాణ ప్రజలు దీన్ని సహించరు, ఇది ఎన్నో ఇతర సమస్యలను లేవనెత్తుతుంది. మళ్ళీ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది.
- జగపతిరావు వెలిచాల
స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, సీనియర్ రాజకీయ వేత్త

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి