September 01, 2013
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని అప్పడెప్పుడో విడుదలైన ఒక సినిమాలో నూతన్‌ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోట కూడా అదే మాట వింటున్నాం. నూతన్‌ప్రసాద్ ఆ డైలాగును కామెడీగా వాడారు. ఇప్పుడు ప్రధానమంత్రి సీరియస్‌గానే ఈ మాట అన్నప్పటికీ కామెడీగానే అనిపిస్తోంది. ఎందుకంటే తన తొమ్మిదేళ్ల ఏలుబడిలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని మితభాషి అయిన మన్మోహన్ సింగ్ అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు. ప్రధాన ప్రతిపక్షమైన బి.జె.పి. తన ఏలుబడిలో దేశం వెలిగిపోతున్నదని ప్రచారం చేసుకోగా, అధికార పక్షమైన కాంగ్రెస్.. ప్రపంచంలోనే భారతదేశం ప్రబల ఆర్థికశక్తిగా ఎదగబోతోందనీ, అందుకు తమ విధానాలే కారణమని చెప్పుకొంటూ వచ్చింది. మొత్తంమీద ఈ ప్రచారం అంతా నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని ప్రస్తుత ఆర్థిక స్థితిని బట్టి అర్థమవుతోంది.
మన రూపాయి రోజురోజుకూ దిగజారడం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రూపాయి పతనాన్ని బట్టి మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ దేశాన్ని దాదాపు 200 ఏళ్లపాటు పాలించి 66 ఏళ్ల క్రితం మనకు అప్పజెప్పి బ్రిటిష్‌వాళ్లు వెళ్లిపోయినప్పుడు ఒక రూపాయికి ఒక డాలర్ లభించేది. ఇప్పుడు 66 ఏళ్ల తర్వాత 66 రూపాయలు పెట్టినా డాలర్ లభించని పరిస్థితి. ఇందుకు ఆర్థికవేత్త కూడా అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పే కారణాలు ఎన్నో ఉండవచ్చు. కారణాలను ముందుగానే ఊహించలేనివాడు నాయకుడు ఎలా అవుతాడు? ఆ మాటకొస్తే మన్మోహన్‌సింగ్ నాయకుడని ఈ దేశ ప్రజలు కూడా అంగీకరించరు. కాంగ్రెస్ పార్టీకి ఆపద్ధర్మంగా లభించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన వ్యక్తిగా ప్రస్తుతానికి ఆయన చరిత్రలో మిగిలారు. ఎంతకాలం పాలించామన్నది కాదు. ఎలా పరిపాలించామన్నది ముఖ్యం.
ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాకుండా నామినేట్ చేయబడిన వ్యక్తి ప్రధానమంత్రి కావడమే ఈ దేశ దౌర్భాగ్యం. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఏ అధికారం లేని వ్యక్తి మన్మోహన్ సింగ్. ఏ పదవిలో లేకుండానే దేశాన్ని ఏలుతున్న వ్యక్తి సోనియాగాంధీ. దీంతో సోనియాగాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి ఒక కీలుబొమ్మలా మారారు. రైతులకు రుణ మాఫీ పథకం ద్వారా 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2014 ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రావడం కోసం 'ఆహార భద్రత' అనే ఒక చట్టానికి శ్రీకారం చుట్టింది. దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని తెలిసీ లక్షా 30 వేల కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి పథకాలను బాధ్యతగల ఏ రాజకీయ పార్టీ అయినా ప్రవేశపెడుతుందా? అధికార పక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తున్నాయి. త్వం శుంఠ అంటే త్వం శుంఠ అన్నట్టుగా అధికార, ప్రతిపక్షాలు వ్యవహరించడంతో ఈ దేశం ఒక నాయకుడనేవాడు లేని అనాథగా మారింది. ఆహార భద్రత చట్టం సోనియాగాంధీ మానస పుత్రిక అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకొంటున్నారు. ఈ దేశంలో 70 శాతం మందికి సబ్సిడీపై ఆహారధాన్యాలు అందించాల్సిన పరిస్థితి 66 ఏళ్ల తర్వాత ఎందుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లును సమర్థించిన ప్రతిపక్షాలు ముందుగా దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. నిజం చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు పది శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అయితే ప్రభుత్వ పథకాలేవీ అలాంటి వారికి అందడం లేదు. ఈ విషయం పట్టించుకోకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా 50 శాతం మందికి ఈ పథకాన్ని వర్తింపజేయడం ఏమిటి? అంటే ఈ దేశంలో పేదరికం నానాటికీ పెరుగుతోందన్న మాట. రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని అధఃపాతాళానికి తీసుకెళుతున్నాయి.
ప్రభుత్వ సొమ్ముతో పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పండించుకోవడానికి రాజకీయ పార్టీలు అలవాటుపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉచిత హామీలను కూడా ఎన్నికల నియమావళి పరిధిలోకి తీసుకురావలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ దేశం మా జాగీరు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అడగడానికి మీరెవరు అంటూ రాజకీయ పక్షాలన్నీ ఒక్కటై ఒంటి కాలి మీద లేచి న్యాయ వ్యవస్థ మీద దాడి చేశాయి. చట్టసభలలో నేరస్తులు ప్రవేశించడానికి వీలులేదని సుప్రీంకోర్టు అంటే, నేరస్తులు లేకపోతే రాజకీయాలకే అందం ఉండదు. మాకు పొద్దు గడవదు అన్నట్టు, సుప్రీంకోర్టు తీర్పుకు తూట్లు పొడుస్తూ చట్టం చేసి పారేశారు. పార్లమెంటు సభ్యులందరూ దొంగలు, నేరస్తులు కాకపోవచ్చు. కానీ ఇవ్వాళ ఈ దేశ ప్రజలకు పార్లమెంట్ సభ్యులపై ఉన్న గౌరవం ఏపాటిదో రాజకీయ పక్షాలు తెలుసుకోవాలి. దేశంలో అవినీతి పెచ్చరిల్లిందని వేదికలపై బుడి బుడి శోకాలు తీస్తున్న రాజకీయ పార్టీలు, తాము అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా దేశ ప్రజలను కూడా అవినీతిపరులుగా మార్చివేస్తున్నాయి. ప్రజలను ఉచితాలకు అలవాటు చేస్తూ వారిని మానసికంగా అవినీతిపరులను చేశాయి. దీంతో దేశంలో నైతిక విలువలన్నీ పతనమయ్యాయి. అన్ని విలువలూ పతనమయ్యాక నాకు మాత్రం విలువ ఎందుకని రూపాయి కూడా పతనం అవ్వడం ప్రారంభించింది. పూట గడవడం కోసం పేదలు ఇబ్బందులు పడుతుండేవారు.
ఇప్పుడు రాజకీయ పార్టీలకు కూడా పూట గడవడమే ముఖ్యం. ఎన్నికలలో గట్టెక్కి అధికారంలోకి రావడం ఒక్కటే వాటి ఎజెండాగా మారింది. ఈ కారణంగా దేశంపట్ల కనీస బాధ్యత లేకుండా రాజకీయ పార్టీలు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దేశ ప్రజలకు ఇప్పుడు ఏమి కావాలో రాజకీయ పార్టీలకు మాత్రమే తెలుసు. అందుకే పోటీలు పడి మరీ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. దేశ రాజకీయాలలో తలపండిన ఒక రాజకీయ ప్రముఖుడు మరో రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. "ప్రజలు వేశ్యల వంటి వారు. మనం ఎంత డబ్బు ఇచ్చినా మరురోజు వేశ్య వద్దకు వెళితే మళ్లీ ఏదో వంకతో డబ్బు అడుగుతుంది. ప్రజలు కూడా అంతే. మనం ఎంత చేసినా మళ్లీ మళ్లీ ఆశిస్తూనే ఉంటారు. అందుకే వారికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూపోతూ ఉండాలి. గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకొన్నంత మాత్రాన మనల్ని మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకురారు'' అని ఆ వృద్ధ నేత అన్నారట! ప్రజల గురించి, స్త్రీల గురించి, వేశ్యల గురించి ఆ మహానుభావుడికి ఉన్న నిరసనకు, ఆయన సంస్కారానికి జోహార్లు! ఆ వృద్ధ నేత అన్నట్టుగా నిజంగా ఈ దేశ ప్రజలు అలా మారి ఉంటే అందుకు రాజకీయ పార్టీలు కారణం కాదా? రెండు దశాబ్దాల క్రితం ఉచితాల పేరిట పథకాలు ఏమీ లేవే? ఇప్పుడే అవసరం ఎందుకు వచ్చింది? డబ్బిచ్చి సుఖం కొనుక్కున్నట్టుగా, ప్రజలకు సంక్షేమం పేరిట ఉచితంగా కొన్ని తాయిలాలు ప్రకటించి, మరోవైపు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు.
తమ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు. గత అయిదేళ్లలో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయి. ఆ మొత్తం అంతా కొద్దిమంది జేబుల్లోకి వెళ్లింది. బొగ్గు కుంభకోణమే తీసుకుందాం. బొగ్గు కేటాయింపుల్లో అవినీతి ఎప్పటినుంచో ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ నిస్సిగ్గుగా పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. ఎప్పటినుంచో అవినీతి ఉన్నట్టు తెలిసిన వ్యక్తికి దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవలసిన బాధ్యత లేదా? పైపెచ్చు ఇది సర్వసాధారణమన్నట్టుగా ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అంటే ఈ దేశ ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్టు? లక్షల కోట్ల అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే లక్ష కోట్లతో 'ఆహార భద్రత'ను తీసుకువచ్చారు. ఒకవైపు ఉపాధి హామీ పథకం, మరోవైపు ఆహార భద్రత? ఇక ఈ దేశంలో ఎవరైనా ఎందుకు పనిచేస్తారు? రాజకీయ పార్టీలకు కావలసింది ఇదే! ప్రజలు సోమరులుగా, బిచ్చగాళ్లుగా మారితే ఎప్పటికీ తామిచ్చే తాయిలాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు. వాళ్లు మాత్రం అధికారంలో ఉంటూ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ములో కొంత భాగాన్ని ఉచితాలకు కేటాయించి, సింహభాగాన్ని జేబుల్లో వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ విషవలయంలో చిక్కుకున్నాయి. మానవ వనరులే ఈ దేశానికి ఉన్న అతి పెద్ద సంపద. ఇప్పుడు ఆ మానవ వనరులను కూడా సర్వనాశనం చేసి తీరుతామని రాజకీయ పార్టీలు ఒట్టేసుకున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. జరగకూడనిది జరిగేలోపు పుత్ర రత్నాన్ని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్నది ఆమె అభిలాష. ఇందుకోసం ఎంతకు తెగించడానికైనా ఆమె సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆకలి చావులు లేకపోయినా ఆహార భద్రత తీసుకువచ్చారు. దీంతో వ్యవసాయ రంగం మరింత కుదేలైనా వారికి పట్టదు. అవసరమైతే ఆహార ధాన్యాలను కూడా దిగుమతి చేసుకుంటామంటారు. రైతు కూలీలు దొరకక గ్రామీణ ప్రాంతాలలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది. ఈ పరిస్థితులలో పులి మీద పుట్రలా వ్యవసాయ కమతాల పరిమాణాన్ని కుదించే విధంగా భూసంస్కరణల ముసాయిదాకు రూపకల్పన చేశారు. ఒక కుటుంబానికి అయిదు ఎకరాల మాగాణి, అదే మెట్ట అయితే పది ఎకరాలు మాత్రమే ఉండాలని ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. అయిదు ఎకరాల రైతు ట్రాక్టరు కొనుక్కుని వ్యవసాయం చేయగలడా? కాంగ్రెస్ పార్టీ ఏమి ఆలోచిస్తున్నదో తెలియడం లేదు. మూడోసారి అధికారంలోకి రావడం కోసం దేశాన్ని ఇంతగా భ్రష్టుపట్టించాల్సిన అవసరం ఉందా? ప్రజలతో సంబంధం లేని జైరామ్ రమేష్ వంటివారు ఇప్పుడు ఢిల్లీలో మేధావులుగా చెల్లుబాటు అవుతున్నారు. ముచ్చటగా మూడో పర్యాయం కూడా అధికారంలోకి రావడం కోసం ఇంత విధ్వంసం అవసరమా? "మళ్లీ అధికారంలోకి రాకపోతే చచ్చిపోతాం. నా కొడుకు ప్రధానమంత్రి కావడాన్ని కళ్లారా చూడాలనుకుంటున్నాను'' అని సోనియాగాంధీ ఈ దేశ ప్రజలను దేబిరిస్తే వారు కనికరించే అవకాశం ఉంది.
సొంతంగా మెజారిటీ లేకపోయినా దేశాన్ని ఛిన్నాభిన్నం చేసే నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియాగాంధీకి ఉందా? ప్రకటిస్తున్నవి ఉచిత పథకాలు కనుక అడ్డుకుంటే ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం ప్రతిపక్షాలకు పట్టుకుంది. దీంతో అందరూ ఏకమై దేశానికి ఎంత నష్టం చేయాలో అంతా చేయడానికి కంకణం కట్టుకున్నారు. అధికారం లేకుండా బతకడం ఎలా అన్న పరిస్థితికి రాజకీయ నాయకులు వచ్చారు. దీంతో మొత్తం రాజకీయ వ్యవస్థపైనే ప్రజలలో నమ్మకం పోతోంది. ఇది అంతిమంగా ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఓట్లు- సీట్లు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్న ఈ రాజకీయ పార్టీలు రేపు డబ్బు కోసం దేశాన్ని అమ్మేయరని గ్యారంటీ ఏం ఉంది? సిగ్గుమాలిన, నీతిమాలిన రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మన్మోహన్ సింగ్‌కు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పే అర్హత కూడా లేదు. అయినా దేశం ఈ పరిస్థితికి చేరడానికి ఎవరు కారణం? ఒక ప్రధానమంత్రిని ఏ దేశంలోనైనా నిండు సభలో "దొంగ'' అంటారా? అని మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తంచేయడంలో తప్పు లేదు. అయితే ఏ దేశంలోనైనా ఇన్ని కుంభకోణాలు జరిగి కూడా నిందితులు నాయకులుగా చెల్లుబాటు అవ్వడం చూశామా? అని ఆయన తనను తాను ప్రశ్నించుకోవాలి.
స్వయంగా ఆర్థికవేత్త అయి ఉండి, అప్పు చేసి పప్పు కూడు తినడానికి ప్రజలను అలవాటుచేయడం నేరం కాదా? ఒక అప్పు చెల్లించడానికి మరోచోట అప్పు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని చిన్నపిల్లవాడికి కూడా తెలుసే! అయినా విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటును ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తీయడం ఏమిటి? మన దేశంలో డాలర్లలో పెట్టుబడి పెట్టినవాళ్లు డాలర్ల రూపంలోనే తిరిగి తీసుకువెళతారు కదా? ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా దిగుమతులను నిరుత్సాహపరచి, ఎగుమతులను ప్రోత్సహించవలసిందిపోయి, ఉన్న డబ్బును పప్పుబెల్లాలుగా ప్రజలకు సంక్షేమం పేరిట పంచడం ఈ దేశానికి చేస్తున్న ద్రోహం కాదా? ప్రజలలో వినిమయతత్వాన్ని అడ్డగోలుగా పెంచడంతో పాటు పొద్దున్నే లేచి పళ్లు తోముకునే టూత్‌పేస్టుల దగ్గర నుంచి పడుకునే వరకు తినే తిండి, వాడే ప్రతి వస్తువు విదేశాలలో తయారైన వాటికి ప్రజలను అలవాటుచేసింది ఎవరు? వేప పుల్లలు, కచ్చికలతో పళ్లు తోముకునే ఈ దేశ ప్రజలు దంతక్షయంతో బాధపడలేదే? ఓట్స్ తినకపోయినా ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారే? తాము బాధ్యతారహితంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రజలను కూడా బాధ్యతారహితంగా మార్చివేశారు. బంగారం, చమురు దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటు పెరిగి రూపాయి పతనం అవుతుందని ఇప్పుడు సెలవిస్తున్నారు. ఈ దేశ ప్రజలలో ఉన్న గొప్ప సుగుణాలలో ఒకటైన పొదుపు నుంచి ప్రజలను దూరం చేసింది ఎవరు? జాతీయ పొదుపు పథకం గురించి ఇప్పుడు ఎవరికైనా తెలుసా? తెలియకపోవడానికి కారణం ఎవరు? అనుత్పాదక ఖర్చులకు రుణ సదుపాయం కల్పించి, ఉత్పాదక పథకాలకు రుణం దొరకని పరిస్థితి కల్పించింది ఎవరు? పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించే వారికంటే, రైతుకు మేలు చేసే ట్రాక్టర్ల కొనుగోలుకి ఇచ్చే రుణాల కంటే, తక్కువ వడ్డీకి కార్లు కొనుక్కోవడానికి రుణాలు ఇవ్వడం దేశానికి మేలు చేయడం అవుతుందా? చేయాల్సినదంతా చేసి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడం కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరే నైతిక హక్కు ప్రధానమంత్రికి ఉందా? పాకిస్థాన్‌తో యుద్ధానంతరం అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్ శాస్త్రి తను ఒక్క పూటే తింటూ, దేశ ప్రజలను కూడా తినే తిండిని కొంత తగ్గించుకుని రక్షణ నిధికి విరాళాలు ఇవ్వవలసిందిగా పిలుపు ఇచ్చారు. ఆయనపై ఉన్న గౌరవం, భక్తితో దేశ ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ప్రజలలో అంతటి గౌరవం పొందుతున్న నాయకుడు మచ్చుకు ఒకరైనా లేరే! బంగారం లేకపోతే జనం చచ్చిపోరు కదా? పెట్రోల్, డీజిల్ వాడకాన్ని నియంత్రిస్తే వచ్చే నష్టం ఏమిటి? అయిన దానికి కాని దానికి వాహన వినియోగం పెరిగిపోయింది.
ప్రభుత్వంతో సహకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అయితే ప్రభుత్వ అధినేతలపై వారికి నమ్మకం ఉండాలి. అదే ఇప్పుడు లోపించింది. నువ్వు ఆదర్శంగా ఉంటే ఇతరులను ఆదర్శంగా ఉండమని చెప్పవచ్చు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై ప్రజలలో సదభిప్రాయమే లేదు. అలాంటప్పుడు ప్రస్తుత సంక్షోభానికి ఎన్ని కారణాలు చూపెట్టినా ప్రజలు మిమ్మల్నే దోషులుగా చూస్తారు. ఈ దేశంలో సంపదకు, డబ్బుకు కొదవ లేదు. అయితే నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అవి దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. దేశంలోని వివిధ కంపెనీలు వ్యాపారాభివృద్ధి కోసమై డాలర్ల రూపంలో తీసుకున్న రుణాలతో కలిపి, వచ్చే ఏడాది మన దేశం నుంచి 250 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించవలసి ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఇలాగే ఉంటే వచ్చే ఏడాది డాలర్‌తో రూపాయి విలువ 80 నుంచి వందకు చేరుకునే ప్రమాదం ఉంది. ఈ దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే కావలసింది ఆహార భద్రత కాదు. పొదుపు. అప్పుల కోసం విదేశీ పెట్టుబడులు అంటూ అర్రులు చాచే బదులు దేశ ప్రజల వద్ద ఉన్న సంపదతో మనల్ని మనమే అభివృద్ధిచేసుకోగలం. కడచిన పదేళ్లలో దేశానికి ఎంత నష్టం చేయాలో అంత నష్టంచేశారు. రాజకీయ పార్టీలు 2014 ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించకుండా కొంచెం దేశం గురించి ఆలోచిస్తే పరిస్థితులు కచ్చితంగా మెరుగుపడతాయి. అలా కాకుండా దేశం ఏమైపోయినా పర్వాలేదు. రూపాయి ఎంత పతనమైనా పర్వాలేదు అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. నొప్పి తెలిసినప్పుడే ఎవరైనా స్పందిస్తారు. ప్రజలకు కూడా ఏదో ఒక రోజు నొప్పి తెలియకపోదు.
ఆరున్నర దశాబ్దాల స్వీయ పాలనలో ఇంతగా దిగజారడమే ఆవేదన కలిగిస్తోంది. మనకంటే బ్రిటిష్ వాళ్లే నయం అన్న భావన కలగడం ప్రమాదకరం. అయినా అది వాస్తవం. అందుకు రాజకీయపార్టీలు, వాటి నాయకులే కారణం. పరిస్థితి ఇలాగే ఉంటే మన దేశాన్ని కలిపేసుకోవలసిందిగా అమెరికాను వేడుకునే రోజు రావచ్చు. వాళ్ల డాలర్‌తో ఎలాగూ పోటీపడలేకపోతున్నాం. ఆ దేశంలో భాగమైపోతే మన కరెన్సీ కూడా డాలర్ అవుతుంది. కలుపుకోవడానికి అమెరికా ఒప్పుకోదు గానీ లేకపోతే ఆ దేశంతో కలిసిపోవడమే మేలు. ఎందుకంటే అక్కడ డాలర్ విలువే కాదు. అన్ని వ్యవస్థలూ పదిలంగా ఉన్నాయి.
దేశం విషయం కాసేపు పక్కన పెట్టి రాష్ట్రం విషయానికి వద్దాం. రూపాయి పతనంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు సంబంధం లేదు. విభజన, సమైక్య ఉద్యమాలతో వారు బిజీగా ఉన్నారు. రాజకీయ పార్టీలన్నీ పరనింద ఆత్మస్తుతితో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పుడు రాజకీయ పార్టీల అదుపులో లేవు. సీమాంధ్రలో నెల రోజుల క్రితం ప్రారంభమైన ఉద్యమం తగ్గకపోగా, పెరగడంతో రాజకీయ పార్టీలు చేష్టలుడిగి చూస్తున్నాయి. అదే సమయంలో పరస్పరం నిందించుకోవడంలో పోటీ పడుతున్నాయి. ఉద్యమాలతో అట్టుడుకుతున్న సీమాంధ్రలో పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నిరసన దీక్షను చేపట్టగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర మొదలెడుతున్నారు. ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ పార్టీకి ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు. రాష్ట్రంలో ఇంతటి అయోమయ పరిస్థితులు నెలకొన్నా కాంగ్రెస్ అధిష్ఠానానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైపెచ్చు సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా, అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనీ, హైదరాబాద్‌పై తమకూ హక్కు ఉందని చెప్పుకోవడానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులతో, "ఆ రెండూ తప్ప వేరే ఏదైనా మాట్లాడండి'' అని ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్ వంటి వారు వ్యాఖ్యానించడం సీమాంధ్రులకు పుండు మీద కారం రాసినట్టుగా ఉంది.
విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం జరిగే పని కాకపోవచ్చు. ఆ విషయాన్ని సున్నితంగా చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో మేం ఏమి చేయాలో చెప్పండి. మీకు ఏమి కావాలో అడగండి అని సాంత్వన కలిగేలా మాట్లాడవచ్చు. అయితే తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోంది. దీంతో వ్రతం చెడినా ఫలం దక్కలేదన్నట్టుగా, తెలంగాణలో కూడా రాజకీయ ప్రయోజనం చేకూరని పరిస్థితి ఏర్పడుతోంది. విభజన ప్రక్రియ ముందడుగు పడకపోవడంతో తెలంగాణ ప్రజలలో అనుమానాలు మొదలయ్యాయి. సీమాంధ్ర ఉద్యోగులు ఎంత కాలం సమ్మె చేస్తారో తెలియదు. ఆ ప్రాంతంలో రగులుతున్న ఉద్యమాలకు భయపడి రాజకీయ పార్టీలన్నీ స్వరం మార్చుకుంటున్నాయి. విభజన చేసినా పర్వాలేదన్న కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీలకు, ప్రభుత్వాలకు ప్రజలే సెలవు ప్రకటిస్తారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి హెచ్చరికలు పంపుతున్నారు. తెలంగాణ ఉద్యమం జోరు మీదున్నప్పుడు ఆయా రాజకీయ పార్టీలు పోటీలు పడి మరీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేశాయి. ఇప్పుడు విభజన ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం వేడెక్కడంతో సమైక్యవాద రాగం ఆలపించడం మొదలెట్టాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ వ్యవహారం వల్ల కొడవళ్లు దూసుకునే పరిస్థితికి వచ్చాయి. సోనియాగాంధీ ఆదేశించినా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు వినే పరిస్థితులలో లేరు. అదే విధంగా చంద్రబాబు చెప్పినా తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర తమ్ముళ్లు శాంతించేలా లేరు.
విభజన నిర్ణయానికి ముందు తెలంగాణవాదం పట్ల అంతగా ఆసక్తి చూపని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు ఇప్పుడు వీర తెలంగాణవాదులుగా అవతరించారు. అదే విధంగా విభజనకు మానసికంగా సిద్ధపడిన కాంగ్రెస్, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర నాయకులు ఇప్పుడు తాము సమైక్యవాదం కోసమే పుట్టాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. దీనికంతటికీ ప్రజలలో నెలకొన్న సెంటిమెంటే కారణం. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రస్తుత సమస్య నుంచి బయటపడలేక పోతున్నాయి కనుక కాంగ్రెస్ అధిష్ఠానమే రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తీసుకోవాలి. తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు అంగీకరించిన తర్వాత రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని దిగ్విజయ్ సింగ్ వంటి వాళ్లు ఇప్పుడు చెప్పవచ్చు గానీ అవి తర్కానికి పనికి రావు. ఆ రెండు పార్టీల అభిప్రాయంతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఇదే కాంగ్రెస్ పార్టీ గత జనవరిలో నిర్ణయం తీసుకున్నది వాస్తవం కాదా? అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున "నై తెలంగాణ'' ప్రకటనను కొంత కాలం వాయిదా వేయవలసిందిగా అప్పట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు.
వాస్తవం ఇది! ఇప్పుడు నెపం ఇతరుల మీదకు నెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఫలితం ఉండదని దిగ్విజయ్ సింగ్ గుర్తించాలి. విభజన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీనే ఎందుకు బాధ్యులను చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనను కలిసిన సీమాంధ్రకు చెందిన ఒక కేంద్ర మంత్రి వద్ద బోలెడంత ఆశ్చర్యం వ్యక్తంచేయగా.. మరణశిక్ష ఎవరు విధించినా చివరకు శిక్ష అమలుచేసిన తలారికే మానసిక క్షోభ మిగులుతుందనీ, విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదేనని సదరు కేంద్ర మంత్రి బదులిచ్చారు. దీన్ని బట్టి బాధ్యత నుంచి కాంగ్రెస్ పార్టీగానీ, ఆ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గానీ తప్పించుకోలేవు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను సంక్షోభంలోకి నెట్టకుండా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటారని ఆశిద్దాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి