3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం



పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’. విలీనానంతరం హైదరాబాద్ రాజ్యానికి ప్రత్యేకమైన సివిల్ సర్వీసెస్ రద్దు కావడం, ఉర్దూ మాత్రమే తెలిసిన ఉద్యోగులు కచ్చితంగా తెలుగు, ఇంగ్లిషు నేర్చుకోవాలని నిబంధనలు తీసుకురావడంతో అప్పుడప్పుడే చదువుకొని పట్టాలు పొందిన, పొందనున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకవైపు ఉన్న ఉద్యోగాలకు ఎసరు రాగా మరోవైపు పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్‌లో అధికారం చెలాయించడానికి దిగుమతైన మద్రాసు ప్రభుత్వ అధికారులు స్థానికుల ఉద్యోగావకాశాలు కొల్లగొట్టారు. అంతేకాదు ఈ అధికారులు వివిధ జిల్లాల్లో విస్తరించి ఆంధ్ర వూపాంతం వారికి ఇబ్బడి ముబ్బడిగా ‘ముల్కీ’ సర్టిఫికెట్లు జారీచేసిం డ్రు. నిజానికి హైదరాబాద్‌లో ముల్కీ సర్టిఫికెట్టు పొందాలంటే కనీసం 15 ఏళ్లు ఇక్కడ నివసించాలి. ఇవేవి లేకుండానే పోలీసు చర్య జరిగిన నాటి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన పోస్టల్ శాఖతో పాటుగా హైదరాబాద్ ప్రభుత్వంలో టీచర్లుగా, రెవిన్యూ అధికారులుగా ఉద్యోగాలను హస్తగతం చేసుకుండ్రు. న్యాయంగా, హక్కు గా స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలు ప్రాంతేతరులు దొంగ ముల్కీ సర్టిఫికెట్లు సృష్టించి కొల్లగొట్టారు.ఇవన్నీ కలగలిసి హైదరాబాద్, నల్లగొండ, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో ముల్కీ ఉద్యమం ప్రారంభమయింది.

1952 ఆగస్టులో ఆరంభమైన ఈ ఉద్యమంలో ప్రజల ఏకైక డిమాండ్‌గా దొంగ ముల్కీ సర్టిఫికెట్లని అరికట్టి స్థానికులకు ఉద్యోగాలివ్వాలనేదే. భవిష్యత్తులో తమకూ ఉద్యోగాలు రాబోవని విద్యార్థులు మొదట ఈ ఉద్యమాన్ని లేవదీసిండ్రు. నెలరోజుల్లోనే ఈ ఉద్యమం ఉధృత రూపందాల్చింది. ముందుగా వరంగల్‌కు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును కలిసి ఉద్యోగాల్లో స్థానికులకు అన్యాయం జరుగుతుందనీ, దొంగ ముల్కీ సర్టిఫికెట్లు సం పాదించి స్థానికేతరులు ఇక్కడి వారి పొట్ట గొడుతున్నారని, ఇందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞాపన అందజేసిండ్రు.సిటీ కళాశాల విద్యార్థులు సెప్టెంబర్ మూడో తేదిన ముల్కీలకు అన్యాయం జరుగుతుందనీ, గైర్ ముల్కీలు తమ ఉద్యోగాలను కాజేస్తున్నారనీ, ముల్కీ సర్టిఫికెట్ల జారీ నిబంధనలను కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఈఊరేగింపులో దాదాపు 15వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నిరసనోద్యమంలో పాల్గొనేందుకు వరంగల్లు నుంచి జయశంకర్ సార్‌తోపాటుగా విద్యార్థులు వస్తున్న బస్సు భువనగిరి దగ్గర పంక్చరై ఆగిపోయింది.‘సమయానికి అక్కడికి చేరుకోలేక పోయామనీ, లేదంటే మేము కూడా బహుశా అమరులయిన వారి జాబితాలో చేరేవారమే మో’ అని సార్ ఆనాటి ఉద్యమం గురించి చెప్పేవాడు. సిటీ కళాశాలలో సమావేశమైన విద్యార్థులను పక్కనే ఉన్న పోలీసు మైదానంలో నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని ధిక్కరిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ పోలీసు వలయాన్ని చేధించుకొని ఊరేగింపు తీసిండ్రు. ఈ ఊరేగింపుపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు కూడా జరిపిండ్రు. ఈ కాల్పుల్లో ఆబిడ్స్‌లో ఉన్న చాదర్‌ఘా ట్ హైస్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. అలాగే మరో ఇద్దరు యువకులు కూడా పోలీసు కాల్పుల్లో మరణించిండ్రు. చనిపోయిన వారిని ఉస్మానియా ఆస్పవూతికి తరలించిండ్రు. ఊరేగింపు తీయనీయకుండా అడ్డుకోవడంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు రోజంతా ఆందోళనలు చేసిండ్రు. ఈ దశలో మృతదేహాలను బలవంతంగా స్వాధీనం చేసుకొని ఊరేగింపు తీస్తున్న విద్యార్థులపై మరోసారి సెప్టెంబర్ నాలుగో తేదిన కాల్పులు జరిగాయి. రెండ్రోజుల కాల్పుల్లో మొత్తం ఏడుగురు అమరులయ్యిండ్రు. 200 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి.40మందికి తూటా గాయాలై ఆస్పవూతిలో చేరిండ్రు. ఈ ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న బూర్గుల నర్సింగ్‌రావు నాయకత్వంలోని ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ శ్రీకారం చుట్టినా, తర్వాతి దశలో వారు వెనుకడుగేయడంతో హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని వివిధ కళాశాలల విద్యార్థి నాయకులు ముందుండి నడిపించారు. ఈ విద్యార్థుల కమిటీయే తర్వాతి కాలంలో ప్రభుత్వం తో చర్చలు జరిపింది.

ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు ఇప్పటి ఈఎన్ టీ(కోఠీ)ఆస్పత్రి సమీపంలో ‘మహిళల’ సమావేశానికి హాజరైన బూర్గుల రామకృష్ణారావును నిలదీసిండ్రు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న బూర్గుల కారును తగలబెట్టిండ్రు. అంతకుముందు విద్యార్థుల ధర్మాక్షిగహానికి హైకోర్టు వెనుక భాగాన ఉన్న పోలీస్‌స్టేషన్, ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని పోలీస్‌స్టేషన్ రెండూ అగ్గికి ఆహుతయ్యాయి. కర్ఫ్యూ కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్రమంత్రి టి.కృష్ణమాచారి సన్మానసభ కూడా రద్దయ్యింది. పాఠశాలలకు, కళాశాలలకు నిరవధిక సెలవు ప్రకటించి, హైదరాబాద్ లో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. విద్యార్థులు ఫతేమైదాన్‌లో బహిరంగసభ నిర్వహించి మృతిచెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ, కాల్పులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఉన్నతస్థాయి విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేసిండ్రు. ‘హైదరాబాద్ వర్ధిల్లాలి, గైర్ ముల్కీ లు వైదొలగాలి’ అని నినదిస్తూ జరిపిన ఈ సభలో కమ్యూనిస్ట్ నాయకుడు వి.డి.దేశ్‌పాండే మాట్లాడుతూ ‘తక్షణమే గైర్ ముల్కీలను తమ ప్రాంతాలకు పంపించి ఆ స్థానాల్ని స్థానికులతో నింపాలని ఈ సమావేశంలో డిమాండ్ చేసిండు. ఎ.కె. డాంగె, దేశ్‌పాండేలు ముఖ్యమంవూతిని కలిసి ఈ సంఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసిండ్రు. మరోవైపు ముల్కీల ఆందోళనలను ప్రభుత్వం తరపున ప్రాణేశాచారి, మీర్జాబాకర్‌లు ఖండించారు. ఈ ఉద్యమం వెనుక కమ్యూనిస్టులు, రజాకార్లు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. సోషలిస్టు నాయకుడు బి.మహదేవ్‌సింగ్ కూడా ఇవే ఆరోపణలు చేసిండు. ముఖ్యమంత్రి బూర్గుల నరసింగరావు జోక్యం చేసుకుంటూ ‘ముల్కీ సమస్య ఆర్థికపరమైన సమస్య. విద్యార్థులకు దీనితో ఏ మాత్రం సంబంధం లేదు’ అని వ్యాఖ్యానించిండు. వీరికి అండగా ఆంధ్రవూపాంతానికి చెందిన ఆంధ్రపవూతిక,ఆంధ్రవూపభపత్రికలు నిలిచాయి. ఈ పత్రికల ప్రచారం ఎంత వరకు పోయిందంటే ముల్కీ ఉద్యమాన్ని పాకిస్తాన్ అనుకూలురు, రజాకా ర్లు, కమ్యూనిస్టులు నడిపిస్తున్నాయని విష ప్రచా రం చేశాయి. ఈ ఉద్యమ ప్రభావం నల్లగొండ, వరంగల్, మెదక్ లాంటి పట్టణాల పై కూడా ఉండింది. కొం త మంది విద్యార్థులు నల్లగొండలో పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమాస్టర్‌నీ, కలెక్టరేట్‌లోని క్లర్క్‌నీ, కొంతమంది టీచర్లని బెదిరించడంతో వాళ్ళు ఊరు విడిచి వెళ్ళి పోయిండ్రు. ఉద్యోగులు విధులు నిర్వహించకబోయినప్పటికీ ప్రభుత్వం ఆంధ్రలోని వారి స్వగ్రామానికి జీతాన్ని పంపించడం ఉద్యమకారుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. న్యాయమైన ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచీ అండదండలు లభించాయి. దోపిడీనీ, అన్యాయాన్ని ఎదిరించిన పత్రికలు కూడా తాము సైతం అంటూ ప్రజల పక్షాన నిలబడ్డాయి.

ముల్కీ ఉద్యమానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ ఒంటెత్తు పోకడని నిలదీస్తూ తమ తమ పత్రికల్లో వార్తలు,వ్యాసాలు ప్రచురించినందుకుగాను ప్రభుత్వం పత్రికా సంపాదకులను కూడా అరెస్టు చేసింది. ముల్కీ ఉద్యమానికి అండగా నిలిచినందుకుగాను ఉర్దూ దినపవూతిక ‘ఏక్తా’ సంపాదకురాలు బేగమ్ సాజత్ జహాన్‌ని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసిండ్రు. అలాగే మరో ఉర్దూ దిన పత్రిక మిలాప్ సంపాదకుడు ప్రతాప్‌ను కూడా ప్రభుత్వం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కిందనే అరెస్టు చేసింది. విద్యార్థులపై పోలీసు కాల్పులు, లాఠీచార్జ్ చేయడాన్ని హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన వి.డి.దేశ్‌పాండే, రాజబహదూర్‌గౌర్‌లు తీవ్రంగా ఖండించారు. విద్యార్థి నాయకులు కూడా ఎక్కువ భాగం కమ్యూనిస్టు భావజాలమున్న విద్యార్థులే. ఇంత పెద్ద ఎత్తున విజృంభించిన ఉద్యమం ఎలాంటి హక్కులు సాధించుకోకుండానే, అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టులు. వీరంతా అప్పుడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రొగ్రెసివ్ డెమోవూకాటిక్ ఫ్రంట్ సభ్యులుగా చెలామణి అయ్యారు. ముల్కీ ఉద్యమం తీవ్రతరం కావడం చూసి ఆంధ్రవూపాంతంలోని నాయకులు ఇది తమ ప్రథమ ప్రయోజనమైన ‘విశాలాంధ్ర’ డిమాండ్‌కు విఘాతం కలిగిస్తుందని తమ విద్యార్థి నాయకుల్ని ఆ ఉద్యమం నుంచి తప్పించిండ్రు. కేవలం ప్రతిపక్ష నాయకులే గాకుండా పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన హైదరాబాదీ, జి.ఎస్.రామాచారి ‘హైదరాబాద్ హిత రక్షక సమితి’ని ఏర్పాటు చేసి నిరాయుధులైన విద్యార్థులతో అమానుషంగా ప్రభుత్వం, పోలీసు వ్యవహరించడాన్ని తప్పుబట్టిండు.

రామాచారితో బాటుగా కమ్యూనిస్టులు పత్రికలు, పౌరసమాజం, విద్యార్థులు, రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో ముల్కీ సర్టిఫికెట్ల జారీ మరింత కఠినతరం జేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు. ఈ విషయాలపై ప్రభుత్వానికి తగిన సలహాలిచ్చేందుకు గాను నలుగురు మంత్రులు కొండా వెంకటరంగాడ్డి, జి.ఎస్. మెల్కోటే, వల్లూరి బసవరాజు, మెహదీ నవాజ్ జంగ్‌లతో ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు. అలాగే సిట్టింగ్ హైదరాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయిన ఎ.జగన్మోహన్‌డ్డి నేతృత్వంలో ఒక కమిషన్‌ని కూడా ప్రభుత్వం నియమించింది. ఈయన పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, ముల్కీలకు న్యాయం జరగాలంటే సర్టిఫికెట్లను జారీ మరింత కట్టుదిట్టంగా ఉండాలని సూచించాడు. అమరులైన వారికి నష్టపరిహారం చెల్లించాలని కూడా నిర్దేశించాడు. 1952 ముల్కీ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ అంతటా శాంతి దీక్షలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఆనాటి వీరులకు శ్రద్దాంజలి ఘటిద్దాం. ఇదే ముల్కీ రూల్స్ చెల్లుతాయని 1972 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాతనే ఆంధ్ర వూపాంతం వారు ఇక తమ దోపిడీ ఆగిపోతుందనే దుగ్ధతో ప్రత్యేకాంవూధరాష్ర్టం కోసం పోరాటం చేసిండ్రు. దాన్ని సాధించుకోవడంలో విఫలమై ఇందిరాగాంధీతోటి ముల్కీ రూల్స్‌ని రాజ్యాంగబద్ధంగా రద్దు చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ ఇష్టా రాజ్యంగా దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈ దోపిడీ ఇక సాగదని చెబుతూ ముల్కీ అమరులను ప్రస్తుత ఉద్యమ సందర్భంగా స్మరించుకుందాం. నివాళి అర్పిద్దాం. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు తెగించి కొట్లాడటమే ఏకైక మార్గమని తేల్చి చెబుదాం.
-సంగిశెట్టి శ్రీనివాస్
తెలంగాణ హిస్టరీ సొసైటీ
(సెప్టెంబర్ 3: ముల్కీ ఉద్యమ దినం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి