21, సెప్టెంబర్ 2013, శనివారం

వడ్డీ వడ్డన


9/21/2013 3:31:20 AM
వడ్డీరేట్ల విషయంలో రాజన్ కూడా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి మంత్రాన్నే జపించారు. ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేటును పావు శాతం పెంచి ఇండస్ట్రీ వర్గాలకు ఊహించని షాకిచ్చారు. ఇప్పటికే నిధుల కొరతతో సతమతవుతున్న తరుణంలో ఆర్‌బీఐ కఠిన వైఖరి కారణంగా రుణ రేట్ల పెంపు తప్పకపోవచ్చని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ అభివూపాయపడింది. ఇదేగనుక జరిగితే గృహ, వాహన రుణాలు తీసుకున్నవారిపై వడ్డీపెంపు రూపంలో అదనపు భారం పడే అవకాశముంది.

-రుణం.. మరింత ప్రియం!
-ఈఎంఐలపై అదనపు భారం?
-రెపోరేటు 0.25 శాతం పెంపు

-పరపతి సమీక్షలోవూదవ్యోల్బణ కట్టడికే మొగ్గుచూపిన రాజన్
ముంబై, సెప్టెంబర్ 20: ఎవరూ ఊహించని రీతిలో రెపో రేటును 0.25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. తొలి సమీక్షలోనే అందరికీ షాకిచ్చారు. తాజా పెంపుతో బ్యాంకుల స్వల్పకాలిక వడ్డీ(పో)రేటు 7.25 శాతం నుంచి 7.5 శాతానికి చేరుకుంది. అలాగే రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని మాత్రం యథాతథంగా కొనసాగించింది. పెరిగిన రేట్లు తక్షణమే అమలులోకి వస్తాయని శుక్రవారం జరిగిన రెండో త్రైమాసిక మధ్యంతర పరపతి సమీక్షలో ఆర్‌బీఐ తెలిపింది. గతంలో ఆర్‌బీఐ.. అక్టోబర్ 2011 సమీక్షలో రెపోరేటును పావు శాతం పెంచింది. దాదాపు రెండేళ్ల తర్వాత ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దృష్ట్యా మళ్లీ పరపతి విధానంలో కఠిన వైఖరిని అనుసరించింది. రెపో రేట్లు పెరగడంతో బ్యాంకులకు గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లను పెంచడం తప్పకపోవచ్చని దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి అభివూపాయం వ్యక్తం చేశారు. పండుగ సీజన్ కావడంతో రుణాల డిమాండ్ భారీగా పెరుగనుందని, ఈ తరుణంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లను పెంచాల్సి రావచ్చని, తద్వారా రుణ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని చౌధురి అన్నారు.

కీలక రేట్లు పెంచినప్పటికీ బ్యాంకులకు ద్రవ్య లభ్యత పెంచే దిశగా కొన్ని నిబంధనలను మాత్రం సడలించింది. బ్యాంకుల మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)రేటును 0.75 శాతం తగ్గించింది. దీంతో ద్రవ్య సర్దుబాటు కోసం ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీరేటు 10.25 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది. అలాగే సీఆర్‌ఆర్ నిధుల రోజువారి సరాసరిని 99 శాతం నుంచి 95 శాతానికి తగ్గించింది. గరిష్ఠ స్థాయిలో ఉన్న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నదని, ధరల కట్టడి విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేమని సమీక్ష నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాదు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కూడా గతంలో అంచనా వేసినదానికంటే అధిక స్థాయిలోనే నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
vaddi
గతనెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 6.1 శాతంగా నమోదైంది. ఉల్లి ధరల ఘాటుతోపాటు భగ్గుమంటున్న కూరగాయల రేట్ల కారణంగా ఆగస్టునెలలో ద్రవ్యోల్బణం మళ్లీ 6 శాతం ఎగువకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ధరల సూచీని మళ్లీ సాధారణ స్థాయికి తగ్గించాలనే ఉద్దేశంతో వడ్డీరేట్లను పెంచడం జరిగిందని పాలసీ నివేదికలో రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని.. కుంటుపడ్డ పారిక్షిశామిక, సేవా రంగాల పనితీరు ఇందుకు కారణమని ఆర్‌బీఐ తెలిపింది. మౌలిక ప్రాజెక్టులు మందగించాయని, కొత్త వెంచర్ల ప్రారంభం కూడా ఆశించిన స్థాయిలో జరగ వెల్లడించింది. ఈమధ్యకాలంలో ఆర్థిక వృద్ధిరేటు సామర్థ్యం కన్నా తగ్గిందని, ఉత్పత్తి రంగంలో డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం (అక్టోబర్ 2013 నుంచి మార్చి 2014)లో వృద్ధి పుంజుకోనుందని రాజన్ పేర్కొన్నారు. ఆశాజనక వర్షపాతం కారణంగా పెరుగనున్న ఖరీఫ్ పంట దిగుబడి, పుంజుకుంటున్న ఎగుమతులు ఇందుకు దోహదపడనున్నాయని అన్నారు. అక్టోబర్ 29న తదుపరి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ధరల నియంవూతణే ఆర్‌బీఐ ప్రాధానత్య: రాజన్
గరిష్ఠ స్థాయి ధరలకు ఆర్‌బీఐ వ్యతిరేకమని, ద్రవ్యోల్బణ నియంవూతణకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు సమీక్ష నిర్ణయాల విడుదల అనంతరం జరిగిన సమావేశంలో రాజన్ తెలిపారు. ధరల సూచీని సాధారణ స్థాయి(5 శాతం లేదా అంతకంటే తక్కువ)కి కుదించాలన్నదే ఆర్‌బీఐ ప్రయత్నమని అన్నారు. కానీ ఎప్పటిలోగా సాధారణ స్థాయికి తగ్గుతుందనే విషయాన్ని మాత్రం ఆయన తెలుపలేదు. రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్య సడలింపు చర్యలు చేపట్టడం వృద్ధికి దోహదపడనుందని ఆయన సమీక్ష నిర్ణయాలను సమర్థించుకున్నారు. అలాగే రెపోరేటు, ఎంఎస్‌ఎఫ్ రేటు మధ్య వ్యత్యాసాన్ని ఒక శాతానికి తగ్గించేందుకు ప్రయత్నిస్తామని రాజన్ తెలిపారు.kplac

అంతేకాదు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య ఉద్దీపనలు తగ్గించినా క్యాపిటల్ మార్కెట్లలో చోటుచేసుకునే ప్రతికూలతను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. సమీక్ష నిర్ణయాల కోసం మున్ముందు ఆర్‌బీఐ టోకు ధరల సూచీ కాకుండా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆధారపడనుందా అని సమావేశంలో అడిగిన ప్రశ్నకు రాజన్ స్పందిస్తూ.. ‘‘ ద్రవ్యపరపతి సమీక్షపై ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో నియమించిన కమిటీ నివేదిక వచ్చాక ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.

రూపాయి ఇంకా స్థిరపడలేదు:
డాలర్-రూపాయి మారకం రేటు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నట్లు, ఇంకా కరెన్సీ విలువలో స్థిరత్వం రావాల్సి ఉందని రాజన్ అన్నారు. ఈమధ్యకాలంలో రుపీ విలువ కాస్త పుంజుకోవడం ఆర్‌బీఐకి కాస్త ఊరట కల్పించిందన్నారు. గతనెల 28న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం రేటు చరివూతాత్మక కనిష్ఠ స్థాయి(68.85)కి పడిపోయినప్పటికీ ప్రస్తుతం 62 స్థాయి వద్ద పుంజుకోగలిగింది. ఈనెల 4న గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గురువారం వరకు రూపాయి విలువ 8 శాతం పెరిగింది.

కఠిన నిర్ణయమైనా సరైనదే: రంగరాజన్
వడ్డీరేట్లను పెంచడం కఠినమైన నిర్ణయమైనప్పటికీ, సరైనదేనని ప్రధాని ఆర్థిక సలహామండలి చైర్మన్ సీ రంగరాజన్ అభివూపాయం వ్యక్తం చేశారు. రెపోరేటును పావు శాతం పెరగడం వృద్ధిపై ప్రతికూల ప్రభావమేమీ చూపించదని ఆయన అన్నారు.

సమతుల్య నిర్ణయం: అహ్లూవాలియా
ఒకవైపు కుంటుపడ్డ వృద్ధిరేటు.. మరోవైపు ఎగువముఖంగా ప్రయాణిస్తున్న ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ సమతుల్యంగానే వ్యవహరించిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. సమీక్షలో రాజన్ తీసుకున్న నిర్ణయాలతో ద్రవ్య లభ్యత పెరగటమే కాకుం డా.. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ కట్టడికి కట్టుబడి ఉందనే సంకేతాలను పంపిస్తుందని ఆయన అన్నారు.

బ్యాంకర్లలో మిశ్రమ స్పందన

పండుగ సీజన్ కావడంతో రుణాలకిప్పుడే డిమాండ్ పుంజుకుంటోంది. దీంతో బ్యాంకులు నిధుల కొరతతో సతమవుతున్నాయి. ఫలితంగా ద్రవ్య లభ్యత పెంచుకునేందుకు డిపాజిట్లపై చెల్లించే రేట్లు పెంచక తప్పదు. అందుకు అనుగుణంగా రుణాలపై విధించే వడ్డీరేట్లను కూడా పెంచాల్సి వస్తుంది.
- ప్రతీప్ చౌధురి, ఎస్‌బీఐ చైర్మన్

బ్యాంకుల ఎంఎస్‌ఎఫ్ రేటు, సీఆర్‌ఆర్ రోజువారి నిధుల సరాసరి నిబంధనలు తగ్గించడం స్వాగతించదగ్గ పరిణామం.
- చందాకొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో

ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయంతో బ్యాంకుల వడ్డీరేట్లపై తక్షణ ప్రభావమేమీ ఉండకపోవచ్చు. చాలావరకు బ్యాంకులు ఎంఎస్‌ఎఫ్ ద్వారానే రుణాలు తీసుకుంటున్నాయి. ఈ రేటును తగ్గించడం నిధుల సేకరణ వ్యయాన్ని కొంత తగ్గిస్తుంది.
-ఏకే గుప్తా, కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్


అసంతృప్తిలో పారిక్షిశామిక వర్గాలు

వృద్ధి పునరుద్ధరణకు గరిష్ఠ స్థాయి వడ్డీరేట్లు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత పెంచడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. మున్ముందు సమీక్షల్లోనైనా మా డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ సమీక్ష నిర్ణయాలు తీసుకుంటుందని నమ్ముతున్నాం.
- నైనా లాల్ కిద్వాయ్, ఫిక్కీ ప్రెసిడెంట్


ఇప్పటికే పారిక్షిశామిక వర్గాలు నిధుల లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో రెపోరేటును పెంచకుండా ఉండే బాగుండేది. ఎంఎస్‌ఎఫ్ రేటు తగ్గించడం మాత్రం కాస్త ఉరట కలిగించే విషయమే.
- చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్


వడ్డీరేట్లు పెంచడం ద్వారా ద్రవ్యోల్బణ కట్టడికే అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది. వడ్డీరేట్ల విషయంలో రాజన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఫైనాన్షియల్ మార్కెట్లే ఆయన నుంచి అతిగా ఆశిస్తున్నాయనుకంటా.
- రాణా కపూర్, అసోచామ్ ప్రెసిడెంట్


ఆటో కంపెనీల ఆశలపై నీళ్లుజల్లిన రాజన్

గత కొద్ది నెలలుగా విక్రయాలు తగ్గి సతమతమవుతున్న దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పండుగ సీజన్‌లోనైనా డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశతో ఉంది. కానీ ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు సంస్థల ఆశలపై నీళ్లు జల్లింది.
- సొసైటీ ఆఫ్ ఇండియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)


వడ్డీరేట్ల పెంపు ఊహించని పరిణామం. ఆటోమొబైల్ రంగానికిది పెద్ద కుదుపే. వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో ఈసారి పండుగ సీజన్‌లో విక్రయాలు మెరుగుపడుతాయని ఆశించాం. కానీ ఇప్పుడది కూడా సవాలుగా కన్పిస్తున్నది.
- పీ బాలేంవూదన్, జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్


అమ్మకాలకు గండి కొట్టే నిర్ణయం: రియల్టర్లు

రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆర్‌బీఐ రెపోరేటు పెంపుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తాజా పెంపుతో నిధుల సేకరణ వ్యయం మరింత పెరుగుతుందని, ఫలితంగా పండుగ సీజన్‌లో విక్రయాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభివూపాయపడ్డారు.

కీలక వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో రియల్టీ ఇండవూస్టీపై ప్రతికూల ప్రభావం పడనున్నది. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కస్టమర్లు గృహ రుణాలు తీసుకోవడానికి జంకుతున్నారు. తాజా పెంపుతో పండుగ సీజన్‌లో గృహ అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది.
-శేఖర్ రెడ్డి, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు


ప్రస్తుత పరిస్థితుల్లో రెపో రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఈ పరిణామం వృద్ధి పునరుద్ధరణపై మరింత ప్రభావం చూపిస్తుంది.
- అశోక్ త్యాగి, డీఎల్‌ఎఫ్ సీఎఫ్‌వో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి