4, సెప్టెంబర్ 2013, బుధవారం

రిలీజ్ కష్టం!


September 04, 2013


హైదరాబాద్, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో ఉద్యమాలవల్ల తెలుగు చిత్రరం గం విలవిల్లాడుతోంది. నిన్నటిదాకా తెలంగాణలో బంద్‌లు, ఆందోళనలతో నైజాం ప్రాం తంలో ఇక్కట్టు పడింది. నేడు సీమాంధ్రలో సమైక్య ఉద్యమ ఉధృతికి మరింత కష్టనష్టాల్ని చవిచూస్తోంది. తెలంగాణలో బంద్ జరిగినప్పుడల్లా థియేటర్లు మూతపడి వసూళ్లపై ప్రభావం చూపాయి. షూటింగ్‌లను సైతం తెలంగాణవాదులు అడ్డుకోవడంతో నిర్మాతలు నష్టపోయారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా, మరునాటి నుంచే సీమాంధ్రలో ఆందోళన మొదలైంది. ఈ పరిణామంతో పలు థియేటర్లలో రోజుకు రెండాటలే ఆడుతున్నాయి. మార్నింగ్ షో, మ్యాట్నీ నడవక వసూళ్లు పడిపోయాయి.


సీమాంధ్ర ఉద్యమంతో పెద్ద సినిమాపై తక్షణ ప్రభావం పడింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పెద్ద సినిమా కూడా విడుదలవలేదు. కొందరు నిర్మాతలు విడుదల తేదీలనూ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 7న పవన్‌కల్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది', 21లేదా 23 తేదీల్లో విడుదల కావాల్సిన రామ్‌చరణ్ 'ఎవడు' సినిమా నిరవధికం గా వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం విడుదల కాకపోతే ఆ ప్రభావం నేరుగా నిర్మాతపైనా, డిస్ట్రిబ్యూటర్లమీద పడుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు తప్పనిసరిగా ఫైనాన్స్ వ్యవహారాలుంటాయి. కాబట్టి వడ్డీలు పెరిగి నిర్మాత నడ్డివిరిగే ప్రమాదం ఉంది. ఆ రెండు సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. అలాగే వెంటవెంటనే విడుదలకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'రామయ్యా వస్తావయ్యా', నాగార్జున 'భాయ్', మంచు మనోజ్ 'పోటుగాడు', కృష్ణవంశీ 'పైసా', వెంకటేశ్-రామ్ సినిమా 'మసాలా'పై ఉద్యమాల ప్రభావం పడబోతోంది.


రామ్‌చరణ్ 'తుఫాన్' సినిమా తుఫాను కల్లోలాన్ని చవిచూస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 6న విడుదలవుతున్నది. ఇది బాలీవుడ్‌లో రూపొందిన 'జంజీర్'కు తెలుగు వెర్షన్. షెడ్యూల్ మేరకు 'జంజీర్'ను ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల చేస్తున్నారు. 'తుఫాన్'నూ అదేరోజు విడుదల చేయక తప్పని స్థితి ఉంది. రామ్‌చరణ్ తొలి బాలీవుడ్ సినిమా కావడంతో 'హైప్' క్రియేట్ అయింది.

ఈ క్రేజ్ ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలతో కొనుగోలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న కేంద్రమంత్రి చిరంజీవి ప్రతిపాదనపై ఇటు తెలంగాణవాదులు; సమైక్యాంధ్ర కు మద్దతుగా రాజీనామా చేయలేదన్న కోపంతో అటు సమైక్యవాదులు గుర్రుగా ఉన్నా రు. ఆయన కుటుంబవ్యక్తుల సినిమాలను ఆడనీయబోమని ఇరువైపులా ఆందోళనకారు లు హెచ్చరించారు. దీంతో 'తుఫాన్' రిలీజ్ అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాత్రమే కాదు, టాక్ ఆఫ్ ద స్టేట్ అయిపోయింది.


'తుఫాన్'పై స్పందన చూశాక 'భాయ్' విడుదల తేదీ నిర్ణయిస్తామని నాగార్జున అంతటి సీనియర్ హీరో చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి గొడవకూ సినిమా 'సాఫ్ట్ టార్గెట్' అయిందని ఇప్పటికే ఆయన 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి ఈనెలలోనే విడుదలకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే హీరో, నిర్మాత కూడా.


జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'రామయ్యా వస్తావయ్యా' విడుదలను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తండ్రి, ఎంపీ నందమూరి హరికృష్ణ పదవికి రాజీనామా చేయడమే దీనికి కారణం. "తెలుగు ప్రజలందరికీ సంబంధించిన సినిమా కావడంతో, ఒక ప్రాంతంలో ఆడకపోతే నిర్మాతకూ, పంపిణీదారులకూ చాలా నష్టం కలుగుతుంది. రాజకీయాలకు ముడిపెట్టి సినిమాలను అడ్డుకోవ డం బాధాకరం. హరికృష్ణ రాజీనామాతో ఆయన కుమారుడైన ఎన్టీఆర్ సినిమాను ఆడనీయబోమని తెలంగాణ వాదులు, చిరంజీవి రాజీనామా చేయనందువల్ల ఆయన కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌ల సినిమాలను ఆపుతామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మా సినిమాను ఆపాం. సానుకూలమైన రోజు కోసం ఎదురు చూస్తున్నాం'' అని 'అత్తారింటికి దారేది..' నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెప్పారు.


పెద్ద సినిమాల విడుదల వాయిదాపడటంతో చిన్న సినిమాలు వరుసబెట్టి వస్తున్నాయి. బయటి నుంచి చూస్తే పెద్ద సినిమాల మధ్య నలిగిపోయే పరిస్థితి నుంచి చిన్న సినిమా తప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ, సీమాంధ్రలో థియేటర్లు సరిగా నడవక ఈ సినిమాలూ ఇబ్బంది పడుతున్నాయి. ఆశించిన రీతిలో వసూళ్లు లేవని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఉద్యమాల వల్ల సినిమా మాత్రమే నష్టపోవడం లేదనీ, గ్లామర్ వరల్డ్ కాబట్టి సినిమా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందనీ, అందువల్లే సినిమా బాగా నష్టపోతున్నదనే ప్రచారం వస్తున్నదన్నారు. "ప్రస్తుత ఉద్యమాల వల్ల ఇప్పటికే ప్రభుత్వానికి వందల కోట్లలో నష్టం వాటిల్లింది. ఇతర వ్యాపారాలూ దెబ్బతింటున్నాయి. సాధారణ ప్రజానీకానికి వినోదం కావాలి. దాన్ని సినిమా అందిస్తోంది. కానీ, ఉద్యమాల ప్రభావం నేరుగా సినిమామీద పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్‌చరణ్ కానీ నేరుగా ఎలాంటి రాజకీయ ప్రకటనలూ చేయలేదు. కానీ వారికి సంబంధించిన పెద్దలు తీసుకున్న రాజకీయ నిర్ణయాలకు వారిని బాధ్యుల్ని చేస్తూ, వారి సినిమాల్ని అడ్డుకోవడం నిజంగా విచారకరం'' అని దిల్ రాజు పేర్కొన్నారు.

రామ్‌చరణ్ 'ఎవడు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలకు ఆయనే నిర్మాత. వీటిలో 'రామయ్యా వస్తావయ్యా'ను సెప్టెంబర్ 27న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అందుకు తగ్గట్లు ఆ సినిమా పనులు ముగింపు దశకొచ్చాయి. అది విడుదలైతే 'ఎవడు' చిత్రాన్ని అక్టోబర్ 10 లేదా 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది ఆయన ఆలోచన. అయితే పరిస్థితులు సానుకూలంగా ఉంటేనే ఆ సినిమాల్ని ఆ తేదీల్లో విడుదల చేస్తామని రాజు స్పష్టం చేశారు. ఏదేమైనా భారీ బడ్జెట్ నుంచి ఓ మోస్తరు బడ్జెట్‌తో తయారైన, తయారవుతున్న సినిమాలన్నీ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావానికి గురవుతున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి