6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఎల్లకాలం మోసం చేయలేరు


ఢిల్లీలో పార్లమెంటు నుంచి గల్లీ వరకు జరిగే నాటకీయ రాజకీయ పరిణామాలు టికెట్ లేకుండా సినిమా చూపిస్తున్నారు. ప్రజల భయాందోళనలను నివృత్తి చేయాల్సిన రాజకీయ నాయకులే అవకాశవాదంతో మరింత గందరగోళం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.రాజధాని, హైదరాబాద్, నీటి సమస్య, ఉద్యోగాల సమస్యలపై సమక్షిగంగా 1937 శ్రీబాగ్ ఒడంబడికలోనూ, 1956 పెద్ద మనుషుల ఒప్పందంలోనూ చర్చించబడినవే. నేడు తెలంగాణలోనూ, కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వచ్చిన ఉద్యమాల నేపథ్యంలో పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం కోస్తా రాయలసీమలో ‘సమైక్య’ నినాదం మారుమోగుతున్నది. గ్రామీణ ప్రాంత ప్రజలు మొదలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు కదనరంగంలో ఉన్నారు. ఎలాంటి మౌలిక సమస్యలు లేకనే రెచ్చగొడితే అంత పెద్ద స్థాయిలో ప్రజలు కదలరు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులో నివసించే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు బయటికెళ్ళాలనే భయవూబాంతులు, ఇటు సమైక్యవాదులు, అటు తెలంగాణవాదులు రెచ్చగొడుతున్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు, కోస్తాంవూధకు నీళ్ళు రావని ముఖ్యమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు. ఇలాంటి వాతావరణ నేపథ్యంలో సహజంగానే కోస్తా, రాయలసీమ ప్రాంతంలో నిరవధిక సమ్మెలకు, బంద్‌లకు పాల్పడుతున్నారు. నాయకులు వెళ్ళి ఉద్యమం చేయించేది కాదు, ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌లు చేయిస్తున్నారు. ప్రతి ఇంటా కరెంటు బిల్లులు మండిపోతున్నాయని, బంద్‌లకు పిలపు ఇస్తే మొక్కుబడిగా, అర్థరోజు పాటించడానికే గగనమైపోయింది. పెట్రోలు, డీజిల్ ధర లు పదే పదే కేంద్రం పెంచేస్తున్నది. కూరగాయలు, నిత్యావసర ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరల పెంపుదలపై రాస్తారోకో చేస్తే, స్కూటర్లలో వచ్చే వారే మాతో సహకరించకపోగా, ‘మాకు టైమ్ అయిపోతున్నది దారి వదలండని’ మాతోనే గొడవ పెట్టుకున్నా రు. అలాంటిది నిరవధిక బంద్ చేయడమంటే సామాన్యం కాదు. ప్రజల వాస్తవ స్పందన ఇలా ఉంటే, రాజకీయ నాయకుల ప్రవర్తనేవిధంగా ఉంది? ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా చెప్పిన విధానానికి భిన్నంగా ఇక్కడ వీధుల్లో మేకపోతు గాంభీర్యంతో విర్రవీగుతున్నారు. ‘తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నాం తెలంగాణ అంశం మీ పరిధిలోనిది మీ నిర్ణయం మీరు తీసుకోండని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చెప్పారు. తీరా తెలంగాణ ప్రకటించిన వెంటనే ‘సమైక్య రాష్ట్రం’ మా విధానమని ప్రకటించుకుని, దీక్షలు, నిరవధికదీక్షలు, ప్రచార యాత్రలతో తలమునకలయ్యా రు. వైఎస్‌ఆర్‌సీపీ వాళ్ళు ముందుకెడితే ప్రజలు వారివైపు వెళతారనే ఆతృతతో కాంగ్రెస్ కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతంలో వీధుల్లోకి వచ్చారు. వారంతా వెళితే మన వాటా ఎట్లాగా అని టీడీపీ రాష్ట్ర విభజనను ఆమోదిస్తూనే, సన్నాయి నొక్కులతో సమస్యలను పైకి చెప్పడం ప్రారంభించి, క్రమంగా సమైక్య బ్యానర్ల ద్వారా దీక్షలకు పూనుకున్నారు. ‘నాది యూ టర్న్ కాదు టీ టర్న్ కాదు. నాది ప్రజల బాట’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తున్నారు. మరి అక్కడి ప్రజలు సమైక్యబాటే పట్టారు. మరి వీరి మాటలకర్థమేంటి? జూలై 30న సీడబ్ల్యు సీ ప్రకటించిన అనంతరం అన్ని రాజకీయపార్టీల ప్రకటన పరిశీలించి సీపీఐ స్వాగతం చెబుతూనే రాయలసీమ ప్రాంతం, నీటి సమస్య, ఉద్యోగాల సమస్య, హైదరాబాద్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సత్వర పరిష్కారాలకు పూనుకొమ్మని కోరింది. మిగిలిన పార్టీల న్నీ సత్వరం విడదీయండని, ప్రత్యామ్నాయ రాజధానికి ఐదు లక్షల కోట్లు కేటాయించాలని తదితర అంశాలకే పరిమితమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత చూపారు. అయితే వారికి కోస్తా, రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఊహించనందున ఆ ప్రకటన చేశారు. జూలై 31 తర్వాత ఉద్యోగస్తులు విద్యార్థి, యువకులు వీథుల్లోకి రావడం ప్రారంభించాక పైన చెప్పిన పార్టీలన్నీ పోటాపోటీగా ఉరకలేసి రంగంలోకి దిగారు.

అసలు ప్రభుత్వం ఉందా? పరిపాలనా వ్యవస్థకు పునాది ఉంది గనుక ఆ మాత్రం ప్రభు త్వ యంత్రాంగం ‘తల లేని మొండిం’లా పనిచేసుకుంటేపోతున్నది. రాష్ట్ర క్యాబినెట్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ముఖ్యమంత్రి ఒక ప్రాంత వర్గానికి, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తెలంగాణ మంత్రుపూవరూ రావడంలేదు. ముఖ్యమంత్రి బహిరంగంగానే అవకాశం దొరికినప్పుడల్లా సమైక్యత గురించి బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. సెప్టెంబరు 2న అనంతపురం నుంచి రైతులు హంద్రీనీవా నీరు చెరువులకు నింపమని కోరడానికి ‘ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం’ ఆధ్వర్యంలో వందలాదిమంది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేస్తే, అప్పుడు కూడా ‘రాష్ట్రం సమైక్యంగా’ ఉంటేనే నీళ్ళు వస్తాయని ప్రకటించారు. అంటే తెలంగాణ ప్రత్యేక దేశమవుతుందా? రాష్ట్రం మాత్రమే. ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి విబేధాలున్నాయి.జూరాల నీటి దగ్గర మహబూబ్‌నగర్,కర్నూలు జిల్లాల మధ్య విభేదాలొస్తూనే ఉన్నాయి. అత్యంత కరువు కాటకాలకు గురయ్యే అనంతపురంకు కేసీ కెనాల్ ద్వారా 0.5 టీఎంసీ నీరివ్వడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తే మైసూరాడ్డి వ్యతిరేకించారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నా, రెండయినా వస్తూనే ఉంటాయి. దాన్ని పరిష్కరించుకునే యంత్రాంగం ఉన్నది. వైఎస్ రాజశేఖరడ్డి జలయజ్ఞంపై అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు అందరూ పాల్గొన్నారు. నీటి కేటాయింపులపై కూడా చర్చలు జరిగి ఒక తీర్మానం చేశారు. ఉమ్మడి అసెంబ్లీ ఆమోదించిన అనంతరం రాష్ట్రం విడిపోతే కాలం చెల్లిందవుతుందా? ఈ కోర్కెలలో పారదర్శకత లేదు. అన్నదమ్ముల్లాగా పని చేసుకునే ఉద్యోగస్తులంతా వేర్పాటువాద ఉద్యమాల వల్ల బద్ధ శత్రువులుగా మారిపోయారు. కార్యాలయాలు మూగబోతే, వీధులన్నీ ఆటస్థలాలుగా మారిపోయా యి. ప్రభుత్వం జీవచ్ఛవంలాగా కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్ళింది. దీని పరాకాష్టగా పార్లమెంటే వేదికగా మారిపోయింది. రోజుకో వేషంతో టీడీపీ ప్రతినిధులు పార్లమెంటులోనే డ్రామా స్టేజీగా మార్చేశారు. దేనికి చేస్తున్నారో రాజకీయ స్పష్టత చేయలేకపోతున్నారు. వారితో పోటీపడుతున్న కాంగ్రెస్ కూడా టీడీపీ సభ్యులకన్నా, తన సొంత ఎంపీలనే ఇద్దర్ని ఎక్కువగానే సస్పెం డ్ చేస్తూ తూకం వేసుకుంటున్నారు. పార్లమెంటు నాటకానికి, ఇక్కడి రాజకీయ యాత్రలకు, కింద ప్రజల ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. ‘కొందరు, కొందర్ని కొంత కాలం మోసం చేయగలరు. అందర్ని ఎల్లకాలం మోసం చేయలేరు’. ఎవరిది అవకాశవాదమో నిదానంగా బయటపడుతుంది. అప్పుడు ప్రజలు తగిన శాస్తి చేయగలరు.
-డాక్టర్ కె. నారాయణ
సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి