September 03, 2013
బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం పుణ్యమా అని 1945 నుంచి 1971 దాకా వెలిగిపోయిన డాలర్.. 'నిక్సన్ షాక్' దెబ్బకు కుదేలైపోయి మిగతా కరెన్సీలతో సమానమైపోయింది. ఇలాంటి పరిస్థితిని అగ్రరాజ్యం ఎలా జీర్ణించుకోగలదు? అందుకే తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు మార్గాలు వెతికింది. అలాంటి సమయంలో అమెరికా కన్ను.. అరేబియా దేశాల వద్ద ఉన్న చమురుపై పడింది. అంతే.. 1972 నుంచి నిక్సన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎగుమతిదారు సౌదీ అరేబియాతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దానిప్రకారం.. సౌదీ అరేబియాకు అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, సైనిక సహాయం అందజేస్తుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా తన చమురు విక్రయాలను డాలర్లలో మాత్రమే చేయాలి. అంటే.. ప్రపంచంలోని మిగతా దేశాల కథ మళ్లీ మొదటికి వచ్చింది. పారిశ్రామిక యుగం కొత్తపుంతలు తొక్కుతున్న దశలో ఏ దేశానికైనా తప్పనిసరిగా కావాల్సిన వస్తువు, ఏటా కొన్ని లక్షల కోట్లు చెల్లించి కొనాల్సిన వస్తువు.. చమురు. ఈ తప్పనిసరి అవసరాన్ని సరిగ్గా గుర్తించిన నిక్సన్.. సౌదీతో మంత్రాంగం నెరపి ప్రపంచ దేశాలను చావుదెబ్బ కొట్టాడు.
సౌదీ బాటలోనే ఇతర చమురు ఎగుమతుల దేశాలన్నీ (ఒపెక్-ద ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) డాలర్లకు జై కొట్టడంతో చమురు కొనుగోళ్ల కోసం దేశాలన్నీ మళ్లీ డాలర్లను సంపాదించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డాలర్లు సంపాదించుకోవాలంటే అమెరికాకు ఎగుమతులు చేయాల్సిందే. దట్సిట్! నిక్సన్ పథకం అనుకున్న ఫలితాన్నిచ్చింది!! పెద్దన్న కరెన్సీకి మళ్లీ అనధికార అంతర్జాతీయ కరెన్సీ హోదా వచ్చింది. అంతకు ముందు దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు డాలర్‌కు ఆ హోదా ఇచ్చింది బంగారం అయితే.. ఈసారి పెట్రోలు వంతు. అందుకే 'పెట్రో డాలర్' అనే పదబంధం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. చమురు నేపథ్యంలో అమెరికాకు ఇంకో ప్రయోజం కూడా దక్కింది. అదేంటంటే.. ఎలాగూ చెల్లించేది తన కరెన్సీలోనే గనక మళ్లీ ఇష్టానుసారం తనకు కావాల్సినన్ని డాలర్లను ముద్రించుకుని ఆ డబ్బుతో ఆయిల్ కొనుగోళ్లు చేపట్టింది. దీనివల్ల చాలా తక్కువ ధరలకే అమెరికన్లకు చమురు అందుబాటులోకి వచ్చింది. అది వారికి పారిశ్రామిక వృద్ధికీ ఎంతగానో ఉపయోగపడింది. ఇదే సమయంలో.. ప్రపంచ దేశాలన్నీ ఎక్కువ డాలర్లను సంపాదించడం కోసం పోటీలు పడి ఎగుమతులు చేశాయి. తమ ఉత్పత్తులనే కొనిపించాలి కాబట్టి.. వాటి ధరలు తగ్గించడానికి తమ కరెన్సీ విలువను కృత్రిమంగా తగ్గించుకున్నాయి. మనదేశంలోనూ 1990ల్లో జరిగింది అదే.
2000 సంవత్సరంలో అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగేలా ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కొన్ని చర్యలు ప్రకటించడంతో పెద్దన్నకు పట్టరాని కోపం వచ్చింది. తాము విక్రయించే చమురుకు చెల్లింపులు డాలర్లలో కాకుండా యూరోల్లో తీసుకుంటామని సద్దాం చెప్పడం ఇరాక్‌ను ఎంతటి దారుణ పరిస్థితికి నెట్టిందో నేటికీ మన కళ్లతో మనం చూస్తూనే ఉన్నాం. జన హనన ఆయుధాల నెపంతో 2003లో ఇరాక్‌పై యుద్ధానికి తెగబడ్డ అగ్రరాజ్యం.. ఆ దేశంలో దారుణ విధ్వంసం సృష్టించి సద్దాంను ఉరితీసి ఇరాక్‌లో చమురు క్షేత్రాలన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికీ అక్కడ ప్రజల భద్రత కంటే చమురు క్షేత్రాల భద్రతకు అమెరికా చేస్తున్న ఖర్చు ఎక్కువ అంటే.. అగ్రరాజ్యం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఇరాక్ బాటలోనే ఇరాన్ కూడా.. బంగారం, యూరోలు, జపనీస్ యెన్‌లు, తన కరెన్సీ అయిన రియాళ్లను చమురు విక్రయాలకు అంగీకరిస్తానని ప్రకటించడం అమెరికా ఆగ్రహావేశాలకు కారణమైంది. అందుకే అక్రమ అణ్వాయుధాల పేరుతో ఇరాన్‌పై పదేపదే ఒంటికాలిపై లేస్తోంది. ఇరాన్ తర్వాత రష్యా సైతం రూబుళ్లలో, వెనెజువెలా యూరోల్లో చమురు విక్రయాలను సాగిస్తామని ప్రకటించడం అమెరికాకు దెబ్బమీద దెబ్బలాగా మారింది. ఈ మూడు దేశాల చమురు ఎగుమతులు ప్రపంచ ఎగుమతుల్లో నాలుగో వంతు. ఈ మూడింటికీతోడు చైనా సైతం తన ఎగుమతులకు యువాన్లలో, యూరోల్లో చెల్లింపులను అంగీకరిస్తానని ప్రకటించడం, యూఏఈ సెంట్రల్ బ్యాంకు తన వద్ద నున్న డాలర్లలో 10 శాతాన్ని యూరోల్లోకి మారుస్తానననడం, కువాయిట్, ఖతార్ సైతం ఇదే యోచనలో ఉండటం, స్వీడన్ తన డాలర్ రిజర్వులను 37 శాతం నుంచి 27 శాతానికి తగ్గించుకోవడం.. ఇవన్నీ అమెరికాకు పులిమీద పుట్రలా మారాయి. రష్యా వద్ద ఉన్న విదేశీ కరెన్సీ నిల్వల్లో ఒకప్పుడు 90 శాతం డాలర్లుండేవి. కానీ ఇప్పుడు 45 శాతం డాలర్లయితే.. మిగతా 45 శాతం యూరోలు. చైనా వద్ద 3.4 ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా డాలర్లున్నాయి.
చైనాగనక ఒకేసారి ఆ డాలర్లన్నిటినీ మార్కెట్లోకి విడుదల చేస్తే అమెరికా పని అవుట్! అదే సమయంలో ఆ చర్య వల్ల చైనా కూడా పతనమైపోతుంది. నిజానికి అది రెండు దేశాలూ ఓడిపోయే పరిస్థితి. అలా జరగదు కూడా. కానీ.. కీలక అంశాల్లో అమెరికాను బెదిరించి తన మాట నెగ్గించుకోవడానికి చైనాకు ఆ రిజర్వులు ఉపయోగపడుతున్నాయి. మొత్తమ్మీద.. ఈ దేశాలన్నీ కూడా తమ పట్టును ఇదే విధంగాకొనసాగిస్తే డాలర్ పునాదులు కదిలిపోతాయనడంలో ఏ సందేహమూ లేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అమెరికా చేసే పని.. ఏదో ఒక సాకుతో తనకు అనుకూలంగా లేని దేశంపై దాడులు చేసి, అస్థిరత సృష్టించడం. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడం. ప్రస్తుతానికిఇరాన్ మీద కాలుదువ్వే పని అందులో భాగమే. సిరియాలోనూ పరిస్థితిని తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే యుద్ధ ప్రకటన చేసింది.
కానీ.. అన్ని దేశాలదీ అదే బాట అయినప్పుడు ఏం చేస్తుందన్నదే ఆసక్తికరమైన ప్రశ్న. ప్రపంచం మొత్తమ్మీదా దాడి చేస్తుందా? చేసి గెలవగలుగుతుందా? ఒకటి మాత్రం నిజం. ఏడు దశాబ్దాలకుపైగా ప్రపంచాన్ని ఏలిన డాలర్‌కు ప్రత్యామ్నాయం వచ్చే రోజు మాత్రం కచ్చితంగా ఉంది. అది సమీప భవిష్యత్తులో కావచ్చు, కాకపోవచ్చు.. కానీ ఎప్పటికైనా సాధ్యమే! ఇది తథ్యం!! - సెంట్రల్ డెస్క్
హైదరాబాద్, సెప్టెంబర్ 2: డాలర్‌తో రూపాయి మారకం విలువ 1949లో రూ.4.96 ఉండేదని, రాజకీయ, విధానపర నిర్ణయాల కారణంగా అది రోజు రోజుకూ పతనమవుతూ ప్రస్తుతం రూ.68.80కి చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసిన వై.బాలాజీ అనే న్యాయవాదికి వింతైన అనుభవం ఎదురైంది. రూపాయి పతనాన్ని ఆపేందుకు కేంద్రానికి తగిన ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆయన తన పిటిషన్‌లో కోరారు. 'రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఏం చర్యలు తీసుకుంటే మంచిదో మీరే కేంద్రానికి సూచించండి..' అంటూ పిటిషనర్‌కే కోర్టు సూచించింది. ఇందుకు 4 వారాల గడువు ఇచ్చింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి