September 12, 2013
భవిష్యత్తులో రాష్ట్రంలో నీటికొరత వలన నీటి యుద్ధాలు వస్తాయని, సీమాంధ్ర ఎడారి అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అనడాన్ని ప్రముఖ ఇంజనీరు ఆర్. విద్యాసాగర్ రావు తప్పుపట్టారు ('నీటి యుద్ధాలు' నిజమా? సెప్టెంబరు 7, ఆంధ్రజ్యోతి). దీనిపై ఒక సీమాంధ్ర రైతుగా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తించి, కొన్ని విషయాలు ప్రజలకు నివేదిస్తున్నాను.
1960 తరువాత మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా సాగునీటి అవసరాలు పెరిగాయి. భారీ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మహారాష్ట్ర, కర్ణాటకలకు కేటాయించిన 585 + 734 = 1319 టీఎంసీలకు అదనంగా 750 టీఎంసీలు వినియోగించుకొనే ప్రణాళికతో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కోయినా, టాటా జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారానూ, కృష్ణా-భీమా స్థిరీకరణ ప్రాజెక్టు, అనేక కేటి బ్యారేజీలు, కర్ణాటకలో ఆల్మట్టి ద్వారా అదనంగా 170 టీఎంసీలు, తుంగభద్ర ద్వారా 50 టీఎంసీలు, రోడ్‌కం బ్యారేజీల ద్వారా అధిక, అక్రమ నీటి వినియోగం వల్ల మన రాష్ట్రానికి నీటి కొరత తప్పదు. నీటి చేరిక కూడా ఆలస్యం అవుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి నిల్వ స్తోమత 189 టీఎంసీలు కోల్పోయిన విషయం కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
ఎవరు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉండాలి. రాయలసీమ వాసులు, తెలంగాణ ప్రాంతీయులు ఎవరికి వారే తమకు అన్యాయం జరిగిందని బాధపడుతుంటారు. కానీ కేంద్ర జల వివాదాల చట్టం ప్రకారం, ఏర్పడిన కృష్ణా, గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ (బచావత్) పరీవాహక ప్రాంతం, నీటి లభ్యత, అవసరాలు, అప్పటికే ఉన్న వినియోగం వగైరా అనేక అంశాలు పరిశీలించి 1976లో తుది తీర్పు ఇచ్చింది. కృష్ణా నదిలోని నికర జలాలను 2130 టీఎంసీలు (75 శాతం విశ్వసనీయతతో)గా లెక్కించి, మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారు. మిగులు, వరద జలాల ఆధారంగా అదనపు నీటికోసం తెలంగాణ, రాయలసీమలలో మొత్తం 335 టీఎంసీలకు డిమాండ్ ఉంది. మరి ఈ నీరు ఎలా లభ్యమవుతుంది? మహబూబ్‌నగర్, నల్గొండ, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని మిగులు జలాల ఆధారంగా 34 లక్షల ఎకరాల దుర్భిక్ష ప్రాంతాలకు నీరు అందించాలి కావున శ్రీశైలం దిగువకు నీరు పారే అవకాశం లేదు.
మరి 368 టీఎంసీల నికర జలాలు పొందాల్సిన నాగార్జున సాగర్, డెల్టా ఆయకట్టులలోని 35 లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం లేక బీడు భూములుగా మారి ఎడారిగా మారే అవకాశం లేదా? ఉన్న నీరు తక్కువ, అవసరాలు ఎక్కువ. మరి దేనికి ప్రాధాన్యమివ్వాలి? నికర జలాలు ఉన్న పురాతన సాగుకా? దుర్భిక్ష ప్రాంతాలైన కొత్త సాగుకా అనేదే పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలకు నీరు అందించాలంటే గోదావరిలోని మిగులుజాలాలను కృష్ణాలోకి పోలవరం-విజయవాడ లింకు, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లింకుల ద్వారా మళ్ళించటం వల్లే సాధ్యమవుతుంది.
విద్యాసాగర్‌రావు ప్రాంతాల వారీగా, పరీవాహక ప్రాంతం, నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించారు. మరి పరీవాహక ప్రాంతం, నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కూడా నీటిని పంపిణీ చేస్తే మన రాష్ట్ర పరిస్థితి గురించి పరిశీలిద్దాం. పరీవాహక ప్రాంతం ప్రకారం నీటిని కేటాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు 627 టీఎంసీలు, నీటి లభ్యత ప్రకారం 362 టీఎంసీలు మాత్రమే లభించాలి. కానీ మనకు 811 టీఎంసీలు కేటాయించుట అన్యాయమా? ప్రస్తుతం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి లభ్యత విశ్వసనీయతను 65 శాతంకు తగ్గించింది. తద్వారా గతంలో కన్నా 448 టీఎంసీలు అదనంగా లభిస్తుందని భావించి నీటి లభ్యతను 2578 టీఎంసీలుగా పరిగణిస్తుంది.
ఈ మేరకు మన రాష్ట్రానికి అదనంగా 190 టీఎంసీలు కేటాయించారు. కానీ దానిలో 150 టీఎంసీలు క్యారీఓవర్‌గా ఉంచుకోవలసిన జలాలతో పాటు తెలుగుగంగకు 25, జూరాలకు 9 టీఎంసీలు కూడా కేటాయించారు. మన రాష్ట్రానికి రావలసిన 459 టీఎంసీలు మనకు చేరిన తరువాతే ఎగువ రాష్ట్రాలు తమ ప్రాజెక్టులలో నీటిని నిలువ చేసుకోవాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సూచించింది. అయితే తమకు కేటాయించిన నీరు వినియోగించుకున్న తరువాతే దిగువకు నీరు విడుదల చేస్తామని మహారాష్ట్ర, కర్ణాటకలు స్పష్టంగా చెప్పాయి. ఇక తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు నీటికొరత తప్పదు.
మన రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టు తెలంగాణలోని జూరాల. జూరాల జలాశయానికి నీరు చేరగానే జూరాల కాలువలకు, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలకు, నీటిని వినియోగించకుండా ఆగుతారా? అలాగే శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఎడమ గట్టు సొరంగ మార్గం, సిల్ లెవల్ 621 అడుగులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల సిల్‌లెవల్ 802 అడుగులు. కానీ పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల సిల్ లెవల్ 844 అడుగులు ఉండడం వలన తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి విడుదల అవకాశాలు చాలా బాగుంటాయి. అలాగే నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి వినియోగంలో కూడా ఆంధ్రకు అన్యాయమే జరుగుతోంది. కేటాయింపులు 33 టీఎంసీలు ఉన్నప్పటికీ సగటు నీటి వినియోగం 7.5 టీఎంసీలు మాత్రమే. గత ఏడాది సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను ఆపుచేయించారు.
వర్షాధారంతోనే డెల్టాలో సాగు జరిగింది. ఈ ఏడాది కూడా పై ప్రాజెక్టులు నిండిపోయి వరదలు ముంచెత్తినా, సముద్రానికి డెల్టా కాలువలకు ఒకేసారి నీటిని విడుదల చేయుట వివక్ష కాదా? జూలై 22న జూరాల, ఆగస్టు 2న పోతిరెడ్డిపాడు, ఆగస్టు 3న నాగార్జునసాగర్ కాలువలు, ఆగస్టు 8న డెల్టా కాలువలకు నీరు విడుదల చేయటలో ఆంతర్యమేమిటి? ఇప్పటికి కూడా కృష్ణా డెల్టా శివారు ప్రాంతాలలో తాగు నీటికి కూడా లేని విషయం పరిగణనలోకి తీసుకోవద్దా? హైదరాబాద్ జనాభా తాగునీటి కోసం, కృష్ణా నది నుంచి నేరుగా ఏ విధమైన కేటాయింపులు లేనప్పటికి 20 టీఎంసీల వినియోగం గురించి ప్రస్తావించవద్దా? రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు కనీసం తాగునీరు ఇవ్వవలసిన అవసరం లేదా? నికర జలాల కేటాయింపులు కేవలం 19 టీఎంసీలు మాత్రమే ఉన్నాయనే నెపంతో నీటి విడుదలను నిలుపు చేస్తే వేలాదికోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకూ పనికిరాకుండా పోవలసిందేనా? రాయలసీమ ఎప్పటికీ దుర్భిక్ష ప్రాంతంగా ఉండవలసిందేనా?
కృష్ణా డెల్టాలో భూగర్భ జలాల విషయంపై 2004లో భాభా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రాష్ట్ర భూగర్భ జలాల విభాగం సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో డెల్టా తీర ప్రాంతాలలోని 25 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిన విషయం మరచిపోదామా? గత ఏడాదితోపాటు నాగార్జున సాగర్ 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేక పోయాము. ఈ ఏడాది ఇప్పటికీ డెల్టాలోని శివారు ప్రాంతాలకు తాగునీరు కూడా ఇంకా చేరకపోవడం, రాయలసీమలోని అనేక ప్రాంతాలు గత ఏడాది, ఈ ఏడాది కూడా వర్షాభావంతో సతమతమవుతున్న సంఘటనలు, సీమాంధ్ర ఎడారిగా మారబోతుందన్న విషయానికి సంకేతాలు కావా? గోదావరిలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుంది. కానీ అక్టోబరులో సగటున 35 నుంచి 55వేల క్యూసెక్కులు మాత్రమే ఉంటో ంది. మరి పై ఎత్తిపోతల పథకాలకు సరిపడ నీరు అందే అవకాశం లేకపోతే గోదావరి డెల్టాకు నీటికొరతతో పొట్ట దశలో ఉన్న పంట ఎండి పోతుంది. 2వ పంట లేకుండా పోతుంది. ఈ ప్రమాదం నుంచి గోదావరి డెల్టాను, కృష్ణా డెల్టాను కాపాడేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి.
కానీ పోలవరంకు అన్నీ అడ్డంకులే. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం ఈ మధ్యనే ప్రారంభమైనది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై ప్రకటన తరువాత కూడా పోలవరం గురించి తెలంగాణ నాయకులు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు, చెబుతారు కూడా. విద్యాసాగర్‌రావు నదుల అనుసంధానం గురించి చెప్తారు కానీ పోలవరం గురించి ప్రస్తావించరు. అలాగే దుమ్ముగూడెం -నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లింక్‌కు కూడా గుత్తేదారు ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలు పూర్తిచేసినప్పటికీ తెలంగాణవారు అభ్యంతరాలు వ్యక్తం చేసి ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయించారు. కృష్ణానది ద్వారా ఆయకట్టుకు సరిపడ నీరు లభ్యం అగుట లేదనే విషయం తెలిసికూడా మిగులు జలాలు ఉన్న గోదావరి నీటిని కృష్ణానదిలోనికి మళ్ళించే విషయాన్ని అడ్డుకొనుటలో ఆంతర్యం ఏముంది? సీమాంధ్రపై కక్ష కాదా?
అందువల్ల అటు గోదావరి డెల్టా, ఇటు కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు తుంగభద్ర నుంచి నీటి విడుదల, కర్ణాటక వివక్ష వలన నీటి కొరతలతో తుంగభద్ర ఆయకట్టు దెబ్బతినే ప్రమాదం లేదా? ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటికొరత ఏర్పడితే, రాయలసీమ భూములు బీడు భూములుగా మారి తాగునీరు కూడా లేక సీమాంధ్ర ఎడారిగా మారదా? రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా కృష్ణానదిలోని నీటికొరత కొంతమేరకైనా తీర్చటమనేది, గోదావరి మిగులు జలాలను పోలవరం-విజయవాడ లింకు, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ లింకుల ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవైపున తెలంగాణ వారు తమ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ, ఎప్పటి నుంచో సీమాంధ్రలో ఉన్న నీటి వనరులను లేకుండా చేయుట ఏమాత్రం సమర్థనీయం కాదు. యాభైఏడు సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాము. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించుటకు సమగ్ర నీటి విధానం అందరూ కలిసి రూపొందించుకోవాలి.
- యెర్నేని నాగేంద్రనాథ్
రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి