4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఆంధ్రకు మళ్లీ అవే అవస్థలు - యనమల రామకృష్ణుడు

September 04, 2013


స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన దేశంలో రాష్ట్రాల విభజన ఒక విధాన ప్రాతిపదికన జరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారు. ఒకే భాష మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న నినాదంతో ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 'భాషాప్రయుక్త' అనే పదం రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ తరువాత నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు 1960లో బాంబే రాష్ట్రం నుంచి గజరాత్‌ను వేరు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో 1966లో పంజాబ్ నుంచి హర్యానాను వేరుపర్చడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్ గురించి వాదులాడుకున్నట్లే అప్పుడు చండీగఢ్‌ను రెండు రాష్ట్రాలు పట్టుబట్టగా ఇరుప్రాంతాలకు పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. పదేళ్ళ పాటు అన్నది ఇప్పటిదాకా యూటీగా కొనసాగిస్తూనే ఉన్నారు.

2000 సంవత్సరంలో ఎన్డీయే పాలనలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీ స్‌గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్‌ను వేరు చేశారు. ప్రజల జీవనశైలి, భాష వేర్వేరు కావడం, వెనుకబాటుతనం, గిరిజన నేపథ్యం, రాజధాని నుంచి దూరంగా ఉండటం ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటుకు కీలకం అయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రజల భాష, జీవనశైలి, సంస్కృతులు ఒక్కటే అయినా ఆకాంక్షలు/ మనోభావాల పేరుతో వేరుచేస్తున్నారు. అరవై శాతం మంది ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమాలుచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మొం డిగా రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోంది.

గత 56 సంవత్సరాలలో అపార అభివృద్ధి సాధించిన రాజధాని హైదరాబాద్ ఉన్న ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా వేరుపరుస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడా ఇలా జరగలేదు. రాజధాని ఉన్న ప్రాంతీయులే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనడం, సమైక్యంగా ఉండాలనే వారిని బలవంతంగా బైటకు పంపి కొత్త రాజధానిని వాళ్ళే నిర్మించుకోవాలని ఆదేశించడం గతంలో జరగలేదు. ఒకవేళ విభజన అనివా ర్యం అయితే ఈ వేర్పాటు ప్రక్రియలో సమన్యాయం పాటించాల్సిన ధర్మం కేంద్రంపై ఉంది. రాజధాని, నదీ జలాలు, విద్యుత్, రాబడి, అప్పులు.. పంపిణీలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగరాదు. రెండుచోట్ల మళ్ళీ అసంతృప్తి తలెత్తి దావానలంగా మారి కొత్త రాష్ట్రాలలో చిచ్చుకు కారణం కారాదు.

ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్ర తన్నుకున్నట్లే రేపు రాయలసీమ, ఆంధ్ర తన్నుకునే పరిస్థితులు ఏర్పడకూడదు. తక్కువ జనాభా, అపార అభివృద్ధి, అద్భుత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలు తెలంగాణకు అప్పజెప్పి, అధిక జనాభా, స్వల్ప అభివృద్ధి, అరకొర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలు సీమాంధ్రకు దఖలు పర్చడం అన్యాయంగా ప్రజలు భావిస్తున్నారు. ఓవరాల్ జీ యస్‌డీపీ, పరిశ్రమలు, సేవారంగాల్లో గణనీయ ప్రగతి సాధించిన తెలంగాణకే రాజధాని హైదరాబాద్‌ను కట్టబెడ్తామనడం సీమాంధ్రుల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది. అధిక జనాభా, తక్కువ వనరులు, ఎక్కువ అప్పులు ఉన్న సీమాంధ్ర ప్రాంతాన్ని సొంత రాజధాని నిర్మించుకోమనడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో రాబడి, అప్పులు, అభివృద్ధి, ప్రధాన రంగాల స్థితిగతులను అవలోకిద్దాం.

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 8.5 కోట్లు కాగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో 3.6 కోట్లు, సీమాంధ్రలో 4.9 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర విభజనలో తక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికే లబ్ధి చేకూరుతుందనేది తెలిసిందే. 2012-13లో అవిభక్త రాష్ట్రం పన్ను రాబడి రూ.69,146 కోట్లు (69 శాతం), సీమాంధ్రలో రాబడి రూ.21,538 (31 శాతం) మాత్రమే. వ్యాట్ ద్వారా ఆదాయం సీమాంధ్రలో రూ.6263 కోట్లు ఉంటే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో రూ.13,914 కోట్లు ఉంది. తెలంగాణలో తక్కువ జనాభా, అధిక రాబడి మరింత ప్రగతికి దోహదపడితే, మిగిలిన ప్రాంతాల్లో అధిక జనాభా, స్వల్ప రాబడి అక్కడి అభివృద్ధికి ఆటంకాలు అవుతాయి. అప్పుల మీద కొత్త రాష్ట్రం బతకాల్సిన దుస్థితి వస్తుంది. 2013-14 బడ్జెట్ ఎస్టిమేట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,79,849 కోట్లు ఉంటే సీమాంధ్ర అప్పులు రూ.1,04,894 కోట్లు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు రూ.74,954 కోట్లు ఉన్నాయి (విభజనలో సీమాంధ్రకు అధిక అప్పులు బదిలీ అవుతాయి). 2013-14 ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రం మొత్తం జీయస్‌డీపీ రూ.7,39,362 కోట్లు. ఈ ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.86,983 ఉంటే తెలంగాణలో రూ.88,040; సీమాంధ్రలో రూ.86,244 ఉంటుందని అంచనా.

అవిభక్త రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలపై వ్యయం రూ.34,937 కోట్లు ఉంటే అందులో తెలంగాణలో 47 శాతం, సీమాంధ్రలో 53 శాతం వ్యయం చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు/ పెన్షనర్ల సంఖ్య ఎక్కువ, అప్పులు ఎక్కువ, పన్ను రాబడి తక్కువ ఉన్న సీమాంధ్ర ప్రాంతం అప్పులు చేస్తే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయి ఇప్పటికే ఉన్న అధిక అప్పులకు తోడు మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుం ది. తలసరి ఆదాయం తక్కువ కావడంతో ప్రజల్లో పొదుపు శక్తి సన్నగిల్లుతుంది. కొనుగోలు శక్తి పడిపోతుంది. దీంతో జీవనప్రమాణాలు పడిపోయి కొత్తగా ఏర్పడే రాష్ట్రం అధోగతి పాలవుతుంది.

సీమాంధ్రలో వ్యవసాయమే ప్రధానం. మూడేళ్ళకొకసారి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. అతివృష్టి, వరదలు, అకాల వర్షాలతో దేశంలోనే అత్యధిక నష్టం వాటిల్లే ప్రాంతంగా సీమాంధ్రకు పేరుంది. ఇప్పటికే అంతర్రాష్ట్ర జల వివాదాల కారణంగా సాగునీరు అందడం అంతంత మాత్రంగానే ఉంది. పొరుగు రాష్ట్రాలలో రిజర్వాయర్లు నిండితే కానీ మన రాష్ట్రానికి సాగునీటి విడుదల లేదు. దీంతో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టులో గత పదేళ్ళలో నాలుగుసార్లు ఖరీఫ్‌లో పంటలు లేవు. రబీ సీజన్‌లో సాగు దైవాధీనమే.. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో లేని గోదావరి డెల్టా రైతులకు ఆ దుస్థితి వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే అని సీమాంధ్ర రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే 13 లక్షల మంది రైతులు రైతుకూలీలుగా మారిన నేపథ్యంలో భవిష్యత్‌లో రెట్టింపు మంది సాగుకు దూరం అవుతారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తే పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉండటంతో అటు పారిశ్రామికరంగం, ఇటు సేవారంగం ముందంజలో ఉంటాయి. ఒకవైపు వ్యవసాయంలో గణనీయమైన ప్రగతి, మరోవైపు పారిశ్రామికరంగం పురోగతితో సేవారంగం సుభిక్షం కానుంది. అదే సీమాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే క్రాప్ హాలిడేల వల్ల లక్షలాది ఎకరాల్లో పొలాలు బీడు పడ్డాయి. సాగునీటి కొరతతో ఆహారధాన్యాల దిగుబడి తగ్గి వ్యవసాయం సంక్షోభంలో పడనుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు కూడా అరకొరగానే నెలకొల్పినందున ఉపాధి అవకాశాలు మృగ్యం. వ్యవసాయ/ పారిశ్రామికరంగాలలో వెనుకబాటు కారణంగా సేవారంగం కుప్పకూలనుంది. ఈ పరిస్థితులు సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా మనగలగడానికి ఆదిలోనే హంసపాదు కానున్నాయి.

అరవై ఏళ్ళలో నాలుగో రాజధాని కోసం సీమాంధ్రులు అన్వేషణలో పడ్డారు. 1952 వరకు మద్రాసు, 1953లో కర్నూలు, 1956 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్.. రాబోయే పదేళ్ళలో సొంత రాజధాని నిర్మించుకోవాలంటున్నారు. రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు మాత్రమే కాదు. ఒక సామాజిక నిర్మాణం చేయాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్డు వంటి రవాణా సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, వైద్యశాలలు, ఐటీ, బీటీ ఇత్యాది రంగాలను అభివృద్ధి పరచాలి. అందుకోసం లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. అధిక జనాభా, స్వల్పరాబడి, అత్యధిక అప్పుల్లో ఉండే సీమాంధ్రకు కొత్తరాజధాని నిర్మాణం శక్తికి మించిన పని అవుతుంది.

ఇరు ప్రాంతాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్, నీటి పారుదల తదితర ప్రధాన రంగాల స్థితిగతులు, అప్పులు, రాబడి తలసరి ఆదాయం, తలసరి అప్పు, పొదుపు శక్తి, కొనుగోలు శక్తి అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. ఇరుప్రాంతాల అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాంతానికి అన్యా యం జరగకుండా సమన్యాయం పాటించాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించి స్టేక్ హోల్డర్లు అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. సమదృష్టిలేని న్యాయం భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయంగా పరిణమిస్తుంది.
- యనమల రామకృష్ణుడు
శాసనమండలిలో ప్రతిపక్ష నేత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి