అలా మొదలైంది...
September 02, 2013
రెండో ప్రపంచ యుద్ధం దెబ్బకు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా పేరొందిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆర్థికంగా కుదేలైపోయింది. అక్కడి పరిశ్రమలన్నీ నాశనమైపోయాయి. నిజానికి అప్పటికి అమెరికా పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. పెరిగిన ద్రవ్యోల్బణంతో అతలాకుతలంగా ఉంది. కానీ, ఆ సమయంలో యూకే బలహీనతను అగ్రరాజ్యం తెలివిగా వాడుకుంది.
తన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే.. అప్పటిదాకా బలంగా ఉన్న పౌండ్ స్థానంలో డాలర్‌ను వ్యాప్తి చేసేలా రెండు విధాల ప్రయోజనం పొందే వ్యూహాన్ని రచించింది. ఆర్థికంగా దివాలా తీసిన యూకేకు ఆ రోజుల్లో ఏడాదికి రెండు శాతం వడ్డీతో 4.34 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది (ఆ అప్పును వడ్డీతో సహా పూర్తిగా తీర్చడానికి బ్రిటన్‌కు 60 ఏళ్లకు పైగా పట్టింది). ఒక చేత్తో అప్పు ఇస్తూనే.. రెండోచేత్తో బ్రెట్టన్‌వుడ్స్ ఒప్పందాన్ని బ్రిటన్‌తో ఆమోదింపజేసుకుంది.
యుద్ధంతో కుదేలవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే ఉద్దేశంతో 1944 జూలై తొలి మూడువారాల్లో 44 మిత్రరాజ్యాలకు చెందిన 730 మంది ప్రతినిధులు అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో ఉన్న బ్రెట్టన్‌వుడ్స్‌లో సమావేశమై ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ విత్త వ్యవస్థ నియంత్రణకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు, నిర్వహణకు అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్), అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకును (ఐబీఆర్‌డీ-ప్రపంచబ్యాంకు అసలు పేరు ఇదే) ఏర్పాటు చేశారు (అందుకే ఈ రెండిటినీ బ్రెట్టన్‌వుడ్స్ కవలలుగా వ్యవహరిస్తారు). కరెన్సీ మారక విలువలను స్థిరంగా ఉంచేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థే.. ఐఎంఎఫ్. అందుకు వారు ఎంచుకున్న రిజర్వ్ కరెన్సీ.. డాలర్ (అదే ఎందుకూ అంటే.. కర్ర ఉన్నవాడిదే బర్రె అనే సామెత గుర్తుందా? అదే కారణం. ఐఎంఎఫ్ నిధుల్లో మూడోవంతు అమెరికావే. అందుకే అది చెప్పిన షరతుల ఆధారంగానే ఐఎంఎఫ్ పనిచేస్తుంటుంది).
అంటే అప్పటిదాకా కరెన్సీ విలువను నిర్ణయించడానికి దేశాలన్నీ అనుసరిస్తున్న గోల్డ్ స్టాండర్డ్ విధానానికి డాలర్‌ను ప్రామాణికం చేశారు.
ఒకప్పుడు ప్రతిదేశమూ తన కరెన్సీ విలువను నిర్ణయించడానికి బంగారాన్ని ప్రమాణంగా నిర్ణయించుకునేది. ఉదాహరణకు.. అమెరికా గ్రాము బంగారం విలువ 1డాలరుగా నిర్ణయించిందనుకోండి..ఒక డాలర్ ముద్రించినప్పుడల్లా గ్రాము బంగారాన్ని రిజర్వుగా భద్రపరిచేది. అలా ఎంత విలువ కలిగిన కరెన్సీ ముద్రిస్తే అంత బంగారాన్ని దాచిపెట్టేది. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గితే ప్రజలు బంగారంతో కరెన్సీని మార్పిడి చేసుకునే వీలుండేది. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ (పసిడి ప్రమాణం) అంటారు. ఇలా ఏ దేశానికి ఆ దేశం తనదైన సొంత స్వర్ణ ప్రమాణాన్ని నిర్వచించుకోవడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో మారక విలువలు స్థిరంగా ఉండేవి కావు. ఇది చాలా సమస్యలకు దారి తీసింది. ఈ ఇబ్బందిని నివారించే పేరుతో బ్రెట్టన్ వుడ్స్ యంత్రాంగం ద్వారా బంగారానికి బదులు డాలర్‌ను పరోక్షంగా రిజర్వుగా మార్చారు.
దేశాలన్నీ వేటికవే సొంత స్వర్ణ ప్రమాణాన్ని అనుసరించకుండా.. బ్రెట్టన్ వుడ్స్ యంత్రాంగం ఒక ఔన్సు బంగారానికి 35 డాలర్ల ధరను నిర్ణయించింది. అంటే.. అన్ని దేశాల కరెన్సీ మారక విలువ ప్రత్యక్షంగా బంగారంతో ఉన్నట్టు కనిపిస్తున్నా, పరోక్షంగా డాలర్‌తో ముడిపడి ఉంటుందన్నమాట!! ఆ ధరకు అనుగుణంగా అవి తమ కరెన్సీలను ముద్రించుకోవాల్సి వచ్చేది. ప్రపంచంపై డాలర్ పెత్తనానికి దారులు తెరుచుకున్న క్షణమది. 'పెద్దన్న' కరెన్సీ అనధికారిక అంతర్జాతీయ కరెన్సీగా మారిపోయిన సమయమది!! బ్రెట్టన్ వుడ్స్ యంత్రాంగంతో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలకు డాలర్లు సరికొత్త ప్రామిసరీ నోట్లుగా మారాయి. దీంతో ప్రపంచదేశాలు కొత్తగా తమతమ కరెన్సీ ముద్రించుకోవాలంటే బంగారాన్ని రిజర్వు చేయాల్సిన పని లేకపోయింది. దానికి బదులుగా డాలర్లు సంపాదించుకుంటే సరిపోయేది. ఎప్పుడు బంగారం కావాలంటే అప్పుడు అమెరికా వద్దకు వెళ్లి.. ఎడం చేత్తో డాలర్లు పారేసి కుడిచేత్తో బంగారం తెచ్చుకునేవి.
కరెన్సీ లోటు ఉన్న దేశాలన్నీ బ్రెట్టన్‌వుడ్స్ ఒప్పందం నేపథ్యంలో.. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వద్ద అప్పులు చేసేవి. ఆ అప్పులన్నీ డాలర్లలోనే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తీసుకునేది డాలర్లలో అయినప్పుడు తీర్చాల్సిందీ డాలర్లలోనే కదా!! దానికి మార్గం వస్తువుల రూపంలోగానీ, సేవల రూపేణాగానీ అమెరికాకు ఎగుమతులు పెంచాలి. దీంతో అన్ని దేశాలూ అమెరికాకు ఎగబడి ఎక్స్‌పోర్ట్స్ పెంచాయి. మిగతా దేశాలతో పోటీపడి తమ వస్తువుల్ని అమ్ముకోవాలి కాబట్టి వాటికి చౌక ధరలు నిర్ణయించాలి. అమెరికా ప్రజలకు స్వర్ణయుగంలాంటి కాలం అది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వస్తువులు ఆ రోజుల్లో వారికి అత్యంత తక్కువ ధరలకు లభించేవి.
ఆయా దేశాలకు డాలర్లు ఇచ్చేందుకు యూఎస్ ఎడాపెడా డాలర్లు ముద్రించేసేది. ఈ సందట్లో ఎవరూ గుర్తించని అంశమేంటంటే.. ఎడాపెడా ముద్రించిపారేస్తున్న డాలర్లకు సరిపడా బంగారం అమెరికా వద్ద లేదు. ఆ దేశం వద్ద ఉన్న బంగారం.. అది ముద్రించిన డాలర్లలో కేవలం 22 శాతానికి మాత్రమే సమానం. బ్రెట్టన్ వుడ్స్ యంత్రాంగం సమయంలో నిర్ణయించిన ప్రకారం ఔన్సు బంగారం ధర 35 డాలర్లయితే.. మార్కెట్లో బంగారం విలువ దానికి మూడింతలుంది. డాలర్లు పోగేసుకున్న దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లతో అమెరికా నుంచి బంగారాన్ని కొని మార్కెట్ ధరకు అమ్ముకుందామని నిర్ణయించుకుని ఒకేసారి వచ్చి డాలర్లు ఇచ్చి బంగారం ఇవ్వమని అడిగితే అగ్రరాజ్యం పరిస్థితి ఏంటి? 1971 మేలో పశ్చిమ జర్మనీ బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం నుంచి వైదొలగింది.
అదే ఏడాది జూలైలో స్విట్జర్లాండ్ 50 మిలియన్ డాలర్లకు, ఫ్రాన్స్ 191 మిలియన్ డాలర్ల సరిపడా బంగారాన్ని డ్రా చేసుకున్నాయి. 1971 ఆగస్టు 9న స్విట్జర్లాండు కూడా బ్రెట్టన్‌వుడ్స్ ఒప్పందం నుంచి వైదొలగింది. ఇది ఇలాగే కొనసాగి మిగతా దేశాలన్నీ డాలర్లిచ్చి బంగారం అడిగితే తమ దేశం పరిస్థితి అతలాకుతలం అయిపోతుందని అంకుల్‌శామ్‌కు అర్థమైంది. దీంతో.. 1971 ఆగస్టు 15న.. అమెరికా (అప్పటి) అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్లు ఇస్తే బంగారం ఇవ్వబోమంటూ ప్రకటన చేశాడు. ప్రపంచదేశాలన్నీ నివ్వెరపోయేలా నిక్సన్ ఇచ్చిన ఈ షాక్‌కి ఆర్థిక నిపుణులు పెట్టిన పేరు.. 'నిక్సన్ షాక్'!! ప్రపంచంలోని పలు దేశాలు అప్పటిదాకా పోగేసుకున్న డాలర్లన్నీ నిక్సన్ షాక్ దెబ్బకు చిత్తుకాగితాలతో సమానమైపోయాయి.
అదే సమయంలో.. డాలర్ల కోసం వెంపర్లాడాల్సిన పని లేదు కాబట్టి ఆ దేశాలన్నీ అమెరికాకు ఎగుమతులు తగ్గించాయి/ఆపేశాయి. అమెరికా డాలరు మిగతా అన్ని దేశాల కరెన్సీతో సమానమైపోయింది. దానికోసం ఎగబడేవారెవరూ లేక డీలాపడింది. దీంతో తన ఆర్థిక వ్యవస్థను బతికించుకోవడానికి అమెరికా ఎగుమతులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకోసం నిక్సన్ డాలర్ విలువను కృత్రిమంగా తగ్గించాడు. తన దేశంలోకి దిగుమతి అయ్యే చీప్ వస్తువుల వల్ల స్థానిక పరిశ్రమలు దెబ్బతినకుండా 10 శాతం దిగుమతి సుంకం విధించారు. కానీ అలా ఎంతకాలం? అన్నాళ్లూ తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులతో కళకళలాడిన అమెరికా మార్కెట్ల పరిస్థితి ఏమిటి? రక్తం రుచి మరిగిన పులి ఎన్నాళ్లని వేటాడకుండా చేతులు కట్టుకుని కూర్చోగలదు? అదుగో.. సరిగ్గా అప్పుడు... అరబ్ దేశాల చమురుపై అమెరికా కన్నుపడింది.
(ఆ కథేంటో రేపు చూద్దాం)
-సెంట్రల్ డెస్క్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి