11, సెప్టెంబర్ 2013, బుధవారం

హైదరాబాద్‌పై రాజీ ప్రసక్తే లేదు


9/11/2013 7:04:03 AM
- ఏ చిన్న ఆంక్షలకూ అంగీకరించం
- 1956 నాటి తెలంగాణ తప్ప మరో మాట లేదు
- తెలంగాణ ఆపాలనుకోవడం పగటి కలే
- గమ్యం చేరేదాకా శాంతియుత పోరే
- ఏపీఎన్జీవోల సభలో
- టీఎన్టీవో సభ డ్రైవర్లంత మందిలేరు
- స్టేడియంలో ఘటనలు వారి
- విజ్ఞతకే వదిలేస్తాం
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (టీ మీడియా): 1956 లో ఏ రూపంలో ఆంధ్రలో కలిపామో అదే రూపంలో తప్ప ఏ ఇతర మార్పులకు అంగీకరించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌పై ఏ చిన్న ఆంక్షలను ఒప్పుకోబోమని విస్పష్టంగా చెప్పారు. అంతిమలక్ష్యం ముద్దాడే వరకు ఉద్యమం కొనసాగించాలని, దాన్ని శాంతియుతంగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీఎన్టీవోల సభకు వచ్చిన కారు డ్రైవర్లంత మంది కూడా ఏపీఎన్జీవోల సమావేశానికి రాలేదని ఎద్దేవా చేశారు. సోమవారం కేకే నివాసానికి వెళ్లిన కేసీఆర్, అక్కడికే వచ్చిన జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తరువాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుందని, ఏ శక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటను అడ్డుకోలేదని చెప్పారు.

kcrpra1 గతంలో అడ్డుకున్నట్లే ఈ దఫా కూడా అడ్డుకుంటామని కొందరు పగటి కలలు కంటున్నారని, వారివి కల్లలే అవుతాయని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం విజయతీరాలను చేరబోతున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించామని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఉద్యమ సంఘాలకు వివరిస్తూ, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలనే అంశాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణలోని 10 జిల్లాల జేఏసీలు, మేధావులతో హైదరాబాద్‌లో ఒక భారీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని, ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సదస్సును నిర్వహించే అంశంపై అనేక సూచనలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో అప్రమత్తంగా ఉండాలనే అంశంపై అన్ని వర్గాల నుండి సూచనలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటి వరకు ఎంతో అప్రమత్తంగా ఉందని, ఇకపై కూడా బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. హైదరాబాద్‌పై ఏ ఆంక్షలను, నిబంధనలను అంగీకరించేది లేదని, ప్రజలేదైతే తెలంగాణను కోరుతున్నారో దాన్నే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీఎన్జీవోల సభకొచ్చిన డ్రైవర్లంత మంది లేరు
ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవోల సభను అనవసరంగా అదేదో గొప్పదిగా, పెద్దదిగా చేసి చూపిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యోగ గర్జన సభ పెడితే ఐదారు లక్షల మంది తరలివచ్చారని, వారు వచ్చిన వాహనాల డ్రైవర్లంత మంది కూడాఎపీఎన్జీవోల సభలో లేరని ఎద్దేవా చేశారు. ఇలాంటి సభలు తెలంగాణలో వేలు, లక్షల సంఖ్యలో పెట్టామని చెప్పారు. ఇక ఆ సభలో వారి ప్రసంగాల తీరు, జరిగిన ఘటనలు వారి సంస్కారానికి ప్రతీకగా ఉన్నాయని అంటూ వాటిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమాన్ని 13 సంవత్సరాలు ఎంత శాంతియుతంగా నిర్వహించామో ప్రపంచం మొత్తం చూసిందని, ఢిల్లీలోని జాతీయ మీడియా, అమెరికాలో ఉండే వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు కూడా తెలంగాణ ఉద్యమం ఎంతో ప్రజాస్వామ్యయుతంగా జరిగిందని కథనాలు రాశాయని తెలిపారు. మా ఉద్యమం, మా ఆచరణ ప్రపంచానికి తెలుసునని, వారి ఆచరణ ఏంటో ఎపీఎన్జీవోల సభలో తేలిపోయిందని చెప్పారు. నెల రోజుల వారి ఉద్యమం ఎంత జుగుప్సాకరంగా సాగిందో అందరూ చూశారన్నారు. తనను 13 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో తనను లక్షల తిట్లు తిట్టారని, వాటన్నింటినీ తెలంగాణ సమాజం కోసం భరించానని, తెలంగాణ కోసం మరో లక్ష తిట్టు తిట్టినా భరిస్తానే తప్ప ఉద్యమం లక్ష్యం చేరేదాక వదిలేసే ప్రసక్తి లేదన్నారు. విలేకరుల సమావేశంలో కోదండరామ్, కత్తి వెంకటస్వామి, ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి