1, సెప్టెంబర్ 2013, ఆదివారం

ముసుగు తొలగిద్దాం (మేధో మథనం) - జాహ్నవి


September 01, 2013

'ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తామయ్యా?' అని వాపోయారు ఆ కమ్యూనిస్టు కురువద్ధుడు. 'విప్లవం వస్తుందని, సమసమాజం ఏర్పడుతుందని, భూమ్మీద స్వర్గం సాక్షాత్కరిస్తుందని ఎన్నాళ్ళు ఈ అమాయక ప్రజలను మభ్యపెడదాం?' అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆ పెద్దాయన వ్యక్తిగతంగా ఎంతో నిజాయితీతో బ్రతికారు. కానీ ఆయన నమ్మినన్నాళ్ళు నమ్మి, ప్రచారం చేసి, ప్రజలను నమ్మించిన భావజాల విలువలు మాత్రం సమాజానికి ఎనలేని హాని చేశాయి. దాని ప్రభావం, పర్యవసానాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం. నినాదాలు, హామీలు, పథకాల ముసుగు చాటున ఇప్పటికీ అంతర్లీనంగా రాజ్యమేలుతున్న తప్పుడు భావ వ్యవస్థ స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకా అనుభవిస్తూనే ఉంటాం.

విడివిడిగా కనిపించే కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ప్రజలను గందరగోళ పెడుతున్నాయి. రూపాయి విలువ పడిపోయింది, ఉల్లిపాయల ధర అమాంతంగా పెరిగి పోయింది. ఆర్థిక వృద్ధి రేటు మళ్ళీ 1970ల స్థాయికి చేరింది. పరిశ్రమలు, సేవారంగాలు నష్టాల్లో మునిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరిన్ని జనాకర్షక పథకాలకు తెరతీస్తోంది. దాంతో లోటు బడ్జెట్ ఇంకా పెరుగుతుంది. ఆహార భద్రత పథకం వల్ల లోటు బడ్జెట్ పెరగడమే కాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో లాగా కాళ్ళ క్రిందకి నీళ్ళు వచ్చేదాకా పట్టించుకోరా? ఆగస్టు 15 ప్రసంగంలో ఆహార భద్రత బిల్లును నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శించారు. కానీ పదిహేను రోజుల్లోపే ఆయన పార్టీ అదే బిల్లుకు సంపూర్ణంగా మద్దతిచ్చింది. బొగ్గు బ్లాకుల కుంభకోణంలో ఫైళ్ళు గల్లంతయ్యాయి.

సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇంకో పక్క జడ్జీల ఎంపిక, నియామకాలు, బదిలీల అధికారాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విభజన నిర్ణయంతో దిగ్భ్రాంతి చెందిన ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రజలు అట్టుడుకుతున్నారు. నెలరోజుల్నించి రోడ్లెక్కి ఉద్యమిస్తున్నారు. కానీ జాతీయ మీడియాలో దీని గురించి అసలు ప్రస్తావనే లేదు. ముంబయిలో ఒక మహిళా విలేఖరిపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి రోజుల తరబడి ప్రసారాలు, చర్చాగోష్ఠులు నిర్వహించారు. కానీ ఒక మహిళ తన కొడుకును ప్రధానిని చెయ్యడానికి ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే జాతీయ మీడియాకు అదొక పెద్ద విషయంలా కనిపించదు. భారత్ నిర్మాణ్ ప్రకటనల పంపకం, దాని పేరిట డబ్బు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం విస్తృత విచక్షణాధికారాలు, దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట స్థితిలో ఉందంటున్న వారే వందల కోట్లు ప్రజా ధనం వార్తా సంస్థలకు పంచి పెడుతున్నారు.

రిజర్వు బ్యాంకు అజమాయిషీలో నిల్వ ఉండే బిలియన్ల డాలర్లు, నిబంధనల్లో స్వల్ప మార్పులు - వీటితో ఎవరికీ తెలియకుండా రూపాయి మారకం విలువను తాత్కాలికంగా అటూ ఇటూ మార్చొచ్చు. ఏనుగుల్లాంటి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలైన ఎల్ఐసీ, యూటీఐల దగ్గరుండే వేలకోట్ల నగదు నిల్వలనుపయోగించి స్టాక్ మార్కె ట్లో ప్రకంపనలు పుట్టించొచ్చు. ఇంత బలమున్న ప్రభుత్వాన్ని ఎవరు ఎదుర్కోగలరు? ఇన్ని అధికారాలున్న వ్యవస్థను నీతిమంతంగా నడుపుతామని ఏ పార్టీ వారు హామీ ఇచ్చినా, నమ్మగలమా? అదసలు మానవ సాధ్యమేనా?

అత్యున్నత న్యాయస్థానాలు కూడా తక్కువేం తినలేదు. తీర్పుల్లో అస్థిర, అస్పష్ట, జనాకర్షక భావజాల ప్రభావాలు కనిపిస్తుంటాయి. ఓట్లాకర్షక పథకాలను, కష్టజీవుల సంపద పునఃపంపకాన్ని ఇన్నాళ్ళు న్యాయస్థానాలు సంపూర్ణంగా సమర్థించాయి. దానికి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను, పీఠికలో ఇందిరాగాంధీ చేర్చిన 'సోషలిస్టు' శబ్దాన్ని ముసుగుగా వాడాయి. కాస్తో కూస్తో పనిచేస్తున్న ప్రైవేటు విద్యారంగాన్ని నాశనం చెయ్యబోయే విద్యా హక్కు చట్టాన్ని సమర్థించాయి. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలవ చెయ్యలేక, ముక్కబెడుతూ, పందికొక్కులకు మేపుతూ, పారబోస్తున్న ఎఫ్‌సీఐని రద్దు చెయ్యాల్సింది పోయి, ధాన్యాన్ని ఉచితంగా ఎం దుకు పంచిపెట్టట్లేదని ప్రశ్నించింది. అదే న్యాయస్థానం ఉచిత హామీలను పార్టీల మేనిఫెస్టోలలో చేర్చడాన్ని ఆక్షేపించింది! రెండేళ్ళు మించి జైలు శిక్ష పడినా, చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నా ఎన్నికల్లో పోటీకి అనర్హులని తీర్పిచ్చింది. ఆ లెక్కన 1977లో జార్జి ఫెర్నాండెజ్, అంతకు ముందు మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్‌లు కూడా ఎన్నికలలో పోటీ చెయ్యడానికి అనర్హులయ్యేవారు. ఈ రోజుల్లో ఆర్థిక, తదితర నేరస్థులకు ఓట్లేస్తున్న ప్రజల విచక్షణ ఏ గంగలో కలిసింది? రాజకీయ పార్టీలు కూడా సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని తీర్పు రాగానే, వామపక్షాలు సహా అన్ని పార్టీలు కలసిపోయి, ఏకగ్రీవంగా ఆ నిబంధనలు మార్చేశాయి. అలాగే నేరస్థుల ఎన్నిక అర్హతలు, ఉచిత హామీల విషయాల్లో అన్ని పార్టీలు ఏకమయ్యాయి.

సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని పార్టీల పట్లా నిరసనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ చేతిలో మోసపోయామన్న భావన విస్తృతంగా వ్యాపించింది. ఇలా ఎందుకు జరిగింది, ప్రజాస్వామ్యం ఎక్కడ ఫెయిలయింది అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీలను కాదనుకుని ఎటువైపు, ఎలా, ఎంతదూరం ముందుకు పోగలం? ఇప్పుడున్న వాటిని కాదని కొత్త పార్టీలు వచ్చినా అవి కూడా ఇలాగే తయారవవని నమ్మకమేముంది? ఎక్కడ తప్పు జరిగింది? సరిదిద్దుకోవడమెలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలే, వ్యక్తులుగా, చిన్న చిన్న సమూహాలుగా, ఆలోచించి, అర్థం చేసుకుని, నలుగురికీ తెలియజెప్పాలి. అంతే తప్ప, రాజకీయ పార్టీలు గానీ, న్యాయస్థానాలు గానీ, మీడియా గానీ, ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు గానీ సమాధానాలు చెప్పలేవు, చెప్పవు కూడా. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం సామాజిక శాస్త్రజ్ఞులకు ఒక ప్రయోగశాల వంటిది. ఒక కేంద్ర నాయకత్వం లేకుండా, క్షేత్రస్థాయిలో పూర్తిగా వికేంద్రీకరణమై ఉండడం వల్లే చొరవ, సృజనాత్మకత, అతి తక్కువ ఖర్చు, అహింసాయుతంగా సాగుతోంది.

ఒక వర్గం సమ్మె వల్ల ఇంకో వృత్తి పని వారికి ఎక్కువ హాని జరక్కుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో పరిపాలనంతా వికేంద్రీకరణ చెయ్యొచ్చు. కానీ విస్తృత, విశేష, విచక్షణాధికారాలు, ఒక లక్ష కోట్ల పై చిలుకు బడ్జెట్టు లేకపోతే ఇన్ని రకాల అధికార, అనధికార రాజ్యాధారిత వ్యవస్థలు మెయ్యడానికి గ్రాసం దొరకదు కదా! దీనికి సంబంధించిన ఆలోచనలకు ఉపయోగపడే శాస్త్రీయ, సిద్ధాంత నేపథ్యాన్ని సరళమైన భాషలో మీ ముందుంచుతాను. ఎవరి విశ్లేషణలు వారు చేసుకోవచ్చు, ఎవరి నిర్ణయాలకు వారు రావచ్చు.

ఆధునిక మానవ సమాజ నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర ఎందుకుండాలి, ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఆర్థిక సంబంధాలు, నియంత్రణలు లాంటి విషయాల్లో మార్క్సిస్టు సిద్ధాంత ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమై, మన దేశానికి గంపగుత్తగా దిగుమతి అయింది. 1850లలో మార్క్సు ప్రతిపాదించిన గతి తార్కిక భౌతిక వాదం, చరిత్ర పరిణామ వివరణ, వర్గ విశ్లేషణ, వర్గ పోరాట సిద్ధాంతాలు ఎవరూ ప్రశ్నించజాలని పవిత్ర సూత్రాలైపోయాయి. వాస్తవ జీవితంలో అవన్నీ సోవియట్ రష్యా, చైనా లాంటి ప్రయోగశాలల్లో పరీక్షించబడి, ఘోరంగా విఫలమయ్యాయి. అయినప్పటికీ వాటి సైద్ధాంతికతను, అందులోని లోపాలను గుర్తించే ప్రయత్నం అతి కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. మెజారిటీ మేధావులు పాత ఒరవడిలోనే కొట్టుకుపోతున్నారు. అంతేగాక ఈ విఫల సిద్ధాంతాలు మనలాంటి పేద దేశాలకు ప్రత్యేకంగా వర్తిస్తాయని, కులం, పేదరికం, అవిద్యలకు అదొక్కటే సమాధానమనే పైత్యాలు ప్రదర్శిస్తుంటారు. పడికట్టు పదాలే జ్ఞానమని, వాస్తవ వీక్షణం దృష్టికోణ లోపమని నమ్మిస్తుంటారు. దీనికి కారణం వ్యక్తిగత లాభనష్టాలు కావచ్చు, లేదా కేవలం మేధో బద్ధకం కావచ్చు. మార్క్సు ప్రతిపాదించిన చారిత్రక పరిణామ వివరాలు సరైనవే. కానీ ఆయన ఎంచుకున్న నైతిక కొలబద్ద, వివరణ, విశ్లేషణలు తప్పుడు అవగాహనతో కూడుకున్నవి. మధ్యయుగాల్లోని బానిసత్వాన్ని, భూస్వామ్య వ్యవస్థని, ఆధునిక యుగంలోని స్వచ్ఛమైన కాపిటలిస్టు వ్యవస్థను ఒకేగాట కట్టేస్తాడు.

ఆయన సిద్ధాంతం ప్రకారం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూడా దోపిడీ దారుడే. ఎవరికీ చెందని అడవినో, తుప్పలనో, కంచెనో కష్టపడి, శుభ్రం చేసి, ఒకాయన పొలంగా మార్చుకున్నాడనుకుందాం. దాన్ని పండించుకుంటూ, మిగుల్చుకున్న డబ్బుతో కొంత కాలానికి పిల్లలను చదివించుకుందామని పట్నం బయల్దేరాడనుకుందాం. వెళుతూ తన చేను కౌలుకిస్తే అది కూడా దోపిడీయే నంటాడు. ఈ విషయాల్లో మార్క్సు పప్పులో కాలేశాడని చిన్న పిల్లలకు, చదువురాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎటొచ్చీ చదువొచ్చిన వాళ్ళను గందరగోళ పరచి, తన సిద్ధాంతానికి ఒప్పించడానికి ఇంకొన్ని సూత్రా లు గాల్లోంచి కనిపెట్టాడు. అవేమిటో వచ్చేసారి చూద్దాం. ఇన్ని సమస్యల మధ్య నలిగిపోతుంటే ఇప్పుడీ సిద్ధాంత రాద్దాంతాలు అవసరమా, అంటే అవసరమే. సమస్య స్వభావాన్ని, దాని మూలాలను తెలుసుకోకుండా విశ్లేషణ, పరిష్కారం అసాధ్యం. ఈ బద్ధకం వల్లే ఒక పార్టీ పట్ల విసుగొచ్చి, ఇంకోటి అలాంటి పార్టీనే నమ్ముకుంటున్నాం.
- జాహ్నవి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి